సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన ఆర్టీసీ విలీనం హామీనే ఇప్పుడు కార్మికులు అడుగుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తూ ఆయన మట్లాడారు. ఈ క్రమంలో గత 14 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది.. చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి ప్రజాస్వామ్యబద్దంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. కార్మికులు అడుగుతున్న కోర్కెలు అన్ని న్యాయమైనవని, ఉద్యోగ భద్రతతో పాటు సంస్థని కాపాడండని కార్మికులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం ఈ సమ్మె జరుగుతుందని.. రేపు జరగబోయే రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ బంద్‌లో యావత్ సమాజం పాల్గోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ దిగిరా లేదంటే ఎర్రజెండా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో పాటు వామపక్ష విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతుని ప్రకటించాయని తెలిపారు. ఈ నెల 19 తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించి.. ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మారుస్తామని తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment