మాతృమూర్తిని కోల్పోయి బాధలో ఉన్న పార్టీ ఎంపీ దామోదరరావును సోమవారం ఆయన నివాసంలో పరామర్శిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
ఓటమిని పాఠంగా తీసుకుని ముందుకు వెళ్దాం
పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు
ఎన్టీఆర్ లాంటి నేతకే ఒడిదుడుకులు తప్పలేదు
కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది
రాబోయే రోజుల్లో ప్రజలు బీఆర్‌ఎస్ విలువ తెలుసుకుని ఆదరిస్తారని వ్యాఖ్య
త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి
ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల నేతలకు దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: పార్టీని వీడి వెళ్లే నేతలతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. పార్టీ ఓడిపోయిన చోట్ల కూడా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్లి కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపాలని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
గతంలో ఎన్టీఆర్ వంటి నేతకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని.. మనకూ తప్పవనే విషయాన్ని అర్థం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ వ్యతిరేకతను బీఆర్‌ఎస్ సద్వినియోగం చేసుకునేలా పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ
లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన పదేళ్ల పాలనలో ప్రజలకు చేయాల్సిందంతా చేశాం. దళితబంధు వంటి మంచి పథకం తెచ్చాం. ఎన్నికల్లో ఓట్లు ఆశించి అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రతి పథకాన్ని మనం ఆయా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే అమలు చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మనకు ఓటర్లు తీర్పునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ విలువను ప్రజలు తెలుసుకుని కచి్చతంగా ఆదరిస్తారు..’’అని పేర్కొన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే గైర్హాజరు
కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన వెంకట్రావు.. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా కలసిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరినా.. చివరి నిమిషంలో తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చి ఎన్నికల్లో పోటీచేశారు.
మరోవైపు సీఎం రేవంత్‌తో తెల్లం వెంకట్రావు భేటీ అయిన నేపథ్యంలో.. భద్రాచలానికి చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పార్టీని వీడినా.. స్థానిక నేతలు అభద్రతా భావానికి లోనుకావొద్దని, పార్టీ వెంటే కొనసాగితే గుర్తింపునిస్తామని భరోసా ఇచ్చారు.
11న కాంగ్రెస్‌లోకి వెంకట్రావు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ నెల 11న కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంబోత్సవం సందర్భంగా బూర్గంపాడులో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment