బీఆర్‌ఎస్‌ గెలిచే ఎంపీ సీట్లు అవే: కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ గెలిచే ఎంపీ సీట్లు అవే: ఖమ్మం రోడ్‌షోలో కేసీఆర్‌

Published Mon, Apr 29 2024 9:35 PM

Kcr Comments At Khammam Road Show Loksabha Campaign

ఖమ్మం,సాక్షి: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పని గోవిందా అని బీఆర్‌ఎస్‌ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ఖమ్మంలో సోమవారం(ఏప్రిల్‌29) రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు.

‘తల లేని బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు తెలంగాణ ప్రజల్ని నూకలు తినమన్నాడు. తెలంగాణలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి,ముగ్గురు ఎంపీలు ఉండి వృథా. మోదీ గోదావరి నీళ్లను ఎత్తుకు పోతా అంటుంటే తెలంగాణ బీజేపీ నోరు మెదపడం లేదు. వరిలో పంజాబ్‌ను తలదన్నే స్థాయిలోకి తెలంగాణను తీసుకెళ్లా. నేను గోదావరిలో మన వాటా ఇచ్చే వరకు చుక్క నీరు తీసుకెళ్లనివ్వనన్నాను.

బీఆర్‌ఎస్‌ 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతోంది. గోదావరి,కృష్ణా జలాలతో పాటు అనేక హక్కులు సాధించడం కోసం బీఆర్‌ఎస్‌ అవసరం.ఆమరణ నిరహర దీక్ష చేసిన సమయంలో ఖమ్మం ప్రజలు,న్యూ డెమోక్రసీ నేతలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.మేం దళారి వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి..అడ్డగోలు హామీలు ఇస్తున్నాడు.

దళిత బంధు,రైతు బంధు అడిగితే కాంగ్రెస్ చెప్పుతో కొడతా అంటుంది.నేటి ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయి.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క.ఉస్మానియా హస్టల్‌లో కనీస సదుపాయాలు లేకుండా చేశాడు.డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం మాట తప్పాడు. భద్రాచలం రామయ్య మీద,యాదాద్రి నర్సన్న మీద ఒట్లు వేయడం తప్ప సీఎం ఏమి చేయడం లేదు. 

నన్ను రకరకాలుగా దుర్భాషలాడుతున్న ముఖ్యమంత్రి నీ భాష ఇదేనా.జైళ్లకు,తోక మట్టలకు కేసిఆర్ భయపడడు. బీజేపీ వాళ్లే చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తెల్లారి ముఖ్యమంత్రి బీజేపీలోకి జంప్ కొడతాడని అంటున్నారు.వారి మాటలకు రేవంత్ ఖండన ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు.

పదేళ్లలో ఒక్క ఎకరా ఎండనివ్వలేదు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చాను. ఖమ్మం పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి.దేశం,రాష్ట్రం యువతది.ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా.ఇక్కడి నుంచే పోరాటం మొదలవ్వాలి.గత ప్రభుత్వ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజి వచ్చింది’అని కేసీఆర్‌ అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement