సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీని ఓడించడమే తమముందున్న లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు తదితరుల కూటమిని ఆమోదించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడించాలనే సీపీఐ, సీపీఎం సంయుక్త వైఖరితో ముందుకెళ్తాయని.. అలాగని రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బహిరంగంగా బలపరచబోమని తమ్మినేని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై తమ్మినేనితో సాక్షి ఇంటర్వ్యూ విశేషాలు.
బీఎల్‌ఎఫ్‌ను కొనసాగిస్తాం
తెలంగాణలో బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)ను కొనసాగించాలని భావిస్తున్నాం. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్ ప్రమేయం ఉండొద్దన్న సీపీఐ షరతుకు మేం అంగీకరించాం. అసెంబ్లీ ఎన్నికలపుడు ప్రత్యామ్నాయ విధానాలు, సామాజికన్యాయం నినాదంతో మిగతా పార్టీలను కలుపుకునే ప్రయత్నం చేశాం. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీచేయాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి ఏకపక్షంగా మద్దతిచ్చే పరిస్థితి లేదు. మేం పోటీచేయని సీట్లలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు మద్దతివ్వాలనే విషయం బాహాటంగా ఉండదు. ఆయా స్థానాల్లోని పరిస్థితిని బట్టి వ్యవహరిస్తాం.
గెలిచే అవకాశాల్లేకపోయినా!
లోక్‌సభ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు విజయావకాశాలు ఎక్కడా లేకపోయినా.. పోటీచేయాలని నిర్ణయించాం. సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు ఖరారులో కొంత ఆలస్యమైంది. ఇరుపార్టీలు పోటీచేస్తున్న నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మినహాయించి మిగతాచోట్ల ఎవరికి మద్దతివ్వాలనే దానిపై రెండుపార్టీలు ఒక నిర్ణయానికి రావాలని, లేని పక్షంలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం. జనసేన, బీఎస్‌పీలతోపాటు బీఎల్‌ఎఫ్‌లో భాగంగా ఉన్న ఎంపీసీఐ (యూ), ఎంబీటీ, బీఎల్‌పీ అభ్యర్థులను బలపరిచే విషయాన్ని సీపీఎం పరిశీలిస్తోంది.
టీఆర్‌ఎస్ తీరు అప్రజాస్వామికం
రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా టీఆర్‌ఎస్ తీరు అప్రజాస్వామికంగానే ఉంది. కుటుంబపాలన ను కొనసాగిస్తోంది. దాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాల ద్వారా టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఈ పథకాలతో సానుకూలత ఏర్పడింది. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ గెలిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగా ణ ఎన్నికల రంగంలోకి దిగడంతో దీనికి మరింత బలం చేకూరింది.
ఆర్థికస్థితి దయనీయం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయ నీయంగా ఉంది. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. ఆయా అంశాల వారీగా టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తాం. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే పోరాటాలు నిర్మిస్తాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో డబ్బు ప్రభావం భారీగా పెరిగింది. అధికారపార్టీతో సహా ప్రధాన రాజకీయపార్టీలు విచ్చలవిడిగా డబ్బును వెదజల్లాయి. ఈ విషయంలో టీఆర్‌ఎస్ అందరికన్నా ముందుంది. ఈ ట్రెండ్‌ను అరికట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. స్వతంత్రంగా వ్యవహరించడంతోపాటు కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని ఎన్నికల సంఘానికి లేదా ఏదైనా ప్రత్యేక సంస్థకు కల్పించినపుడే ఇది సాధ్యమవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యంపై..
కమ్యూనిస్టుపార్టీలు ఐక్యంగా లేకపోవడం, ఎవరో ఒకరితో పొత్తులు ఉండటం మా విజయావకాశాలను దెబ్బతీశాయి. బీఎల్‌ఎఫ్ పరంగా తీసు కున్న సామాజికన్యాయం అంశం చాలా మంచి ఎజెండా. అయితే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు సాధించలేకపోయాం. ఈ ఎన్నికల్లోనే వామపక్షాలను కలుపుకు ని పోవాలని మేము చేసి న యత్నం విఫలమైంది.
సంస్థాగతంగాబలహీనపడ్డాం
సీపీఎం కూడా సంస్థాగతం గా కొంతమేర బలహీనపడింది. అధికారపార్టీ, ఇతర ప్రధాన రాజకీయపార్టీల ప్రలోభాలు, ఆకర్షణ, అధికార రాజకీయాల ప్రభావం మా పార్టీలోని వివిధ స్థాయిల వారిపైనా పడింది. జిల్లాల్లో పార్టీనాయకులు కొందరు అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇవన్నీ పార్టీకి నష్టం కలిగించాయి. దాదాపు 3, 4 దశాబ్దాలుగా కమ్యూనిస్టుపార్టీలకున్న ఆదరణ కొంతకాలంగా దిగజారుతోంది. ఈ ట్రెండ్‌ను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో సీపీఎం ఓటమితోపాటు బీఎల్‌ఎఫ్ వైఫల్యానికి కూడా ఇదే కారణం. మూడున్నర దశాబ్దాలకాలంలో ఒకసారి టీడీపీ, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి టీఆర్‌ఎస్‌తో ఇలా పొత్తులు కుదుర్చుకోవడం, సొం తంగా అన్ని సీట్లకు పోటీ చేసే స్థాయికి చేరుకుని ప్రజలకు విశ్వాసం కలిగించకపోవడం వంటివి వైఫల్యాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.
టీఆర్‌ఎస్‌పై వ్యతిరేక వైఖరే
బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రెండూ అధికారపార్టీలే. అందుకే ఆ రెండు పార్టీలపై వ్యతిరేక వైఖరితో ముందుకెళ్లే విషయంలోనూ మా రెండు పార్టీలకు పూర్తి స్పష్టత ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలనే విధానాన్ని మా పార్టీ తీసుకుంది. బీజేపీ విధానాలు దేశానికి ›ప్రమాదకరంగా ఉన్నాయి. అదేసమయంలో కాంగ్రెస్ విధానాలను కూడా వ్యతిరేకిస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల పొత్తుల్లో భాగంగా టీటీడీపీని కూడా కలుపుకుపోతే బాగుంటుందని సీపీఐ సూచించింది. అయితే తెలంగాణలో టీడీపీ బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి పోటీచేస్తున్నందున, తెలంగాణలోనూ ఈ మూడుపార్టీలు కలిసి పనిచేయాలన్న మా సూచనను సీపీఐ తిరస్కరించింది.
బీజేపీనిఎదుర్కునే శక్తివామపక్షాలకే
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం పెరిగి, మతతత్వ విధానాలు, నియంతృత్వధోరణి ప్రబలుతున్న తరుణంలో దానిని అడ్డుకోగలిగి, పోరాడేశక్తి వామపక్షాలకే ఉంది. పోరాటాల ద్వారా, సైద్ధాంతికంగా మతతత్వ బీజేపీని అడ్డుకునే విషయంలో.. రాబోయే రోజు ల్లో దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టుపార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశముంది. వామపక్షాలు బలపడితే తప్ప దేశానికి రక్షణ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment