కాంగ్రెస్‌ను ‘కౌలు’కిచ్చారా? | Vardhelli Murali Article On Congress Party Scenario | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను ‘కౌలు’కిచ్చారా?

Published Sun, Jun 13 2021 2:17 AM | Last Updated on Sun, Jun 13 2021 2:17 AM

Vardhelli Murali Article On Congress Party Scenario - Sakshi

పూర్వం యయాతి అనే ఒక మహారాజు ఉండేవారు. కౌరవ– పాండవులకు పూర్వీకుడు. ఈయన తండ్రిగారి పేరు నహు షుడు. చతుస్సముద్రవలయతాఖండ భూమండలాన్ని ఈ నహు షుడు పరిపాలించాడని మహాభారతం మనకు చెబుతుంది. అటువంటి తండ్రికి వారసుడు కనుక యయాతి కూడా గొప్ప వాడే. శక్తిమంతుడైన రాజుకు సుఖభోగాలకు కొదవేముంటుంది? అతిలోక రూపలావణ్యవతులైన దేవయాని, శర్మిష్ట అనే ఇద్దరు భార్యలున్నారు. వారివలన ఐదుగురు పుత్రులు జన్మించారు. హాయిగా సాగుతున్న యయాతి జీవన నౌక హఠాత్తుగా నడిసంద్రాన మునిగిపోయేటంత ప్రమాదం వచ్చిపడింది. నడి వయసు కూడా దాటని యయాతికి తక్షణమే వార్ధక్యం ప్రాప్తిం చాలని శుక్రాచార్యులవారు శపిస్తారు. యవ్వనోత్తేజ వాంఛ లింకా తీరకముందే అకాల వార్ధక్యమేమిటని యయాతి దుఃఖి స్తాడు. తరుణోపాయం చెప్పమని శుక్రాచార్యుని వేడుకుం టాడు. దానవ గురువైన శుక్రుడు యయాతికి పిల్లనిచ్చిన మామ. పెద్దరాణి దేవయానికి తండ్రి. హద్దులు దాటిన యయాతి భోగలాలసను భరించలేక శపించాడే గానీ, అల్లుడు కాళ్లమీద పడేసరికి కరిగిపోయాడు. అతడికి శాపవిమోచన మార్గం ఉపదేశిస్తాడు. నీ కుమారుల్లో ఎవరైనా, అతడి యవ్వ నాన్ని నీకు అరువుగా ఇచ్చి నీ వార్ధక్యాన్ని వారు మోసేందుకు అంగీకరిస్తే, కావలసినంత కాలం యవ్వనాన్ని అనుభవించే అవ కాశం ఇస్తున్నానని వెసులుబాటును ప్రకటించాడు. పెద్దకొడు కులు నలుగురూ యవ్వన దానానికి అంగీకరించరు. చిన్న వాడైన పూరుడు అంగీకరించి తన వయసును తండ్రికి ధారపోసి తండ్రి వయసును స్వీకరిస్తాడు. కొత్త వయసుతో కొంతకాలం హల్‌చల్‌ చేసిన అనంతరం జీవితంపై వైరాగ్యం పుట్టి పూరుడి వయసును అతనికే ఇచ్చి రాజ్యాన్ని కూడా అప్పగించి తన వార్ధక్యాన్ని యయాతి స్వీకరిస్తాడు.


దేశంలో ఎమర్జెన్సీ కాలం ముగిసిన వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇందిరమ్మతో సహా హేమాహేమీలంతా ఓడిపోయారు. ఎమర్జెన్సీ తప్పిదాలకు బాధ్యతను ఇందిరమ్మపై మోపుతూ అగ్రశ్రేణి కాంగ్రెస్‌ నాయకు లందరూ ఇందిరమ్మ వర్గాన్ని పక్కకునెట్టి తమదే అసలైన కాంగ్రెస్‌ అంటూ రెడ్డి కాంగ్రెస్‌గా అవతరించారు. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ పేరుతో పార్టీ చలామణి అయింది. అప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న వెంగళరావు కూడా రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్రంలో పేరున్న నాయకులందరూ రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీల తరఫున పోటీకి మోహరించారు. ఏదో ఒక పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకుం దామనుకుని దరఖాస్తులు పడేసిన వారందరికీ ఇందిరా కాంగ్రెస్‌ టికెట్లు లభించాయి. అగ్నిపర్వతం లోలోపల జ్వలిస్తున్న లావాను రాజకీయవేత్తలు గుర్తించలేదు. కూలినాలి సామాన్య జనం గుండెల్లో మొలకెత్తిన ఇందిరమ్మ సానుభూతి ప్రభంజ నమై హోరెత్తింది. నియోజకవర్గాల్లో ఆమె విసిరేసిన గడ్డిపోచ లన్నీ గెలిచాయి. అలా గెలిచిన వారిలో చంద్రబాబు నాయుడు ఒకరు. హోరుగాలికి ఎదురు నిలబడి రెడ్డి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన పిడికెడుమందిలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒకరు. ఒకే వయసువారు, ఒకే ప్రాంతం వారు, పైగా మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఒక స్నేహబృందంగా ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు. అంజయ్య కేబినెట్‌లో చంద్రబాబుకు మంత్రి పదవి లభించడానికి వైఎస్‌ సహాయపడ్డారని క్లాస్‌ ఆఫ్‌ ’78 బ్యాచ్‌ రాజకీయ నాయకులు చెప్పేవారు. యువకుడు, మంత్రి పదవిలో ఉన్నాడు, ఒకే సామాజికవర్గంవాడు కనుక ఆయనకు పిల్లనిస్తే బాగుంటుందని కొందరు ఎన్టీ రామారావు వద్దకు రాయబారం నడిపారు. ఎన్టీఆర్‌ సరేనని కూతురునిచ్చి పెళ్లి చేశారు. ఏడాది గడిచేసరికి, రాజకీయాల్లోకి రావాలన్న అభిలాష ఎన్టీఆర్‌కు కలిగింది. తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. మామ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం చంద్రబాబుకు కలుగలేదు. అటు వంటి పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి మనసొప్పలేదు. పార్టీ ఆదేశిస్తే మామగారిపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన వల్ల కాంగ్రెస్‌ అధిష్టానం దగ్గర మంచి మార్కులు పడి మళ్లీ మంత్రి పదవి తనకు లభిస్తుందని బాబు స్కెచ్‌ వేశారు. కథ అడ్డం తిరిగింది. తెలుగుదేశం విజయ దుందుభి మోగించింది. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయారు. సీన్‌ కట్‌ చేస్తే చంద్రబాబు అత్తవారింటికి చేరుకున్నారు. కాళ్ల దగ్గర కొచ్చిన అల్లుడిని ఎన్టీఆర్‌ కనికరించారు. అక్కున చేర్చు కున్నారు. తరువాతి కథ తెరిచిన పుస్తకమే.


ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎల్లో మీడియా సహకారంతో, వ్యవస్థలను నియంత్రించగల యాజమాన్య పద్ధ తులతో, అవకాశవాద పొత్తులతో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు, రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చివరి ఐదేళ్ల తర్వాత ఓడిపోవడం ఆయనకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది. రాజధాని నిర్మాణం పేరుతో లభిం చిన ఒక అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని తన కుటుం బాన్ని ప్రపంచ మెగా రిచ్‌ జాబితాలో చేర్చాలనుకున్నారు. ఆ ఆశ చేజారిపోయింది. తన కుమారుడిని సీఎం గద్దెపై కూర్చో బెట్టాలనుకున్నారు. అది కలగానే మిగిలిపోయింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవగలమనే పరిస్థితులు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే కనిపించడం లేదు.


కోరికలు నెరవేరకుండానే చనిపోయినవాళ్లు దయ్యాలవుతా రని జనసామాన్యంలో ఒక ప్రచారముండేది. ఆ ప్రచారాన్ని నమ్మడానికి మనకు ఏ ఆధారమూ లేదు. కానీ పదవిలో ఉండగా వ్యక్తిగత లబ్ధికోసం పెద్ద టార్గెట్లు పెట్టుకొని అవి నెరవేరకుం డానే దిగిపోవలసి వస్తే మాత్రం వాళ్ల మెదళ్లలో తప్పనిసరిగా దయ్యాలు దూరతాయి. కొత్తకొత్త వింతైన ఆలోచనలు చేస్తాయి. అలా చెప్పడానికి ఇప్పుడు ఆధారాలు ఒక్కొక్కటే దొరుకుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదని అనుభవసారాన్ని రంగరించిన ఆరో ఇంద్రియం గట్టిగా చెబుతున్నది. ‘అయితే పక్క రాష్ట్రంలో ప్రయత్నిద్దాం. ఏదోఒక రాయి తగలకపోతుందా?... మెదళ్లలో దూరిన దయ్యం లాజిక్‌. ‘అదెట్లా సాధ్యం. మనదేమన్నా జాతీయ పార్టీనా? పైగా మనం అసెంబ్లీకి పోటీ చేయడం అస్సలు కుదరదు’ ... కామన్‌ సెన్స్‌ వాదన. దయ్యం కూడా వాదించడం మొదలుపెట్టింది. ‘ఎందుకు కుదరదు? అది గతంలో మనం పాలించిన రాష్ట్రమే. మనకెన్నో లింకులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. బినామీ ఆస్తుల్లో చాలా భాగం అక్కడే ఉన్నాయి. రాజధాని అటకెక్కిన తర్వాత ఇక్కడ మిగిలిందేముంది మనకు?.. అక్కడ మన పార్టీ లేచే పరిస్థితి లేకపోతే జాతీయ హోదాగల ప్రతిపక్షం ఉండనే ఉన్నది. ఆక్సిజన్‌ దొరక్క అలమటిస్తున్నది. మనం కాస్త ప్రాణవాయు వును పంపిస్తే చాలు ఆ పార్టీ అధిష్ఠానం తెలంగాణ యూనిట్‌ను మనకు కౌలుకు ఇస్తుంది. మనం దున్నేసుకోవచ్చు. యయాతి యవ్వనాన్ని అద్దెకు తీసుకోగాలేనిది, మనం ఒక పార్టీని అద్దెకు తీసుకోలేమా?’ తీర్పు కూడా దయ్యం వాదనకు అనుకూలం గానే వచ్చింది. ముఖ్య నేతకు ‘జ్ఞానోదయం’ కాగానే మెదళ్లలోని దయ్యం మొదళ్లతో సహా మాయమై వచ్చిన చోటుకి వెళ్లిపోయింది. ఒక శుభముహూర్తాన, చల్లని శీతాకాలంలో, క్యాలెండర్‌ ప్రకారం గడిచిన సంవత్సరం చివరి రోజుల్లో పార్టీ అధ్యక్షుల వారు ఒక ప్రత్యేక విమానంలో ఎగురుకుంటూ వెళ్లి ఢిల్లీలో వాలిపోయారు.


విశ్వసనీయ సమాచారం ప్రకారం అత్యంత రహస్యంగా ఈ పర్యటన జరిగింది. ఢిల్లీలో ఆయన ముగ్గురు వ్యక్తులను కలుసు కున్నారని సమాచారం. మన టాపిక్‌కు ఒక వ్యక్తి ప్రస్తావనే చాలు. ఆ ఒక్కడు రాహుల్‌గాంధీ. గడిచిన పుష్కరకాలంగా రాహుల్‌ గాంధీతో, ఆయన బృందంతో చంద్రబాబుకు బాగా సఖ్యత ఏర్పడింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించి అరెస్టు చేయించిన ఎపిసోడ్‌ మొత్తం టెన్‌ జనపథ్‌తో సమన్వయం చేసుకుని బాబు పనిచేశారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా ఆదుకుని కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మీయు డుగా మారిపోయారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ అసెంబ్లీ లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. తెలంగాణ ఎన్నికల్లోనైతే ఏకంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని పనిచేశాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును మొత్తం చంద్రబాబే భరించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. తన మీద ఓటుకు కోట్లు కేసు పెట్టి అప్రతిష్ట పాల్జేసిన కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న కసితో చంద్రబాబు కాంగ్రెస్‌ కోసం పనిచేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నం దుకు అంతే కసితో జనం కాంగ్రెస్‌ పార్టీని ఓడించారు. కథ దుఃఖాంతమైంది.


అనుభవాల నుంచి తీసుకున్న గుణపాఠాల ప్రాతిపదికన రాహుల్‌–బాబుల మధ్య ఒక అంగీకారం కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ అంగీకారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌తో తలపడేందుకు అవసరమయ్యే ‘జవ సత్వాలను’ కాంగ్రెస్‌ పార్టీకి సమకూర్చడానికి చంద్రబాబు సహ కరిస్తారు. అయితే తెలుగుదేశం–కాంగ్రెస్‌ల మధ్య బహిరం గంగా పొత్తేమీ ఉండదు. బహిరంగ మైత్రి కూడా ఉండదు. పార్టీ అధ్యక్షుడి పేరును చంద్రబాబు సూచిస్తారు. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే అతడే ముఖ్యమంత్రి అవుతాడు. రాహుల్‌ సమక్షంలో రేవంత్‌రెడ్డి పేరును చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్‌లో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, మధు యాష్కీ వంటి ముఖ్యనేతలకు నచ్చచెప్పవలసిన అవసరం ఉన్న దృష్ట్యా కొంత సమయం కావాలని అడిగినట్లు వినికిడి. ప్రస్తుతం అందు తున్న వివరాలను బట్టి ఈ బుజ్జగింపుల కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. రేవంత్‌ నాయకత్వంపై కార్యకర్తల స్థాయి ఫీడ్‌ బ్యాక్‌ను కూడా రాహుల్‌ తెప్పించుకున్నారట. బయటిపార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి అప్పుడే కీలక నాయకత్వం అప్పగించడం పట్ల పాతతరం, వృద్ధతరం నాయకత్వంలో వ్యతిరేకత వ్యక్తమైం దట. రేవంత్‌రెడ్డి దూకుడు వైఖరి, వాగ్ధాటి, అందుబాటులో ఉండే లక్షణం మొదలైన కారణాల వల్ల యువతరంలో మాత్రం సమ్మతి వ్యక్తమైందని గాంధీభవన్‌ వర్గాల భోగట్టా. ఇందులో నిజానిజాలు ఎట్లా వున్నా రేవంత్‌రెడ్డి పేరును నేడో రేపో కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించవచ్చునని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీకి లాభమే తప్ప నష్టం లేదని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నదట. చంద్రబాబు సొంత ప్రయోజనాలు ఏమైనా ఉండవచ్చు. తమకు మాత్రం పైసా ఖర్చుండదు. పార్టీ అధ్యక్షునిగా ఆయన ఏ పేరు సూచించినా అతడు కాంగ్రెస్‌వాడే. పొరపాటున గెలిస్తే... అదంత సులువు కాదు... అయినా వాదనకోసం... గెలిస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చున్నా అతడు కాంగ్రెస్‌ వాడే కనుక తమకొచ్చే నష్టం ఏమీలేదని పెద్దల ఆలోచనగా వుందని విశ్వసనీయంగా తెలుస్తున్న భోగట్టా.


ఇక్కడ చంద్రబాబు త్రిపాత్రాభినయం గురించి చెప్పు కోవాలి. ఒకపక్క తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని ఆయన ‘లీజు’కు తీసుకుంటున్నారు. దానికి ఆర్థిక వనరులు సమకూర్చి కేసీఆర్‌తో యుద్ధానికి సన్నద్ధం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మరోపక్కన కేసీఆర్‌తో శత్రుత్వం ఏర్పడకుండా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి, బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి నిష్క్రమించారు. అదే జిల్లాకు చెందిన సీనియర్‌ బీసీ నేత తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ స్వయంగా చంద్ర బాబు ఆదేశం మేరకే టీఆర్‌ఎస్‌లో చేరారని తెలుస్తున్నది. మరో తెలుగుదేశం మాజీ సహచరుడైన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ వ్యవహారంలో సంధానకర్తగా వ్యవహరించారు. ఇంకా కొంత మంది వట్టిపోయిన నాయకులు తెలంగాణ టీడీపీలో మిగిలి వున్నారు. వారిలో కొందరిని టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు వరుసలో నిలబెట్టి ఉంచారట. ఈ చేర్పింపుల కార్యక్రమం ద్వారా తాను టీఆర్‌ఎస్‌కు శ్రేయోభిలాషిననే సంకేతాలను చంద్ర బాబు పంపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేసి తామే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ యుద్ధ సన్నాహాల్లో ఉన్నది. ఈ సమయంలో ఇక్కడ కాంగ్రెస్‌కు సహకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మొన్నటి మహానాడులో టీడీపీ ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించింది. ఇప్పటికే పలువురు తెలుగుదేశం నాయకులు, బాబు సన్నిహితులు బీజేపీ వేషాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చెప్పండి... సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీ రామారావు చతురుడా?... రాజకీయాల్లో త్రిపాత్రాభి నయం చేస్తున్న చంద్రబాబు చతురుడా?


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement