ఫలితాల అనంతరం డీకే శివకుమార్, ఖర్గే, సిద్ధరామయ్య విజయాభివాదం
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్‌కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే.
బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు.
ఇక నాలుగు రాష్ట్రాలపై గురి
లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్‌కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment