మంద కృష్టవి నిలకడలేని ప్రకటనలు
కేసీఆర్‌ను విమర్శించడమే ఆయన పని
మీట్‌ది ప్రెస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలనే దండోర ఉద్యమ అజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మాదిగ ఉప కులాలకు ముందుగా న్యాయం జరగాలని దండోర ఉద్యమం ఆరంభంలో మంద కృష్ణ చెప్పారని... ఇప్పుడు అదే జరిగిందని అన్నారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో కడియం శ్రీహరి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడమే మంద కృష్ణ పనిగా పెట్టుకొన్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్‌ను విమర్శించారే తప్ప... తెలంగాణ సాధన కోసం మంద కృష్ణ ఏమీ చేయలేదని విమర్శించారు. మంద కృష్ణ నిలకడలేని ప్రకటనలతో ఎమ్మార్పీఎస్ చీలకలు, పేలికలు అయ్యిందని అన్నారు. ఎమ్మార్పీఎస్‌లో మొదట ఉన్న వారు ఎవరు ఇప్పుడు లేరని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలపై, నాయకులపై విమర్శలు చేసే ముందు మంద కృష్ణ తన గురించి వెనక్కి తిరిగి పరిశీలించుకోవాలని కడియం శ్రీహరి అన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి కులంపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఓ విలేకరి గుర్తు చేయగా... ‘కొందరు ఆశ్చర్యకరంగా నా కులం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్నో పరిశోధనాత్మక కథనాలు రాస్తారు. నేను పుట్టిన పర్వతగిరికి వెళ్లి ఈ విషయంపై పరిశోధనాత్మక స్టోరీ రాయండి’ అన్నారు.
వచ్చే ఏడాది కేజీ టు పీజీ
ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరుస్తానని కడియం చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 862 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు.
రాష్ట్రంలో 289 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని ఇందులో 125 కాలేజీలకు మాత్రమే అఫ్లియేషన్ వచ్చిందని పేర్కొన్నారు. అఫిలియేషన్ రాని కాలేజీలను మరోసారి తనిఖీ చేసి నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.