
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వలేదన్నారు. ప్రాథమిక, ఉన్నత విద్యపై రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తూతూ మంత్రంగా సమావేశాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇలాంటి సమావేశాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని నిరసన వ్యక్తం చేసినట్టు చెప్పారు.
అన్ని రాష్ట్రాలకు ట్రిపుల్ ఐటీలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని కడియం శ్రీహరి వాపోయారు. కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు కావాలని అడిగినా స్పందించలేదన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేజీబీవీ స్కూళ్లను 12వ తరగతి వరకు కొనసాగించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం స్థలం కేటాయించినా ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయడం లేదని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పడే నాటికి 296 గురుకుల పాఠశాలలు ఉండేవని, వాటిని తాము 470కి పెంచామని తెలిపారు. కొత్తగా 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజిలు కూడా ప్రారంభించామని, రెసిడెన్షియల్ విద్యా విధానం ద్వారా డ్రాపవుట్లు తగ్గాయని కేంద్రానికి వివరించినట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కొనియాడారని తెలిపారు. బయోమెట్రిక్ విధానంతో హాజరు శాతం పెరిగిందని, తద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment