ఐఐఎం ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరిన కడియం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో ఐఐఎం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను రాష్ట్ర విద్యా మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్ కోరారు. గురువారం వారు కేంద్ర మంత్రితో ఢిల్లీలో సమావేశమై పలు ప్రతిపాదనలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ... ఐఐఎం ఏర్పాటుపై తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశామన్నారు. ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకుంటే.. భూమి తదితర అన్ని వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించామన్నారు. ‘ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా దేశంలో విద్యకు సంబంధించి ఎలాంటి విధానాన్ని ప్రవేశపెట్ట్టలేదు.
ప్రధాని పిలుపునిచ్చిన బేటీ బచావో, బేటీ పడావో నినాదంగానే మిగిలిపోయింది. భ్రూణ హత్యల నివారణ, బాలికల సంరక్షణ, విద్యకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. అందుకే స్కూల్ డ్రాపవుట్స్‌ను ఆపేందుకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చాం. అలాగే మోడల్ స్కూల్స్‌ను దేశవ్యాప్తంగా తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని కడియం వెల్లడించారు.
విచారణకు ఎవరూ అతీతులు కారు...
‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై విచారణ జరపకుండా ఆదేశాలివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించడంపై కడియం స్పందిస్తూ.. ఎంతటివారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు తప్పించుకోలేనన్నారు.