Union Minister Javadekar
-
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి
రాష్ట్రంలో అంతర్లీనంగా మోదీ హవా - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్ - ఎంఐఎం ఎజెండాను అమలు చేస్తే ఎదిరించి పోరాడతాం - ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా మా గెలుపును ఆపలేరు: లక్ష్మణ్ సాక్షి, యాదాద్రి: 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని, ఇది భువనగిరి నుంచే ప్రారంభం కావాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ కమిటీ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అంతర్లీనంగా ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తోందని, ఇందుకు ఎన్డీఏ చేపట్టిన పథకాలు, విధానాలే కారణమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఎజెండా అమలు చేయాలని చూస్తే దానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఎంఐఎం మెప్పు కోసమే కేసీఆర్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కనబెట్టిందని ఆయన విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వాలు నిర్వ హిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రజావ్యతిరేక పార్టీలకు ఓట్లు వేయకుండా జనం ఓడిస్తే ఓటర్లను అవమానపర్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఈవీఎంలలో తేడా లేదని, కేవలం మీ ఆలోచనల్లో తేడా ఉందని ఆయన ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరగా నిర్మించాలని, లేకుంటే కేంద్రం మంజూరు చేసే 90 వేల ఇళ్లు ఇక్కడ నిర్మిస్తామన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీ బీజేపీయేనని, కేవలం రెండు ఎంపీ స్థానాల నుంచి దేశం పరిపాలించే స్థాయికి ఎదిగిందన్నారు. బీజేపీకి 11కోట్ల సభ్యత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భీం యాప్‌ను కార్యకర్తల మొబైల్‌లలో డౌన్లోడ్ చేయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ సాధిస్తున్న విజయాలు చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, దీంతో కులం, మతం ప్రాతిపదికన విడదీసి తాను మరోసారి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. 2019లో ఎంత మంది కేసీఆర్‌లు వచ్చినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. ఎంఐఎంతో చేతులు కలిపి 12శాతం రిజర్వేషన్లు తేవాలని చూస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ యాదగిరిగుట్టలో కేంద్రమంత్రి జవదేకర్ పార్టీ శ్రేణులతో కలసి స్వచ్ఛభారత్ నిర్వహిం చారు. బస్టాండ్ పరిసరాల్లో చెత్తను తొలగిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు, అందరినీ నగదు రహిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకు వచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బీజేపీ నాయకులతో కలసి తారకరామానగర్‌లోని ఆ పార్టీ దళిత మోర్చా నాయకుడు మేడి కోటేశ్ ఇంటికి వెళ్లారు. ఆయన తల్లిదండ్రులతో పాటు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఇంట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పక్కనే ఉన్న గుడారాల్లో నివాసం ఉంటున్న వీధి వ్యా పారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముద్ర రుణాలను తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. -
మరో 23 నగరాల్లో ‘నీట్’
ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, గుంటూరుకు అవకాశం - పరీక్షా కేంద్రం ఎంపిక కోసం కొత్త యాప్ - 27వ తేదీ వరకు కొత్త సెంటర్ ఎంపికకు చాన్స్ న్యూఢిల్లీ: ఈసారి జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను మరో 23 నగరాల్లోనూ నిర్వహించనున్నామని కేంద్ర మానవ వనరుల మంత్రి జవదేకర్ చెప్పారు. దీంతో నీట్ నిర్వహించే నగరాల సంఖ్య 103కు చేరనుందని, ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు, తిరుపతిలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం పార్లమెంట్ బయట ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తమ దగ్గర్లోని సెంటర్‌ను ఎంపిక చేసుకునేలా ఓ మొబైల్ యాప్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. గత సంవత్సరం పరీక్ష కోసం 8,02,594 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఈసారి రికార్డు స్థాయిలో 11,35,104 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇది గత సంవత్సరం కంటే 41.42 శాతం అధికమన్నారు. ఈ ఏడాది నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాత్, మరాఠీ, తమిళ్, ఒడిశా, కన్నడ భాషల్లో నీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ నుంచి 2, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 4, తమిళనాడు, గుజరాత్ నుంచి 3, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి 1 చొప్పున నగరాలను ఎంపిక చేయనున్నట్లు జవదేకర్ వివరించారు. దాదాపు 2200 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. సీబీఎస్ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు కొత్త సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చని సూచించింది. పరీక్ష కేంద్రాన్ని ఈనెల 24 నుంచి 27 తేదీలకు వరకు మార్చుకునే సౌకర్యం ఉందన్నారు. స్థానిక భాషల్లో పరీక్షకు సీబీఎస్ఈ ఆమోదం తెలియ జేసినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. -
కడియం చైర్మన్‌గా ‘కేబ్’ ఉపసంఘం
ప్రకటించిన కేంద్ర మంత్రి జవదేకర్ - బాలికల విద్య అంశాలపై అధ్యయనం చేయనున్న కమిటీ - 64వ కేబ్ సమావేశంలో పలు నిర్ణయాలు - ‘నో డిటెన్షన్ పాలసీ’అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ - డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకించిన కడియం - లోటుపాట్లు సరిచేస్తే సత్ఫలితాలు వస్తాయని స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: బాలికల విద్యకు సంబంధించిన పలు అంశాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ‘కేబ్’ (సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జాతీయ స్థాయిలో విద్యారంగ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలివ్వడానికి ఏర్పాటైన కేబ్ 64వ సమావేశంలో జవదేకర్ ఈ మేరకు ప్రకటించారు. జాతీయ నూతన విద్యా విధానంతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన అంశంపై మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నో డిటెన్షన్‌పై నిర్ణయం రాష్ట్రాలకే..! విద్యా హక్కు చట్టంలో భాగంగా అమలు చేస్తున్న ‘నో డిటెన్షన్’ విధానంపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పా టైన కేబ్ ఉపసంఘం తమ నివేదికను సమావేశంలో అందించింది. నో డిటెన్షన్ పాలసీ వల్ల ఫలితాలు ఆశించిన మేరకు లేవని, విద్యా ప్రమాణాలు తరగడమే కాక నాణ్యమైన విద్య కొరవడుతోందని పలు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘నో డిటెన్షన్’ పాలసీని ఎత్తివేయాలని మెజారిటీ రాష్ట్రాల మంత్రులు డిమాండ్ చేశారు. అయితే కడియం అందుకు వ్యతిరేకించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల వెనుకబాటుతనానికి ఈ పాలసీ కారణం కాదని స్పష్టంచేశారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రమాణాలు పెంచడానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు. టీచర్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచి, డ్రాపవుట్స్ పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడమంటే విద్యా హక్కును కాలరాయడమేనన్నారు. దీంతో నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారన్నారు. అందువల్ల డిటెన్షన్ విధానం అమలుకు తాము సుముఖంగా లేమన్నారు. ప్రస్తుత విధానంలో లోటుపాట్లు ఉంటే సరి చేయాలని, స్కూళ్లలో మౌలిక వసతులు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా డ్రాపవుట్స్ శాతం పెరగడానికి ప్రైవేటు స్కూళ్లకు ఊతమిచ్చేలా ఉన్న కొన్ని ప్రభుత్వ పథకాలే కారణమని, వాటిని సవరించాల్సిన అవస రముందన్నారు. ఈ వాదనలతో కొన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఏకీభవించారు. దీంతో ఈ పాలసీని సమీక్షించే స్వేచ్ఛను రాష్ట్రాలకే ఇస్తామని జవదేకర్ తెలిపారు. విద్య జాతీయ ఎజెం డా అని, నాణ్యమైన విద్య అందించే విషయంపై ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నా రు. శిక్షణ లేని టీచర్లకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని రానున్న ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయిం చారు. కేంద్రమంత్రులు విజయ్ గోయల్, రాజీవ్ ప్రతాప్ రూడీ తో పాటు వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆడపిల్లల విద్యపై చర్చ ఏది? బాలికల విద్య అంశాన్ని కేబ్ భేటీలో చర్చించకపోవడం దురదృష్టకరమని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా ఆడపిల్లల విద్య కోసం ‘బేటీ బచావో... బేటీ పడావో’ నినాదాన్ని ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి జవదేకర్... కడియం నేతృత్వంలోనే కేబ్ ఉపసంఘం ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఐఐఎం ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరిన కడియం సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో ఐఐఎం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను రాష్ట్ర విద్యా మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్ కోరారు. గురువారం వారు కేంద్ర మంత్రితో ఢిల్లీలో సమావేశమై పలు ప్రతిపాదనలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ... ఐఐఎం ఏర్పాటుపై తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశామన్నారు. ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకుంటే.. భూమి తదితర అన్ని వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించామన్నారు. ‘ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా దేశంలో విద్యకు సంబంధించి ఎలాంటి విధానాన్ని ప్రవేశపెట్ట్టలేదు. ప్రధాని పిలుపునిచ్చిన బేటీ బచావో, బేటీ పడావో నినాదంగానే మిగిలిపోయింది. భ్రూణ హత్యల నివారణ, బాలికల సంరక్షణ, విద్యకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. అందుకే స్కూల్ డ్రాపవుట్స్‌ను ఆపేందుకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చాం. అలాగే మోడల్ స్కూల్స్‌ను దేశవ్యాప్తంగా తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని కడియం వెల్లడించారు. విచారణకు ఎవరూ అతీతులు కారు... ‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై విచారణ జరపకుండా ఆదేశాలివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించడంపై కడియం స్పందిస్తూ.. ఎంతటివారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు తప్పించుకోలేనన్నారు. -
మార్నింగ్ వాక్ వద్దంటున్న వైద్యులు
ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాయుకాలుష్యం న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయాన్నే లేచి నడక, వర్కవుట్లు చేయడమో సర్వసాధారణం. అయితే ఈ చలికాలంలో అటువంటిమేమీ చేయొద్దని, ఒకవేళ చేస్తే ఆరోగ్యం సంగతి దే వుడెరుగు, అనారోగ్యం బారినపడడం తథ్యం. ఉదయపు వేళల్లో వీచే గాలి తాజాగా ఉంటుందని, అందువల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతామని అందరూ భావిస్తారు. ఈ ఆలోచన ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో కానీ జాతీయ రాజధానిలో మాత్రం అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పుగా పరిణమించే కాలుష్య కారకాలు గాలిలో సమ్మిళితమయ్యాయి. ఈ కారణంగా మీ ఊపిరితిత్తుల పనిసామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోవడం తథ్యమని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు. మార్నింగ్ వాక్ చేయడమంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనంటున్నారు. అందువల్ల ఉదయం పూట ఇంటికే పరిమితం కావాలని హితవు పలుకుతున్నారు. సాధారణంగా అయితే ఉదయం పూట గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ కలుషితమవుతుంది. అయితే నగరంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నగరంలోని దుమ్మధూళి కణాల స్థాయి ఉదయం వేళల్లోనే 2.5 శాతంగా నమోదవుతోంది. ఉదయం ఆరు గంటలనుంచి పది గంటలవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగమంచు కారణంగా దృశ్యస్పష్టత తగ్గిపోతుందని, ఇందువల్ల కళ్లపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ఈ విషయమై నగర వాతావరణ శాఖ అనుబంధ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చి సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త గుఫ్రాన్బేగ్ మాట్లాడుతూ ‘సాయంత్రం ఏడు గంటలనుంచి ఉదయం ఏడు గంటలవరకూ నగర వాతావరణంలో ధూళికణాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఉదయం పదిగంటలదాకా కొనసాగుతోంది’అని అన్నారు. వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు: కేంద్ర మంత్రి జవదేకర్ న్యూఢిల్లీ: నగరంలో వాయుకాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేక ర్ గురువారం రాజ్యసభకు తెలియజేశారు. వాయుకాలుష్యం పెరుగుదల నగరంలో మరణాల సంఖ్యను పెంచుతుండడంపై అనేకమంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాయుకాలుష్య నియంత్రణ, మరణాల శాతం తగ్గింపునకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాలుష్య శుద్ధికి సంబంధించిన ఉత్పత్తులకు ప్రోత్సాహమిస్తామన్నారు.