మరో 23 నగరాల్లో ‘నీట్’
ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, గుంటూరుకు అవకాశం
- పరీక్షా కేంద్రం ఎంపిక కోసం కొత్త యాప్
- 27వ తేదీ వరకు కొత్త సెంటర్ ఎంపికకు చాన్స్
న్యూఢిల్లీ: ఈసారి జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను మరో 23 నగరాల్లోనూ నిర్వహించనున్నామని కేంద్ర మానవ వనరుల మంత్రి జవదేకర్ చెప్పారు. దీంతో నీట్ నిర్వహించే నగరాల సంఖ్య 103కు చేరనుందని, ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు, తిరుపతిలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం పార్లమెంట్ బయట ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తమ దగ్గర్లోని సెంటర్‌ను ఎంపిక చేసుకునేలా ఓ మొబైల్ యాప్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు.
గత సంవత్సరం పరీక్ష కోసం 8,02,594 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఈసారి రికార్డు స్థాయిలో 11,35,104 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇది గత సంవత్సరం కంటే 41.42 శాతం అధికమన్నారు. ఈ ఏడాది నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాత్, మరాఠీ, తమిళ్, ఒడిశా, కన్నడ భాషల్లో నీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ నుంచి 2, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 4, తమిళనాడు, గుజరాత్ నుంచి 3, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి 1 చొప్పున నగరాలను ఎంపిక చేయనున్నట్లు జవదేకర్ వివరించారు. దాదాపు 2200 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు కొత్త సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చని సూచించింది. పరీక్ష కేంద్రాన్ని ఈనెల 24 నుంచి 27 తేదీలకు వరకు మార్చుకునే సౌకర్యం ఉందన్నారు. స్థానిక భాషల్లో పరీక్షకు సీబీఎస్‌ఈ ఆమోదం తెలియ జేసినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు.