సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఈ నెల 5న జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. ఎవరికి ఎక్కడెక్కడ పరీక్ష కేంద్రం కేటాయించిందీ సంబంధిత విద్యార్థికి అందజేసిన అడ్మిట్ కార్డులో పొందుపరిచారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు, ఇతర కేంద్రం ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు నీట్ నిర్వహిస్తారు. అఖిల భారత స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో 15 శాతం సీట్లకు పోటీ పడి అడ్మిషన్ సాధించుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు పొందడానికి నీట్ ర్యాంకులే ఆధారం. అఖిల భారత ర్యాంకులతోపాటు, ఆయా రాష్ట్రాల్లో అర్హత పొందిన వివరాలను కూడా ప్రకటించనున్నారు. నీట్ పరీక్ష 180 ప్రశ్నలు, 720 మార్కులకు నిర్వహిస్తారు. మూడు గంటలపాటు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు తెలుగులోనూ పరీక్ష రాయడానికి వీలు కల్పించారు. తెలుగు ప్రశ్నపత్రం కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాసే విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నీట్ ఫలితాలను జూన్ 5న ప్రకటిస్తారు. నీట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
అరగంట ముందు వరకే అనుమతి...
పరీక్ష హాజరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆ నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభ సమయానికి రెండు గంటల ముందే కేంద్రాన్ని తెరుస్తారు. అంటే 2 గంటలకు పరీక్ష అయితే, 12 గంటల నుంచే తెరిచి ఉంచుతారు. విద్యార్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం 1.30 గంటలలోపుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. అందువల్ల విద్యార్థుల ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని ఆ సమయానికి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. 1.30 గంటల నుంచి 1.45 గంటల వరకు పరీక్ష హాలులో ముఖ్యమైన నియమ నిబంధనలను ఇన్విజిలేటర్ ప్రకటిస్తారు. అడ్మిట్‌కార్డును తనిఖీ చేస్తారు. 1.45 గంటలకు టెస్ట్ బుక్‌లెట్లను ఇస్తారు. 1.50 గంటల వరకు టెస్ట్ బుక్‌లెట్‌లో అవసరమైన సమాచారాన్ని విద్యార్థి రాయాల్సి ఉంటుంది. విద్యార్థి తన వెంట అడ్మిట్‌కార్డు, దానిపై ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటోను అతికించాలి. దీంతోపాటు మరో పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి. 5 గంటలలోపు పరీక్ష మధ్యలోనే ముగించి వెళ్లడానికి అనుమతించరు. ప్రతీ ప్రశ్నకు నాలుగు మార్కులు.
ఆభరణాలు ధరించకూడదు...
పరీక్ష రాసే విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలి. అలా పాటించకుండా అనుచితంగా ప్రవర్తిస్తే మరోసారి పరీక్ష రాయకుండా మూడేళ్లు డిబార్ చేస్తారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వారి పరీక్ష ఫలితాన్ని నిలిపేస్తారు. నీట్ రాసే విద్యార్థులు తప్పనిసరిగా అనుసరించాల్సిన విషయాలివి...
- పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, ఎరేజర్, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ తదితరమైన వాటిని అనుమతించరు.
- మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్రాండ్ తదితరమైన వాటికి నో ఎంట్రీ.
- వాలెట్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, కళ్లద్దాలు తదితరమైన వాటిని తీసుకురావొద్దు.
- వాచ్, రిస్ట్‌వాచ్, బ్రాస్‌లెట్, కెమెరాలు తేవొద్దు.
- ఎటువంటి ఆభరణాలను ధరించకూడదు.
- డ్రెస్‌కోడ్ పాటించాలి. హాఫ్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్‌తో కూడిన లైట్ క్లాత్స్ అనుమతించరు. ఒకవేళ ఆచార వ్యవహారాలుంటే అటువంటివారు ముందస్తుగా 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి వచ్చి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. వారిని పూర్తిగా తనిఖీ చేసి పరీక్షా హాల్‌లోకి పంపుతారు.
- బూట్లు అనుమతించరు. స్లిప్పర్లు, శాండిళ్లు, తక్కువ హీల్స్ కలిగిన చెప్పులను మాత్రమే అనుమతిస్తారు.
- యాక్ససరీస్, కమ్యూనికేషన్ డివైజెస్ తదితర వాటిని అనుమతించరు.
- మంచినీళ్ల బాటిళ్లు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేదా స్నాక్స్‌లను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లనివ్వరు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి డయాబెటిస్‌తో బాధపడితే అటువంటి వారు ముందుగా సమాచారం ఇచ్చేట్లయితే వారికోసం షుగర్ మాత్రలు, అరటి, యాపిల్, నారింజ వంటి పళ్లను అనుమతిస్తారు. అలాగని ప్యాకింగ్‌లో ఉండే ఆహారాన్ని, చాక్‌లెట్లు, శాండ్‌విచ్‌లను అనుమతించరు.
- ఒకవేళ ఎవరైనా పైన పేర్కొన్న నిషేధిత వస్తువులను పొరపాటున తీసుకొచ్చినా పరీక్ష కేంద్రం వద్ద వాటిని దాచుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవు.
- పరీక్ష అనంతరం కౌన్సెలింగ్ తదితర వివరాల కోసం కోఠిలోని ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ)ను సంప్రదించాల్సి ఉంటుంది.
5న ‘నీట్’ పరీక్ష
Published Wed, May 1 2019 3:07 AM | Last Updated on Wed, May 1 2019 7:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment