తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల వద్ద నీట్ పరీక్ష రాసేందుకు బారులు తీరిన విద్యార్థులు
సాక్షి, అమరావతి : ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన ‘నీట్’ ప్రవేశ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం పూట పరీక్ష ఉండటంతో పరీక్ష రాసే విద్యార్థులు ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అత్యంత గరిష్టంగా వేసవి ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో బయట ఎండలు, పరీక్ష రాసే రూముల్లో ఉక్కపోతతో పరీక్ష రాసిన మూడు గంటలపాటు విద్యార్థులు నానా యాతనపడ్డారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయలేదని.. మరికొన్నిచోట్ల మంచినీళ్లు కూడా సరిగా ఇవ్వలేకపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి అన్నదానిపై ముందే మార్గదర్శకాలు జారీచేసినా కొంతమంది అభ్యర్థులు రబ్బరు బ్యాండ్‌లు, ముక్కు పుడకలు, వాచీలు పెట్టుకుని మరీ వెళ్లడంతో అక్కడి సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడికక్కడే వాటిని తొలగించి పరీక్షా హాలులోకి వెళ్లారు.
మరికొంతమంది విద్యార్థులు బూట్లు వేసుకుని, అమ్మాయిలు ఎత్తు చెప్పులు వేసుకుని వెళ్లగా వారిని లోపలకు అనుమతించకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకే విద్యార్థులను అనుమతించారు. పరీక్ష రాసే ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులతో ఆయా కేంద్రాల వద్ద వారి తల్లిదండ్రులూ పెద్ద సంఖ్యలో కనిపించారు. పరీక్ష జరిగిన మూడు గంటలూ వారు అక్కడే నిరీక్షించారు. కాగా, రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో పరీక్ష నిర్వహించారు. ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో మన రాష్ట్రం నుంచి సుమారు 60 వేల మంది వరకూ పరీక్షకు హాజరై ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, గత కొన్ని నెలలుగా నీట్ ప్రవేశ పరీక్ష కోసం అహోరాత్రులు శ్రమించిన విద్యార్థులకు ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయింది.
రైలు ఆలస్యంతో 600 మంది ‘నీట్’కు దూరం
శివాజీనగర (బెంగళూరు) : ఇదిలా ఉంటే.. రైలు ఆలస్యం కావడంతో వందలాది మంది నీట్ అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయిన సంఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు రైల్వేశాఖపై భగ్గుమన్నారు. హుబ్లీ–మైసూరు మధ్య నడిచే హంపి ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం 6.20 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సింది. అయితే, గుంతకల్లు రైల్వే డివిజన్‌లో డబ్లింగ్ పనుల కారణంగా రైలును మళ్లించారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా ఉ. 8.20 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సింది. కానీ, రైలు మ.2.30 గంటలకు చేరడంతో విద్యార్థులు లబోదిబోమన్నారు. సుమారు 600 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు. కాగా, రైలు ఆలస్యం కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర సీఎం కుమారస్వామి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్‌లకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా కేంద్రాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment