సాక్షి, అమరావతి/విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): నీట్ మెడికల్ (యూజీ) రాష్ట్ర ర్యాంకులను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ సీవీ రావు బుధవారం విడుదల చేశారు. నీట్ సీబీఎస్‌ఈ విడుదల చేసిన ర్యాంకుల ఆధారంగా ఈ జాబితా ప్రకటిస్తున్నామన్నారు. నీట్ ప్రవేశ పరీక్షలో 8వ ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంకడాల అనిరుధ్‌బాబు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. 680 మార్కులు సాధించిన మొదటి ర్యాంకు నుంచి 96 మార్కులు సాధించిన 39051 ర్యాంకు వరకూ జాబితాలో వెల్లడించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ సీవీ రావ్ మాట్లాడుతూ ఏపీ నుంచి 54,246 మంది అభ్యర్థులు నీట్ మెడికల్ పరీక్షకు హాజరుకాగా, 39,051 మంది అర్హత సాధించారన్నారు.
ఇందులో ఓపెన్ కేటగిరీలో 13,346, బీసీ కేటగిరీలో 16,919, ఎస్సీ కేటగిరీలో 6,784, ఎస్టీ కేటగిరీలో 2,002, దివ్యాంగుల కేటగిరీలో 75 మంది అర్హత సాధించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1900 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 283 సీట్లు సెంట్రల్ పూల్‌కి ఇచ్చామని, వీటితోపాటు పద్మావతి మెడికల్ కళాశాల నుంచి 23 సీట్లు ఎన్‌ఆర్‌ఐలకు కేటాయించామని చెప్పారు. దీంతో మొత్తం 1594 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫాతిమా మైనార్టీ మెడికల్ కళాశాలలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డెంటల్‌లో వైఎస్సార్ జిల్లా కడప, విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లలో 21 సీట్లు సెంట్రల్‌పూల్‌కి ఇచ్చామన్నారు. కాగా, ఇంటర్æ ఏపీలో చదివి, ఏపీలో చిరునామా ఇచ్చిన వారికి మాత్రమే రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటించారు.
ఈనెల 25 నుంచి తొలివిడత కౌన్సెలింగ్
ఈనెల 25 నుంచి జూలై 5 వరకు తొలి విడత (ఆన్‌లైన్) మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వీసీ డాక్టర్ సీవీ రావు తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 12లోగా ఆయా కళాశాలల్లో చేరాలన్నారు. మరో రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా జూలై 15 నుంచి 26 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 3లోగా చేరాల్సి ఉంటుందన్నారు. పై రెండు కౌన్సెలింగ్‌ల్లో మిగిలిన సీట్లు, సెంట్రల్ పూల్‌లో ఇచ్చిన సీట్లు మిగిలిపోతే ఆ సీట్లతో కలిపి వాటికి ఆగస్టు 4 నుంచి 8 వరకు మాప్‌ఆప్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అన్ని రకాల (ఏ, బీ, ఎన్‌ఆర్‌ఐ) సీట్లను యూనివర్సిటీనే భర్తీ చేస్తుందన్నారు. ఆగస్టు 18తో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుందని వివరించారు.
నీట్ రాష్ట్ర ర్యాంకులు విడుదల
Published Thu, Jun 14 2018 3:31 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment