రాష్ట్ర ప్రభుత్వానికి కాళోజీ వర్సిటీ ప్రతిపాదనలు
జూన్ 2 తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్ల కేటాయింపు ఉండదు
విభజన చట్టం మేరకు పదేళ్లుగా 15% సీట్లు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయింపు
ఉమ్మడి కోటా రద్దయితే రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి 200కుపైగా సీట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి కోటా కింద ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎంబీబీఎస్‌లో సీట్ల కేటాయింపునకు స్వస్తి పలకాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు ఆదేశాల మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైపోతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ తర్వాత నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లుగా అన్ని రకాల విద్యా సంస్థల్లో 15 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు.
రెండు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఏపీలో కాలేజీల్లో కూడా ఇదే విధంగా ఉమ్మడి కోటా అమలవుతోంది. అయితే మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడి విద్యార్థులు అక్కడ దరఖాస్తు చేసుకోవడం తక్కువ. కానీ ఏపీ విద్యార్థులు మాత్రం ఉమ్మడి కోటాను ఉపయోగించుకుని ఇక్కడ సీట్లు పొందుతున్నారు. విభజన చట్టం జూన్ రెండో తేదీతో ముగిసిపోనుంది.
దీంతో ప్రభుత్వం కూడా ఏపీతో ముడిపడి ఉన్న అంశాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటాను రద్దు చేస్తే, ఇక నుంచి అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే వస్తాయి. పీజీ మెడికల్‌లోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. ఆ ప్రకారం రానున్న కౌన్సెలింగ్‌లో నిబంధనలు మార్చాలని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
విభజనకు ముందున్న కాలేజీల్లోనే అమలైన కోటా
రాష్ట్రంలో ప్రస్తుతం 26 ప్రభుత్వ, 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2022 వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉమ్మడి కోటా అమలైంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో ఉమ్మడి కోటాను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే కోటా అమలు చేసింది. ఈ 20 కా>లేజీల్లో కలిపి 1,950 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 200కు పైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు చేస్తే ఇక నుంచి ఆ 200 సీట్లు తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి వస్తాయి.
తప్పనిసరిగా రద్దు చేయాలనే రూల్ లేదా?
మరోవైపు విభజన చట్టం పదేళ్లతో ముగిసినా ఉమ్మడి కోటాను తప్పనిసరిగా రద్దు చేయాల్సిన రూలేమీ లేదని అధికారులు అంటున్నారు. ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రతిపాదనలపై అసలు చర్చే జరగడం లేదని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment