రాష్ట్రంలో 3,856 కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్
మొత్తం 13,850 మంది విద్యార్థుల దరఖాస్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. కన్వీనర్ కోటాలో మొత్తం 3,856 సీట్లు ఉండగా.. వీటికి 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో సీటుకు దాదాపు నలుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. యాజమాన్య కోటా (ఎంక్యూ) సీట్లకు కూడా గతంతో పోలిస్తే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎంక్యూ సీట్లకు 3,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 4,136 మంది నమోదు చేసుకున్నారు.
సీట్ వస్తుందో.. లేదో
నీట్ యూజీలో మంచి స్కోర్ సాధించిన వారికి అఖిల భారత స్థాయిలో ర్యాంక్‌లు పెరిగిపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంచి స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీటు వస్తుందో, లేదో అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. మరోవైపు తెలంగాణ విద్యార్థులకు 15 శాతం కోటా రద్దు, స్థానికతపై తీసుకున్న నిర్ణయం, స్కోర్, ర్యాంక్‌ల తీరు మారడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న సీట్లను రిజర్వేషన్‌ల వారీగా ప్రకటిస్తే కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
కొనసాగుతున్న రెండో విడత పరిశీలన
విద్యార్థుల దరఖాస్తులను రెండు విడతల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కన్వీనర్ కోటా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే తొలి విడత పరిశీలన పూర్తయింది. రెండో విడత కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయ్యాక రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9 నుంచి కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా 16తో గడువు ముగిసింది.
భారీగా పెరిగిన కటాఫ్..
ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి విడత కౌన్సెలింగ్‌లో భారీగా కటాఫ్ స్కోర్‌లు పెరిగాయి. దీంతో రాష్ట్ర కోటాలో పోటీ పడుతున్న విద్యార్థులు తాము సాధించిన మార్కులకు సీటు వస్తుందో, రాదోననే ఆందోళనలో ఉన్నారు. గతేడాది ఏఐక్యూ తొలి విడత కౌన్సెలింగ్‌లో అన్ రిజర్వుడ్ విభాగంలో 618 స్కోర్ వరకు సీటు లభించింది.
ఈ ఏడాది కటాఫ్ స్కోర్ 42 పెరిగి 660 స్కోర్‌కు చివరి సీటు వచ్చింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో గతేడాది 613 మార్కులకు సీటు వస్తే ఈసారి 654 మార్కులు వచ్చినవారికి చివరి సీటు దక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో 600 స్కోర్‌కు పైన చేసిన విద్యార్థుల్లో చాలా మంది అఖిల భారత కోటాలో సీట్లు పొందుతుంటారు. దీంతో రాష్ట్ర వాటా సీట్లలో కొత్త వారికి అవకాశం లభించేది. అయితే ఏఐక్యూ కటాఫ్ గణనీయంగా పెరగడం చూసి.. రాష్ట్రంలో కూడా ఇవే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment