convenor quota
-
వైద్య విద్య సీట్లపై ‘ప్రైవేటు’ కన్ను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేదలకు అందే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలుగా హోదా తెచ్చుకుని.. ప్రభుత్వ నియంత్రణ లేకుండా తమదైన నిబంధనలు అమలు చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడమేకాదు.. ఫీజులను ఇష్టారీతిన పెంచుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా అంతా సొంత రాజ్యాలుగా మార్చుకునేందుకు ఈ మార్గం ఎంచుకుంటున్నాయి. ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)’నుంచి డీమ్డ్ వర్సిటీలుగా అనుమతులు తెచ్చుకుంటాయి. ప్రతిభ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలకు ఈ తీరు దెబ్బకొట్టనుంది. ఇప్పటికే రెండు కాలేజీలకు.. ఇటీవలే మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. అపోలో, సీఎంఆర్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. మున్ముందు మరికొన్ని కాలేజీలు ఇదే బాటన నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. ఈ పరిణామాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా యూజీసీకే దరఖాస్తు చేసుకుంటూ పోతే ఎలాగని.. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ కోసం.. రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా.. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా కనీ్వనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో సగం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు ఏడాదికి రూ.60 వేలు మాత్రమే. డీమ్డ్ వర్సిటీలుగా మారిన మెడికల్ కాలేజీల్లో ఈ కనీ్వనర్ కోటా సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోతాయి. మొత్తం సీట్లన్నీ కాలేజీల చేతిలోకే వెళ్లిపోతాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 200 సీట్లు కనీ్వనర్ కోటాలోకి రావాలి.కానీ వాటికి డీమ్డ్ వర్సిటీ హోదా రావడంతో.. అవన్నీ మేనేజ్మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. ఇక డీమ్డ్ వర్సిటీ కాలేజీల్లో స్థానిక అభ్యర్థులకు కోటా ఉండదు. దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా వచ్చి చేరవచ్చు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండవు. ఫీజులు నిర్ణయించుకునే అధికారం కూడా యాజమాన్యాలకే ఉంటుంది. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా యాజమాన్యాలే నిర్వహించుకుంటాయి. అంటే ఆ మెడికల్ కాలేజీలు పూర్తిగా యాజమాన్యాల సొంత రాజ్యాలుగా మారిపోతాయి. కనీ్వనర్ కోటా సీట్లలో చాలా వరకు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులే దక్కించుకుంటారు. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతుండటంతో వారికి అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ నష్టదాయకమేకావడం ఆందోళనకరం. -
ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు నలుగురు పోటీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. కన్వీనర్ కోటాలో మొత్తం 3,856 సీట్లు ఉండగా.. వీటికి 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో సీటుకు దాదాపు నలుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. యాజమాన్య కోటా (ఎంక్యూ) సీట్లకు కూడా గతంతో పోలిస్తే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎంక్యూ సీట్లకు 3,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 4,136 మంది నమోదు చేసుకున్నారు. సీట్ వస్తుందో.. లేదోనీట్ యూజీలో మంచి స్కోర్ సాధించిన వారికి అఖిల భారత స్థాయిలో ర్యాంక్‌లు పెరిగిపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంచి స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీటు వస్తుందో, లేదో అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. మరోవైపు తెలంగాణ విద్యార్థులకు 15 శాతం కోటా రద్దు, స్థానికతపై తీసుకున్న నిర్ణయం, స్కోర్, ర్యాంక్‌ల తీరు మారడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న సీట్లను రిజర్వేషన్ల వారీగా ప్రకటిస్తే కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కొనసాగుతున్న రెండో విడత పరిశీలన విద్యార్థుల దరఖాస్తులను రెండు విడతల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కన్వీనర్ కోటా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే తొలి విడత పరిశీలన పూర్తయింది. రెండో విడత కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయ్యాక రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9 నుంచి కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా 16తో గడువు ముగిసింది. భారీగా పెరిగిన కటాఫ్.. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి విడత కౌన్సెలింగ్‌లో భారీగా కటాఫ్ స్కోర్లు పెరిగాయి. దీంతో రాష్ట్ర కోటాలో పోటీ పడుతున్న విద్యార్థులు తాము సాధించిన మార్కులకు సీటు వస్తుందో, రాదోననే ఆందోళనలో ఉన్నారు. గతేడాది ఏఐక్యూ తొలి విడత కౌన్సెలింగ్‌లో అన్ రిజర్వుడ్ విభాగంలో 618 స్కోర్ వరకు సీటు లభించింది. ఈ ఏడాది కటాఫ్ స్కోర్ 42 పెరిగి 660 స్కోర్‌కు చివరి సీటు వచ్చింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో గతేడాది 613 మార్కులకు సీటు వస్తే ఈసారి 654 మార్కులు వచ్చినవారికి చివరి సీటు దక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో 600 స్కోర్‌కు పైన చేసిన విద్యార్థుల్లో చాలా మంది అఖిల భారత కోటాలో సీట్లు పొందుతుంటారు. దీంతో రాష్ట్ర వాటా సీట్లలో కొత్త వారికి అవకాశం లభించేది. అయితే ఏఐక్యూ కటాఫ్ గణనీయంగా పెరగడం చూసి.. రాష్ట్రంలో కూడా ఇవే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
కంప్యూటర్ సైన్సు ఫస్ట్.. ఈసీఈ సెకండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు హాట్ కేకులను తలపిస్తున్నాయి. ఇంజినీరింగ్ సీట్ల తొలి విడత కౌన్సెలింగ్‌లో 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా తొలి దశలో 1,17,136 సీట్లు భర్తీ అవడం విశేషం. 19,524 సీట్లు మలి విడత కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. విద్యార్థులు కంప్యూటర్ సైన్సుకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత ఈసీఈకి డిమాండ్ ఉంది. కాలేజీలు కూడా ఇదే దృష్టితో కంప్యూటర్ సైన్సు సీట్లను ఎక్కువగా అందుబాటులో ఉంచాయి. ఈ మేరకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి.కంప్యూటర్ సైన్స్‌లోనే ఎక్కువ..కంప్యూటర్ సైన్స్‌లో కన్వీనర్ కోటాలో 42,303 సీట్లు ఉండగా, 40,242 సీట్లు తొలి దశలోనే భర్తీ అయ్యాయి. అంటే సీట్లన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ)లో 24,121 సీట్లు ఉండగా, 21,060 సీట్లను కేటాయించారు. సీఎస్ఈ (ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్)లో 11,156 సీట్లకు గాను 10,133 సీట్లు భర్తీ అయ్యాయి. ఫెసిలిటైస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్‌లో 66 సీట్లలో ఒక్కటి కూడా భర్తీ కాలేదు. కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో 64 సీట్లకు గాను 7 సీట్లే భర్తీ అయ్యాయి. తొలి దశ కౌన్సెలింగ్ 17వ తేదీతో ముగిసింది. శుక్రవారం నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో మిగిలిన 19,524 సీట్లకు వచ్చే వారంలో మలి విడత కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. దానికంటే ముందే ఎన్ఆర్ఐ, కేటగిరీ–బి సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. చివరి దశలో కళాశాలలకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనుంది.వైఎస్ జగన్ దార్శనికతతో..వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికత, సంస్కరణలతో మెరిట్ సాధించిన పేద, మధ్య తరగతి విద్యార్థులు కూడా ప్రైవేటు వర్సిటీల్లో సీట్లు సాధించుకోగలిగారు. రాష్ట్రంలో 9 ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయి. వీటిలో గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం సీట్లను ఏపీఈఏపీసెట్‌లో మెరిట్ సాధించిన విద్యార్ధులకు కన్వీనర్ కోటాలో కేటాయించేలా గత వైఎస్ జగన్ సర్కారు సంస్కరణలు తెచ్చింది. దీంతో గడిచిన రెండేళ్లలో 7 ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఎందరో పేదింటి విద్యార్థులు మెరుగైన ఉన్నత విద్యను అందుకున్నారు. ఈ ఏడాది ప్రైవేటు వర్సిటీలు 9కి చేరడంతో సీట్ల సంఖ్య 7,832కు చేరుకుంది. ఇందులో ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో తొలి విడతలోనే 7,700 సీట్లను విద్యార్థులు దక్కించుకున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు వర్సిటీల్లో చదువంటే పేద మెరిట్ విద్యార్థులకు సాధ్యయ్యేది కాదు. లక్షల్లో ఫీజులు చెల్లించే వారికే అక్కడ సీట్లు దక్కేవి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో ఈ వర్సిటీల్లో పేద విద్యార్థులూ చదువుకోగలుగుతున్నారు. -
ఇంజనీరింగ్ సీట్లు 98,296
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల లెక్క పాక్షికంగా తేలింది. ఆఖరి నిమిషంలో కాలేజీలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు లభించింది. దీంతో ఈఏపీసెట్ అర్హత పొంది, కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 15 వరకు ఈ అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యా విభాగం అందించిన సమాచారం ప్రకారం తొలిదశ ఆప్షన్లు ఇచ్చే నాటికి 173 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. మొత్తం 98,296 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.18 లక్షల ఇంజనీరింగ్ సీట్లు వివిధ విభాగాల్లో ఉండాలి. కానీ కొన్ని కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ వంటి బ్రాంచీల్లో సీట్లు, సెక్షన్లు తగ్గించుకున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సులు కావాలని దరఖాస్తు చేసుకున్నాయి. పెరిగే సీట్ల వివరాలకు ఇంకా ప్రభుత్వం అనుమతి లభించలేదు. దీంతో కోత పడే సీట్లుపోను మిగతా వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చారు. సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో 60 శాతానికిపైగా సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. -
3 లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!
సాక్షి, హైదరాబాద్: నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరో వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశముంది. ఈసారి అర్హత మార్కులు పెరగడంతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్ని ర్యాంకులు వచ్చిన వారికి కన్వీనర్ సీట్లు వచ్చాయన్న విషయమై విద్యార్థులు ఆరా తీస్తున్నారు. లక్షల్లో ర్యాంకు వచ్చినా.. గతేడాది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్ జాతీయ స్థాయిలో 2.66 లక్షల ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీటు లభించింది. మేడ్చల్‌లోని సీఎంఆర్ మెడికల్ కాలేజీలో బీసీ సీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి ఆ ర్యాంక్‌కు సీటు వచ్చింది. అలాగే 2.62 లక్షల ర్యాంకు పొందిన బీసీ సీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్ధికి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో సీటు లభించింది. సంగారెడ్డిలోని టీఆర్ఆర్ కాలేజీలో బీసీ సీ కేటగరీకే చెందిన విద్యార్థికి 2.58 లక్షల ర్యాంక్ వచ్చినా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఈ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇక ఓపెన్ కేటగిరీ లోకల్ కోటాలో వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో 1.60 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు లభించింది. ఓపెన్ కేటగిరీలోని అన్ రిజర్వ్డ్ కోటాలో సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 58,727 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు లభించింది. పెరిగిన సీట్లతో ఈసారి విస్త్రుత అవకాశాలు... రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెరిగాయి. 2023–24 వైద్య విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద కేటాయిస్తారు. మరోవైపు ఈ ఏడాది కూడా మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. 2024–25 విద్యాసంవత్సరంలో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు రానున్నాయి. వాటికి సంబంధించి ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈసారి ఆరు కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని.. ఈ లెక్కన కనీసం 300 సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. అంటే ఆ మేరకు ఎంబీబీఎస్‌లో విద్యార్థుల చేరికలకు అవకాశాలు పెరగనున్నాయి. 15 శాతం ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో.. తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు 15 శాతం కోటా కింద పదేళ్లపాటు సీట్లు పొందేందుకు వీలు కల్పించిన ఏపీ పునర్విభజన చట్టం–2014లోని నిబంధన గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ నిబంధన వల్ల 2014 నుంచి 2022 వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 15 శాతం సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి కోటా కింద వర్తింపజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందుబాటులోకి వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను రద్దు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే ఉమ్మడి కోటాను అమలు చేసింది. ఆయా కాలేజీల్లో 1,950 కన్వీనర్ కోటా సీట్లలో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే అందులో 200కుపైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో ఇకపై ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇలా కూడా అదనంగా సీట్లు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి 3 లక్షల ర్యాంక్ పొందిన విద్యార్ధికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభిస్తుందని కాళోజీ నారాయణరావు వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఉస్మానియా, గాం«దీ, కాకతీయల్లో ఏ ర్యాంక్‌కు సీట్లు వచ్చాయంటే? – ఉస్మానియా మెడికల్ కాలేజీ ఓపెన్ కేటగిరీలోని లోకల్ కింద 19,239 ర్యాంకుకు, అన్ రిజర్వుడ్‌లో 7,943 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 30,522 ర్యాంకు వరకు కూడా సీటు లభించింది. ఎస్సీ విద్యార్థులకు లోకల్ కేటగిరీలో 89,253 ర్యాంకు సాధించినా సీటు వచ్చింది. అన్‌రిజర్వ్‌డ్‌లో 48,358 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీ లోకల్ కేటగిరీలో 90,658 ర్యాంకర్‌కు, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 73,500 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు వచ్చింది. బీసీ ఏలో లోకల్ కేటగిరీ కింద 79,611 ర్యాంకు, అన్‌రిజర్వ్‌డ్‌లో 42,349 ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చాయి. బీసీ బీలో లోకల్‌కు 30,944... అన్ రిజర్వుడుకు 12,788 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ సీలో లోకల్‌కు 69,344... అన్ రిజర్వ్‌డ్‌లో 21,822 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ డీలో లోకల్‌కు 30,465... అన్ రిజర్వ్‌డ్‌లో 20,069 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ–ఈలో లోకల్‌కు 34,482... అన్ రిజర్వ్‌డ్‌లో 20,497 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. – గాంధీ మెడికల్ కాలేజీలో ఓపెన్ కోటాలో లోకల్ కేటగిరీ కింద 8,164 ర్యాంకుకు, అన్ రిజర్వ్‌డ్‌లో 3,225 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 26,245 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కోటాలో లోకల్ కేటగిరీ కింద 80,215 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు వచ్చింది. అన్ రిజర్వ్‌డ్‌లో 39,519 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీలో లోకల్‌కు 78,656... అన్ రిజర్వ్‌డ్‌కు 47,860 ర్యాంకుకు సీటు వచ్చింది. బీసీ–ఏ లోకల్ కేటగిరీలో 36,691 ర్యాంకుకు సీటురాగా బీసీ–బీలో లోకల్ కింద 15,625 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. అలాగే బీసీ–సీలో లోకల్‌కు 55,674 ర్యాంకుకు సీటు లభించింది. బీసీ–డీలో లోకల్‌కు 14,598 ర్యాంకుకు... అన్ రిజర్వ్‌డ్‌లో 8,257 ర్యాంకుకు సీట్లు వచ్చాయి. బీసీ–ఈలో లోకల్‌కు 30,495... అన్ రిజర్వ్‌డ్‌లో 5,737 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. – వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓపెన్‌లోని లోకల్ కేటగిరీలో 36,905 ర్యాంకుకు, అన్ రిజర్వ్‌డ్‌లో 25,305 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 47,684 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీల్లో లోకల్ కేటగిరీలో 1.14 లక్షల ర్యాంకుకు సీటు వచ్చింది. అన్ రిజర్వ్‌డ్‌లో 98,658 ర్యాంకుకు సీటు వచ్చింది. ఎస్టీ కోటాలో లోకల్ కింద 1.07 లక్షల ర్యాంకు వచ్చిన వారికి... అన్ రిజర్వ్‌డ్‌లో 95,831 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ–ఏ లోకల్ కేటగిరీలో 1.09 లక్షల ర్యాంకుకు... అన్ రిజర్వ్‌డ్‌లో 66,831 ర్యాంకులకు సీట్లు వచ్చాయి. బీసీ–బీలో లోకల్‌కు 43,616... అన్ రిజర్వ్‌డ్‌కు 37,381 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ–సీలో లోకల్‌కు 94,902 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ–డీలో లోకల్‌కు 42,838, బీసీ–ఈలో లోకల్ కోటా కింద 50,030 ర్యాంక్ పొందిన వారికి సీట్లు లభించాయి. -
లక్షకు చేరువలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రి య తుదిదశకు చేరుకుంది. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు బుధవారంతో ముగిసింది. కన్వినర్‌కోటా కింద మొత్తం 75 వేలమంది సీట్లు పొందినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. యాజమాన్యకోటా కింద మరో 25 వేలకుపైగా సీట్లు భర్తీ అయినట్టు తెలిసింది. అయితే పూర్తి గణాంకాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 58 శాతానికిపైగా కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లోనే భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. సెపె్టంబర్ 1 నుంచి కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ చేపడుతున్నారు. ఒక బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్‌కు మారేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. కాలేజీల్లో మిగిలిన సీట్ల వివరాలు ప్రతీ కాలేజీ సెప్టెంబర్ 1న వెల్లడించాలని సాంకేతికవిద్య కమిషనరేట్ ఆదేశించింది 3,4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. ఎంసెట్ అర్హులు నేరుగా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు పొందే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 18,815 సీట్లు మిగిలిపోయే వీలుందని అధికారులు అంచనా వేశారు. -
నీట్ ర్యాంకు 2.38 లక్షలు..ఎంబీబీఎస్‌లో కన్వినర్ సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా కన్వీనర్ కోటాకింద ఎంబీబీఎస్‌లో అధిక ర్యాంకర్‌కు సీటు లభించింది. నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించింది. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎంబీబీఎస్ కన్వినర్ కోటా మొదటివిడత జాబితాను వర్సిటీ బుధవారం వెల్లడించింది. ఏ కాలేజీలో ఎవరికి సీట్లు వచ్చాయో... విద్యార్థులకు సమాచారం పంపించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వినర్ సీట్లలో 4,378 సీట్లు విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ♦ గతేడాది ఓ ప్రైవేట్ కాలేజీలో చివరి (నాలుగో) విడత కౌన్సెలింగ్‌లో 2.28 లక్షల ర్యాంకర్‌కు బీసీ–ఏ కేటగిరీలో కన్వినర్ సీటు లభించగా, ఈసారి మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 2.38 లక్షల ర్యాంకు సాధించిన ఎస్సీ కేటగిరీ విద్యార్థికి కన్వినర్ సీటు లభించడం విశేషం. ♦ గతేడాది జనరల్ కేటగిరీలో చివరి విడతలో 1.25 లక్షల ర్యాంకుకు సీటు లభించగా, ఇప్పుడు మొదటి విడతలోనే 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ♦ బీసీ– బీ కేటగిరీలో గతేడాది 1.37 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి మొదటి విడతలోనే 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ♦ గతేడాది బీసీ–డీ కేటగిరీలో 1.28 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ♦ అన్ని కేటగిరీల్లోనూ గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా కన్వినర్ కోటాలోనే సీట్లు వచ్చాయి. కన్వినర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరుగుతుంది. మొద టి విడతలో సీటు వచ్చినా, జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినవారు ఇక్కడ చేరకుంటే, ఆ సీట్లు తదుపరి విడతల్లో కేటాయిస్తారు. అప్పుడు ఇంకా పెద్ద ర్యాంకర్‌కు సీటు వచ్చే అవకాశముంది. పెరిగిన సీట్లు.. ఎక్కువగా అవకాశాలు రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరిగింది. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అందులో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిలభారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండటం తెలిసిందే. మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్లకు కూడా త్వరలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. వాటిల్లో భారీ ర్యాంకర్లకు కూడా సీట్లు వస్తాయి. జాతీయస్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందంటున్నారు. బీడీఎస్‌కు కౌన్సెలింగ్ నేటినుంచి ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాలల్లో కన్వినర్ కోటా బీడీఎస్ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ నెల 24 ఉదయం 10 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకుు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. -
2 లక్షల ర్యాంకు దాటినా.. కన్వినర్ సీటు
సాక్షి, హైదరాబాద్: నీట్ ఫలితాలు వెలువడ్డాయి. ఇక త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎంత ర్యాంకుకు ఎంబీబీఎస్‌లో కన్వినర్ కోటాలో సీటు వస్తుందన్న దానిపై విద్యార్థుల్లో చర్చ జరుగుతోంది. పైగా గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలో 9 కొత్తగా వస్తున్నాయి. అంటే 900 ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరుగుతాయి. గతేడాది లెక్క ప్రకారం చూసినా 2 లక్షల ర్యాంకు దాటినా రిజర్వు కేటగిరీలో సీటు వచ్చే అవకాశముంది. అలాగే అన్ రిజర్వుడు కేటగిరీలోనూ 1.25 లక్షల ర్యాంకుకూ కన్వీనర్ సీటు వచ్చే అవకాశం ఉంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో రెండు లక్షలకుపైగా ర్యాంకులు వచ్చి న వారికి కూడా కన్వినర్ కోటాలో సీ ట్లు వస్తాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చి న వారి కి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు. రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో 2023–24 వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. మంగళవారం ‘నీట్’ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చి ంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి నీట్లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. ‘నీట్’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్రస్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. 15 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కేటాయింపు... ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. -
‘బీ’టెక్ బేరం షురూ!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ ఎక్కువైంది. ప్రైవేటు కాలేజీలు బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఇప్పటికే ద్వారాలు తెరిచాయి. బేరసారాల కోసం ఆయా కాలేజీలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాయి. తల్లిదండ్రులూ ప్రముఖ కాలేజీల వద్ద బారులు తీరుతున్నారు. మధ్యస్థంగా ఉండే కాలేజీలు డిమాండ్ సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కన్సల్టెన్సీలు, పీఆర్వోల ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంసెట్‌లో 50 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు మంచి కాలేజీలో కోరుకున్న సీటు రాదని భావిస్తున్నారు. దీంతో యాజమాన్య కోటాలో సీటు తెచ్చుకునేందుకు ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు ప్రముఖ కాలేజీల్లో రోజూ 20 మంది వరకూ కళాశాల ప్రతినిధులతో బేరసారాలు ఆడుతున్నారు. ఈ కేటగిరీలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉన్నతాధికారులు ఉంటున్నారు. వాస్తవానికి కన్వినర్ కోటా సీట్ల భర్తీ తర్వాతే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఉంటుంది. కానీ కాలేజీలు అనధికారికంగా ముందే బేరం కుదుర్చుకుంటున్నాయి. నిబంధనలకు పాతరేస్తున్నా అధికారులు మాత్రం ఇవేవీ తమ దృష్టికి రావడం లేదని చెబుతున్నారు. రూ.లక్షల్లో బేరం రాష్ట్రంలో దాదాపు 176 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 145 ప్రైవేటు కాలేజీలే. 71 వేల ఇంజనీరింగ్ సీట్లు కన్వినర్ కోటా కింద, 30 వేల సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. ఇందులో సగం సీట్లను జేఈఈ ర్యాంకులు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక రుసుం తీసుకోవాలి. కాకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. మిగిలిన సగం సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు, ఎన్ఆర్ఐలు స్పాన్సర్ చేసే వారికి ఇవ్వాలి. ఈ సీట్లకు ఎక్కువ ఫీజు వసూలు చేయొచ్చు. అందుకే ముందుగానే అనధికారికంగా డొనేషన్ల రూపంలో తీసుకుంటున్నాయి. ఒక్కో సీటుకు రూ. 8 నుంచి 12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఫీజులతో కలిపి రూ.20 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. బేరం కుదిరితే ఇప్పుడే సగం కట్టాలని షరతు పెడుతున్నట్లు సమాచారం. కంప్యూటర్ సైన్స్ హాట్ కేక్ యాజమాన్య కోటా కింద సీట్లు ఆశిస్తున్న విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్, అనుబంధ బ్రాంచ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీలు సీఎస్సీ సీటుకు వార్షిక ఫీజుకు అదనంగా రూ.8–10 లక్షలు అడుగుతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులైతే రూ.12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో కన్వినర్ కోటా కిందే సీట్లు భర్తీ కావడం లేదు. కాబట్టి ఎంసెట్‌లో లక్షల్లో ర్యాంకు వచ్చిన వాళ్లు, క్వాలిఫై కాని వాళ్లే ఈ సీట్లను ఆశిస్తున్నారు. ప్రముఖ కాలేజీలైతే రూ. 2 లక్షల వరకూ అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలి యాజమాన్య కోటా సీట్లయినా నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలి. ఈ విషయంలో మండలి సీరియస్‌గా ఉంది. బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మెరిట్ పద్ధతి పాటించాల్సిందే. అందుకు విరుద్ధంగా డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకున్నట్టు ఫిర్యాదులొస్తే విచారణ జరిపిస్తాం. ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరు కోం. తల్లిదండ్రులు కూడా నోటిఫికేషన్ రాకుండా యాజమాన్య కోటా సీట్లు ఆశించడం సరికాదు. - ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) -
Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పెరిగిన ఫీజులు.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు గుదిబండగా మారనున్నాయి. సగటున ఒక్కో విద్యార్థిపై ఏటా అదనంగా రూ.20 వేల భారం పడుతుందని.. నాలుగేళ్లకు కలిపి రూ.80వేలు భరించాల్సి వస్తుందని విద్యా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచిన కళాశాలల్లో చేరే దాదాపు 45 వేల మంది విద్యార్థులపై ఈ భారం పడనుంది. వీరంతా కన్వీనర్ కోటా కింద చేరే విద్యార్థులే కానుండటం గమనార్హం. ఇక అదనపు ఫీజు భారానికితోడు ట్రాన్స్‌పోర్టు/హాస్టల్/ల్యాబ్ ఖర్చులపేరిట ప్రతినెలా మరో రూ.ఐదు వేల వరకు భారం పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫీజులో అదనంగా రూ.లక్షకుపైనే ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.45 వేల దాకా అదనపు భారం కోర్టు అనుమతి మేరకు కాలేజీలను బట్టి వార్షిక ఫీజు కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు పెరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10వేలలోపు ర్యాంకు వచ్చి కాలేజీల్లో చేరే దాదాపు ఆరు వేల మంది బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తిఫీజును ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ట ఫీజు రూ.1.38 లక్షలు ఉండేది. అదిప్పుడు రూ.45 వేల నుంచి రూ1.73 లక్షలకు పెరిగింది. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మరోవైపు పదివేలకన్నా పైన ర్యాంకు వచ్చినవారికి ప్రభుత్వం కనీస ఫీజును మాత్రమే చెల్లిస్తుంది. ఆపై మొత్తాన్ని విద్యార్థులే కట్టాలి. దీంతో పదివేలపైన ర్యాంకు వచ్చిన బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులందరిపై పెరిగిన ఫీజు మోత మోగనుంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రానివారికీ భారం పడుతోంది. సగటున చూస్తే ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.20వేల చొప్పున నాలుగేళ్లకు రూ.80 వేలకుపైగా అదనపు భారం పడనుంది. పెంచిన ఫీజులను తగ్గించాల్సిందే.. ఏఎఫ్ఆర్సీ, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష సహకారంతోనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకున్నాయి. దీనిని వెంటనే వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపారు. – ప్రవీణ్, ఏబీవీపీ నేత కోర్టుకెళ్లి పెంచుకున్న కాలేజీలు ‘తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిషన్(టీఎస్ఏఎఫ్ఆర్సీ)’ ఈసారి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు ప్రక్రియ చేపట్టింది. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి.. 20 నుంచి 25% ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలపై ఏమీ తేల్చలేదు. దీనితో 81 ఇంజనీరింగ్ కాలేజీలు కోర్టును ఆశ్రయించి ఈ విద్యా సంవత్సరంలోనే ఫీజుల పెంపునకు అనుమతి తెచ్చుకున్నాయి. అయితే కోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు అప్పీలు చేయలేదని.. అంటే పరోక్షంగా పెంపును అంగీకరించనట్లేనన్న విమర్శలు వస్తున్నాయి. ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం సీబీఐటీలో రూ.1.73 లక్షలకు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళా కాలేజీలలో రూ.1.55 లక్షలు, శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో రూ.1.50 లక్షలు, ఎంవీఎస్ఆర్ రూ.1.45 లక్షలు చొప్పున ట్యూషన్ ఫీజులకు అనుమతి లభించింది. అయితే ఫీజు పెంపునకు సంబంధించి హైకోర్టు.. కాలేజీలకు తాత్కాలిక అనుమతి మాత్రమే ఇచ్చింది. మొత్తం 79 కాలేజీలుండగా.. 36 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం ఉంది. కాగా, కాలేజీలు వసూలు చేసే పెంపు మొత్తాన్ని బ్యాంకుల్లోనే ఉంచాలని.. తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఫీజు పెంపు ఉత్తర్వులు ఉంటాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
డిగ్రీ కన్వీనర్ కోటా భర్తీ చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరపవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. వీటిలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేసుకోవచ్చని తెలిపింది. 30 శాతం యాజమాన్య సీట్లను భర్తీ చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 55పై తీర్పును రిజర్వ్ చేసింది. జీవో 55ను సవాలు చేస్తూ మాల మహానాడు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పేద మెరిట్ విద్యార్థులకు ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీసింది. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో 35 శాతం సీట్లు నిరుపేద మెరిట్ విద్యార్థులకే కేటాయించనుంది. ఈ సీట్లను ప్రభుత్వ కోటా (కన్వీనర్ కోటా) కింద రాయితీ ఫీజులతో పేదలకు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం–2017కు సవరణలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు ఆయా సంస్థల విధివిధానాల్లో కూడా ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులతో ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతోపాటు ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు సీట్లు దక్కనున్నాయి. ‘ప్రైవేటు’కు మాత్రమే మేలు కలిగేలా టీడీపీ ప్రభుత్వం చట్టం ప్రైవేటు వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా కాకుండా ఆ వర్సిటీలకు లాభం చేకూరేలా మాత్రమే చట్టంలో నిబంధనలు పెట్టింది. ఆ వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతోపాటు ఇతర రాయితీలూ కల్పించింది. ప్రైవేటు వర్సిటీలకు ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ కూడా రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్ని వ్యవహారాల్లోనూ ఆ వర్సిటీల ఇష్టానుసారానికే వదిలిపెట్టింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించినవారికి మాత్రమే కేటాయిస్తున్నాయి. ఫలితంగా పేద మెరిట్ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీల్లోని 35 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీట్లను ప్రవేశపరీక్షలో మెరిట్ సాధించిన రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కన్వీనర్ కోటాలో పారదర్శకంగా కేటాయించనున్నారు. ఫీజులపైనా నియంత్రణ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నోటిఫికేషన్ మేరకు ప్రైవేటు వర్సిటీలు ఫీజుల నిర్ణయానికి అకౌంటు పుస్తకాలు, ఇతర పత్రాలను అథారిటీ సమర్పించాలి. ఈ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని పరిశీలించి అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. కోర్సుల వారీగా ఆ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులను సమీక్షించి.. అంతిమంగా వాటి వాదనలను కూడా విని ఫీజులను నిర్ణయిస్తుంది. దీని సిఫార్సుల మేరకు ఆ ఫీజులను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థలపై రూ.15 లక్షలకు మించకుండా పెనాల్టీని విధించే అధికారం అథారిటీకి ఉంటుంది. వర్సిటీలు తప్పనిసరిగా నిర్ణీత ప్రమాణాల్లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కలిగి ఉండాలి. భవిష్యత్తులో రానున్న మూడేళ్లలో వివిధ కోర్సుల నిర్వహణకు రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టగలగాలి. అంతర్జాతీయ స్థాయిలో టాప్ 100 యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీలకు వీలుగా టైఅప్ కలిగి ఉండాలని ప్రైవేటు వర్సిటీల చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. -
ఇంజినీరింగ్‌లో ఇంకా సీట్లున్నాయ్..!
మచిలీపట్నం: ఇంజినీరింగ్ కాలేజీల్లో 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తవుతోంది. జిల్లాలోని ఏఏ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు సీట్లు ఎంపిక చేసుకున్నారనేది అధికారులు వెల్లడించారు. చాలా కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కొన్ని బ్రాంచిల్లో ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే కోరుకున్నారు. ఇలాంటి చోట్ల తరగతులు నిర్వహణ ఎలా ఉంటుందనేది విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో 32 కాలేజీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 11,555 సీట్లు అందుబాటులో ఉండగా, తొలివిడతలో 8,408 మంది సీట్లు కోరుకోగా, ఇందులో కొంతమంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి 8,698 మంది విద్యార్థులు సీటు పొందారు. ఫిబ్రవరి 1 నాటికి విద్యార్థులు కాలేజీల్లో చేరాలని అధికారులు స్పష్టం చేశారు. లేకుంటే సీటు రద్దు చేస్తామని ప్రకటించారు. కౌన్సెలింగ్‌లో సీటు కోరుకున్నప్పటికీ, ఎంత మంది కాలేజీలకు వచ్చి చేరుతారనేది తేలాల్సి ఉంది. రెండు విడుతల పూర్తి అయినప్పటికీ, కన్వీనర్ కోటాలోనే ఇంకా 2,857 సీట్లు ఖాళీ ఉన్నాయి.(చదవండి: త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ) ఇదిలా ఉంటే జిల్లాలోని 32 కాలేజీల్లో 9 చోట్ల వందమంది లోపే విద్యార్థులు చేరారు. కొన్ని బ్రాంచిల్లో అయితే ఒకరిద్దరు మాత్ర మే కోరుకున్నారు. మూడేళ్ల పాటు 25 శాతంపైన ప్రవేశాలు లేకుంటే, వాటికి గుర్తింపు వద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మూడు కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో మూతపడ్డాయి. ఈ లెక్కన తక్కువ అడ్మిషన్లు నమోదు అయిన కాలేజీల పరిస్థితి వచ్చే ఏడాది ఎలా ఉంటుందోనని కళాశాల యాజమాన్యాల్లో సర్వత్రా చర్చసాగుతోంది. మరోవైపు, ఇంజినీరింగ్ విద్యలో సీఎస్ఈ బ్రాంచికు మంచి క్రేజ్ ఉంటుంది. కానీ గాంధీజీలో ఆరుగురు, అదే విధంగా శ్రీవాణి మైలవరంలో ఏడుగురు మాత్రమే చేరారు.లింగయాస్, పీపీడీవీ, డీజేఆర్ఎస్, మండవ వంటి కాలేజీల్లో మెకానికల్ బ్రాంచిలో ఒక్కొక్కొరు చొప్పున మాత్రమే విద్యార్థులు చేరారు. ఒక గ్రూపుకు తప్పనిసరిగా ఆరుగురు అధ్యాపకులు ఉండాలి. మరి ఒకరిద్దరు చేరిన చోట గ్రూపులను కొనసాగిస్తారా..లేదా..? అనేది తేలాల్సి ఉంది. వాసవి పెడన కాలేజీలో మిగతా గ్రూపుల్లో కొంతమేర పరువాలేకున్నా, సివిల్ ఇంజినీర్లో 8 మంది మాత్రమే చేరారు. ఇలాంటి కాలేజీలు చాలానే ఉన్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్గామారింది. -
కన్వీనర్ కోటా కిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో అన్నీ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలే ఉన్నందున, 10 శాతం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. డిగ్రీ, పీజీ వంటి ఉన్నత, వృత్తి, సాంకేతిక విద్యా సంస్థలన్నీ కలిసి దాదాపు 2,500కు పైగా ఉండగా, వాటిల్లో దాదాపు 7 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో డిగ్రీ కాలేజీల్లోని 4 లక్షల సీట్లు మినహాయిస్తే మిగిలిన 3 లక్షల సీట్లలో ప్రభుత్వం ఏటా 2.5 లక్షల వరకే అడ్మిషన్లకు అనుమతి (అనుబంధ గుర్తింపు) ఇస్తోంది. ఈ లెక్కన 6.5 లక్షల సీట్లకు ఈడబ్ల్యూఎస్ కోటా కోసం అన్ని రకాల కోర్సులకు కలిపి 65 వేల సీట్లు అదనంగా వస్తాయి. మేనేజ్మెంట్ కోటా యధాతథం..: 65 వేల సీట్లను కన్వీనర్ కోటా కిందకే తెచ్చి రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మొత్తం సీట్లలో 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తుండగా, మిగతా 70 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటాను పక్కనపెట్టి, పెంచిన 10 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో కలిపి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తుండటంతో ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి సంప్రదించారు. ఈ సందర్భంగా ఏపీలో ఇదే విధానం అమలు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. కాగా వచ్చే విద్యా సంవత్సరంలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని పాపిరెడ్డి వివరించారు. -
ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజులు
మేడ్చల్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజు రూ. 89 వేలు.. అయినా కాలేజీ యాజమాన్యం మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీటుకు వార్షిక ఫీజు కలుపుకొని నాలుగేళ్లకు రూ. 9 లక్షలు తీసుకుంటోంది.. ఘట్కేసర్ సమీపంలోని మరొక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సీటుకు రూ.12 లక్షల డొనేషన్‌తో పాటు ఏడాదికేడాది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును వసూలు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అగ్రశ్రేణి కాలేజీలతో పాటు, కొద్ది పేరున్న వాటిలో యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇదీ.. యాజమాన్య కోటాకు ప్రత్యేక ఫీజు లేకపోయినా, కన్వీనర్ కోటా ఫీజునే యాజమాన్య కోటాలో వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా కూడా అదేమి పట్టకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మేనేజ్మెంట్ కోటా పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుకు హేతుబద్ధత ఏంటన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. యాజమాన్యాలు నిర్ణయించి వసూలు చేస్తున్నదే అధికారిక ఫీజు అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ, ఫీజుల విధానంపైనా వివిధ కోణాల్లో ఆలోచనలు మొదలయ్యాయి. మెడికల్ తరహాలో రెండు రకాల ఫీజుల విధానం ప్రవేశపెట్టి, కన్వీనర్ ద్వారానే ఆ సీట్లను భర్తీ చేస్తే అడ్డగోలు వసూళ్ల దందాకు తెరపడుతుందన్న ఆలోచనలను అధికారులు చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో ఉన్న ఫీజుపై 50 శాతం లేదా ఎంతో కొంత మొత్తాన్ని పెంచి యాజమాన్య కోటా ఫీజుగా ఖరారు చేస్తే యాజమాన్యాలకు ఊరటతో పాటు, యాజమాన్య కోటాలో సీట్లు కావాలనుకునే తల్లిదండ్రులపైనా భారం తగ్గుతుందన్న వాదనలున్నాయి. మరోవైపు కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే ఆ సీట్లను భర్తీ చేస్తే ఎలాంటి అక్రమాలకు తావుండదని, మెరిట్ విద్యార్థులు టాప్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి. అయితే అది అంత తొందరగా ఆచరణ రూపం దాల్చుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలతో పారదర్శకత సాధ్యం కాదా? ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజుల విధానం ఆచరణలోకి వచ్చేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పారదర్శకత ఉండేలా చూడటం సాధ్యం కాదా..? అంటే అవుతుందనే చెప్పవచ్చు.. ఇటు హైకోర్టు కూడా మేనేజ్మెంట్ కోటాలో పారదర్శకత ఉండాలని, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఏం చేసిందంటే.. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక నిబంధనలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 74, 75 జీవోలను, 2012లో 66, 67 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. వాటిల్లోని వివిధ అంశాలపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా.. 2014 ఆగస్టు 14న 13, 14 జీవోలను జారీ చేసింది. అయితే జీవో 66, 67 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాజమాన్య కోటాలో సీటు కోరుకునే ప్రతి విద్యార్థికి దరఖాస్తు దక్కేలా, ఆ దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంపికయ్యేలా చర్యలు చేపట్టింది. మారదర్శకాలు ఇవీ.. బీ కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్ విండో తరహాలో అధికార యంత్రాంగం ఒక వెబ్ పోర్టల్‌ను తయారు చేయాలి. ఈ పోర్టల్‌లో ప్రతి కాలేజీకి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. కాలేజీల్లోని ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి. మరోవైపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కాలేజీలు ప్రకటనలివ్వాలి. విద్యార్థులు ఆ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒకే కాలేజీలో రెండు, మూడు కోర్సులను ఎంచుకుంటే ప్రాధాన్య క్రమం ఇవ్వాలి. వాటి ఆధారంగా కాలేజీలు విద్యార్థులను ఎంపిక చేయాలి. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను కాలేజీలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. మెరిట్ ప్రకారమే ఎంపిక చేశారని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్లైన్లోనే ఆమోదించాలి. లేదంటే తిరస్కరించాలి. ఇంకా సీట్లు మిగిలితే రెండో జాబితాను రూపొందించాలి. ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే.. ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. జీవో 66, 67లను కోర్టు సమర్థిస్తూనే యాజమాన్యాలు కోరిన పలు అంశాలను ఆ జీవోల్లో చేర్చాలని సూచించింది. అందులో దరఖాస్తులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశంతో పాటు విద్యార్థిని ఇంటర్వ్యూ చేసే వీలుంది. అలాగే వారి ఆర్థిక స్థోమత తెలుసుకొని సీట్లను కేటాయించే అవకాశమివ్వాలని, ఒకవేళ యాజమాన్యం ఆ విద్యార్థిని తిరస్కరిస్తే అందుకు గల కారణాలను ఉన్నత విద్యా మండలికి తెలియజేయడం వంటి అంశాలను చేర్చాలని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే అప్పటివరకు 5 శాతమే ఉన్న ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా 15 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అమలుకు నోచుకోని ఉత్తర్వులు.. హైకోర్టు సూచించిన మేరకు 66, 74 జీవోలకు సవరణ చేస్తూ ప్రభుత్వం.. 2014 ఆగస్టు 14న జీవో 13ను జారీ చేసింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశం ఇక్కడ లేకుండాపోయింది. దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, దానిని అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే ఆన్లైన్ విధానాన్ని మళ్లీ తెచ్చేందుకు చర్యలు చేపట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డుకట్ట.. కోర్టు తీర్పులు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా సీట్లు అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆధారం లేకుండా ఏ చర్యలు చేపట్టే అవకాశం లేదు. రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డగోలు వసూళ్లను అడ్డుకోవచ్చు. కన్వీనర్ కోటా ఫీజు కంటే యాజమాన్య కోటా ఫీజు కొంత పెంచి, కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తే పారదర్శకత ఉంటుంది. తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ అలా చేస్తే అభ్యంతరం లేదు.. రెండు రకాల ఫీజుల విధానం తెస్తే మాకేమీ అభ్యంతరం లేదు. సీట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు పోతాయి. సీట్ల భర్తీ వ్యవహారం కూడా కన్వీనరే చేస్తారు కనుక మాపై భారం తగ్గుతుంది. అయితే కన్వీనర్ కోటా కంటే యాజమాన్య కోటా ఫీజు రెట్టింపు ఉండేలా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ విధానాన్ని తెస్తే స్వాగతిస్తాం.. – గౌతంరావు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్ -
పీజీ మెడికల్ కన్వీనర్ సీట్ల తుది విడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి శని, ఆదివారాల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్ల భర్తీకి ఇప్పటికే మొదటి, రెండు, మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఈ మాప్‌అప్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. కాలేజీల వారీగా ఖాళీలను వెబ్సైట్లో పొందుపరిచారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. తగ్గించిన నీట్ అర్హత కటాఫ్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో కూడిన రివైజ్డ్ తుది మెరిట్ జాబితాను వర్సిటీ విడుదల చేసింది. ఆ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అధికారులు కోరారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కాని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు, అలాగే ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. -
డబ్బుంటేనే డాక్టర్ గిరి?
ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం భర్తీ చేసే సీట్ల ఫీజు రూ.60 వేలు. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ.11.55 లక్షలు. అదే సీ(ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు రూ. 23.10 లక్షలు. ఇప్పుడు వీటినే ప్రధానంగా మార్చనున్నారు.ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020–21 వైద్య విద్యా సంవత్సరంలోనే ఈ ఫీజుల భారాన్ని వైద్య విద్యార్థులపై పడేసేలా కేం ద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం అమలుపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఎంసీఐ స్థానంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బోగ్)ను కేంద్రం తాజాగా ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజును కాలేజీ యాజమాన్యాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తారు. మిగి లిన 50% కన్వీనర్ కోటా ఫీజులను కేంద్రం నిర్ధారించనుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘బోగ్’ఫీజులపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. వారి సలహాలను కోరింది. ఎంఎన్సీ చట్టం వల్ల అత్యంత తక్కువగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఫీజులు మరింత పెరుగుతాయి. యాజమాన్య సీట్ల ఫీజులూ ఇష్టారాజ్యంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్ఎంసీ బిల్లుపై మొదట్లో జూనియర్ డాక్టర్లు (జూడా) రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కానీ సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పేద విద్యార్థులపై పిడుగు... తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,500 వరకు కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల ఫీజు ఏడాదికి రూ. 10 వేలుకాగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటి ఫీజును రూ. 60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 35 శాతంగా ఉన్న బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉండగా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుగా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను ఎంఎన్సీ నియంత్రిస్తుంది. వాటినే ఇప్పుడు ప్రధానంగా మార్చనున్నారు. ప్రస్తుతం ఈ ఫీజులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకటే ఫీజు ఉంది. దేశవ్యాప్తంగా ఒక్కో డీమ్డ్ వర్సిటీలో ఫీజులు మన రాష్ట్రంలోని బీ కేటగిరీ ఫీజులకు దగ్గరగా ఉంటాయి. వాటిని క్రమబద్ధీకరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా ఫీజులను రూ. 6–7 లక్షల వరకు క్రమబద్ధీకరిస్తారని సమాచారం. అవే ఫీజులను ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఖరారు చేస్తారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. గందరగోళం నెలకొంది... ఎన్ఎంసీ చట్టం నేపథ్యంలో ఫీజులపై ఇప్పుడు కసరత్తు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ఎంసీ చట్టం ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ‘బోగ్’నిర్ధారించనుంది. మిగిలిన 50 శాతం సీట్ల ఫీజును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి యాజమాన్యాలు నిర్ధారించుకునే అవకాశముంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ఇప్పుడు ఏ మేరకు నిర్ధారిస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఫీజుల పెంపుపై మాకు ఇప్పటివరకు సమాచారం రాలేదు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచితే పెనుభారమే... డీమ్డ్ వర్సిటీలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను పెంచితే అది పేద విద్యార్థులకు పెనుభారమే కానుంది. ఫీజులు పెంచుతారన్న ఆందోళనైతే ఇప్పటికీ నెలకొని ఉంది. ఎన్ఎంసీ బిల్లు వచ్చిన సమయంలో ఫీజులు పెరుగుతాయని ఉద్యమాలు చేశాం. అయినా బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. - డాక్టర్ విజయేందర్, సలహాదారు, జూడాల సంఘం -
ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా ఫీజు... ఎందుకు పెరిగిందట?
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఎనిమిదేళ్ల కిందట తక్కువ ఫీజులు ఉంటే ఇప్పుడు అవి భారీగా పెరిగిపోయాయి. కాస్త పేరున్న కాలేజీలు మొదలు టాప్ కాలేజీల వరకు చూసుకుంటే ఈ ఫీజులు ఎనిమిదేళ్లలో రెండు, మూడింతలయ్యాయి. 2011లో కన్వీనర్ కోటా ఫీజు రూ. 31 వేలుగా ఉంటే మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ. 95 వేలుగా ఉండేది. 30% సీట్లు ఉండే మేనేజ్మెంట్ కోటాతో పోటీగా.. 70% సీట్లుండే కన్వీనర్ కోటాలో ఫీజులు పెంచాలంటూ ప్రభుత్వం ముందు యాజమాన్యాలు డిమాండ్ పెట్టాయి. మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటాలో రెండింటిలోనూ ఒకే రకమైన ఫీజులను అమలు చేసేలా కామన్ ఫీజు విధానం కోసం పట్టుబట్టాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాన్ని సాధించుకున్న యాజమాన్యాలు.. కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై ఫీజుల భారానికి కారణమయ్యాయి. ఏ స్థాయిలోనూ ప్రశ్నించలేని విధంగా ఆదాయ, వ్యయాలనుబట్టి ఫీజులను పెంచుకుంటామని కోరినా.. ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. ఇంత చేసున్నా కామన్‌ఫీజు విధానాన్ని మేనేజ్మెంట్ కోటాలో అమలు చేయట్లేదు. కన్వీనర్ కోటాలో ఫీజులను పెంచుకొని.. యాజమాన్య కోటాలో ఆ ఫీజులను అమలు చేయకుండా, కొన్ని కాలేజీలు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టించుకోని అధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా ఈ దోపిడీకి అడ్డులేకుండా పోయింది. ర్యాటిఫికేషన్లలోనూ చూసీచూడని మండలి తీరుతో యాజమాన్య కోటా ప్రవేశాల్లో అక్రమాలు పెరిగిపోయాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులు భారీగా పెరిగిపోయాయి. 8 ఏళ్ల క్రితంతో పోలిస్తే.. ఇవి రెండు, మూడింతలయ్యాయి. మేనేజ్మెంట్ కోటాతోపాటు.. కన్వీనర్ కోటాలోనూ అదే స్థాయిలో ఫీజుల పెంపుకోసం కామన్ ఫీజు విధానానికి కాలేజీల యాజమాన్యాలు పట్టుబట్టాయి. తద్వారా కన్వీనర్ కోటాలోనూ ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై అడ్డగోలుగా ఫీజుల భారం మోపుతున్నాయి. కొద్ది పేరున్న కాలేజీల నుంచి టాప్ కాలేజీలుగా పేరున్న విద్యాసంస్థల వరకు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో కామన్ ఫీజు నిబంధనలకు నీళ్లొదిలాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టింపులేని ప్రభుత్వాధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా యాజమాన్యాలకు కాసుల పంట పండుతోంది. కోటాను పెంచుకున్న యాజమాన్యాలు రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ఒకప్పుడు కన్వీనర్ కోటా సీట్లు 85%. యాజమాన్య కోటా 15% మాత్రమే. క్రమంగా యాజమాన్యాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ పేరుతో యాజమాన్య కోటాను 30% పెంచుకున్నాయి. అంటే ఆ 30% సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. అప్పట్లో కన్వీనర్ కోటా ఫీజు చాలా తక్కువ. అదే యాజమాన్య కోటా ఫీజు దాదాపు రూ.1 లక్షకు దగ్గర్లో ఉండేది. ఇవి సరిపోవడం లేదంటూ.. మరో 15% సీట్లను యాజమాన్య కోటాలోకి తెచ్చుకొని 30% తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి. 2006–07 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా ఫీజు రూ.26 వేలు ఉంటే, యాజమాన్య కోటా ఫీజు రూ.79 వేలుగా ఉంది. ఆ ఫీజులు 2011–12కు వచ్చేసరికి కన్వీనర్ కోటా ఫీజు రూ.31 వేలు కాగా, యాజమాన్య కోటా ఫీజు రూ.95 వేలకు పెరిగింది. అయినా కొన్ని టాప్ కాలేజీలు అప్పట్లోనే యాజమాన్య కోటా సీట్లను ఒక్కోదానిని రూ. 4 లక్షల వరకు అమ్ముకున్నాయి. కామన్ ఫీజు కోసం పట్టు యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో సీట్లను అమ్ముకుంటున్నప్పటికీ.. డబ్బు యావ తీరలేదు. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణలో పడిన యాజమాన్యాల దృష్టి కన్వీనర్ కోటాపై పడింది. కన్వీనర్ కోటాలో 70% సీట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తున్నందున.. అందులో ఒక్కో విద్యార్థి నుంచి వచ్చే రూ.31 వేలు తమకు ఏ మూలకు సరిపోవడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. పైగా యాజమాన్య కోటా సీట్లు అమ్ముకుంటున్నారని తమపై అభాండాలు వేస్తున్నారని, కామన్ ఫీజు విధానం (కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాకు ఒక రకమైన ఫీజు) అమలు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం 2012లో కామన్ ఫీజు డిమాండుకు ఓకే చెప్పింది. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు కోసం కామన్ ఫీజు విధానం తీసుకొచ్చినా.. కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి చెందలేదు. మరిన్ని డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషించాయి. సాధారణ కాలేజీకి, తమ టాప్ కాలేజీకి చాలా తేడా ఉందని.. విద్యార్థులపై చేసే ఖర్చులోనూ భారీ వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. కాలేజీని బట్టి ఫీజులను నిర్ణయించాల్సిందేనని పట్టుబట్టాయి. కొన్ని యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నేతృత్వంలో.. కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే విధానానికి శ్రీకారం చుట్టింది. 2012–13 విద్యాసంవత్సరంలో ఒక్క ఏడాదికే.. కాలేజీలను బట్టి ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం.. 2013–14 విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడేళ్లకోసారి కాలేజీల ఆదాయ వ్యయాలను ఆధారంగా ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో.. ఫీజులను నిర్ణయిస్తోంది. దీంతో కన్వీనర్ కోటాలోనూ చేరే వేల మంది విద్యార్థులపై ఫీజుల భారం అమాంతంగా పెరిగిపోయింది. పాత ఫీజు విధానం ఉంటే కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులపై ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఫీజులు ఉండేవి కావని ఉన్నత విద్యామండలి వర్గాలే పేర్కొంటున్నాయి. తీరని మేనేజ్మెంట్ల ధనదాహం ఇంత చేసినా కొన్ని యాజమాన్యాల ధనదాహం తీరలేదు. తమ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే 70% విద్యార్థులపైనా ఫీజు భారం మోపాయి. కన్వీనర్ కోటాలో చేరే అనేక మంది పేద విద్యార్థులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. 2011–12 విద్యా సంవత్సరం వరకు కన్వీనర్ కోటాలో కేవలం రూ.31 వేల ఫీజు మాత్రమే ఉండగా ఆ తరువాత భారీగా పెరిగిపోయింది. ఇపుడు అత్యధికంగా కన్వీనర్ కోటాలోనూ ఫీజు రూ.1.63 లక్షల వరకు పెరిగిపోయింది. రాష్ట్రంలో 212 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాదాపు 80 కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.90 వేలకు పైనే ఉంది. మరో 40 కాలేజీల్లో రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. కొన్ని సాధారణ కాలేజీలు మాత్రమే రూ.35 వేల కనీస ఫీజును అమలు చేస్తున్నాయి. అవి మినహా కొద్దిగా పేరున్న ప్రతి కాలేజీ.. భారీగానే ఫీజులు వసూలు చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో కారణంతో ఫీజులను పెంచుకున్నాయి. ప్రభుత్వం పెంచితే సరే.. లేదంటే కోర్టును ఆశ్రయించి తమ కాలేజీల్లో ఫీజులను పెంచుకోవడం యాజమాన్యాలకు పరిపాటిగా మారింది. ఫీజులను పెంచుకుంటున్న యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో మాత్రం కామన్ ఫీజును అమలు చేయడం లేదు. కొన్ని కాలేజీలైతే అడ్డగోలుగా ఒక్కో సీటును రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
కన్వీనర్ కోటాలో అదనంగా 2,378 సీట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. 2017–18లో ఈ కోటాలో 62,188 సీట్లు ఉండగా.. ఈసారి (2018–19) 64,566 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అంటే గతేడాదికన్నా 2,378 సీట్లు పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కోర్సులోనే సీట్లు ఎక్కువగా పెరగడం గమనార్హం. ఐటీలో గతేడాది 2,487 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 3,369 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ)లో మాత్రం సీట్లు తగ్గిపోయాయి. ఈ కోర్సు కన్వీనర్ కోటాలో గతేడాది 8,412 సీట్లు ఉండగా.. ఈసారి 8,372 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా కన్వీనర్ కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. గతేడాది 29 కోర్సుల్లో ప్రవేశాలకు చర్యలు చేపట్టగా.. ఈసారి రెండు కొత్త కోర్సులకు అనుమతులు వచ్చాయి. అందులో పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 42 సీట్లకు, ఫార్మాస్యుటికల్ ఇంజనీరింగ్‌లో 42 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. టాప్–100లో ముగ్గురే హాజరు ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. తొలిరోజున ఒకటో ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలవగా.. 5,699 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో టాప్–100లోపు ర్యాంకులు వచ్చినవారు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. 101 ర్యాంకు నుంచి 500లోపు ర్యాంకు వారిలోనూ 63 మందే హాజరయ్యారు. ఇక స్పెషల్ కేటగిరీలో భాగంగా ఒకటో ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు వరకున్న ఎన్సీసీ విద్యార్థుల్లో వెరిఫికేషన్‌కు 6,075 మంది హాజరయ్యారు. మంగళవారం (29న) 10,001వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకు వరకు, ఎన్సీసీ కేటగిరీలో 40,001వ ర్యాంకు నుంచి 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులంతా వచ్చే నెల 5వ తేదీలోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. -
సీట్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ
♦ కన్వీనర్ కోటాలో గతేడాది కన్నా తగ్గిన సీట్లు ♦ సీట్లు 62,746.. వెరిఫికేషన్ చేయించుకున్న వారు 64,340 ♦ గతేడాది 5 వేల సీట్లు అదనం.. ఈసారి 1,594 సీట్లు తక్కువ ♦ కన్వీనర్ కోటా ప్రవేశాలకు ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ♦ నేడు వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. 28న సీట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఈసారి ఇంజనీరింగ్‌లో విద్యార్థులకు కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిం చడం కొంచెం కష్టంగా మారింది. కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు తక్కువగా ఉండటం.. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది కన్వీనర్ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య కన్నా 5 వేలకు పైగా ఎక్కువ సీట్లున్నాయి. ఈ సారి విద్యార్థుల సంఖ్య కంటే 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభించడం కాస్త కష్టమే. గతేడాది కన్వీనర్ కోటాలో 71,066 సీట్లు అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 66,566 విద్యార్థుల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో 57,789 మందికే సీట్లు లభించాయి. ఈ సారి కన్వీనర్ కోటాలో 62,746 సీట్లు అందుబాటులో ఉండగా, గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముగిసే సమయానికి 64,340 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్ కు హాజరైన విద్యార్థుల కన్నా 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన ఎంత మందికి మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభి స్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మేనేజ్మెంట్ కోటా వైపు మొగ్గు..! కన్వీనర్ కోటాలో కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయో లేదోనన్న అనుమానంతో డబ్బు చెల్లించగలిన వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతేడాది కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు మొత్తం 1.04 లక్షలుండగా, ఎంసెట్‌లో 1.06 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. కానీ ఈ సారి మొత్తం సీట్లు 92,700 వరకు ఉండగా, అర్హులు మాత్రం 1.03,500 మంది ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 11 వేల సీట్లు తగ్గిపోయాయి. దీనివల్ల కూడా మేనేజ్మెంట్ కోటాకు డిమాండ్ ఏర్పడింది. వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. ఇంజనీరింగ్ ఎంసెట్ వెరిఫికేషన్ గురువారంతో ముగిసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోనివారు ఈ నెల 23న ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు శుక్రవారం తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 28న రాత్రి 8కు సీట్లు కేటాయించనున్నారు. జ్టి్టpట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో వివరాలను ఉంచుతామని వివరించారు. -
యాజమాన్య కోటా సీట్లకు ఆన్లైన్ ఎంట్రన్స్
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సన్నద్ధం విజయవాడ: ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 35 శాతం యాజమాన్య కోటా (బి-కేటగిరీ) సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ‘అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నద్ధమవుతోంది. ఈ సీట్లకుప్రత్యేకంగాప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆన్లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నట్టు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులోని సీట్ల ప్రకారం తెలంగాణ, ఏపీలలో కలిపి 1,242 (ఏయూ పరిధిలో 420, ఎస్వీయూ పరిధిలో 227, ఓయూ పరి దిలో 595) సీట్లకే అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది. -
యాజమాన్యాల ఆశల గల్లంతు!
ఆశించినమేర చేరని విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల్లో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. ఎక్కువ మొత్తం లో విద్యార్థులు చేరుతారనుకుంటే తక్కువ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలోని 135 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జరిగిన కౌన్సెలింగ్‌లో కేవలం 3,115 మంది మాత్రమే సీట్లు పొందారు. ఈ సీట్ల కేటాయింపు వివరాలను ఆదివారం ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెల్లడించింది. కనీసంగా 25 వేల వరకు విద్యార్థులు తమ కాలేజీల్లో చేరుతారని యాజమాన్యాలు అంచనా వేసుకోగా.. అంత సంఖ్యలో విద్యార్థులు చేరలేదు. అన్నీ సక్రమంగా ఉన్న 149 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 68,516 సీట్లు ఉంటే కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు ఇచ్చిన వారు 55,094 మంది మాత్రమే. అందులో 52,839 మంది విద్యార్థులకుసీట్లు లభిం చాయి. 15,677 సీట్లు మిగిలిపోయాయి. అఫిలియేషన్లు లభిం చని 161 కాలేజీలు సుప్రీంకోర్టును పలుమార్లు ఆశ్రయించాయి. గత నెలలో సుప్రీం కోర్టు వాటిలోనూ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం మైనారిటీ కాలేజీలు, సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే కాలేజీలు మినహా మిగతా 135 కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో ఉన్న 45,293 సీట్ల భర్తీకి ఈ నెల 5 నుంచి 7 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించింది. 3,261 మంది సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోగా 3,115 మం ది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఆదివారం సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 42,178 సీట్లు మిగిలిపోయాయి. ఇక సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 10, 11 తేదీల్లో సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సంప్రదించి అలాట్మెంట్ లెటర్‌పై ధ్రువీకరణ తీసుకుని ఈనెల 12వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని స్పష్టం చేసింది. -
పరిష్కారానికి చొరవ చూపేదెవరు?
* ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై పీటముడి * స్లైడింగ్‌కైనా అవకాశం తప్పనిసరి * ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందిస్తేనే విద్యార్థులకు న్యాయం * ఇంజనీరింగ్ రివ్యూ పిటిషన్‌పైనే ఆశలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వ్యవహారంలో విద్యార్థులకు మేలు జరగాలంటే కనీసం స్లైడింగ్‌కైనా (కాలేజీ, బ్రాంచీ మార్చుకునే) అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలసి స్పందిస్తేనే ఫలితం ఉంటుంది. అయితే ఎవరు చొరవ తీసుకుంటారన్నదే ఇపుడు సమస్య. ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయంటూ కోర్టుకు చెప్పిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై మిన్నకుండిపోగా, తాము ప్రవేశాల గడువు పెంచాలని కోరినా ఏపీ సర్కారే వద్దన్నదంటూ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో కన్వీనర్ కోటాలో తమకు ఇష్టంలేని బ్రాంచీల్లో మెరిట్ మేరకు సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. వేలమందికి నిరాశ.. ఇంజనీరింగ్‌లో 1.16 లక్షల మందికి అధికారులు సీట్లు కేటాయించారు. అందులో 1.12 లక్షలమంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఇంకో నాలుగువేల మంది స్లైడింగ్ ఉంటుందనే ఆశతో ఇష్టంలేని కాలేజీల్లో చేరలేదు. కాగా, కాలేజీల్లో చేరిన వారిలో చాలా మంది స్లైడింగ్‌లో మరో కాలేజీలో.. మరో బ్రాంచీకి మారవచ్చనే ఆలోచనతో ఉన్నారు. అయితే గురువారంనాటి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వారి ఆశలు అడియాసలయ్యాయి. తల్లిదండ్రులు కూడా తీవ్రఆవేదన చెందుతున్నారు. 35 వేల మందికి ఇష్టమైన బ్రాంచీలో సీటు రానందునే! మేనేజ్మెంట్ కోటా విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే భావన అధికారుల్లో ఉంది. మేనేజ్మెంట్ కోటా కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి గత నెల 22న నోటిఫికేషన్‌ను జారీ చేసినా, అంతుకుముందుగానే యాజమాన్యాలు సీట్లు భర్తీ చేసుకున్నాయని తెలుస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కన్వీనర్ కోటాలో మంచి బ్రాంచీల్లో సీట్లు రాకపోవడంతో మేనేజ్మెంట్ కోటాలో పేరున్న కాలేజీలో, ఇష్టమైన బ్రాంచీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు 35 వేలమంది ఉంటారు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు బీటెక్ బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లో బైపీసీ స్ట్రీమ్ ద్వారా ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న మరో 3 వేల మందికి కౌన్సెలింగ్ ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక వారంతా నేరుగా కాలేజీలను సంప్రదించి అనధికారింగా చేరాల్సి ఉంది. అయితే అసలు నోటిఫికేషనే జారీ చేయనపుడు ప్రవేశాలు చేపట్టడమూ కుదరకపోవచ్చనే వాద న ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలప్రభుత్వాలు, రెండు ఉన్నత విద్యా మండళ్లు పట్టిం పులు వీడాలని నిఫుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మేలు చేసేందుకు ఉమ్మడి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. -
కన్వీనర్ కోటాలోనే 73,059 సీట్లు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు మొదటి దశ కౌన్సెలింగ్ కన్వీనర్ కోటా సీట్లను శనివారం కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ కలిపి 575 కళాశాలల్లో 1,16,029 మంది విద్యార్థులకు ఎంసెట్ ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఈ సీట్లను కేటాయించింది. ఈ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 1,89,088 సీట్లు అందుబాటులో ఉండగా.. 73,059 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 57,372 సీట్లు మిగిలిపోగా, తెలంగాణలో 15,677 సీట్లు మిగిలినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే తరహాలో యాజమాన్య కోటాలో కూడా భారీగా సీట్లు మిగిలిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంసెట్ సీట్ల కేటాయింపు వివరాలు https://eamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంసెట్ ప్రవేశాల కోసం 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహించారు. ఎంసెట్ అర్హులు మొత్తంగా 2,03,450 మంది ఉండగా.. 1,22,389 మంది మాత్రమే తనిఖీకి హాజరయ్యారు. ఇందులో 1,20,098 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను (మొత్తంగా 36 లక్షల ఆప్షన్లు) ఇచ్చుకున్నారు. వారిలో 1,16,029 మందికి సీట్లను కేటాయించగా... మిగతా వారికి ఆప్షన్లు ఇచ్చుకున్న కాలేజీల్లో సీట్లు రాలేదు. ఈ వివరాలను విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేశారు. యాజమాన్య కోటా పరిస్థితి ఏమిటి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి యాజమాన్య కోటాలో మరో 81,037 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటాలోనే 73,059 సీట్లు మిగిలిపోగా... యాజమాన్య కోటాలో ఎన్ని మిగిలిపోతాయోనని యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రముఖ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లు సులువుగానే భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగతా కాలేజీల పరిస్థితి కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాజమాన్య కోటాలో తెలంగాణలో 29,364 సీట్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో 51,673 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి భర్తీకి ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ కూడా జారీ చేసి.. సెప్టెంబరు 15లోగా ఆ ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది. రెండో దశ కౌన్సెలింగ్‌పై త్వరలో నిర్ణయం.. ఇంజనీరింగ్, ఫార్మసీ రెండో దశ కౌన్సెలింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రవేశాల కమిటీ సమావేశమై ఆ తేదీలను ఖరారు చేస్తుందని వెల్లడించారు. అడ్మిషన్ విధానం ఇదీ.. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబరు, లాగిన్ ఐడీ, పుట్టినతేదీ, పాస్వర్డ్ ఉపయోగించి తమ సీటు కేటాయింపు ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీజు వర్తించే విద్యార్థులు ఉంటే.. ఇండియన్ బ్యాంకు, రెండు రాష్ట్రాల్లోని ఏదేని ఆంధ్రా బ్యాంకు శాఖలో చలానా రూపంలో చెల్లించాలి. సీటు కేటాయింపు ఆర్డర్, ఫీజు చెల్లించిన చలానాలను రెండు సెట్ల కాపీలు తీసుకుని సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో రిపోర్టు చేయాలి. 1వ తేదీన ఒకటో ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు.. 2వ తేదీన 50,001 నుంచి లక్ష ర్యాంకు వరకు.. 3వ తేదీన 1,00,001 నుంచి 1,50,000 ర్యాంకు వరకు.. 4వ తేదీన 1,50,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీల్లో రిపోర్టు చేయని వారు 5వ తేదీన రిపోర్టు చేయవచ్చు. హెల్ప్‌లైన్ కేంద్రం వారు కౌంటర్ సైన్ చేసి అలాట్మెంట్ ఆర్డర్‌పై తమ స్టాంపు వేసి, విద్యార్థులకు అందజేస్తారు. విద్యార్థి సంబంధిత కాలేజీలో 6వ తేదీలోగా రిపోర్టు చేయాలి. విద్యార్థులు తరువాతి దశ కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనవచ్చు. అయితే చివరి దశ కౌన్సెలింగ్ తరువాతే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, చలానాలను కాలేజీల్లో అందజేయాలి. చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవద్దు. ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దు. హెల్ప్‌లైన్ కేంద్రంలో కౌంటర్ సైన్ చేసిన అలాట్మెంట్ ఆర్డర్‌ను మాత్రమే తీసుకొని విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకోవాలి. అయితే ఒకటో తేదీన చేరిన వారికి ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభమైనట్లు పరిగణిస్తారని, 7వ తేదీ నుంచి మొదటి దశలో కాలేజీల్లో చేరిన వారందరికీ తరగతులు ప్రారంభిస్తారని ఓ అధికారి వెల్లడించారు. సీట్ల కేటాయింపు ఆర్డర్లో ఫీజుల వివరాలు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు లభించిన విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన వివరాలు సదరు విద్యార్థి సీటు కేటాయింపు ఆర్డర్లో ఉంటాయని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి ర ఘునాథ్ వెల్లడించారు. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉన్నందున... విద్యార్థికి కేటాయించిన కాలేజీకి సంబంధించిన ఫీజు వివరాలు, అర్హతలు, చెల్లింపు నిబంధనలను అందులోనే పొందుపరిచినట్లు చెప్పారు. 10 వేల ర్యాంకు దాటితే రూ. 35 వేలే! ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉన్నందున ఆయా నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాలని రఘునాథ్ వెల్లడించారు. దాని ప్రకారం.. 10 వేల ర్యాంకులోపు విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థుల్లో 10 వేల ర్యాంకుపైన వచ్చినవారికి రూ. 35 వేల కనీస ఫీజును మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని సదరు విద్యార్థే భరించాల్సి ఉంటుంది. తెలంగాణలో ‘ఫాస్ట్’ మేరకు.. ఇక తెలంగాణలో 1956 స్థానికత ప్రామాణికంగా ‘ఫాస్ట్’ పథకాన్ని అమలు చేయనున్నందున .. ఆ నిబంధనల మేరకు ఫీజుల విధానం ఉంటుంది. అయితే తెలంగాణలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యేందుకు 3 నెలలు సమయం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి వరకు విద్యార్థులను ఫీజులు అడుగవద్దని ఫాస్ట్ మార్గదర్శకాల కమిటీ యాజమాన్యాలను కోరింది. దీనికి వారు అంగీకరించారు కూడా. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు జారీ అయ్యాక తెలంగాణలో ఫీజుల చెల్లింపుపై తదుపరి చర్యలు ఉంటాయి. -
కన్వీనర్ కోటాకు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానుంది. కౌన్సెలింగ్ వ్యవహారంపై ఏం చేయాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ.. న్యాయశాఖను సంప్రదించింది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగానే యాజమాన్యాలు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రకటనలు ఇచ్చుకోవచ్చన్న నిబంధన ఉన్న కారణంగా ఇన్ని రోజులూ కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై తీర్పు రిజర్వులో ఉంది. దీంతో కన్వీనర్ కోటా సీట్లకు కూడా నోటిఫికేషన్ వెలువడలేదు. అయితే ప్రవేశాలకు తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇక కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వడానికే ఉన్నత విద్యాశాఖ అధికారులు మొగ్గుచూపుతున్నారు. న్యాయశాఖ కూడా ఇందుకు సమ్మతించినట్టు ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీని హైకోర్టు తీర్పు ప్రకారం జరపాలన్న షరతు విధిస్తూ కన్వీనర్ కోటా సీట్ల భర్తీని మాత్రం త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఢిల్లీలో ఉన్నందున ఆయన రాగానే ఇందుకు సంబంధించి చర్యలు చేపడతారని ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా హైకోర్టుకు నివేదించనున్నట్టు సమాచారం. గత పరిణామాలు పునరావృతం? గతంలో ఉన్నత విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి, అందరికీ యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తులివ్వాలని, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని ఆదేశించినా యాజమాన్యాలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం హైకోర్టు తీర్పు తర్వాతే భర్తీ చేసుకోవాలంటూ షరతులు విధించినా.. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం యాజమాన్యాలు తమ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకునే వీలుంది. అయితే ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇన్నిరోజులు వేచి ఉన్న ఉన్నత విద్యామండలి.. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఒత్తిళ్లకు తలొగ్గి కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సిద్ధమవుతోంది. ఆందోళనలతో మళ్లీ బ్రేక్! ఉన్నత విద్యామండలి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ సిద్ధం చేసినా.. ఈనెల 12 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడనున్నాయి. కౌన్సెలింగ్ ఆన్లైన్లోనే జరిగినప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్‌లైన్ సెంటర్లు అవసరం. ఉద్యోగులు సమ్మెకు దిగిన పక్షంలో హెల్ప్‌లైన్ సెంటర్లు పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. ఎంబీఏ, ఎంసీఏ కనిష్ట ఫీజు రూ.20 వేలు... అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను నోటిఫై చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇంతవరకు జీవో వెలువడలేదు. అయితే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కనిష్ట ఫీజు రూ. 20 వేలు, గరిష్ట ఫీజు రూ.70 వేలుగా రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.