ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా ఫీజు... ఎందుకు పెరిగిందట? | Parents And Students Disappoints Telangana Engineering College Fee Hike | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 2:41 AM | Last Updated on Fri, Jan 4 2019 5:27 AM

Parents And Students Disappoints Telangana Engineering College Fee Hike - Sakshi

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఎనిమిదేళ్ల కిందట తక్కువ ఫీజులు ఉంటే ఇప్పుడు అవి భారీగా పెరిగిపోయాయి. కాస్త పేరున్న కాలేజీలు మొదలు టాప్‌ కాలేజీల వరకు చూసుకుంటే ఈ ఫీజులు ఎనిమిదేళ్లలో రెండు, మూడింతలయ్యాయి. 2011లో కన్వీనర్‌ కోటా ఫీజు రూ. 31 వేలుగా ఉంటే మేనేజ్‌మెంట్‌ కోటా ఫీజు రూ. 95 వేలుగా ఉండేది. 30% సీట్లు ఉండే మేనేజ్‌మెంట్‌ కోటాతో పోటీగా.. 70% సీట్లుండే కన్వీనర్‌ కోటాలో ఫీజులు పెంచాలంటూ ప్రభుత్వం ముందు యాజమాన్యాలు డిమాండ్‌ పెట్టాయి. మేనేజ్‌మెంట్‌ కోటా, కన్వీనర్‌ కోటాలో రెండింటిలోనూ ఒకే రకమైన ఫీజులను అమలు చేసేలా కామన్‌ ఫీజు విధానం కోసం పట్టుబట్టాయి.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాన్ని సాధించుకున్న యాజమాన్యాలు.. కన్వీనర్‌ కోటాలో ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై ఫీజుల భారానికి కారణమయ్యాయి. ఏ స్థాయిలోనూ ప్రశ్నించలేని విధంగా ఆదాయ, వ్యయాలనుబట్టి ఫీజులను పెంచుకుంటామని కోరినా.. ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. ఇంత చేసున్నా కామన్‌ఫీజు విధానాన్ని మేనేజ్‌మెంట్‌ కోటాలో అమలు చేయట్లేదు. కన్వీనర్‌ కోటాలో ఫీజులను పెంచుకొని.. యాజమాన్య కోటాలో ఆ ఫీజులను అమలు చేయకుండా, కొన్ని కాలేజీలు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టించుకోని అధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా ఈ దోపిడీకి అడ్డులేకుండా పోయింది. ర్యాటిఫికేషన్లలోనూ చూసీచూడని మండలి తీరుతో యాజమాన్య కోటా ప్రవేశాల్లో అక్రమాలు పెరిగిపోయాయి.  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులు భారీగా పెరిగిపోయాయి. 8 ఏళ్ల క్రితంతో పోలిస్తే.. ఇవి రెండు, మూడింతలయ్యాయి. మేనేజ్‌మెంట్‌ కోటాతోపాటు.. కన్వీనర్‌ కోటాలోనూ అదే స్థాయిలో ఫీజుల పెంపుకోసం కామన్‌ ఫీజు విధానానికి కాలేజీల యాజమాన్యాలు పట్టుబట్టాయి. తద్వారా కన్వీనర్‌ కోటాలోనూ ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై అడ్డగోలుగా ఫీజుల భారం మోపుతున్నాయి. కొద్ది పేరున్న కాలేజీల నుంచి టాప్‌ కాలేజీలుగా పేరున్న విద్యాసంస్థల వరకు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటాలో కామన్‌ ఫీజు నిబంధనలకు నీళ్లొదిలాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టింపులేని ప్రభుత్వాధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా యాజమాన్యాలకు కాసుల పంట పండుతోంది.

కోటాను పెంచుకున్న యాజమాన్యాలు 
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ఒకప్పుడు కన్వీనర్‌ కోటా సీట్లు 85%. యాజమాన్య కోటా 15% మాత్రమే. క్రమంగా యాజమాన్యాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ పేరుతో యాజమాన్య కోటాను 30% పెంచుకున్నాయి. అంటే ఆ 30% సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. అప్పట్లో కన్వీనర్‌ కోటా ఫీజు చాలా తక్కువ. అదే యాజమాన్య కోటా ఫీజు దాదాపు రూ.1 లక్షకు దగ్గర్లో ఉండేది. ఇవి సరిపోవడం లేదంటూ.. మరో 15% సీట్లను యాజమాన్య కోటాలోకి తెచ్చుకొని 30% తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి. 2006–07 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా ఫీజు రూ.26 వేలు ఉంటే, యాజమాన్య కోటా ఫీజు రూ.79 వేలుగా ఉంది. ఆ ఫీజులు 2011–12కు వచ్చేసరికి కన్వీనర్‌ కోటా ఫీజు రూ.31 వేలు కాగా, యాజమాన్య కోటా ఫీజు రూ.95 వేలకు పెరిగింది. అయినా కొన్ని టాప్‌ కాలేజీలు అప్పట్లోనే యాజమాన్య కోటా సీట్లను ఒక్కోదానిని రూ. 4 లక్షల వరకు అమ్ముకున్నాయి. 

కామన్‌ ఫీజు కోసం పట్టు 
యాజమాన్యాలు మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లను అమ్ముకుంటున్నప్పటికీ.. డబ్బు యావ తీరలేదు. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణలో పడిన యాజమాన్యాల దృష్టి కన్వీనర్‌ కోటాపై పడింది. కన్వీనర్‌ కోటాలో 70% సీట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తున్నందున.. అందులో ఒక్కో విద్యార్థి నుంచి వచ్చే రూ.31 వేలు తమకు ఏ మూలకు సరిపోవడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. పైగా యాజమాన్య కోటా సీట్లు అమ్ముకుంటున్నారని తమపై అభాండాలు వేస్తున్నారని, కామన్‌ ఫీజు విధానం (కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటాకు ఒక రకమైన ఫీజు) అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో ప్రభుత్వం 2012లో కామన్‌ ఫీజు డిమాండుకు ఓకే చెప్పింది.  

ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు కోసం 
కామన్‌ ఫీజు విధానం తీసుకొచ్చినా.. కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి చెందలేదు. మరిన్ని డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషించాయి. సాధారణ కాలేజీకి, తమ టాప్‌ కాలేజీకి చాలా తేడా ఉందని.. విద్యార్థులపై చేసే ఖర్చులోనూ భారీ వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. కాలేజీని బట్టి ఫీజులను నిర్ణయించాల్సిందేనని పట్టుబట్టాయి. కొన్ని యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నేతృత్వంలో.. కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే విధానానికి శ్రీకారం చుట్టింది. 2012–13 విద్యాసంవత్సరంలో ఒక్క ఏడాదికే.. కాలేజీలను బట్టి ఏఎఫ్‌ఆర్‌సీ ఆధ్వర్యంలో ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం.. 2013–14 విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడేళ్లకోసారి కాలేజీల ఆదాయ వ్యయాలను ఆధారంగా ఏఎఫ్‌ఆర్‌సీ ఆధ్వర్యంలో.. ఫీజులను నిర్ణయిస్తోంది. దీంతో కన్వీనర్‌ కోటాలోనూ చేరే వేల మంది విద్యార్థులపై ఫీజుల భారం అమాంతంగా పెరిగిపోయింది. పాత ఫీజు విధానం ఉంటే కన్వీనర్‌ కోటాలో చేరే విద్యార్థులపై ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఫీజులు ఉండేవి కావని ఉన్నత విద్యామండలి వర్గాలే పేర్కొంటున్నాయి. 

తీరని మేనేజ్‌మెంట్ల ధనదాహం 
ఇంత చేసినా కొన్ని యాజమాన్యాల ధనదాహం తీరలేదు. తమ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో చేరే 70% విద్యార్థులపైనా ఫీజు భారం మోపాయి. కన్వీనర్‌ కోటాలో చేరే అనేక మంది పేద విద్యార్థులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. 2011–12 విద్యా సంవత్సరం వరకు కన్వీనర్‌ కోటాలో కేవలం రూ.31 వేల ఫీజు మాత్రమే ఉండగా ఆ తరువాత భారీగా పెరిగిపోయింది. ఇపుడు అత్యధికంగా కన్వీనర్‌ కోటాలోనూ ఫీజు రూ.1.63 లక్షల వరకు పెరిగిపోయింది. రాష్ట్రంలో 212 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉంటే దాదాపు 80 కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.90 వేలకు పైనే ఉంది. మరో 40 కాలేజీల్లో రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది.

కొన్ని సాధారణ కాలేజీలు మాత్రమే రూ.35 వేల కనీస ఫీజును అమలు చేస్తున్నాయి. అవి మినహా కొద్దిగా పేరున్న ప్రతి కాలేజీ.. భారీగానే ఫీజులు వసూలు చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో కారణంతో ఫీజులను పెంచుకున్నాయి. ప్రభుత్వం పెంచితే సరే.. లేదంటే కోర్టును ఆశ్రయించి తమ కాలేజీల్లో ఫీజులను పెంచుకోవడం యాజమాన్యాలకు పరిపాటిగా మారింది. ఫీజులను పెంచుకుంటున్న యాజమాన్యాలు మేనేజ్‌మెంట్‌ కోటాలో మాత్రం కామన్‌ ఫీజును అమలు చేయడం లేదు. కొన్ని కాలేజీలైతే అడ్డగోలుగా ఒక్కో సీటును రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement