afrc
-
ఆ జీవో చెల్లదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సిఫార్సులు లేకుండానే సూపర్ స్పెషాలిటీ కోర్సు ఫీజులు పెంచుతూ టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును సమర్ధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుధాంశు ధూలియాలతోకూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులు పెంచడం సరికాదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకే ఫీజులు వసూలు చేయాలని, అంతకన్నా ఎక్కువగా వసూలు చేసిన సొమ్మును విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, నారాయణ మెడికల్ కాలేజి చెరో రూ.2.5 లక్షలు ఆరు వారాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జమ చేయాలని, ఆ మొత్తాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా), సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీలకు బదిలీ చేయాలని తీర్పులో పేర్కొంది. జరిగిందిదీ.. ఏఎఫ్ఆర్సీ 2011లో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల రుసుములు నిర్ణయించింది. మూడేళ్లకోసారి ఈ ఫీజులు సవరిస్తూ ఉంటుంది. 2017 వచ్చినప్పటికీ ఏఎఫ్ఆర్సీ సిఫార్సులు చేయలేదు. ఏఎఫ్ఆర్సీ తగిన సమయంలో సిఫార్సులు చేయకపోవడంతో 2017 జూన్ 9న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ జీవోను కొంతమంది విద్యార్థులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు 2019లో జీవో చెల్లదని ఆదేశాలు ఇచ్చింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం జీవో ఇవ్వాలని స్పష్టం చేసింది. దీన్ని నారాయణ మెడికల్ కాలేజ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఫీ'జులుం'పై ఫైన్.. ఒక్కో సీటుపై రూ.2 లక్షల జరిమానా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కళాశాలలు యాజమాన్య కోటా సీట్లకు విచ్చల విడిగా ఫీజులు నిర్ణయించి వసూలు చేయడంపై రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీలోనూ నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. ఈ విధంగా చేపట్టిన ఒక్కో అడ్మిషన్‌పై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. అదేవిధంగా అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి విద్యార్థులకు అప్పజెప్పనుంది. ఇష్టారాజ్యంగా వసూళ్లు రాష్ట్రంలో 159 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్, బీఈ కోర్సులు నిర్వహిస్తుండగా... వీటిలో 76 కాలేజీలు ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎం.టెక్, ఎం.ఈ.) కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయి. మరోవైపు 238 కాలేజీలు పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో భాగమైన ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటా మినహాయించి మిగతా సీట్లకు బీ కేటగిరీ, యాజమాన్య కోటా కింద అడ్మిషన్లు కల్పిస్తారు. కన్వీనర్ కోటా ప్రవేశాలు, కేటగిరీ బీ అడ్మిషన్లు, యాజమాన్య కోటాలో ప్రవేశాలకు సంబంధించి ఏఎఫ్ఆర్సీ ఫీజులు సిఫారసు చేసింది. కాలేజీల్లో వసతులు, సౌకర్యాలు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఏయే కోర్సుకు ఫీజులు ఎలా ఉండాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల వారీగా ఫీజులు ఖరారు చేసింది. అయితే కొన్ని కాలేజీలు ఆదాయార్జన కోసం కేటగిరీ బీ, యాజమాన్యా కోటా ప్రవేశాల్లో జిమ్మిక్కులు చేస్తున్నాయి. టీఏఎఫ్ఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా.. డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో దండుకుంటున్నాయి. ప్రవేశ పరీక్షల్లో మెరిట్, ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పక్కకు నెడుతూ అత్యధిక ఫీజులు చెల్లించే వారికి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు వాస్తవానికి బీ కేటగిరీ అడ్మిషన్ల విషయంలో ఏఎఫ్ఆర్సీ సూచనలు కాలేజీలు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా కన్వీనర్ కోటాలో చివరిర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలి. బీ కేటగిరీలో ఫలానా ప్రమాణాలకు అనుగుణంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తే తప్పకుండా నడుచుకోవాలి. అదేవిధంగా యాజమాన్యా కోటా ప్రవేశాల విషయంలోనూ ఉత్తమ ర్యాంకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. ఆ మేరకు నిబంధనలు అనుసరించాలి. కానీ మెరిట్, బెస్ట్ ర్యాంకు తదితరాలను పట్టించుకోని కొన్ని కాలేజీలు.. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతో పాటు డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో విద్యార్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ఈ మేరకు ఏఎఫ్ఆర్సీకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన కమిటీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై జరిమానాలు విధించి ముక్కుపిండి వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేసి కేటాయించిన ఒక్కో సీటుపై కనిష్టంగా రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించనుంది. మెరిట్ లేకుండా సీట్లు కేటాయించినా.. ఇక బీ కేటగిరీ అడ్మిషన్లలో ర్యాంకులు పరిగణించకుండా ఎన్ని సీట్లు కేటాయిస్తే అన్ని సీట్లపై.. ఒక్కో సీటుకు రూ.10 లక్షల లెక్కన జరిమానా విధిస్తామని ఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. ఈ రెండు రకాల జరిమానాల వసూలుకు గాను కన్వీనర్ దగ్గర జమ చేసిన కాలేజీ నిధికి కోత పెట్టనున్నట్లు వెల్లడించింది. ఆయా కాలేజీల్లో ఎంతమంది నుంచి ఈ విధంగా వసూళ్లకు పాల్పడ్డారో గుర్తించేందుకు సిద్ధమవుతోంది. జరిమానాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన కమిటీ.. క్షేత్రస్థాయిలో అడ్డగోలు ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు కూడా స్వీకరించనుంది. సరైన ఆధారాలను సమర్పిస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోనుంది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
అదనంగా ఫీజులు వసూలు చేస్తే రూ.2లక్షల జరిమానా: AFRC
-
పది రోజుల్లో ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చర్యలు వేగవంతం చేసింది. 10 రోజుల్లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజును ఖరా రు చేసేందుకు చర్యలు చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయకుండా, ఫీజులను ఖరారు చేశాకే కౌన్సెలింగ్‌ను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీల ఫీజుల ను 3 రోజుల్లో ఖరారు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. సోమవారం 20 కాలేజీల ఫీజులను ఖరా రు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్ నిర్వ హించింది. యాజమాన్యాలు ఇచ్చిన గత రెండేళ్ల ఆదాయ వ్యయాలు, తాజా ప్రతిపాదనలను ఏఎఫ్ఆర్సీ పరిశీలించింది. ఇప్పటికే ఆడిటర్లు ఆ కాలేజీల ఆదాయ వ్యయాలను సమీక్షించిన నేపథ్యంలో సోమ వారం ఏఎఫ్ఆర్సీ సమావేశమై వాటన్నింటినీ పరిశీలించి ఫీజులను ప్రాథమికంగా నిర్ణయించింది. మంగళవారం మరో 30 కాలేజీల ఫీజులను ఖరారు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్ నిర్వహించనుంది. బుధవారం మరో 31 కాలేజీల ఫీజులను కూడా ఖరారు చేయనుంది. కోర్టును ఆశ్రయించి యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలుకు ఉత్తర్వులు పొందిన 81 కాలేజీల ఫీజులను ఖరారు చేయనుంది. దీంతో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు కాకుండా, ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసే ఫీజుతో ప్రవేశాలను చేపట్టనున్నారు. కోర్టుకు వెళ్లని 108 కాలేజీల ఫీజులను కూడా వచ్చే పది రోజుల్లోగా ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ 108 కాలేజీల్లో రూ.50 వేల లోపు వార్షిక ఫీజు ఉన్న కాలేజీలకు 20 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలకు 15 శాతం ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు ఏఎఫ్ఆర్సీ యాజమాన్యాలతో సమావేశమై ప్రతిపాదించింది. వీటికి ఒప్పుకుంటే ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వ హిస్తామని సూచించింది. తర్వాత కాలేజీ వారీగా, ఆదాయ వ్యయాల ఆధారంగా పూర్తి స్థాయి ఫీజును ఖరారు చేస్తామని వెల్లడించింది. ఇందుకు మెజారిటీ యాజమాన్యాలు అంగీకరించాయి. దీనిపై ఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. ఇప్పుడు తాత్కాలికంగా 15%, 20% ఫీజులను పెం చి కౌన్సెలింగ్ నిర్వహిస్తే విద్యార్థులు ఈ ఫీజుల ప్రకా రమే కాలేజీల్లో చేరుతారు. ఆ తర్వాత పూర్తి స్థాయి ఫీజు ఖరారు చేసినప్పుడు, ప్రస్తుతం ఇచ్చిన 15–20 శాతం పెంపునకు మించి పూర్తిస్థాయి ఫీజులో కాలే జీ ల ఆదాయ వ్యయాల ఆధారంగా పెంపుదల వస్తే గందరగోళం తలెత్తుతుందన్న ఆలోచన ఏఎఫ్ఆర్సీ వర్గాల్లో వచ్చింది. కాగా, ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు కోసం ఏఎఫ్ఆర్సీ చేపట్టిన హియరింగ్‌కు సోమవా రం టాప్ కాలేజీల ప్రతినిధులు ఏఎఫ్ఆర్సీ కార్యాలయానికి వచ్చారు. సోమవారం విచారణకు హాజరైన కొన్ని కాలేజీల యాజమాన్య ప్రతినిధులు మంగళ, బుధవారాల్లో మళ్లీ వస్తామని గడువు కోరారు. అప్పీల్ కోరితే రూ. లక్ష వాసవి, శ్రీనిధి కాలేజీల ఫీజులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను రివ్యూ చేయాలంటే మళ్లీ ఏఎఫ్ఆర్సీకే అప్పీల్ చేసుకోవాలి. అందుకు రూ.లక్ష అప్పీల్ ఫీజుగా ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కచ్చితంగా ఉండే కాలేజీలు మాత్రమే అప్పీల్‌కు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. -
నిర్ణయాధికారం ఏఎఫ్ఆర్సీదే..
సాక్షి, న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ దేనని (ఏఎఫ్ఆర్సీ).. దీని నిర్ణయాలనే అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫీజు నిర్ధారణ ప్రక్రియలో లోపాలుంటే కోర్టు సమీక్షించవచ్చని.. కానీ కోర్టే ఫీజులపై నిర్ణయం తీసుకోరాదని సూచించింది. ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని వెల్లడించింది. వాసవీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు వివాదంపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు సోమవారం తుదితీర్పు వెలువరించింది. ఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ రెండు కాలేజీల ఫీజులను నిర్ధారించడం ద్వారా హైకోర్టు ఏఎఫ్ఆర్సీ పరిధిలో చొరబడిందని పేర్కొంది. తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యాసంస్థలకు సం బంధించి 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు గానూ ఏఎఫ్ఆర్సీ ఫీజులు నిర్ధారించింది. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 21 ద్వారా జూలై 4, 2016న నోటిఫై చేసింది. దీని ప్రకా రం వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వార్షిక ఫీజు రూ.86 వేలు కాగా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఫీజు రూ.91 వేలు. ఈ ఫీజుల నిర్ధారణ తగినరీతిలో లేదని పునఃసమీక్షకు ఆయా కళాశాలలు అభ్యర్థించగా ఫిబ్రవరి 4, 2017న ఏఎఫ్ఆర్సీ రెండు కళాశాలల ఫీజును రూ.97 వేలుగా నిర్ధారించింది. హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకు! ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఆయా విద్యా సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి. దీంతో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయ సమీక్ష జరిపి వాసవీ కళాశాల ఫీజును రూ.1,60,000గా, శ్రీనిధి కళాశాల ఫీజును రూ.1,37,000గా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిని రాష్ట్ర ప్రభు త్వం సవాలు చేయగా.. ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మొదట వాసవీ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజునే తీసుకోవాలని, అదనంగా ఫీజులు వసూలు చేయరాదని, విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. అనంతరం సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం సోమవారం 35 పేజీల తీర్పు వెలువరించింది. పేరెంట్స్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు డి.మహేష్ బాబు, కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించగా, తెలంగాణ ప్రభుత్వం తరపున రాధాకృష్ణన్, పాల్వాయి వెంకటరెడ్డి, కళాశాలల తరపున సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. ఏఎఫ్ఆర్సీ ఫీజులే వర్తిస్తాయ్ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియపైనే న్యాయ సమీక్ష ఉంటుంది. కానీ తీసుకున్న నిర్ణయంలో ఉన్న మెరిట్‌పై కాదు. సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ నిర్ణయ ప్రక్రియ ఉంటే దానిని కోర్టులు సరిదిద్దవచ్చు. చట్టప్రకారం తిరిగి నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ (ఏఎఫ్ఆర్సీ)ని తిరిగి మొదటి నుంచి ప్రక్రియను సజావుగా చేపట్టాలని ఆదేశించవచ్చు. కానీ కోర్టులు న్యాయసమీక్ష పేరుతో బలవంతంగా నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ పరిధిలోకి వెళ్లి తానే నిర్ణయం తీసుకోరాదు. అలాగే ఏఎఫ్ఆర్సీకి అప్పిలేట్ అధికారిగా కూడా కోర్టులు వ్యవహరించజాలవు’అని పేర్కొంది. ‘ఏఎఫ్ఆర్సీ ఫీజుల నిర్ధారణ ప్రక్రియ.. విద్యను పొందడంలో సమాన అవకాశాల కల్పించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని చేర్చే భావనలో ఒక భాగం. అందువల్ల నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం సమర్థించజాలనిది’అని పేర్కొంది. ‘ఇక్కడ ఏఎఫ్ఆర్సీ సిఫారసుల్లో జోక్యం చేసుకుని హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది. అందువల్ల హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెడుతున్నాం. ఏఎఫ్ఆర్సీ ఫిబ్రవరి 4, 2017న నిర్ధారించిన ఫీజులు 2016–17 నుంచి 2018–19 బ్లాక్పీరియడ్కు అమలులో ఉంటాయి. అలాగే ప్రతివాదులైన విద్యాసంస్థలు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలు క్రియాశీలతను సంతరించుకొని విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి’అని ధర్మాసనం పేర్కొంది. -
ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా ఫీజు... ఎందుకు పెరిగిందట?
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఎనిమిదేళ్ల కిందట తక్కువ ఫీజులు ఉంటే ఇప్పుడు అవి భారీగా పెరిగిపోయాయి. కాస్త పేరున్న కాలేజీలు మొదలు టాప్ కాలేజీల వరకు చూసుకుంటే ఈ ఫీజులు ఎనిమిదేళ్లలో రెండు, మూడింతలయ్యాయి. 2011లో కన్వీనర్ కోటా ఫీజు రూ. 31 వేలుగా ఉంటే మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ. 95 వేలుగా ఉండేది. 30% సీట్లు ఉండే మేనేజ్మెంట్ కోటాతో పోటీగా.. 70% సీట్లుండే కన్వీనర్ కోటాలో ఫీజులు పెంచాలంటూ ప్రభుత్వం ముందు యాజమాన్యాలు డిమాండ్ పెట్టాయి. మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటాలో రెండింటిలోనూ ఒకే రకమైన ఫీజులను అమలు చేసేలా కామన్ ఫీజు విధానం కోసం పట్టుబట్టాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాన్ని సాధించుకున్న యాజమాన్యాలు.. కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై ఫీజుల భారానికి కారణమయ్యాయి. ఏ స్థాయిలోనూ ప్రశ్నించలేని విధంగా ఆదాయ, వ్యయాలనుబట్టి ఫీజులను పెంచుకుంటామని కోరినా.. ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. ఇంత చేసున్నా కామన్‌ఫీజు విధానాన్ని మేనేజ్మెంట్ కోటాలో అమలు చేయట్లేదు. కన్వీనర్ కోటాలో ఫీజులను పెంచుకొని.. యాజమాన్య కోటాలో ఆ ఫీజులను అమలు చేయకుండా, కొన్ని కాలేజీలు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టించుకోని అధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా ఈ దోపిడీకి అడ్డులేకుండా పోయింది. ర్యాటిఫికేషన్లలోనూ చూసీచూడని మండలి తీరుతో యాజమాన్య కోటా ప్రవేశాల్లో అక్రమాలు పెరిగిపోయాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులు భారీగా పెరిగిపోయాయి. 8 ఏళ్ల క్రితంతో పోలిస్తే.. ఇవి రెండు, మూడింతలయ్యాయి. మేనేజ్మెంట్ కోటాతోపాటు.. కన్వీనర్ కోటాలోనూ అదే స్థాయిలో ఫీజుల పెంపుకోసం కామన్ ఫీజు విధానానికి కాలేజీల యాజమాన్యాలు పట్టుబట్టాయి. తద్వారా కన్వీనర్ కోటాలోనూ ఇంజనీరింగ్‌లో చేరే పేద విద్యార్థులపై అడ్డగోలుగా ఫీజుల భారం మోపుతున్నాయి. కొద్ది పేరున్న కాలేజీల నుంచి టాప్ కాలేజీలుగా పేరున్న విద్యాసంస్థల వరకు అడ్డగోలుగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో కామన్ ఫీజు నిబంధనలకు నీళ్లొదిలాయి. పారదర్శకత లేని ప్రవేశాలు, పట్టింపులేని ప్రభుత్వాధికారులు, ఉన్నత విద్యామండలి వైఖరి కారణంగా యాజమాన్యాలకు కాసుల పంట పండుతోంది. కోటాను పెంచుకున్న యాజమాన్యాలు రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ఒకప్పుడు కన్వీనర్ కోటా సీట్లు 85%. యాజమాన్య కోటా 15% మాత్రమే. క్రమంగా యాజమాన్యాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ పేరుతో యాజమాన్య కోటాను 30% పెంచుకున్నాయి. అంటే ఆ 30% సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. అప్పట్లో కన్వీనర్ కోటా ఫీజు చాలా తక్కువ. అదే యాజమాన్య కోటా ఫీజు దాదాపు రూ.1 లక్షకు దగ్గర్లో ఉండేది. ఇవి సరిపోవడం లేదంటూ.. మరో 15% సీట్లను యాజమాన్య కోటాలోకి తెచ్చుకొని 30% తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి. 2006–07 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా ఫీజు రూ.26 వేలు ఉంటే, యాజమాన్య కోటా ఫీజు రూ.79 వేలుగా ఉంది. ఆ ఫీజులు 2011–12కు వచ్చేసరికి కన్వీనర్ కోటా ఫీజు రూ.31 వేలు కాగా, యాజమాన్య కోటా ఫీజు రూ.95 వేలకు పెరిగింది. అయినా కొన్ని టాప్ కాలేజీలు అప్పట్లోనే యాజమాన్య కోటా సీట్లను ఒక్కోదానిని రూ. 4 లక్షల వరకు అమ్ముకున్నాయి. కామన్ ఫీజు కోసం పట్టు యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో సీట్లను అమ్ముకుంటున్నప్పటికీ.. డబ్బు యావ తీరలేదు. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణలో పడిన యాజమాన్యాల దృష్టి కన్వీనర్ కోటాపై పడింది. కన్వీనర్ కోటాలో 70% సీట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తున్నందున.. అందులో ఒక్కో విద్యార్థి నుంచి వచ్చే రూ.31 వేలు తమకు ఏ మూలకు సరిపోవడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. పైగా యాజమాన్య కోటా సీట్లు అమ్ముకుంటున్నారని తమపై అభాండాలు వేస్తున్నారని, కామన్ ఫీజు విధానం (కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాకు ఒక రకమైన ఫీజు) అమలు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం 2012లో కామన్ ఫీజు డిమాండుకు ఓకే చెప్పింది. ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు కోసం కామన్ ఫీజు విధానం తీసుకొచ్చినా.. కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి చెందలేదు. మరిన్ని డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషించాయి. సాధారణ కాలేజీకి, తమ టాప్ కాలేజీకి చాలా తేడా ఉందని.. విద్యార్థులపై చేసే ఖర్చులోనూ భారీ వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. కాలేజీని బట్టి ఫీజులను నిర్ణయించాల్సిందేనని పట్టుబట్టాయి. కొన్ని యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నేతృత్వంలో.. కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే విధానానికి శ్రీకారం చుట్టింది. 2012–13 విద్యాసంవత్సరంలో ఒక్క ఏడాదికే.. కాలేజీలను బట్టి ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం.. 2013–14 విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడేళ్లకోసారి కాలేజీల ఆదాయ వ్యయాలను ఆధారంగా ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో.. ఫీజులను నిర్ణయిస్తోంది. దీంతో కన్వీనర్ కోటాలోనూ చేరే వేల మంది విద్యార్థులపై ఫీజుల భారం అమాంతంగా పెరిగిపోయింది. పాత ఫీజు విధానం ఉంటే కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులపై ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఫీజులు ఉండేవి కావని ఉన్నత విద్యామండలి వర్గాలే పేర్కొంటున్నాయి. తీరని మేనేజ్మెంట్ల ధనదాహం ఇంత చేసినా కొన్ని యాజమాన్యాల ధనదాహం తీరలేదు. తమ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే 70% విద్యార్థులపైనా ఫీజు భారం మోపాయి. కన్వీనర్ కోటాలో చేరే అనేక మంది పేద విద్యార్థులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. 2011–12 విద్యా సంవత్సరం వరకు కన్వీనర్ కోటాలో కేవలం రూ.31 వేల ఫీజు మాత్రమే ఉండగా ఆ తరువాత భారీగా పెరిగిపోయింది. ఇపుడు అత్యధికంగా కన్వీనర్ కోటాలోనూ ఫీజు రూ.1.63 లక్షల వరకు పెరిగిపోయింది. రాష్ట్రంలో 212 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాదాపు 80 కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.90 వేలకు పైనే ఉంది. మరో 40 కాలేజీల్లో రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. కొన్ని సాధారణ కాలేజీలు మాత్రమే రూ.35 వేల కనీస ఫీజును అమలు చేస్తున్నాయి. అవి మినహా కొద్దిగా పేరున్న ప్రతి కాలేజీ.. భారీగానే ఫీజులు వసూలు చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో కారణంతో ఫీజులను పెంచుకున్నాయి. ప్రభుత్వం పెంచితే సరే.. లేదంటే కోర్టును ఆశ్రయించి తమ కాలేజీల్లో ఫీజులను పెంచుకోవడం యాజమాన్యాలకు పరిపాటిగా మారింది. ఫీజులను పెంచుకుంటున్న యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటాలో మాత్రం కామన్ ఫీజును అమలు చేయడం లేదు. కొన్ని కాలేజీలైతే అడ్డగోలుగా ఒక్కో సీటును రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఏపీ తరహాలో ‘వైద్య’ ఫీజుల పెంపు!
- నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజు పెంపునకు రంగం సిద్ధమైంది. ఏపీలో ఉన్నట్లుగానే తెలంగాణలోనూ ఫీజులు పెరిగే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఫీజును నిర్ధరించేందుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) మంగళ, బుధవారాల్లో ప్రత్యేకంగా ప్రైవే టు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో భేటీ కానుంది. అనంతరం ప్రభుత్వం ఫీజుల పెంపును ప్రకటించనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం బీ కేటగిరీ ఎంబీ బీఎస్ సీటు ఫీజు ఏడాదికి రూ. 9 లక్షలుం డగా... ఆ ఫీజును ఏపీ మాదిరిగా రూ. 11 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ) ఫీజు ప్రస్తుతం రూ. 11 లక్షలు ఉంది. ఏపీలో ఈ కేటగిరీ ఫీజును బీ కేటగిరీ ఫీజుకు 5 రెట్ల వరకు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. తెలంగాణలోనూ ఆ వెసులుబాటు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. -
ఫీజుల ఖరారు
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ధారించిన ఏఎఫ్ఆర్సీ 69 కాలేజీల్లో కనీస ఫీజు రూ. 35,000 అత్యధిక ఫీజు రూ. 1,13,500.. నాలుగు కాలేజీల్లో రూ.లక్షకు పైనే సగటున రూ. 8 వేల వరకు పెరిగిన ఫీజులు కాలేజీల వారీగా ఫీజుల వివరాలు ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులోకి.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అందజేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పులు, చేర్పులతో ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం రాత్రే సంతకం చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఉత్తర్వుల కాపీ విడుదల కాలేదు. ఇది మంగళవారం ఉదయం అందుబాటులోకి రానుంది. కాలేజీల వారీగా ఫీజుల వివరాలను విద్యార్థులు ఎంసెట్ వెబ్సైట్ æ tseamcet.nic.in లో చూసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. గరిష్ట ఫీజు 1,13,500 కాగా, కనీస ఫీజు 35,000గా ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు కాలేజీల్లో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఫీజును ఖరారు చేయగా.. 69 కాలేజీలకు కనీసఫీజు రూ.35 వేలుగా మాత్రమే నిర్ణయించింది. 8 కాలేజీలకు రూ.35 వేల నుంచి రూ.39 ,000... 119 కాలేజీలకు రూ.40 వేల నుంచి రూ.59 వేల వరకు.. 17 కాలేజీలకు రూ.60 వేల నుంచి రూ.69,000.. 16 కాలేజీలకు రూ.70 వేల నుంచి రూ.79,000.. 5 కాలేజీలకు రూ.80 వేల నుంచి రూ.89,000.. 14 కాలేజీలకు రూ.90 వేల నుంచి రూ.99 వేల వరకు ఫీజు నిర్ణయించింది. ఈ ఫీజులు 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయి. పెరిగిన ఫీజులు: కనీస ఫీజు ఉన్న కాలేజీలు మినహా మిగతా కాలేజీల్లో ఫీజులు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. కొన్ని కాలేజీల్లో మాత్రం రూ.30 వేల వరకు పెరిగింది. రాష్ట్రంలో సగటు ఫీజు రూ.49,768గా నిర్ణయించింది. గతంలో ఈ ఫీజు రూ.41 వేలకు పైగా ఉండగా.. ఈసారి 8 వేల వరకు పెరిగింది. కొన్ని ప్రధాన కాలేజీల్లో ఫీజులు కాలేజీ ఫీజు సీబీఐటీ 1,13,500 వాసవి 86,000 ఎంవీఎస్ఆర్ 95,000 శ్రీనిధి 91,000 గోకరాజు రంగరాజు 95,000 సీవీఆర్ 90,000 మాతృశ్రీ 67,000 ఎంజీఐటీ 1,00,000 కేఎంఐటీ 77,000 కిట్స్ 1.05,000 వర్ధమాన్ 1.05,000 బీవీఆర్ఐటీ 95,000 మల్లారెడ్డి 78,000 సీఎంఆర్ 75,000 అనురాగ్ గ్రూప్ 93,000 స్టాన్లీ 62,000 వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి 98,500 విద్యాజ్యోతి 80,000 వీబీఐటీ 67,000 టీకేఆర్ 57,000 జి.నారాయణమ్మ 95,000 గురునానక్ 75,000 -
బీఎడ్‌లో ఫీజుల మోత
* కనీస ఫీజు రూ.16 వేలు, గరిష్ట ఫీజు రూ.31 వేలు * కాలేజీల ఆదాయ, వ్యయాల ఆధారంగా నిర్ధారించిన ఏఎఫ్ఆర్సీ * ప్రభుత్వ అనుమతి రాగానే అమల్లోకి.. * ఇక అన్ని వృత్తివిద్యా కోర్సుల్లో కనీస, గరిష్ట ఫీజుల విధానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సు బీఎడ్ ఫీజులను పెంచుతూ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకుంది. 222 ప్రైవేటు బీఎడ్ కాలేజీల్లో వచ్చే మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) వసూలు చేయాల్సిన ఫీజులను గురువారం ఖరారు చేసింది. ఇప్పటివరకూ కామన్‌గా రూ.13,500గా ఉన్న వార్షిక ఫీజును... కాలేజీల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా కనిష్టంగా రూ.16 వేల నుంచి.. గరిష్టంగా రూ. 31వేల వరకు పెంచింది. ఒక కాలేజీకి మాత్రమే రూ.31 వేల గరిష్ట ఫీజు నిర్ణయించినట్లు తెలిసింది. మరో 15 వరకు కాలేజీల్లో రూ.30 వేలు, పదికిపైగా కాలేజీల్లో కనీస ఫీజు అయిన రూ.16 వేలను వార్షిక ఫీజుగా నిర్ణయించింది. మిగతా కాలేజీల్లో రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఈ కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. ఇక మిగతా వృత్తి విద్యా కోర్సులకు కూడా కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలని... ఇప్పటివరకు కొనసాగిన కామన్ ఫీజు విధానాన్ని రద్దు చేయాలని ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. దీంతోపాటు ఇంజనీరింగ్ సహా అన్ని కోర్సుల్లో కనీస, గరిష్ట ఫీజుల విధానం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకూ రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు... రూ.1,13,500గా ఉన్న గరిష్ట ఫీజును రూ.2 లక్షలకుపైగా నిర్ధారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏఎఫ్ఆర్సీ తమకు అందిన ఫీజుల పెంపు ప్రతిపాదనల్లో శాస్త్రీయత, ఇతర లోపాలపై ఇప్పటికే యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకుంది. పెరిగే ఫీజులు భరించాల్సింది విద్యార్థులే? కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఈసారి అన్ని వృత్తి విద్యా కోర్సుల ఫీజుల్లో 15 శాతానికిపైగా పెరుగుదల ఉండే అవకాశముంది. ఆదాయ, వ్యయాల ప్రకారం ఫీజుల పెంపునకు ఏఎఫ్ఆర్సీ సిఫారసు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే అంశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫీజులు పెరిగినప్పటికీ ఇప్పటివరకు ఉన్న కామన్ ఫీజు మొత్తాన్నే ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ఇచ్చే అవకాశముందని... మిగతా ఫీజు మొత్తాన్ని విద్యార్థులే భరించాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన ప్రకారం ఇప్పటివరకు వివిధ కోర్సుల్లో టాప్ 10 వేల మంది ర్యాంకర్లకు (ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా రీయింబర్స్మెంట్ ఉంది) రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని టాప్ 5 వేల ర్యాంకులకు తగ్గించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌గా స్వరూప్‌రెడ్డి
ఏడుగురు సభ్యులను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రవేశాల క్రమబద్ధీకరణ, ఫీజుల నియంత్రణ నిమిత్తం ‘అడ్మిషన్స్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ’ (ఏఎఫ్ఆర్సీ)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పి.స్వరూప్‌రెడ్డి, కమిటీ సభ్యులుగా జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, గాంధీ బోధనాస్పత్రి ప్రొఫెసర్ పీవీ చలం, చార్టెడ్ అకౌంటెంట్ జీవీ లక్ష్మణ్‌రావు, అడ్వొకేట్ కె.రవీందర్‌రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి జేఎన్టీయూహెచ్, మెడికల్ కోర్సులకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, బీఈడీ కోర్సులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లను ఏఎఫ్ఆర్సీ కమిటీలో సభ్యులుగా తీసుకోవాలని సర్కారు సూచించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్థిక శాఖ నుంచి ఒక అధికారిని ఏఎఫ్ఆర్సీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. -
మిథ్యగా మారిన ఇంజనీరింగ్ విద్య!
95 శాతం కాలేజీల్లో అరకొర సౌకర్యాలు ఫ్యాకల్టీ లేదు.. ఉన్నా సరైన జీతాల్లేవ్ ఏఎఫ్ఆర్సీ వెబ్సైట్లో కాలేజీల వివరాలు వివరాలు చూసి కాలేజీని ఎంచుకొండి! హైదరాబాద్: ‘లక్షా 13 వేల 300 ఫీజున్న ఓ నంబర్‌వన్ ఇంజనీరింగ్ కాలేజీలో నిబంధనల ప్రకారం 213 మంది అర్హులైన సిబ్బంది ఉండాలి. కాని అందులో 136 మందే ఉన్నారు. అంటే 77 మంది తక్కువగా ఉన్నారు. అయితే సరైన అర్హతలు లేని ఫ్యాకల్టీ 49 మంది ఉన్నారు. రూ. 97 వేల ఫీజున్న మరో కాలేజీలో 212 మంది సిబ్బంది అవసరం కాగా, అర్హులైన వారు 180 మంది ఉన్నారు. ఇతర ఫ్యాకల్టీ 23 మంది ఉన్నారు. రూ. 85 వేల ఫీజున్న ఇంకొక కాలేజీలో 183 మంది ఫ్యాకల్టీ అవసరం కాగా, 165 మందే ఉన్నారు.’ ... ఇలా ఏ కాలేజీ పరిస్థితి చూసినా ఏమున్నది గర్వకారణం..పేరుగొప్ప తప్ప సౌకర్యాల లేమి, బోధనాసిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏ కాలేజీలో ఎంతమంది అర్హులైన సిబ్బంది ఉన్నారు? తమ పిల్లలను ఏ కాలేజీలో చేర్పించవచ్చు? ఎందులో చేర్చితే మెరుగైన విద్యా బోధన అందుతుంది? అనే విషయంలో టాస్క్‌ఫోర్స్ వెబ్సైట్ కారణంగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత గాలికిపోతోంది. అర్హత లేని అధ్యాపకులతో బోధన ఇంజనీరింగ్ విద్య దెబ్బతింటోంది. రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు 2012-13 సంవత్సరంలో 686 కాలేజీల్లో తనిఖీలు చేయగా వాటిల్లో 95 శాతం కాలేజీల్లో లోపాలు ఉన్నట్టు తేలింది. ప్రముఖ కాలేజీల్లోనూ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీని నియమించకపోగా, అర్హులైన వారికి వేతనాలు సరిగా చెల్లించడం లేదు. టాస్క్‌ఫోర్స్ తనిఖీల ఆధారంగా ప్రవేశ ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) గత ఏడాది నిర్ధారించిన ఫీజులనే ఆయా కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2014-15), ఆ తరువాతి విద్యా సంవత్సరంలో (2015-16) వసూలు చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులను గత ఏడాదే జారీ చేసింది. 175 కళాశాలల్లో రూ. 35,500 నుంచి రూ. 1,13,300 వరకు ఫీజులు ఖరారు చేయగా, మిగితా కాలేజీల్లో రూ. 35 వేల ఫీజును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఏ కాలేజీల్లో బోధన సిబ్బంది పరిస్థితి ఏంటి? అర్హులైన వారు ఉన్నారా? లేదా? అనే విషయాలను తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశాన్ని ఏఎఫ్ఆర్సీ కల్పించింది. తమ వెబ్సైట్లో (్చజటఛి.్చఞ.జీఛి.జీ) కాలేజీల ఆదాయ వ్యయ నివేదికలు, ఫ్యాకల్టీ స్థితిగతులను అందుబాటులో ఉంచింది. మే 22న జరిగే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న 2.80 లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులు ఈ వివరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. 95 శాతం కళాశాల ల్లో లోపాలే..! టాస్క్‌ఫోర్స్‌కమిటీ నివేదిక మేరకు 95 శాతం కాలేజీల్లో లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రధాన కాలేజీల్లోనూ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ లేరు.దాదాపు 90 శాతం కళాశాలలు బోధన సిబ్బందికి ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఆరో వేతన కమిషన్ పేస్కేలు ఇవ్వడం లేదు. అలాగే, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 9వ పీఆర్సీ వేతనాలు అమలుచేయడం లేదు.కొన్ని కాలేజీలు భారీగా వేతనాలు ఇస్తున్నట్టు బ్యాంకు ఖాతాల్లో మాత్రమే చూపుతున్నాయి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాల్సి ఉన్నా 75 శాతం కాలేజీల్లో ఆ నిష్పత్తిలో ఫ్యాకల్టీ లేరు. 164 కాలేజీలు మాత్రమే ఆరో వేతన స్కేళ్లను అమలు చేస్తున్నా, అదీ అందరికి ఇవ్వడం లేదు. ఫ్యాకల్టీకి ఎంటెక్, పీహెచ్డీ అర్హతలు ఉండాల్సి ఉన్నా 70 శాతం ఫ్యాకల్టీ బీటెక్ విద్యార్హతతోనే పనిచేస్తున్నారు. వారికి రూ.6 నుంచి రూ. 10 వేలు చెల్లిస్తూ బోధన కొనసాగిస్తున్నా యి. 60 శాతం కాలేజీల్లో ప్రయోగశాలలు, పరికరాలు లేవు. -
ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కళాశాలల్లో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గురిజాల కృష్ణమోహన్‌రెడ్డి నియమితులైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాత్రి సంతకం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం వెలువడనున్నట్టు సమాచారం. ఏఎఫ్ఆర్సీలో ఫీజు నిర్ధారణ కమిటీ, అడ్మిషన్ల నియంత్రణ కమిటీలు ఉంటాయి. ఫీజుల నిర్ధారణ కమిటీ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ ఆర్.బయ్యపురెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 7న వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు. దీంతో, అడ్మిషన్ల నియంత్రణ కమిటీ చైర్మన్ జస్టిస్ టి.రంగారావుకే ఈ కమిటీ బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ నేపధ్యంలో జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డిని ఫీజు నిర్ధారణ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం వై.కొత్తపల్లి గ్రామానికి చెందినవారు. జిల్లా జడ్జిగా, ఏసీబీ కోర్టు జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.