సాక్షి, న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ దేనని (ఏఎఫ్‌ఆర్సీ).. దీని నిర్ణయాలనే అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫీజు నిర్ధారణ ప్రక్రియలో లోపాలుంటే కోర్టు సమీక్షించవచ్చని.. కానీ కోర్టే ఫీజులపై నిర్ణయం తీసుకోరాదని సూచించింది. ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని వెల్లడించింది. వాసవీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు వివాదంపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు సోమవారం తుదితీర్పు వెలువరించింది. ఏఎఫ్‌ఆర్సీ నిర్ధారించిన ఫీజులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ రెండు కాలేజీల ఫీజులను నిర్ధారించడం ద్వారా హైకోర్టు ఏఎఫ్‌ఆర్సీ పరిధిలో చొరబడిందని పేర్కొంది. తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యాసంస్థలకు సం బంధించి 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు గానూ ఏఎఫ్‌ఆర్సీ ఫీజులు నిర్ధారించింది. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 21 ద్వారా జూలై 4, 2016న నోటిఫై చేసింది. దీని ప్రకా రం వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వార్షిక ఫీజు రూ.86 వేలు కాగా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఫీజు రూ.91 వేలు. ఈ ఫీజుల నిర్ధారణ తగినరీతిలో లేదని పునఃసమీక్షకు ఆయా కళాశాలలు అభ్యర్థించగా ఫిబ్రవరి 4, 2017న ఏఎఫ్‌ఆర్సీ రెండు కళాశాలల ఫీజును రూ.97 వేలుగా నిర్ధారించింది.
హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకు!
ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఆయా విద్యా సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి. దీంతో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయ సమీక్ష జరిపి వాసవీ కళాశాల ఫీజును రూ.1,60,000గా, శ్రీనిధి కళాశాల ఫీజును రూ.1,37,000గా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిని రాష్ట్ర ప్రభు త్వం సవాలు చేయగా.. ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మొదట వాసవీ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఏఎఫ్‌ఆర్సీ నిర్ధారించిన ఫీజునే తీసుకోవాలని, అదనంగా ఫీజులు వసూలు చేయరాదని, విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. అనంతరం సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం సోమవారం 35 పేజీల తీర్పు వెలువరించింది. పేరెంట్స్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు డి.మహేష్ బాబు, కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించగా, తెలంగాణ ప్రభుత్వం తరపున రాధాకృష్ణన్, పాల్వాయి వెంకటరెడ్డి, కళాశాలల తరపున సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు.
ఏఎఫ్‌ఆర్సీ ఫీజులే వర్తిస్తాయ్
హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియపైనే న్యాయ సమీక్ష ఉంటుంది. కానీ తీసుకున్న నిర్ణయంలో ఉన్న మెరిట్‌పై కాదు. సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ నిర్ణయ ప్రక్రియ ఉంటే దానిని కోర్టులు సరిదిద్దవచ్చు. చట్టప్రకారం తిరిగి నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ (ఏఎఫ్‌ఆర్సీ)ని తిరిగి మొదటి నుంచి ప్రక్రియను సజావుగా చేపట్టాలని ఆదేశించవచ్చు. కానీ కోర్టులు న్యాయసమీక్ష పేరుతో బలవంతంగా నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ పరిధిలోకి వెళ్లి తానే నిర్ణయం తీసుకోరాదు. అలాగే ఏఎఫ్‌ఆర్సీకి అప్పిలేట్ అధికారిగా కూడా కోర్టులు వ్యవహరించజాలవు’అని పేర్కొంది. ‘ఏఎఫ్‌ఆర్సీ ఫీజుల నిర్ధారణ ప్రక్రియ.. విద్యను పొందడంలో సమాన అవకాశాల కల్పించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని చేర్చే భావనలో ఒక భాగం. అందువల్ల నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం సమర్థించజాలనిది’అని పేర్కొంది. ‘ఇక్కడ ఏఎఫ్‌ఆర్సీ సిఫారసుల్లో జోక్యం చేసుకుని హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది. అందువల్ల హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెడుతున్నాం. ఏఎఫ్‌ఆర్సీ ఫిబ్రవరి 4, 2017న నిర్ధారించిన ఫీజులు 2016–17 నుంచి 2018–19 బ్లాక్‌పీరియడ్‌కు అమలులో ఉంటాయి. అలాగే ప్రతివాదులైన విద్యాసంస్థలు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలు క్రియాశీలతను సంతరించుకొని విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి’అని ధర్మాసనం పేర్కొంది.
నిర్ణయాధికారం ఏఎఫ్‌ఆర్సీదే..
Published Tue, Jul 2 2019 2:01 AM | Last Updated on Tue, Jul 2 2019 2:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment