Engineering fees
-
తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల మోత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరిగాయి. ఇంజనీరింగ్‌తోపాటు ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ఫీజులను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులు ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. ‘రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)’ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 2019 నుంచి అమల్లో ఉన్న ఫీజులతో పోలిస్తే.. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో సగటున 20 శాతం వరకూ ఫీజులు పెరిగాయి. పెద్ద కాలేజీల్లో 10 నుంచి 15 శాతం పెంచగా.. రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు పెంచారు. రాష్ట్రంలో గరిష్టంగా మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)కి గరిష్టంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇక ఎంసీఏ కోర్సుల వార్షిక ఫీజులను కనిష్టంగా రూ.27 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు.. ఎంటెక్ ఫీజులను కనిష్టంగా రూ.57 వేల నుంచి గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు పెంచారు. మొత్తం 153 కాలేజీలకు మాత్రమే ఫీజులు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగతా కాలేజీల్లో కొన్నింటికి అనుబంధ గుర్తింపు రావాల్సి ఉండటంతో ఫీజుల నిర్థారణ చేయలేదని తెలిపారు. 40 కాలేజీల్లో లక్షపైనే.. తాజా ఫీజుల పెంపును పరిశీలిస్తే.. రూ.లక్ష, ఆపైన ఫీజు ఉండే జాబితాలో ఇంతకుముందు 18 కాలేజీలుంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 40కి పెరిగింది. రూ.75వేలపైన వార్షిక ఫీజున్న కాలేజీలు 24 నుంచి 38కి చేరాయి. తొమ్మిది కాలేజీల్లో కనీస ఫీజు రూ.35 వేల నుంచి రూ. 45వేలకు పెరిగింది. మరో 66 కాలేజీల్లో రూ.45 వేల నుంచి రూ.75 వేల మధ్య ఫీజులు ఉండబోతున్నాయి. -
Telangana: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాల్లో ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అడ్మిషన్, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్ బుధవారం జీవో జారీ చేసింది. అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ.45వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు రూ. లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలుగా నిర్ణయించింది. మూడేళ్లపాటు కొత్త ఇంజనీరింగ్ ఫీజులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులు సైతం ప్రభుత్వం పెంచింది. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక ఫీజు రూ.27వేలుగా.. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ.57వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. చదవండి: మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి -
ఇంజనీరింగ్ ఫీజులు తగ్గుతాయ్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంపై త్వరలో స్పష్టత వచ్చే వీలుంది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) శనివారం భేటీ కానుంది. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాకాటి సహా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటివరకు పునఃసమీక్షించిన ఆడిట్ నివేదికల ఆధారంగా 2023 నుంచి అమలు చేసే ఫీజులను నిర్ధారించనున్నారు. కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అనంతరం ప్రభుత్వం ఫీజులపై జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. మూడేళ్ల తర్వాత మరోసారి ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశంపై కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తు జూలైలో పూర్తయింది. కాలేజీల నిర్వహణ ఖర్చు ఆధారంగా కొత్త ఫీజులను ఖరారు చేసినా రెండేళ్లుగా కోవిడ్ వల్ల విద్యాసంస్థలు మూతపడ్డ నేపథ్యంలో పాత ఫీజులనే అమలు చేయాలని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 80 కాలేజీలు ఫీజుల పెంపును నిలిపివేయడంపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో గత మూడు రోజలుగా కాలేజీల ఆడిట్ నివేదికలను ఎఫ్ఆర్సీ పరీశీలించింది. పొరపాట్లు గుర్తించినందునే.. చాలా కాలేజీల్లో ఫీజులు తగ్గుతాయని ఆడిట్ నివేదికల పరిశీలన అనంతరం టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ స్వరూప్‌రెడ్డి తెలిపారు. నివేదికల సమీక్షను సొంతంగా చేపట్టామని... న్యాయస్థానం లేదా ప్రభుత్వం తమను ఆదేశించలేదని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తొలిసారి ఆడిట్లో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించడం వల్లే మరోసారి నివేదికలను పరిశీలించాల్సి వచ్చిందన్నారు. లోతుగా పరిశీలించిన తర్వాత వాస్తవ ఫీజులను నిర్ధారిస్తున్నామన్నారు. ఈ లెక్కన జూలైలో నిర్ణయించిన వాటికన్నా చాలా కాలేజీల్లో ఇప్పుడు ఫీజులు తగ్గుతాయని చెప్పారు. ఇప్పుడున్న కనీస ఫీజు రూ. 35 నుంచి 45 వేలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పెద్ద కాలేజీల ఫీజులు కూడా భారీగానే తగ్గుతా యని చెప్పారు. తుది ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్ఆర్సీకి ఉందని, కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అవసరమైన వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సీబీఐటీ ఫీజు రూ.1.12 లక్షలు! గరిష్ట వార్షిక ఫీజు నిర్ధారణ అయిన సీబీఐటీ కాలేజీ ఫీజును ఆడిట్ నివేదికల పరిశీలన తర్వాత రూ. 1.12 లక్షలుగా టీఎఫ్ఆర్సీ నిర్ధారించినట్టు తెలిసింది. వాస్తవానికి ఈ కాలేజీ ఫీజును జూలైలో రూ. 1.73 లక్షలుగా నిర్ణయించారు. తాజా పరిశీలనలో కాలేజీ ఖాతాల్లో రూ. 14 కోట్ల నిల్వ ఉన్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించి సమగ్ర వివరాలు అందించలేదని ఎఫ్ఆర్సీ భావించింది. ఆడిట్ నివేదికలు పూర్తయిన తర్వాత యాజమాన్యం నిల్వకు సంబంధించిన వివరాలు ఎఫ్ఆర్సీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. మరో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ అయిన ఎంజీఐటీ... ‘నాలా’చట్టం కింద మున్సిపల్ ట్యాక్స్ రూ. 3 కోట్ల వరకూ చెల్లిస్తున్నట్లు పేర్కొంది. దీన్ని ఖర్చు కింద పరిగణించడంతో ఈ కాలేజీ ఫీజును రూ. 1.60 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం. ఆడిట్ నివేదికకు ముందు దాదాపు 25 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉంటే... పరిశీలన తర్వాత కేవలం 12 కాలేజీల్లో రూ. లక్షకుపైగా వార్షిక ఫీజు ఉండే వీలుందని తెలియవచ్చింది. నాలుగైదు కాలేజీలు మినహా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఫీజులు తగ్గే వీలుందని తెలుస్తోంది. -
ఇంజనీరింగ్ ఫీజు పెంపు ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజు పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. తమ జమా ఖర్చులన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రవే శాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ముందు వాదన వినిపిస్తున్నాయి. హైకోర్టు సూచన మేరకు ఫీజుల నిర్ధారణపై ప్రైవేటు కాలేజీల మూడేళ్ల ఖర్చును సోమవారం నుంచి తిరిగి పరిశీలించడం మొదలుపెట్టింది. దాదాపు 19 కాలేజీలు ఫీజుల పెంపును కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాయి. తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, వారి జమా ఖర్చులను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని ఎఫ్ఆర్సీకి సూచించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవానికి ప్రతీ మూడేళ్లకోసారి ఎఫ్ ఆర్సీ ఇంజనీరింగ్ ఫీజులను సమీక్షిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. లాక్డౌన్ ఉన్నా ఖర్చులు పెరిగాయా? 2023లో ఇంజనీరింగ్ ఫీజుల పెంపు కోసం కాలేజీలు ఆరునెలల క్రితమే ఆడిట్ నివేదికలు సమర్పించాయి. గత మూడేళ్లుగా కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొన్నాయి. కరోనా కారణంగా కాలేజీలు సరిగా నడవకపోయినా, కొన్ని కాలేజీలు భారీగానే వ్యయం చేసినట్టు లెక్కలు చూపించాయి. సాంకేతికత అందిపుచ్చుకోవడం, ప్రత్యేక ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పించామనే వాదనను తెరమీదకు తెచ్చాయి. కొన్ని కాలేజీలు న్యాయ సంబంధమైన లావాదేవీలకు అయిన ఖర్చును కూడా లెక్కల్లో చూపించాయి. వీటన్నింటిపైనా ఎఫ్ఆర్సీ కొన్నినెలల క్రితమే అభ్యంతరం తెలిపింది. వాటిని తొలగించి వాస్తవ ఖర్చుతో పెంపును నిర్ధారించింది. అయితే, ఇదే సమయంలో విద్యార్థులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది పాత ఫీజులే అమలు చేయాలని ప్రభుత్వానికి ఎఫ్ఆర్సీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, ఎఫ్ఆర్సీ అంగీకరించిన ఫీజునే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కావాలంటే కాస్త్త తగ్గిస్తాం... ఎఫ్ఆర్సీ దగ్గర జరిగిన సంప్రదింపుల్లో కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కొంత తగ్గినట్టు తెలిసింది. రూ. 1.73 లక్షలు డిమాండ్ చేస్తున్న కాలేజీ రూ.10 వేలు తగ్గించుకునేందుకు, రూ.1.50 పైన ఫీజులు డిమాండ్ చేసే కాలేజీలు రూ. 5 వేలు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీన్నిబట్టి కనిష్ట ఫీజు రూ 45 వేలు, గరిష్ట ఫీజు రూ.1.63 లక్షల వరకూ ఉండొచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. అయితే ఈ వాదనను మాత్రం ఎఫ్ఆర్సీ వర్గాలు అంగీకరించడం లేదు. కాలేజీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా మని, ఏమేర ఫీజులను నిర్ధారించాలనే దిశగా అడుగులు వేస్తున్నామని ఎఫ్ఆర్సీకి చెందిన ఓ అధికారి తెలిపారు. -
Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పెరిగిన ఫీజులు.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు గుదిబండగా మారనున్నాయి. సగటున ఒక్కో విద్యార్థిపై ఏటా అదనంగా రూ.20 వేల భారం పడుతుందని.. నాలుగేళ్లకు కలిపి రూ.80వేలు భరించాల్సి వస్తుందని విద్యా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచిన కళాశాలల్లో చేరే దాదాపు 45 వేల మంది విద్యార్థులపై ఈ భారం పడనుంది. వీరంతా కన్వీనర్ కోటా కింద చేరే విద్యార్థులే కానుండటం గమనార్హం. ఇక అదనపు ఫీజు భారానికితోడు ట్రాన్స్‌పోర్టు/హాస్టల్/ల్యాబ్ ఖర్చులపేరిట ప్రతినెలా మరో రూ.ఐదు వేల వరకు భారం పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫీజులో అదనంగా రూ.లక్షకుపైనే ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.45 వేల దాకా అదనపు భారం కోర్టు అనుమతి మేరకు కాలేజీలను బట్టి వార్షిక ఫీజు కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.45 వేల వరకు పెరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10వేలలోపు ర్యాంకు వచ్చి కాలేజీల్లో చేరే దాదాపు ఆరు వేల మంది బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తిఫీజును ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ట ఫీజు రూ.1.38 లక్షలు ఉండేది. అదిప్పుడు రూ.45 వేల నుంచి రూ1.73 లక్షలకు పెరిగింది. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మరోవైపు పదివేలకన్నా పైన ర్యాంకు వచ్చినవారికి ప్రభుత్వం కనీస ఫీజును మాత్రమే చెల్లిస్తుంది. ఆపై మొత్తాన్ని విద్యార్థులే కట్టాలి. దీంతో పదివేలపైన ర్యాంకు వచ్చిన బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులందరిపై పెరిగిన ఫీజు మోత మోగనుంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రానివారికీ భారం పడుతోంది. సగటున చూస్తే ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.20వేల చొప్పున నాలుగేళ్లకు రూ.80 వేలకుపైగా అదనపు భారం పడనుంది. పెంచిన ఫీజులను తగ్గించాల్సిందే.. ఏఎఫ్ఆర్సీ, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష సహకారంతోనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకున్నాయి. దీనిని వెంటనే వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపారు. – ప్రవీణ్, ఏబీవీపీ నేత కోర్టుకెళ్లి పెంచుకున్న కాలేజీలు ‘తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిషన్(టీఎస్ఏఎఫ్ఆర్సీ)’ ఈసారి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు ప్రక్రియ చేపట్టింది. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి.. 20 నుంచి 25% ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలపై ఏమీ తేల్చలేదు. దీనితో 81 ఇంజనీరింగ్ కాలేజీలు కోర్టును ఆశ్రయించి ఈ విద్యా సంవత్సరంలోనే ఫీజుల పెంపునకు అనుమతి తెచ్చుకున్నాయి. అయితే కోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు అప్పీలు చేయలేదని.. అంటే పరోక్షంగా పెంపును అంగీకరించనట్లేనన్న విమర్శలు వస్తున్నాయి. ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం సీబీఐటీలో రూ.1.73 లక్షలకు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళా కాలేజీలలో రూ.1.55 లక్షలు, శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో రూ.1.50 లక్షలు, ఎంవీఎస్ఆర్ రూ.1.45 లక్షలు చొప్పున ట్యూషన్ ఫీజులకు అనుమతి లభించింది. అయితే ఫీజు పెంపునకు సంబంధించి హైకోర్టు.. కాలేజీలకు తాత్కాలిక అనుమతి మాత్రమే ఇచ్చింది. మొత్తం 79 కాలేజీలుండగా.. 36 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండే అవకాశం ఉంది. కాగా, కాలేజీలు వసూలు చేసే పెంపు మొత్తాన్ని బ్యాంకుల్లోనే ఉంచాలని.. తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఫీజు పెంపు ఉత్తర్వులు ఉంటాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
ఇంజనీరింగ్‌లో పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కాలేజీల్లో ఈ ఏడాది ఫీజుల పెంపు లేనట్టే. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే వీలుంది. ఈ సంవత్సరం పాత ఫీజులే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. దీన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించారు. ఈ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వీలుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 నుంచి కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. దీనిపై ఎఫ్ఆర్సీ కసరత్తు చేసింది. కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించడంతోపాటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. రూ. 35 వేలున్న కనిష్ట ఫీజును రూ. 45 వేలకు, రూ. 1.43 లక్షలున్న గరిష్ట ఫీజును రూ. 1.73 లక్షలకు పెంచాలని భావించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
ఇంజనీరింగ్ ఫీజుపై నిర్ణయించలేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక ఫీజుల పెంపు నిలిపివేతపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనే ప్రభుత్వానికి రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా శుక్రవారం మంత్రి వద్ద ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఫీజులు పెంచాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ అన్నీ పరిశీలించాక అవసరమైన సిఫార్సులు చేస్తుందని వివరించారు. రాష్ట్ర అడ్మిషన్ల కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటి వరకూ తమ దృష్టికి ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. యాజమాన్యాలతో చర్చించిన తర్వాత కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షల వరకూ ఫీజుల పెంపునకు సమ్మతించింది. అయితే, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈఏడాది పాత ఫీజులే అమలు చేయాలని భావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దిశగా నివేదిక పంపినట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు ఉండదని అందరూ భావించారు. కానీ మంత్రి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఫీజుల పెంపు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు -
Telangana: ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు నో! ఈ ఏడాది కూడా పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు సర్కార్ నో చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ ఏడాది కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఫీజులనే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం ఎఫ్ఆర్సీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎఫ్ఆర్సీ ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపును సమీక్షిస్తుంది. ఈ విధంగా 2019లో పెరిగిన ఫీజులు 2022 వరకు అమల్లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి గత మూడు నెలలుగా కసరత్తు చేస్తోంది. ఎఫ్ఆర్సీ పెంపు ప్రతిపాదించినా.. కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన జమాఖర్చులు మదింపు చేసింది. వారితో చర్చలూ జరిపింది. చివరకు కని ష్ట వార్షిక ఫీజును రూ. 45 వేలుగా, గరిష్ట ఫీజును రూ.1.73 లక్షలుగా నిర్ణయించింది. ఈ మేరకు ఏ కాలేజీకి ఎంత ఫీజు పెంచాలనే ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపింది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఫీజుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. వ్యతిరేకతే కారణమా? కరోనా వల్ల గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఈ సమయంలో ఫీజుల పెంపు సరికాదంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజీల ఫీజులు కూడా ఈ ఏడాది పెంచలేదన్న విషయం చర్చకు వచ్చింది. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఫీజుల పెంపుతో ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది. -
ఇంజనీరింగ్ ఫీజు 25% పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పట్టుబడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ముందు తమ వాదనను విన్పిస్తున్నాయి. కొన్ని రోజులుగా కాలేజీలతో కమిటీ విడివిడిగా చర్చలు జరుపుతోంది. ఇందులో టాప్‌టెన్ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పెంపుపై భారీగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రతీ మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను కమిటీ అధ్యయనం చేస్తోంది. మౌలిక వసతులు, లేబొరేటరీలు, ఫ్యాకల్టీకి అయ్యే ఖర్చును పరిగణనలోనికి తీసుకుని ఫీజులను నిర్ధారిస్తుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. డిసెంబర్ నుంచి మొదలయ్యే 2022–23 విద్యా సంవత్సరంలో ఫీజుల పెంపుపై కమిటీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. ఏఐసీటీఈ ప్రకారం వెళ్లాలి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రతిపాదించిన ట్యూషన్ ఫీజులనే అమలు చేయాలని పలు ప్రైవేటు కాలేజీలు కోరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 158 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిలో 20 కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.35 వేలు, 110 కాలేజీల్లో రూ.80 వేల వరకూ, మిగతా కాలేజీల్లో రూ.1.40 లక్షల వరకూ ఉంది. ఏఐసీటీఈ ఈ ఏడాది ఫీజులను కనీసం రూ.79,600 నుంచి గరిష్టంగా 1,89,800 వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. అయితే, దీనిపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ఎఫ్ఆర్సీలు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. అంత పెంచితే ఎలా? కాలేజీల వాదనపై కమిటీ కొంత ఇబ్బంది పడుతోంది. ప్రతీ ఏటా 10–15 శాతం ఫీజులు పెంచుతున్నారు. ఇప్పుడు ఏకంగా 25 శాతం అంటే ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని ఎఫ్ఆర్సీ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని కాలేజీల యాజమాన్యాలకు నచ్చజెప్పే యత్నం చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతోంది. ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికీ రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత ర్యాంకుంటే.. బీసీలు, ఓసీలు ఎవరికైనా కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్టంగా 35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. కాలేజీలు కోరినట్టు ఫీజులు పెంచితే ఏటా రూ. 21 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇదే క్రమంలో రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వచ్చే విద్యార్థులపైనా అదనపు భారం పడుతుంది. ఈ కారణంగానే కమిటీ తర్జన భర్జనపడుతోంది. ఫ్యాకల్టీని పట్టించుకోరా? ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందనే విషయాన్ని ముందు ఎఫ్ఆర్సీ పరిశీలించాలి. యాజమాన్యాలు ఇచ్చే ఆడిట్ నివేదికలను యథాతథంగా ఆమోదిస్తే పేదలపై భారం పడుతుంది. చాలా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేదు. అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదు. బ్యాంకు ఖాతాలను, ఫ్యాకల్టీ సమర్థతను పరిశీలించాల్సిన అవసరం కమిటీపై ఉంది. – సంతోష్ కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పెంపు అన్యాయం ఫీజుల పెంపు నిర్ణయాన్ని కమిటీ ఉపసంహరించుకోవాలి. కాలేజీల గొంతెమ్మ కోర్కెలు తీరిస్తే పేదలు ఉన్నత విద్యకు దూరమవుతారు. ఇప్పటికే నాణ్యతలేని కాలేజీల్లో భారీగా ఫీజులున్నాయి. అడ్డగోలుగా పెంచితే విద్యార్థుల నుంచి తిరుగుబాటు తప్పదు. –నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. ఫీజుల పెంపు దిశగా ప్రవేశాలు, నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) కసరత్తు మొదలు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడున్న ఫీజుకు దాదాపు 15 శాతం పెంపునకు ఎఫ్ఆర్సీ అంగీకరించినట్టు కాలేజీల యాజమాన్యాలు చెప్పుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంనుంచి పెంచిన ఫీజులు అమలులోకి వచ్చే అవకాశముంది. 2019లో నిర్ధారించిన ఇంజనీరింగ్ ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఫీజుల పెంపు కోసం ప్రైవేటు కాలేజీల నుంచి వచ్చిన ఆడిట్ రిపోర్టులపై ఎఫ్ఆర్సీ పరిశీలన తుదిదశకు చేరుకుంది. గత మూడేళ్లలో మౌలిక సదుపాయాల కోసం వెచ్చించిన మొత్తం, విద్యార్థుల నుంచి వచ్చిన ఫీజులు, ఇంకా ఎంత లోటు ఉంటుందనే వివరాలను కాలేజీ యాజమాన్యాలు ఎఫ్ఆర్సీ ముందుంచాయి. కోవిడ్ వల్ల కాలేజీలు పూర్తిస్థాయిలో తెరవకపోయినా ఖర్చును మాత్రం పెంపునకు సరిపడా చూపించాయి. కంప్యూటర్ కోర్సులతో ఖర్చు మూడేళ్లుగా విద్యార్థులు 95.56 శాతం కంప్యూటర్, అనుబంధ కోర్సులనే ఎంచుకున్నారని ఎక్కువ కాలేజీలు ఎఫ్ఆర్సీ ముందు పేర్కొన్నాయి. గతేడాది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో ఆయా కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. ఈ కోర్సులకు అదనంగా అప్లికేషన్స్, కంప్యూటర్స్, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాల్సి వచ్చిందని, వీటికి అదనంగా ఖర్చు చేశామని చెబుతున్నాయి. సైన్స్ గ్రూపుల ఫ్యాకల్టీకి కూడా అదనంగా వెచ్చించాల్సి వస్తోందన్నాయి. ప్రస్తుతం ఫీజులు రూ.35 వేల నుంచి 1.40 లక్షల వరకూ ఉన్నాయి. కాలేజీలు 25 శాతం మేర ఫీజులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రూ.35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు మాత్రం రెట్టింపును కోరుతున్నాయి. అయితే, కనీసం 10 నుంచి 15 శాతం పెంపు అనివార్యమనే వాదన ఎఫ్ఆర్సీ వర్గాల నుంచి విన్పిస్తోంది. ఇదో మాయాజాలం కొత్త కోర్సులను అడ్డుపెట్టుకుని ప్రైవేటు కాలేజీలు మరోసారి ఫీజుల మాయాజాలానికి తెరలేపుతున్నాయి. కంప్యూటర్ కోర్సుల బోధనకు అవసరమైన నైపుణ్యం గల ఫ్యాకల్టీ లేదని ప్రభుత్వ కమిటీనే పేర్కొంది. . డబ్బుల కోసం కాలేజీలు చేస్తున్న వాదన పేదలకు నష్టం చేస్తుంది. ఫీజుల నియంత్రణ కమిటీ జోక్యం చేసుకుని, వాస్తవాలు పరిశీలించాలి. అడ్డగోలుగా ఫీజులు పెంచితే విద్యార్థిలోకం ఆందోళన చేపట్టడం మినహా మరోమార్గం లేదు. –టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అవి బోగస్ రిపోర్టులు ప్రైవేటు కాలేజీల ఆడిట్ రిపోర్టుల్లో విశ్వసనీయత లేదు. నిర్వహణ ఖర్చులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి, జేఎన్టీయూ, ఎఫ్ఆర్సీకి వేర్వేరు నివేదికలకు ఇస్తున్నాయి. 2019లో పెంచిన ఫీజులకు అనుగుణంగా ఫ్యాకల్టీకి చాలా కాలేజీలు వేతనాలు ఇవ్వడం లేదు. కరోనా కాలంలో మెజారిటీ కాలేజీలు 50 శాతం జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల ఆడిట్ రిపోర్టులను ఎఫ్ఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఫీజులపెంపుపై నిర్ణయం తీసుకోవాలి. –అయినేని సంతోష్ కుమార్, టీఎస్టీసీఈఏ, రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ కమిషన్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది. (చదవండి: ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు) ఇంజనీరింగ్ ఫీజులపై ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర కోర్సులకు కాలేజీల వారీగా ఫీజులు నిర్థారిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య నేతృత్వంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్. భార్గవ రామమోహన్‌రావు, సభ్యకార్యదర్శి డాక్టర్ ఎన్. రాజశేఖరరెడ్డి, సభ్యులు అశుతోష్ మిశ్రా, కల్కి విజయులురెడ్డి, ప్రొఫెసర్ డి.ఉషారాణి, డాక్టర్ జి.శాంతారావు, ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్, ఎ.సాంబశివారెడ్డి ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రను కలిసి నివేదిక అందజేశారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుంది. -
ఫీజా.. బడితెపూజా!
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని ఒక ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మహేశ్‌కు (పేరుమార్చాం) కాలేజీ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. 2019–20 విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజు, అక్రిడిటేషన్, మిస్లీనియస్ కింద రూ.2,05,000 చెల్లించాలని అందులో స్పష్టం చేసింది. మహేశ్ 2018–19 విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీజు, అక్రిడిటేషన్, మిస్లీనియస్ కింద రూ.1,13,500 మాత్రమే చెల్లించాడు. ఏఎఫ్ఆర్సీ నిబంధనల ప్రకారం ఈ మేరకు ఫీజు తీసుకోవాల్సి ఉండగా.. కాలేజీ యాజమాన్యం మాత్రం రూ.91,500 ఫీజు పెంచేసి విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులను ఇష్టానుసారంగా పెంచేస్తున్న కళాశాల యాజమాన్యాలు.. విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఏఎఫ్ఆర్సీ (అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) నిర్దేశించిన ఫీజులు కాకుండా కాలేజీ యాజమాన్యాలు ఖరారు చేసిన ఫీజులు తక్షణమే చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. కటాఫ్ తేదీలను విధిస్తూ ఆ లోపు చెల్లించకుంటే అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుందంటూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటా ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులతో పాటు కనీ్వనర్ కోటాలో సీట్లు పొందిన వారిపైనా ఇదే తరహాలో ఒత్తిడి తీవ్రతరం చేయడంతో ఆయా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రీయింబర్స్మెంట్ లబి్ధదారులకు ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే ఆయా విద్యార్థులకు సీట్ల కేటా యింపు లేఖలోనే స్పష్టం చేస్తారు. కొన్ని కాలేజీలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా అన్నివర్గాల విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్లు చేస్తున్నాయి. డెడ్ లైన్ ఐదో తారీఖు.. విద్యా సంవత్సరం అర్ధ వార్షికం కావస్తుండటంతో కాలేజీలు ఫీజుల వసూళ్ల వేగాన్ని పెంచాయి. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను పేర్కొంటూ విద్యార్థులకు సర్క్యులర్లు పంపుతున్నాయి. ఇందులో ట్యూషన్ ఫీజుతో పాటు అక్రిడిటేషన్, మిస్లీనియస్ ఫీజులను సైతం జోడిస్తూ.. ఆ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట్ సమీపంలోని ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వేరువేరుగా సర్క్యులర్లు పంపింది. కేటగిరీ–ఏ, కేటగిరీ–బీ విద్యార్థులతో పాటు ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ విద్యార్థులు ఎంతమేర ఫీజులు చెల్లించాలో స్పష్టం చేసింది. గతేడాది చెల్లించిన మొత్తాలు కాకుండా.. ప్రస్తుతం పెంచిన ఫీజులు అక్టోబర్ 5లోగా తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులు తమ లాగిన్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో లేదా తమ బ్యాంకు ఖాతా ఉన్న శాఖ ద్వారా డీడీల రూపంలో సమరి్పంచాలని పేర్కొం ది. కటాఫ్ తేదీ తర్వాత రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన.. ఫీజుల చెల్లింపులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రూ.2 లక్షలు చెల్లించడం తమవల్ల కాదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. టాప్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ఒత్తిడి చేస్తుండటంతో చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నట్లు వాపోతున్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ లేఖలు సమరి్పస్తున్నారు. వీటిపై స్పందిస్తున్న అధికారులు.. విద్యార్థులు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కాలేజీ యాజమాన్యాలకు అష్యూరెన్స్ సరి్టఫికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. -
పది రోజుల్లో ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చర్యలు వేగవంతం చేసింది. 10 రోజుల్లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజును ఖరా రు చేసేందుకు చర్యలు చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయకుండా, ఫీజులను ఖరారు చేశాకే కౌన్సెలింగ్‌ను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీల ఫీజుల ను 3 రోజుల్లో ఖరారు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. సోమవారం 20 కాలేజీల ఫీజులను ఖరా రు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్ నిర్వ హించింది. యాజమాన్యాలు ఇచ్చిన గత రెండేళ్ల ఆదాయ వ్యయాలు, తాజా ప్రతిపాదనలను ఏఎఫ్ఆర్సీ పరిశీలించింది. ఇప్పటికే ఆడిటర్లు ఆ కాలేజీల ఆదాయ వ్యయాలను సమీక్షించిన నేపథ్యంలో సోమ వారం ఏఎఫ్ఆర్సీ సమావేశమై వాటన్నింటినీ పరిశీలించి ఫీజులను ప్రాథమికంగా నిర్ణయించింది. మంగళవారం మరో 30 కాలేజీల ఫీజులను ఖరారు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్ నిర్వహించనుంది. బుధవారం మరో 31 కాలేజీల ఫీజులను కూడా ఖరారు చేయనుంది. కోర్టును ఆశ్రయించి యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలుకు ఉత్తర్వులు పొందిన 81 కాలేజీల ఫీజులను ఖరారు చేయనుంది. దీంతో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు కాకుండా, ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసే ఫీజుతో ప్రవేశాలను చేపట్టనున్నారు. కోర్టుకు వెళ్లని 108 కాలేజీల ఫీజులను కూడా వచ్చే పది రోజుల్లోగా ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ 108 కాలేజీల్లో రూ.50 వేల లోపు వార్షిక ఫీజు ఉన్న కాలేజీలకు 20 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలకు 15 శాతం ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు ఏఎఫ్ఆర్సీ యాజమాన్యాలతో సమావేశమై ప్రతిపాదించింది. వీటికి ఒప్పుకుంటే ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వ హిస్తామని సూచించింది. తర్వాత కాలేజీ వారీగా, ఆదాయ వ్యయాల ఆధారంగా పూర్తి స్థాయి ఫీజును ఖరారు చేస్తామని వెల్లడించింది. ఇందుకు మెజారిటీ యాజమాన్యాలు అంగీకరించాయి. దీనిపై ఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. ఇప్పుడు తాత్కాలికంగా 15%, 20% ఫీజులను పెం చి కౌన్సెలింగ్ నిర్వహిస్తే విద్యార్థులు ఈ ఫీజుల ప్రకా రమే కాలేజీల్లో చేరుతారు. ఆ తర్వాత పూర్తి స్థాయి ఫీజు ఖరారు చేసినప్పుడు, ప్రస్తుతం ఇచ్చిన 15–20 శాతం పెంపునకు మించి పూర్తిస్థాయి ఫీజులో కాలే జీ ల ఆదాయ వ్యయాల ఆధారంగా పెంపుదల వస్తే గందరగోళం తలెత్తుతుందన్న ఆలోచన ఏఎఫ్ఆర్సీ వర్గాల్లో వచ్చింది. కాగా, ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు కోసం ఏఎఫ్ఆర్సీ చేపట్టిన హియరింగ్‌కు సోమవా రం టాప్ కాలేజీల ప్రతినిధులు ఏఎఫ్ఆర్సీ కార్యాలయానికి వచ్చారు. సోమవారం విచారణకు హాజరైన కొన్ని కాలేజీల యాజమాన్య ప్రతినిధులు మంగళ, బుధవారాల్లో మళ్లీ వస్తామని గడువు కోరారు. అప్పీల్ కోరితే రూ. లక్ష వాసవి, శ్రీనిధి కాలేజీల ఫీజులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను రివ్యూ చేయాలంటే మళ్లీ ఏఎఫ్ఆర్సీకే అప్పీల్ చేసుకోవాలి. అందుకు రూ.లక్ష అప్పీల్ ఫీజుగా ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కచ్చితంగా ఉండే కాలేజీలు మాత్రమే అప్పీల్‌కు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. -
నిర్ణయాధికారం ఏఎఫ్ఆర్సీదే..
సాక్షి, న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయాధికారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ దేనని (ఏఎఫ్ఆర్సీ).. దీని నిర్ణయాలనే అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫీజు నిర్ధారణ ప్రక్రియలో లోపాలుంటే కోర్టు సమీక్షించవచ్చని.. కానీ కోర్టే ఫీజులపై నిర్ణయం తీసుకోరాదని సూచించింది. ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని వెల్లడించింది. వాసవీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు వివాదంపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు సోమవారం తుదితీర్పు వెలువరించింది. ఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ రెండు కాలేజీల ఫీజులను నిర్ధారించడం ద్వారా హైకోర్టు ఏఎఫ్ఆర్సీ పరిధిలో చొరబడిందని పేర్కొంది. తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యాసంస్థలకు సం బంధించి 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు గానూ ఏఎఫ్ఆర్సీ ఫీజులు నిర్ధారించింది. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 21 ద్వారా జూలై 4, 2016న నోటిఫై చేసింది. దీని ప్రకా రం వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వార్షిక ఫీజు రూ.86 వేలు కాగా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఫీజు రూ.91 వేలు. ఈ ఫీజుల నిర్ధారణ తగినరీతిలో లేదని పునఃసమీక్షకు ఆయా కళాశాలలు అభ్యర్థించగా ఫిబ్రవరి 4, 2017న ఏఎఫ్ఆర్సీ రెండు కళాశాలల ఫీజును రూ.97 వేలుగా నిర్ధారించింది. హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకు! ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఆయా విద్యా సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి. దీంతో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయ సమీక్ష జరిపి వాసవీ కళాశాల ఫీజును రూ.1,60,000గా, శ్రీనిధి కళాశాల ఫీజును రూ.1,37,000గా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిని రాష్ట్ర ప్రభు త్వం సవాలు చేయగా.. ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మొదట వాసవీ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజునే తీసుకోవాలని, అదనంగా ఫీజులు వసూలు చేయరాదని, విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. అనంతరం సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం సోమవారం 35 పేజీల తీర్పు వెలువరించింది. పేరెంట్స్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు డి.మహేష్ బాబు, కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించగా, తెలంగాణ ప్రభుత్వం తరపున రాధాకృష్ణన్, పాల్వాయి వెంకటరెడ్డి, కళాశాలల తరపున సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. ఏఎఫ్ఆర్సీ ఫీజులే వర్తిస్తాయ్ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియపైనే న్యాయ సమీక్ష ఉంటుంది. కానీ తీసుకున్న నిర్ణయంలో ఉన్న మెరిట్‌పై కాదు. సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ నిర్ణయ ప్రక్రియ ఉంటే దానిని కోర్టులు సరిదిద్దవచ్చు. చట్టప్రకారం తిరిగి నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ (ఏఎఫ్ఆర్సీ)ని తిరిగి మొదటి నుంచి ప్రక్రియను సజావుగా చేపట్టాలని ఆదేశించవచ్చు. కానీ కోర్టులు న్యాయసమీక్ష పేరుతో బలవంతంగా నిర్ణయాత్మక అధీకృత వ్యవస్థ పరిధిలోకి వెళ్లి తానే నిర్ణయం తీసుకోరాదు. అలాగే ఏఎఫ్ఆర్సీకి అప్పిలేట్ అధికారిగా కూడా కోర్టులు వ్యవహరించజాలవు’అని పేర్కొంది. ‘ఏఎఫ్ఆర్సీ ఫీజుల నిర్ధారణ ప్రక్రియ.. విద్యను పొందడంలో సమాన అవకాశాల కల్పించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని చేర్చే భావనలో ఒక భాగం. అందువల్ల నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం సమర్థించజాలనిది’అని పేర్కొంది. ‘ఇక్కడ ఏఎఫ్ఆర్సీ సిఫారసుల్లో జోక్యం చేసుకుని హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది. అందువల్ల హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెడుతున్నాం. ఏఎఫ్ఆర్సీ ఫిబ్రవరి 4, 2017న నిర్ధారించిన ఫీజులు 2016–17 నుంచి 2018–19 బ్లాక్పీరియడ్కు అమలులో ఉంటాయి. అలాగే ప్రతివాదులైన విద్యాసంస్థలు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలు క్రియాశీలతను సంతరించుకొని విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి’అని ధర్మాసనం పేర్కొంది. -
10% పెరుగుతుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపు ఉండే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లపాటు (2016–17 నుంచి 2018–19వరకు) అమలు చేసిన ఫీజల గడువు ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఫీజుల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే మూడేళ్లకు (2019–20 నుంచి 2021–22 వరకు) ఫీజులను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ఇటీవల లేఖ రాసింది. దానిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓకే చెప్పారు. దీంతో యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఉన్నత మండలి షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. బుధవారం లేదా గురువారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సభ్య కార్యదర్శి పేరుతో ఆ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శే టీఏఎఫ్ఆర్సీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నం దున, ఆయన ఓకే చెప్పిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం అయింది. గతంలో ఫీజులు ఖరారు చేసినప్పుడు యాజమాన్యాల నుంచి దరఖా స్తులను స్వీకరించేందుకు దాదాపు రెండు నెలల గడువు ఇచ్చారు. అయితే ఇప్పుడు అంత గడువు ఇచ్చే పరిస్థితి లేదు. మే/జూన్ నెలల్లో ప్రవేశాలు చేపట్టే నాటికి ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఆలోగా ఫీజులు ఖరారు కాకపోతే ప్రవేశాలు చేపట్టే వీలుండదు. ప్రవేశాల సమయం లో కాలేజీ వారీగా, కోర్సు వారీగా ఫీజులను నిర్ణయించి, వెబ్సైట్లో అందు బాటులో ఉంచితేనే విద్యార్థులు వాటిని చూసి, కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కామన్ ఫీజు పెంచితే భారమే! ఫీజుల పెంపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వద్దనుకుంటే పాత ఫీజులనే కొనసాగించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆదాయ వ్యయా లు ఇవ్వకుండా కామన్ ఫీజు రూ.35 వేలు మాత్రం అలాగే కొనసాగించే అవకాశం ఉంది. దానిని పెంచితే ప్రభుత్వంపై భారం పడుతుంది కాబట్టి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కోర్టును ఆశ్రయించి ఫీజును పెంచుకున్న కాలేజీల విషయంలో కొత్తగా ఫీజు పెంపు ఉండకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వాటికి సంబంధించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కేసు ఉన్నందున, ఆ కేసు తేలేవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే వీల్లేదని చెబుతున్నారు. వచ్చే మూడేళ్లకు ఫీజులను నిర్ణయించేందుకు చర్యలు చేపట్టినం దునా ఆయా కాలేజీల నుంచి వచ్చే మూడేళ్ల కోసం ఇప్పుడు దరఖాస్తులను తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించాలని మండలి అధికారులు భావిస్తున్నారు. ముగిసిన టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ పదవీకాలం.. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ పదవీకాలం కూడా రెండు నెలల కిందటే ముగిసినందున ఇప్పుడు కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. అందుకోసం ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ జడ్జీల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించాల్సి ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇప్పుడు దానిపై దృష్టిసారించి, పేర్లను పంపించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఈలోగా కాలేజీ నుంచే మూడేళ్ల ఆదాయ వ్యయాలపై ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులను స్వీకరించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. వీలైతే బుధ లేదా గురువారం ఆ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. కాలేజీల నుంచి వచ్చే దరఖాస్తులను టీఏఎఫ్ఆర్సీ కొత్త చైర్మన్ వచ్చాక ఆయన ముందుంచితే కమిటీ మొత్తం కూర్చొని ఆదాయ, వ్యయాల పరిశీలన, ఫీజుల ఖరారు ప్రక్రియను చేపడుతుందని వెల్లడించారు. -
ఇంజనీరింగ్ ఫీజుల మోత
- సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల ఖరారు - ఎక్కువ కాలేజీల్లో ఫీజులు రూ. 60 వేలకు పైగానే.. - పలు కాలేజీల్లో పాత ఫీజులపై అదనంగా రూ. 25 వేల వరకు పెంపు - 2016-17 నుంచి కాలేజీల్లో చేరే వారికి కొత్త ఫీజులు - ఇప్పటికే చదువుతున్న వారికి పాత ఫీజులే వర్తింపు - అత్యధిక ఫీజు ఫార్మ్-డిలో 1.15 లక్షలు, ఇంజనీరింగ్‌లో 1,13,500 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న సాధారణ, ఓ మోస్తరు కాలేజీల్లో 80 శాతం వరకు ఫీజు పెంచారు. కొన్ని కాలేజీల్లో మాత్రం ఇప్పటివరకు ఉన్న ఫీజులను యథాతథంగా ఉంచారు. ఇప్పటివరకు ఎక్కువ కాలేజీల్లో రూ.35 వేల కనీస ఫీజు ఉండగా.. తాజాగా రూ.60 వేల వరకు చేరింది. గతంలో రూ.50 వేలలోపు ఫీజు ఉన్న కాలేజీల్లో రూ.75 వేల వరకు పెంచారు. కొన్ని టాప్ కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెంచారు. కొన్నింటి ఫీజుల్లో కోత పెట్టారు. మొత్తంగా ఇంజనీరింగ్‌లో కనీస ఫీజు రూ.35,000 కాగా, గరిష్ట ఫీజు రూ.1,13,500గా... ఫార్మ్-డిలో గరిష్ట ఫీజు రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే చదువుతున్నవారికి పాత ఫీజులే ఉంటాయి. 2016-17 నుంచి కాలేజీల్లో చేరే వారికి కొత్త ఫీజులు వర్తిస్తాయి. కాలేజీలవారీగా ఫీజుల వివరాలను సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కామ్ వెబ్సైట్లో పొందవచ్చు. గుర్తింపు లభించిన కాలేజీలకే.. రాష్ట్రంలో 293 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేయాల్సిన వార్షిక ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం జీవో 21 జారీ చేశారు. ఫీజుల ఖరారు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలన్నింటికీ కాకుండా ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపటే ్టందుకు అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలకు మాత్రమే ఫీజులను ఖరారు చేశారు. ఇందులో 179 ఇంజనీరింగ్ (బీటెక్) కాలేజీలు, 10 బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కాలేజీలు, 2 బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీప్లానింగ్) కాలేజీలు, 73 బీఫార్మసీ కాలేజీలు, 29 ఫార్మ్-డి కాలేజీలు ఉన్నాయి. ఈ ఫీజులు మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) అమల్లో ఉంటాయి. ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు - ఎన్నారై కోటా కింద చేరే విద్యార్థులు ట్యూషన్ ఫీజు కింద 5 వేల అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. (డాలర్ విలువ పెరిగినందున ఈ ఫీజు పెంపును ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించలేదు) - ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సుల్లో చేరే విద్యార్థులు ట్యూషన్ ఫీజుతోపాటు అదనంగా ఏటా రూ.3 వేలు చెల్లించాలి. - మరో రూ.2 వేలను విద్యార్థి ప్రవేశాల సమయంలో అడ్మిషన్/రిజిస్ట్రేషన్/రికగ్నైజేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇందులో రూ.500 యూనివర్సిటీకి సదరు విద్యా సంస్థ చెల్లిస్తుంది. మిగతా రూ.1,500 కాలేజీలో ఉంచాలి. - విద్యార్థికి అందించే ప్రత్యేక సేవల కింద ఏటా మరో రూ.1,000 చెల్లించాలి. ఇందు లో కాలేజీ కార్యక్రమాలకు రూ.75, హెల్త్ సెంటర్ సేవలకు రూ.100, రీడింగ్ రూమ్‌కోసం రూ.25, కాలేజీ మ్యాగజైన్ కోసం రూ.50, హాబీ సెంటర్‌కు రూ.25, స్టూడెం ట్ హ్యాండ్‌బుక్ కోసం రూ.25, ల్యాబ్ ఫీజు రూ.150, లైబ్రరీ ఫీజు రూ.125, కంప్యూటర్, ఇంటర్నెట్ ఫీజు రూ.250, ప్లేస్మెంట్ సెల్‌కు రూ.125, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోసం రూ.50 కేటాయిస్తారు. - ఏటా కామన్ సర్వీసెస్ కింద కాలేజీ యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి మరో రూ.1,500 వసూలు చేసి యూనివర్సిటీకి చెల్లించాలి. ఇందులో పరీక్షల సంబంధ అంశాలకు రూ.500, అకడమిక్ ఆడిట్‌కు రూ.200, కరిక్యులమ్ రివిజన్, కంటెంట్ డెవలప్మెంట్కు రూ.300, స్టాఫ్ ట్రైనింగ్‌కు రూ.50, కో-ఆర్డినేషన్ మీటింగ్ కోసం రూ.50, యూనివర్సిటీ పబ్లికేషన్, వెబ్సైట్ మెయింటెనెన్స్‌కు రూ.200 చెల్లించాలి. - లైబ్రరీ డిపాజిట్ కింద రూ.500, లేబొరేటరీ డిపాజిట్ కింద రూ.500 ప్రవేశాల సమయంలో వన్‌టైమ్ ఫీజుగా చెల్లించాలి. కాలేజీలకు నిబంధనలు.. - ఏటా వార్షిక ట్యూషన్ ఫీజును ముందుగా వసూలు చేసుకోవచ్చు. లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో వసూలు చేసుకోవచ్చు. విద్యా సంస్థ ఏ విధానం ఎంచుకుంటే దానిని అమలు చేయాలి. - విద్యా సంస్థలు క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర మరే పేర్లతో అదనపు ఫీజులు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ వసూలు చేయడానికి వీల్లేదు. - యూనివర్సిటీ/ఏఐసీటీఈ అనుమతించని కోర్సులను, ఫీజు నిర్ధారించని కోర్సులను కొనసాగించడానికి వీల్లేదు. - ప్రస్తుతం నిర్ణయించిన ఫీజులు ఆయా కళాశాలలు ఆన్లైన్ ద్వారా అందజేసిన వివరాల ఆధారంగా నిర్ధారించినవి. ప్రత్యక్ష తనిఖీల సందర్భంగా ఆ వివరాల్లో తప్పులున్నట్లు తేలితే ఫీజులను సవరించడంతోపాటు ఆయా కాలేజీలపై చర్యలు చేపడతారు. -
ఫీజుల లెక్క తేలింది!
- ఇంజనీరింగ్ ఫీజులపై ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన ఏఎఫ్ఆర్సీ - టాప్ కాలేజీల్లో రూ. 3 వేల నుంచి రూ. 25 వేల వరకు పెంపు - ఆ తర్వాత స్థాయి కాలేజీల్లో రూ.2 వేల నుంచి 10 వేల వరకు పెంపు - ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను అంగీకరించని కొన్ని కాలేజీలు - పూర్తి స్థాయి కమిటీ నిర్ణయం తర్వాత సర్కారు నిర్ణయమే ఫైనల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు పూర్తయ్యింది. కళాశాలల ఆదాయ వ్యయాల ప్రకారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) ఫీజులను ఖరారు చేసింది. అయితే యాజమాన్యాలు తమ కాలేజీల్లో ఫీజుల పెంపు కోసం చేసిన ప్రతిపాదలను బట్టి చూస్తే.. ఈసారి భారీ మొత్తంలో ఫీజులు పెరుగుతాయని భావించినా అంత మొత్తం పెరగలేదు. కాలేజీల ఆదాయ, వ్యయాల లెక్కల ప్రకారమే ఫీజులను పెంచారు. కాలేజీలు చేసిన ప్రతిపాదనలకు భారీగా కత్తెర పడింది. కానీ కొన్ని టాప్ కాలేజీల్లో గత ఏడాది వరకు ఉన్న ఫీజులపై అదనంగా రూ. 3 వేల నుంచి రూ. 25 వేల వరకు పెరిగింది. ఆ తర్వాత స్థాయిలో ఉన్న కాలేజీల్లో రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు ఫీజులు పెరిగినట్లు తెలిసింది. ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజుకు తాము అంగీకరించబోమని కొన్ని ప్రముఖ కాలేజీ యాజమాన్యాలు తేల్చిచెప్పినట్లు సమాచారం. గడిచిన మూడేళ్ల ఆదాయ వ్యయాల పరిశీలన , కొత్త ఫీజుల ఖరారు కోసం యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఏఎఫ్ఆర్సీ ఖ రారు చేసిన ఫీజుకు 95 శాతం యాజమాన్యాలు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. కొన్ని టాప్ కాలేజీలు మాత్రం అంగీకరించలేదు. తమ కాలేజీలకు ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజుకు తాము ఒప్పుకోమని పేర్కొంటూ ఏఎఫ్ఆర్సీ నిర్ణయానికి అనుగుణంగా సంతకం చేయలేదని తెలిసింది. అంటే ఆయా కాలేజీలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మెజారిటీ కాలేజీల్లో రూ.65 వేల నుంచి రూ.75 వేలు రాష్ట్రంలోని 247 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిల్లో అనేక కాలేజీల్లో వార్షిక ఫీజును రూ.65 వేల నుంచి రూ.75 వేల వరకు ఖరారు చేసింది. మిగతా కాలేజీల్లో రూ.35 వేల నుంచి రూ.65 వేలుగా ఖరారు చేసినట్లు సమాచారం. కాలేజీల ఆదాయ వ్యయాలను ఏఎఫ్ఆర్సీ పరిశీలించిన తర్వాత కొన్ని కాలేజీలకు ఇప్పటివరకు ఉన్న కనీస ఫీజు రూ.35 వేలు కూడా రాలేదు. దీంతో అంతకంటే తక్కువ ఫీజు చెల్లిస్తే కాలేజీల నిర్వహణ సాధ్యంకాదన్న భావనతో అనేక చర్చల తర్వాత వచ్చే మూడేళ్లు కూడా కనీస ఫీజు రూ. 35 వేలు ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. మరో రెండు దశల తర్వాతే ఫైనల్ ఏఎఫ్ఆర్సీ ప్రాథమికంగా నిర్ణయించిన ఫీజులే ఫైనల్ కాదు. వీటిపై ఏఎఫ్ఆర్సీ పూర్తి స్థాయి కమిటీ సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ప్రభుత్వ స్థాయిలోనూ వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజుల వివరాల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏఎఫ్ఆర్సీ పూర్తి స్థాయి కమిటీ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఖరారు చేసేవే ఫైనల్ ఫీజులు. వాటిని కాలేజీలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజుల నిర్ణయంతో ఫీజు రీయింబర్స్మెంట్ విధానానికీ లింకు ఉన్నందునా ప్రభుత్వం విస్తృతంగా చర్చించాకే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బయోమెట్రిక్ తప్పనిసరి ప్రస్తుతం కాలేజీలవారీగా ఫీజులపై నిర్ణయం చేసిన ఏఎఫ్ఆర్సీ ఈసారి ప్రభుత్వానికి మరో కీలక ప్రతిపాదన చేయబోతున్నట్లు తెలిసింది. ప్రతి కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తేనే ఈ ఫీజులను ఇవ్వాలని సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం ప్రవేశాల్లోనూ ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేస్తోంది. ఇక వచ్చే వారం పది రోజుల్లో ఏఎఫ్ఆర్సీ పూర్తి స్థాయి కమిటీ సమావేశమై ప్రభుత్వానికి ఫీజుల ఫైలు పంపించనుంది.