సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపు ఉండే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లపాటు (2016–17 నుంచి 2018–19వరకు) అమలు చేసిన ఫీజల గడువు ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఫీజుల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే మూడేళ్లకు (2019–20 నుంచి 2021–22 వరకు) ఫీజులను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ఇటీవల లేఖ రాసింది. దానిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓకే చెప్పారు. దీంతో యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఉన్నత మండలి షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. బుధవారం లేదా గురువారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) సభ్య కార్యదర్శి పేరుతో ఆ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శే టీఏఎఫ్‌ఆర్‌సీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నం దున, ఆయన ఓకే చెప్పిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం అయింది. గతంలో ఫీజులు ఖరారు చేసినప్పుడు యాజమాన్యాల నుంచి దరఖా స్తులను స్వీకరించేందుకు దాదాపు రెండు నెలల గడువు ఇచ్చారు. అయితే ఇప్పుడు అంత గడువు ఇచ్చే పరిస్థితి లేదు. మే/జూన్ నెలల్లో ప్రవేశాలు చేపట్టే నాటికి ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఆలోగా ఫీజులు ఖరారు కాకపోతే ప్రవేశాలు చేపట్టే వీలుండదు. ప్రవేశాల సమయం లో కాలేజీ వారీగా, కోర్సు వారీగా ఫీజులను నిర్ణయించి, వెబ్‌సైట్‌లో అందు బాటులో ఉంచితేనే విద్యార్థులు వాటిని చూసి, కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
కామన్ ఫీజు పెంచితే భారమే!
ఫీజుల పెంపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వద్దనుకుంటే పాత ఫీజులనే కొనసాగించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆదాయ వ్యయా లు ఇవ్వకుండా కామన్ ఫీజు రూ.35 వేలు మాత్రం అలాగే కొనసాగించే అవకాశం ఉంది. దానిని పెంచితే ప్రభుత్వంపై భారం పడుతుంది కాబట్టి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కోర్టును ఆశ్రయించి ఫీజును పెంచుకున్న కాలేజీల విషయంలో కొత్తగా ఫీజు పెంపు ఉండకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వాటికి సంబంధించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కేసు ఉన్నందున, ఆ కేసు తేలేవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే వీల్లేదని చెబుతున్నారు. వచ్చే మూడేళ్లకు ఫీజులను నిర్ణయించేందుకు చర్యలు చేపట్టినం దునా ఆయా కాలేజీల నుంచి వచ్చే మూడేళ్ల కోసం ఇప్పుడు దరఖాస్తులను తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించాలని మండలి అధికారులు భావిస్తున్నారు.
ముగిసిన టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ పదవీకాలం..
టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ పదవీకాలం కూడా రెండు నెలల కిందటే ముగిసినందున ఇప్పుడు కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. అందుకోసం ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ జడ్జీల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించాల్సి ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇప్పుడు దానిపై దృష్టిసారించి, పేర్లను పంపించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఈలోగా కాలేజీ నుంచే మూడేళ్ల ఆదాయ వ్యయాలపై ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులను స్వీకరించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. వీలైతే బుధ లేదా గురువారం ఆ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. కాలేజీల నుంచి వచ్చే దరఖాస్తులను టీఏఎఫ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్ వచ్చాక ఆయన ముందుంచితే కమిటీ మొత్తం కూర్చొని ఆదాయ, వ్యయాల పరిశీలన, ఫీజుల ఖరారు ప్రక్రియను చేపడుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment