సాక్షి, హైదరాబాద్: ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులైన డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ పీఈసెట్–2019 ఫలితాలు విడుదలయ్యాయి. డీపీఈడీలో టాప్ 10 ర్యాంకులను బాలికలు కైవసం చేసుకోగా, బీపీఈడీలో టాప్ 10లో ఒక్కటి మినహా మిగతా ర్యాంకులను బాలికలే సాధించారు. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు ఫలితాలను వెబ్‌సైట్‌లో (https://pecet.tsche.ac.in/) అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ నెల 29 నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్ జూన్ నెలాఖరులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి 21 వరకు, 24 నుంచి 26 వరకు నిర్వహించిన సెట్‌లో డీపీఈడీ ఫిజికల్ టెస్టులకు హాజరయ్యేందుకు 2,567 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1,819 మంది హాజరయ్యారు. వారితో 1,798 మంది అర్హత సాధించారు. బీపీఈడీ కోర్సులో చేరేందుకు 3,111 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,115 మంది ఫిజికల్ టెస్టులకు హాజరు కాగా 2,038 మంది అర్హత సాధించారు.
ఎంజీ వర్సిటీలో రంజీ మ్యాచ్‌లు..
మహాత్మాగాంధీ(ఎంజీ) యూనివర్సిటీలో రంజి ట్రోఫీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ వెల్లడించారు. మరింతగా క్రీడా వసతులను అభివృద్ధి చేసేందుకు గాను రూ.10 లక్షల గ్రాంటు ఇచ్చేందుకు పాపిరెడ్డి అంగీకరించారని తెలిపారు. ఈసారి పీఈసెట్ పరీక్షకు జాతీయ స్థాయి క్రీడాకారులతోపాటు నలుగురు అంతర్జాతీయ క్రీడాకారులు హాజరైనట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ సహకారంతో పీఈసెట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పీఈసెట్–2019 ఫలితాలు విడుదల
Published Tue, May 28 2019 1:35 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment