Tummala Papi Reddy
-
తెలంగాణ ఈ-సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఈ-సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్‌లో 95.16శాతం మంది అభ్యర్థలు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజులు
మేడ్చల్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజు రూ. 89 వేలు.. అయినా కాలేజీ యాజమాన్యం మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీటుకు వార్షిక ఫీజు కలుపుకొని నాలుగేళ్లకు రూ. 9 లక్షలు తీసుకుంటోంది.. ఘట్కేసర్ సమీపంలోని మరొక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సీటుకు రూ.12 లక్షల డొనేషన్‌తో పాటు ఏడాదికేడాది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును వసూలు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అగ్రశ్రేణి కాలేజీలతో పాటు, కొద్ది పేరున్న వాటిలో యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇదీ.. యాజమాన్య కోటాకు ప్రత్యేక ఫీజు లేకపోయినా, కన్వీనర్ కోటా ఫీజునే యాజమాన్య కోటాలో వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా కూడా అదేమి పట్టకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మేనేజ్మెంట్ కోటా పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుకు హేతుబద్ధత ఏంటన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. యాజమాన్యాలు నిర్ణయించి వసూలు చేస్తున్నదే అధికారిక ఫీజు అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ, ఫీజుల విధానంపైనా వివిధ కోణాల్లో ఆలోచనలు మొదలయ్యాయి. మెడికల్ తరహాలో రెండు రకాల ఫీజుల విధానం ప్రవేశపెట్టి, కన్వీనర్ ద్వారానే ఆ సీట్లను భర్తీ చేస్తే అడ్డగోలు వసూళ్ల దందాకు తెరపడుతుందన్న ఆలోచనలను అధికారులు చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో ఉన్న ఫీజుపై 50 శాతం లేదా ఎంతో కొంత మొత్తాన్ని పెంచి యాజమాన్య కోటా ఫీజుగా ఖరారు చేస్తే యాజమాన్యాలకు ఊరటతో పాటు, యాజమాన్య కోటాలో సీట్లు కావాలనుకునే తల్లిదండ్రులపైనా భారం తగ్గుతుందన్న వాదనలున్నాయి. మరోవైపు కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే ఆ సీట్లను భర్తీ చేస్తే ఎలాంటి అక్రమాలకు తావుండదని, మెరిట్ విద్యార్థులు టాప్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి. అయితే అది అంత తొందరగా ఆచరణ రూపం దాల్చుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలతో పారదర్శకత సాధ్యం కాదా? ఇంజనీరింగ్‌లో రెండు రకాల ఫీజుల విధానం ఆచరణలోకి వచ్చేందుకు సమయం పట్టనున్న నేపథ్యంలో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పారదర్శకత ఉండేలా చూడటం సాధ్యం కాదా..? అంటే అవుతుందనే చెప్పవచ్చు.. ఇటు హైకోర్టు కూడా మేనేజ్మెంట్ కోటాలో పారదర్శకత ఉండాలని, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఏం చేసిందంటే.. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక నిబంధనలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 74, 75 జీవోలను, 2012లో 66, 67 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. వాటిల్లోని వివిధ అంశాలపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా.. 2014 ఆగస్టు 14న 13, 14 జీవోలను జారీ చేసింది. అయితే జీవో 66, 67 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాజమాన్య కోటాలో సీటు కోరుకునే ప్రతి విద్యార్థికి దరఖాస్తు దక్కేలా, ఆ దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంపికయ్యేలా చర్యలు చేపట్టింది. మారదర్శకాలు ఇవీ.. బీ కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్ విండో తరహాలో అధికార యంత్రాంగం ఒక వెబ్ పోర్టల్‌ను తయారు చేయాలి. ఈ పోర్టల్‌లో ప్రతి కాలేజీకి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. కాలేజీల్లోని ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి. మరోవైపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కాలేజీలు ప్రకటనలివ్వాలి. విద్యార్థులు ఆ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒకే కాలేజీలో రెండు, మూడు కోర్సులను ఎంచుకుంటే ప్రాధాన్య క్రమం ఇవ్వాలి. వాటి ఆధారంగా కాలేజీలు విద్యార్థులను ఎంపిక చేయాలి. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను కాలేజీలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. మెరిట్ ప్రకారమే ఎంపిక చేశారని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్లైన్లోనే ఆమోదించాలి. లేదంటే తిరస్కరించాలి. ఇంకా సీట్లు మిగిలితే రెండో జాబితాను రూపొందించాలి. ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే.. ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. జీవో 66, 67లను కోర్టు సమర్థిస్తూనే యాజమాన్యాలు కోరిన పలు అంశాలను ఆ జీవోల్లో చేర్చాలని సూచించింది. అందులో దరఖాస్తులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశంతో పాటు విద్యార్థిని ఇంటర్వ్యూ చేసే వీలుంది. అలాగే వారి ఆర్థిక స్థోమత తెలుసుకొని సీట్లను కేటాయించే అవకాశమివ్వాలని, ఒకవేళ యాజమాన్యం ఆ విద్యార్థిని తిరస్కరిస్తే అందుకు గల కారణాలను ఉన్నత విద్యా మండలికి తెలియజేయడం వంటి అంశాలను చేర్చాలని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే అప్పటివరకు 5 శాతమే ఉన్న ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా 15 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అమలుకు నోచుకోని ఉత్తర్వులు.. హైకోర్టు సూచించిన మేరకు 66, 74 జీవోలకు సవరణ చేస్తూ ప్రభుత్వం.. 2014 ఆగస్టు 14న జీవో 13ను జారీ చేసింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశం ఇక్కడ లేకుండాపోయింది. దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, దానిని అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే ఆన్లైన్ విధానాన్ని మళ్లీ తెచ్చేందుకు చర్యలు చేపట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డుకట్ట.. కోర్టు తీర్పులు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా సీట్లు అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆధారం లేకుండా ఏ చర్యలు చేపట్టే అవకాశం లేదు. రెండు రకాల ఫీజుల విధానంతో అడ్డగోలు వసూళ్లను అడ్డుకోవచ్చు. కన్వీనర్ కోటా ఫీజు కంటే యాజమాన్య కోటా ఫీజు కొంత పెంచి, కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తే పారదర్శకత ఉంటుంది. తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ అలా చేస్తే అభ్యంతరం లేదు.. రెండు రకాల ఫీజుల విధానం తెస్తే మాకేమీ అభ్యంతరం లేదు. సీట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు పోతాయి. సీట్ల భర్తీ వ్యవహారం కూడా కన్వీనరే చేస్తారు కనుక మాపై భారం తగ్గుతుంది. అయితే కన్వీనర్ కోటా కంటే యాజమాన్య కోటా ఫీజు రెట్టింపు ఉండేలా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ విధానాన్ని తెస్తే స్వాగతిస్తాం.. – గౌతంరావు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్ -
డిగ్రీ, పీజీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. బుధవారం పాపిరెడ్డి ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ గతంలో ఒక రూమ్ లో 40 మందిని కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించే వాళ్ళమని, ఇప్పుడు 20 మంది మాత్రమే కూర్చొని పరీక్ష రాస్తారని అన్నారు. ప్రతి విద్యార్థికి మద్యలో ఒక బెంచ్ ఖాళీగా వుంటుందని, అయితే ఇన్విజిలేటర్లు మాత్రం బయటి నుంచి వస్తారని, సాధ్యమైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు పరీక్ష రాయలేని వాళ్లకు అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని, సర్టిఫికేట్లో మాత్రం రెగ్యులర్ అనే వస్తుందని పేర్కొన్నారు. కాగా ప్రతి విద్యార్థి మాస్క్ ధరించి పరీక్షకు హాజరవ్వాలని ఇప్పుడు మాత్రం చివరి సంవత్సర విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 6 యూనివర్సిటీలలో రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఒక వేళ బ్యాక్ లాగ్స్ వుంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు ఎంసెట్ రాయలేని వారి గురించి ప్రభుత్వ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పాపిరెడ్డి స్ఫష్టం చేశారు. -
రోజుకు 3 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం సమా వేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపై చర్చించారు. ముం దుగా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించాలని, భౌతిక దూరం పాటిం చేలా, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రోజుకు మూడు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చింది. ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రంలోగా రెండు గంటలకో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాక, వెనువెంటనే ద్వితీయ, ప్రథమ సంవత్సరాలకు సెమిస్టర్, బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణ యానికి వచ్చింది. దీనిపై సమగ్ర ప్రణా ళికతో త్వరలోనే వర్సిటీలకు స్పష్టమైన ఆదే శాలు జారీ చేయాలని భావిస్తోంది. జూన్ 20 నుంచి వర్సిటీలు పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయాన్ని రెండు గంటలకే తగ్గించాలని, డిటెన్షన్ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని ఇదివరకే విద్యామండలి ఆదేశించింది. అందుకు అనుగుణంగా వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతుందని గురుకుల విద్యాలయాల కార్యదర్శి లేఖ రాయగా దానిపైనా చర్చించారు. -
అన్ని ఎంట్రెన్స్ టెస్టులు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి అధికారికంగా వాయిదా వేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఆదివారం ప్రకటించింది. వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ను ఈనెల 30వ తేదీ వరకు పొడగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 5వ తేదీ వరకు ఆయా సెట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ముందస్తు షెడ్యూలు ప్రకారం మే 2వ తేదీన ఈసెట్, 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్, మే 13 నుంచి పీఈసెట్, మే 20, 21 తేదీల్లో, 23వ తేదీన ఎడ్‌సెట్, 27వ తేదీన లాసెట్, 28నుంచి 31వ తేదీ వరకు పీజీ ఈసెట్ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. మళ్లీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి ప్రకటన చేస్తామన్నారు. -
పరీక్షలకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 21న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో దరఖాస్తులను ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు స్వీకరించాలని నిర్ణయించింది. బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసే అభ్యర్థికి 2020 జూలై 1వ తేదీ నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. దాంతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డీపీఈడీ కోర్సులకు ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న వారు, ఇంటర్ పూర్తయిన వారు ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 జూలై 1వ తేదీ నాటికి సదరు విద్యార్థికి 16 ఏళ్లు నిండి ఉండాలి. మే 13వ తేదీ నుంచి నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు రూ.800 పరీక్ష ఫీజును, ఎస్సీ, ఎస్టీలైతే రూ.400 పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలను https:// pecet.tsche.ac.in వెబ్సైట్లో పొందవచ్చు. మే 28 నుంచి పీజీఈసెట్ ఎంఈ/ఎంటెక్/ఎం.ఆర్క్/ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4వ తేదీన జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఆన్లైన్ దరఖాస్తులను వచ్చే నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో మే 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. పరీక్షలను మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు దఫాలుగా ఆన్లైన్లో పరీక్షలను నిర్వహించనుంది. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 28న ఉదయం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ను నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్‌కు పరీక్ష ఉంటుంది. 29న ఉదయం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీకి పరీక్ష ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుంది. 30న ఉదయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్‌కు, అదేరోజు మధ్యాహ్నం సివిల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీకి పరీక్ష నిర్వహిస్తారు. 31వ తేదీన ఉదయం ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, మధ్యాహ్నం నానో టెక్నాలజీకి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, మల్టిఫుల్ చాయిస్ జవాబులుంటాయి. ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర వివరాలను https://www.pgecet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్సైట్లో పొందవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000గా సెట్ కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. -
ఓరియంటల్ విద్యార్థులకు ఎడ్‌సెట్
సాక్షి, హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 20న జారీ చేయాలని, 24వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎడ్‌సెట్ రాసేందుకు ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఓరియంటల్ కాలేజీల్లో బీఏ (లాంగ్వే జెస్) చేసిన వారిని పండిట్ కోర్సులకే పరిమితం చేయగా, ఇకపై వారు బీఎడ్ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎడ్‌సెట్ నిబంధనల్లో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఆన్లైన్లో (https: //edcet.tsche.ac.in) ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. రూ.650 పరీక్ష ఫీజు గా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు మాత్రం రూ.450గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్ పరీక్షను మే 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఫలితాలను జూన్ 11వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. 14 రీజనల్ సెంటర్ల ఏర్పాటు.. ఇక ఎడ్‌సెట్ పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 14 రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నర్సంపేట్, నిజామాబాద్, ఖమ్మం, సత్తుపల్లి, కోదాడ, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, విజయవాడ, కర్నూల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను, అర్హతలు, సిలబస్, మోడల్ పేపర్లను తమ వెబ్సైట్లో పొందవచ్చని వివరించారు. -
మే మొదటి వారంలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. ఈనెల 24న మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. 2020 మే మొదటి వారంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర పరీక్షలను ఈ సారి కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. -
పీజీఈసెట్‌లో 88.27% అర్హత
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్–డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 19 రకాల సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా టాపర్ల వివరాలను వెల్లడించారు. ఈ ఫలితాలను https://pgecet.tsche.ac.in వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. గత నెల 28 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20,415 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 17,722 మంది హాజరయ్యారని చెప్పారు. వారిలో 15,644 మంది (88.27 శాతం) అర్హత సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల ప్రవేశా ల్లో ముందుగా గేట్, జీప్యాట్‌లో అర్హ త సాధించిన వారికి ప్రవేశాలు కల్పిస్తామని, ఆ తర్వాత పీజీఈసెట్ వారి కి ప్రవేశాలుంటాయని ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం తెలిపారు. జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్.. ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జూలైలో ఉంటుందని పీజీఈసెట్ కన్వీనర్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరుకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ప్రవేశాల కమిటీ సమావేశమై కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పీఈసెట్–2019 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులైన డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ పీఈసెట్–2019 ఫలితాలు విడుదలయ్యాయి. డీపీఈడీలో టాప్ 10 ర్యాంకులను బాలికలు కైవసం చేసుకోగా, బీపీఈడీలో టాప్ 10లో ఒక్కటి మినహా మిగతా ర్యాంకులను బాలికలే సాధించారు. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు ఫలితాలను వెబ్సైట్లో (https://pecet.tsche.ac.in/) అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్ జూన్ నెలాఖరులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి 21 వరకు, 24 నుంచి 26 వరకు నిర్వహించిన సెట్లో డీపీఈడీ ఫిజికల్ టెస్టులకు హాజరయ్యేందుకు 2,567 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1,819 మంది హాజరయ్యారు. వారితో 1,798 మంది అర్హత సాధించారు. బీపీఈడీ కోర్సులో చేరేందుకు 3,111 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,115 మంది ఫిజికల్ టెస్టులకు హాజరు కాగా 2,038 మంది అర్హత సాధించారు. ఎంజీ వర్సిటీలో రంజీ మ్యాచ్‌లు.. మహాత్మాగాంధీ(ఎంజీ) యూనివర్సిటీలో రంజి ట్రోఫీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ వెల్లడించారు. మరింతగా క్రీడా వసతులను అభివృద్ధి చేసేందుకు గాను రూ.10 లక్షల గ్రాంటు ఇచ్చేందుకు పాపిరెడ్డి అంగీకరించారని తెలిపారు. ఈసారి పీఈసెట్ పరీక్షకు జాతీయ స్థాయి క్రీడాకారులతోపాటు నలుగురు అంతర్జాతీయ క్రీడాకారులు హాజరైనట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ సహకారంతో పీఈసెట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు తెరలేచింది. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే అడ్మిషన్లకు సంబంధించి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సంస్థ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తదితరులు బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని 1,049 డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్ డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ నెల 23 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. మీ సేవ, ఈ సేవ, ఆధార్ ఫోన్ లింకైన మొబైల్, హెల్ప్‌లైన్ కేంద్రాల్లో https://dost.cgg.gov.in/ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలు.. విద్యార్థుల సందేహాల నివృత్తి, సాంకేతిక సహకారం తదితర అంశాల కోసం దోస్త్ కమిటీ 75 హెల్ప్‌లైన్ కేంద్రాలను ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో.. మరో 7 కేంద్రాలను వర్సిటీల్లో ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 10 ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. బయోమెట్రిక్ (వేలిముద్రలు) అథెంటికేషన్ సమస్య ఉంటే ఇక్కడ ఐరీస్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కాలేజీకి వెల్లకుండానే సీటు కన్ఫర్మేషన్ ఈసారి సీటు కన్ఫర్మేషన్ కోసం కాలేజీకి వెళ్లకుండా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ను తెచ్చారు. నేరుగా తరగతులు ప్రారంభమయ్యే నాడే కాలేజీలో రిపోర్టు చేయొచ్చు. ఫీజుల చెల్లింపునంతా ఆన్లైన్లో చేయాలి. ఎంపిక చేసుకున్న కాలేజీకి ఈ వివరాలను సమర్పి ంచాలి. దరఖాస్తు అప్పుడే విద్యార్థి ద్వితీయ భాష వివరాలుంటాయి. కొత్త యాప్.. ఈసారి కొత్తగా దోస్త్ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ సిస్టం ద్వారా ఇది నడుస్తుంది. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా యాప్‌ను వినియోగిచుకోవచ్చు. ఒత్తిడి చేస్తే చర్యలు: కొన్ని కాలేజీలు తమ సంస్థలోనే అడ్మిషన్లు తీసుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు గతేడాది పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అలాంటివాటిని ఉపేక్షించం. ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి ఆ కాలేజీని దోస్త్ నుంచి తొలగిస్తాం. ఈసారి 27 కాలేజీలు దోస్త్‌లో లేవు. మరో 20 మైనార్టీ కాలేజీలు సొంతంగా ప్రవేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. - తుమ్మల పాపిరెడ్డి, టీఎస్సీహెచ్ఈ చైర్మన్ -
సులభంగా ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌లో ప్రశ్నల సరళి గతంలో పోల్చితే ఈసారి సులభంగానే ఉందని సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌లో గతంలో కంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ సులభంగానే ఉందని, గణితంలో మాత్రం కొన్ని ప్రశ్నలు విద్యార్థులను కొద్దిగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నట్లు తెలిపారు. అయితే గణితంలో 55వ ప్రశ్న నుంచి 65వ ప్రశ్న వరకు 10 ప్రశ్నలు కాస్త ఎక్కువ ఆలోచిస్తే జవాబు రాసేలా ఉండగా, 10వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు ఐదు ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎంసెట్ 2019 పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలోని మొదటి రోజు పరీక్ష సెట్ కోడ్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి డ్రా తీసి ఎంపిక చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, పరీక్షలు జరుగతున్న తీరును పరిశీలించారు. 83 కేంద్రాల్లో పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు రాష్ట్రంలోని 83 పరీక్ష కేంద్రాల్లో 25,023 మంది విద్యార్థులకు 23,543 మంది (94.1 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన పరీక్షకు 24,174 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 22,807 మంది (94.4 శాతం) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం జరిగిన పరీక్ష రాసేందుకు 3,480 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 2,715 మంది (78.1 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 4,229 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 3,315 మంది (78.4 శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 1,42,218 మందికి మొదటి రోజు 56,906 మందికి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయగా, 52,380 మంది హాజరయ్యారు. మిగిలిన వారికి ఈ నెల 4, 6 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య పేర్కొన్నారు. -
నేటి నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరగునున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులను 2 గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. -
మే 3 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిగ్రీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్–2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. శనివారం జేఎన్టీయూహెచ్లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మే 3నుంచి ఆన్లైన్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం టీఎస్టీఎస్, టీసీఎస్ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 పరీక్ష జోన్లుగా విభజించి 54 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, తెలంగాణలో 15 జోన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 3 జోన్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆన్లైన్లో మాక్ టెస్ట్‌కు అవకాశం కల్పించామని, ఇందుకు సెట్ వెబ్సైట్ చూడాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్షా కేంద్రాలను ఖరారు చేస్తామని పాపిరెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహిస్తామని, ప్రస్తుతం ప్రకటించిన పరీక్షల తేదీల్లో ఎన్నికల తేదీలు ఉంటే వాటిని మార్చే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి మరో 10 వేల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదీ ఎంసెట్ షెడ్యూల్... ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06–03–2019 దరఖాస్తుల స్వీకరణ గడువు: 05–04–2019 దరఖాస్తులో తప్పుల సవరణ: 06–04–2019 నుంచి 09–04–2019 రూ. 500 అపరాధ రుసుముతో గడువు: 11–04–2019 రూ. 1000 అపరాధ రుసుముతో గడువు: 17–04–2019 ఆన్లైన్లో హాల్‌టికెట్లు జనరేట్ అయ్యే తేదీ: 18–04–2019 హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం తేదీ: 20–04–2019 హాల్‌టికెట్ల డౌడ్‌లోడ్‌కు చివరి తేదీ: 01–05–2019 రూ. 5,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 24–04–2019 రూ. 10,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 28–04–2019 పరీక్ష తేదీలు: ఇంజనీరింగ్ స్ట్రీమ్- మే 3, 4, 6 అగ్రికల్చర్, ఫార్మసీ- మే 8, 9 పరీక్ష సమయం: మార్నింగ్ సెషన్: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫ్టర్నూన్ సెషన్: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు: కేటగిరీ ఫీజు వివరాలు ఇంజనీరింగ్ ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800 అగ్రికల్చర్, ఫార్మసీ ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800 రెండు కేటగిరీలకు ఎస్సీ, ఎస్టీలకు రూ. 800, ఇతరులకు రూ. 1,600 -
మార్చి 15 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్–2019కి వచ్చే నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని లాసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన లాసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశాల షెడ్యూలును ఖరారు చేసింది. మే 20న ఉదయం 10 నుంచి 11:30 వరకు ఆన్లైన్లో ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 10న జారీ చేయనుంది. సిలబస్, అర్హతలు, ప్రాంతీయ కేంద్రాలపై చర్చించింది. ఎల్ఎల్బీ పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా నిర్ణయించింది. పీజీ లా పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.800, ఇతరులకు రూ.1,000గా నిర్ణయించింది. వివరాలను https://lawcet.tsche.ac.in లో పొందవచ్చని వివరించింది. సమావేశంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, మండలి కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి పాల్గొన్నారు. -
మార్చి 13 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్‌కు ఆన్లైన్లో దరఖాస్తులను మార్చి 13 నుంచి స్వీకరించాలని టెస్టు కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మే 28 నుంచి 31 వరకు ప్రతి రోజూ రెండు దఫాలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 129 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో, 96 కాలేజీల్లో ఎంఫార్మసీ కోర్సులో, 14 కాలేజీల్లో ఫార్మ్–బీ (పీబీ) కోర్సులో, 3 కాలేజీల్లో మాస్టర్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 1000గా (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500) నిర్ణయించారు. 120 ప్రశ్నలతో 2 గంటల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 6న జారీ చేయనున్నారు. పూర్తి వివరాలను http://pgecet.tsche.ac.in, http:// www.tsche.ac.in వెబ్సైట్లలో పొందవచ్చు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, టెస్టు కమిటీ చైర్మన్ ఎస్.రామచంద్రం, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, సెట్ కన్వీనర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూలు వివరాలు.. 13–3–2019 నుంచి దరఖాస్తుల స్వీకరణ 30–4–2019 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 25–5–2019 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ 22–5–2019 నుంచి 27–5–2019 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్. -
జనవరి తొలి వారంలో సెట్స్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌ను జనవరి మొదటి వారంలో ప్రకటించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా షెడ్యూల్‌ను ఖరారు చేయాలని భావించినా ఈ నెల 22న నిర్వహించాల్సిన వైస్ చాన్స్లర్ల సమావేశం వాయిదా పడటంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌పై చర్చించలేదు. జనవరి మొదటి వారంలో వాటిపై చర్చించి పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ నెలాఖరు నుంచే ప్రారంభించేలా షెడ్యూల్ తయారీ కోసం కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా తేదీలతోపాటు పండుగ రోజలనుమినహాయించి ఇతర తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆయా సెట్స్‌కు కన్వీనర్లను నియమించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, పీజీ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, న్యాయ విద్యా కోర్సుల్లో చేరాలనుకునే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రవేశపరీక్షల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. 28 లేదా 29న ఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్ వివిధ వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు ఫీజల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నోటిఫికేషన్ ఈ నెల 28 లేదా 29న జారీ అయ్యే అవకాశం ఉంది. గత వారమే నోటిఫికేషన్ జారీ చేయాలని ఏఎఫ్ఆర్సీ భావించినా ఆన్లైన్ ప్రాసెస్ చేసే సంస్థ ఖరారులో జాప్యం కావడంతో నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. కాలేజీ యాజమాన్యాల నుంచి మూడేళ్ల ఆదాయ వ్యయాలు, కొత్త ఫీజుల ప్రతిపాదనలను ఆన్లైన్లో స్వీకరించే పనులను గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేయగా ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్ఐసీ అధికారులతో చర్చించి ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులను స్వీకరించేందుకు తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 28 లేదా 29న ఖరారు అయ్యే అవకాశం ఉందని పాపిరెడ్డి తెలిపారు. -
10% పెరుగుతుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపు ఉండే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లపాటు (2016–17 నుంచి 2018–19వరకు) అమలు చేసిన ఫీజల గడువు ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఫీజుల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే మూడేళ్లకు (2019–20 నుంచి 2021–22 వరకు) ఫీజులను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ఇటీవల లేఖ రాసింది. దానిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓకే చెప్పారు. దీంతో యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఉన్నత మండలి షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. బుధవారం లేదా గురువారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సభ్య కార్యదర్శి పేరుతో ఆ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శే టీఏఎఫ్ఆర్సీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నం దున, ఆయన ఓకే చెప్పిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం అయింది. గతంలో ఫీజులు ఖరారు చేసినప్పుడు యాజమాన్యాల నుంచి దరఖా స్తులను స్వీకరించేందుకు దాదాపు రెండు నెలల గడువు ఇచ్చారు. అయితే ఇప్పుడు అంత గడువు ఇచ్చే పరిస్థితి లేదు. మే/జూన్ నెలల్లో ప్రవేశాలు చేపట్టే నాటికి ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఆలోగా ఫీజులు ఖరారు కాకపోతే ప్రవేశాలు చేపట్టే వీలుండదు. ప్రవేశాల సమయం లో కాలేజీ వారీగా, కోర్సు వారీగా ఫీజులను నిర్ణయించి, వెబ్సైట్లో అందు బాటులో ఉంచితేనే విద్యార్థులు వాటిని చూసి, కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కామన్ ఫీజు పెంచితే భారమే! ఫీజుల పెంపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వద్దనుకుంటే పాత ఫీజులనే కొనసాగించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆదాయ వ్యయా లు ఇవ్వకుండా కామన్ ఫీజు రూ.35 వేలు మాత్రం అలాగే కొనసాగించే అవకాశం ఉంది. దానిని పెంచితే ప్రభుత్వంపై భారం పడుతుంది కాబట్టి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కోర్టును ఆశ్రయించి ఫీజును పెంచుకున్న కాలేజీల విషయంలో కొత్తగా ఫీజు పెంపు ఉండకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వాటికి సంబంధించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కేసు ఉన్నందున, ఆ కేసు తేలేవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే వీల్లేదని చెబుతున్నారు. వచ్చే మూడేళ్లకు ఫీజులను నిర్ణయించేందుకు చర్యలు చేపట్టినం దునా ఆయా కాలేజీల నుంచి వచ్చే మూడేళ్ల కోసం ఇప్పుడు దరఖాస్తులను తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించాలని మండలి అధికారులు భావిస్తున్నారు. ముగిసిన టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ పదవీకాలం.. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ పదవీకాలం కూడా రెండు నెలల కిందటే ముగిసినందున ఇప్పుడు కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. అందుకోసం ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ జడ్జీల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించాల్సి ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇప్పుడు దానిపై దృష్టిసారించి, పేర్లను పంపించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఈలోగా కాలేజీ నుంచే మూడేళ్ల ఆదాయ వ్యయాలపై ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులను స్వీకరించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. వీలైతే బుధ లేదా గురువారం ఆ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. కాలేజీల నుంచి వచ్చే దరఖాస్తులను టీఏఎఫ్ఆర్సీ కొత్త చైర్మన్ వచ్చాక ఆయన ముందుంచితే కమిటీ మొత్తం కూర్చొని ఆదాయ, వ్యయాల పరిశీలన, ఫీజుల ఖరారు ప్రక్రియను చేపడుతుందని వెల్లడించారు. -
‘ఉన్నత విద్యలో బెస్ట్ ప్రాక్టీసెస్ అంశంపై సదస్సు’
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా రంగంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అంశంపై ఆగస్టు 31న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మంగళవా రం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ...తాజ్ వివంతాలోని ఇంపీరియల్ హాల్లో నిర్వహించబోయే సదస్సులో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కవిత, యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బి హడ్డా, బిజినెస్ వరల్డ్ చైర్మన్ అనురాగ్ బాత్రా, ఐఐఎం లక్నో మాజీ డైరెక్టర్ పద్మశ్రీ ప్రీతం సింగ్లతోపాటు విద్యావేత్తలు పాల్గొంటారని చెప్పారు. ఉన్నత విద్యా రంగంలో ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనే అంశంపై సెమినార్ జరుగుతుందని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులపై చర్చించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే పరిశ్రమలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు తెస్తున్నామని, ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశామని చెప్పారు. అన్ని కాలేజీలు, విశ్వ విద్యాలయాలకు వెళ్లి స్టార్టప్‌లపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సెప్టెంబర్ 15న స్టార్టప్ యాత్రను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
పీహెచ్డీ స్థాయిని దిగజార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) సాధారణ డిగ్రీ కాదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఓ పరిశోధన. అలాంటి పీహెచ్డీ స్థాయిని దిగజార్చవద్దు. కొన్ని యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. అడ్డగోలుగా ప్రవేశాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టండి’’ అని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లను గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. ‘‘ఇప్పటివరకు ఏ యూనివర్సిటీ ఎన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది, ప్రస్తుతం ఏ యూనివర్సిటీలో ఎంతమంది పీహెచ్‌డీలు చేస్తున్నారు, వారు ఎన్నేళ్లుగా చేస్తున్నారు’’అన్న సమగ్ర వివరాలను సేకరించి తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డికి సూచించారు. నాలుగైదేళ్లకు మించి పీహెచ్‌డీకి సమయం ఇవ్వడానికి వీల్లేదని, ఐదేళ్లు దాటిన వారి ప్రవేశాలను రద్దు చేయాలని, అలాంటి వారు ఎందరు ఉన్నారో తేల్చాలని వైస్ చాన్స్లర్లను ఆదేశించారు. పీహెచ్డీ ప్రవేశాలను కూడా నెట్, స్లెట్ ప్రతిభ ఆధారంగా చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీల పనితీరుపై వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లతో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి గవర్నర్ సమీక్షించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు.. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీలు ఒకే రకమైన నిబంధనలు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని సహించబోనని గవర్నర్ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిబంధనల ప్రకారమే ప్రవేశాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో బాలికలపై ఆకృత్యాలు జరక్కుండా పక్కా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా హాస్టళ్ల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వారికి భద్రత కల్పించాలని సూచించారు. మహిళా ప్రొఫెసర్ నేతృత్వంలో కమిటీ, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. సంతృప్తిగా ఉన్నా సమీక్ష అనంతరం గవర్నర్ నరసింహన్ విలేకరులతో మాట్లాడారు. ‘విశ్వవిద్యాలయాల అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’అని విలేకరులు అడగ్గా ‘చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్మెంట్ కావాలి’అని పేర్కొన్నారు. విద్యలో నాణ్యత పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని, అవి ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఇతర విద్యార్థులతో కలసి గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేయాలని వీసీలకు సూచించామని తెలిపారు. ఉన్నత విద్య పటిష్టానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కితాబిచ్చారు. సమావేశంలో చర్చించిన పలు అంశాలను కడియం వెల్లడించారు. ప్రస్తుతం పీహెచ్డీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొందని, నెట్, స్లెట్, సెట్లలో మెరిట్ సాధించిన వారికే యూజీసీ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గైడ్స్ సమర్థతను పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ సూచించారని చెప్పారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలాంటి కాలేజీలపై దయాదాక్షిణ్యాలు వద్దు యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులు సమాజానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో సమీక్షించి తగిన మార్పులు చేయాలని గవర్నర్ సూచించారు. అవి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేలా ఉండాలన్నారు. బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగే కాలేజీల్లో పక్కాగా నాణ్యత ప్రమాణాలు ఉండాల్సిందేనని, నాణ్యత ప్రమాణాలు లేని, మెరుగైన విద్యను అందించని కాలేజీలపై దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని, అలాంటి వాటిని మూసేయాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ద్వారా యూనివర్సిటీలు తమ సేవలను అందించి నిధులను సమీకరించుకోవాలన్నారు. వచ్చే ఏడాది విద్య, వైద్యానికి ప్రభు త్వం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించనుందని పేర్కొన్నారు. న్యాక్ గుర్తింపు, 12 ఎఫ్, 12బీ స్థాయి కోసం అన్ని యూనివర్సిటీలు కృషి చేయాలని ఆదేశించారు. కామన్ అకడమిక్ కేలండర్ అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి యూజీసీ తరహాలో వ్యవహరించాలని సూచించారు. ఆర్జీయూకేటీ, వెటర్నరీ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. -
‘డిగ్రీ రెండో దశ’లో 70 వేల సీట్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌లో 70,925 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 1.21 లక్షల మంది విద్యార్థులకు సీట్లను కేటాయించగా, 80,678 మంది కాలేజీల్లో రిపోర్టు చేశారని పేర్కొన్నారు. మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో డిగ్రీ రెండో విడత సీట్ల కేటాయింపును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ నెల 20 నుంచి 25 వరకు కొత్తగా రిజిస్టర్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. మొదటి, రెండో విడతలో మొత్తం 1,51,603 మందికి సీట్లను కేటాయించగా, ఇంగ్లిష్ మీడియంలో 1,25,885 మందికి, తెలుగు మీడియంలో 24,766 మందికి, అరబిక్‌లో ఒకరికి, ఉర్దూలో 937 మందికి, హిందీలో 14 మందికి సీట్లను కేటాయించినట్లు తెలిపారు. కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ఎంసెట్ తరహాలో వచ్చే ఏడాది ఆన్లైన్ రిపోర్టింగ్ విధానం అమల్లోకి తెస్తామన్నారు. ఈసారి మొదటి దశలో మొదటి ఆప్షన్‌తో సీట్లు పొందిన వారికి మళ్లీ అవకాశం ఇచ్చేది లేదన్నారు. 44 డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, 188 కాలేజీల్లో 25 మందిలోపే విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. 386 కాలేజీల్లో 50 మందిలోపు, 584 కాలేజీల్లో 100 మందిలోపు విద్యార్థులు చేరారన్నారు. కాలేజీల్లో చేరిన వారికి వచ్చే నెల 2 నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొదటి విడతలో 17,445 సీట్లు, రెండో విడతలో 19,046 సీట్లు కేటాయించామన్నారు. కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌లలో ప్రభుత్వ కాలేజీలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ ఆన్లైన్ ప్రవేశాల నుంచి ఎవరైనా ఎగ్జిట్ అయితే స్లైడింగ్‌కోసం చెల్లించిన ఫీజును తిరిగి వారికి ఇస్తామన్నారు. -
లా కాలేజీల్లో పెరిగిన సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లా కాలేజీల్లో సీట్లు పెరిగాయి. గతేడాది రాష్ట్రంలోని 21 కాలేజీల్లో 4,322 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 4,712కు పెరిగాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్–2018 ఫలితాలను గురువారం ఆయన విడుదల చేశారు. అన్ని ప్రవేశ పరీక్షల్లో సీట్లు ఎక్కువగా, అభ్యర్థులు తక్కువగా ఉన్నారని, లాసెట్‌లో మాత్రం సీట్లు తక్కువగా ఉంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం లాసెట్‌లో 15,793 మంది అర్హత సాధించారని తెలిపారు. లాసెట్‌కు 23,109 మంది దరఖాస్తు చేశారని, వారిలో 18,547 మంది రాత పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. మూడేళ్ల లా కోర్సుకు 16,332 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 12,960 రాత పరీక్ష రాయగా, 11,563 మంది అర్హత సాధించారన్నారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,580 మంది దరఖాస్తు చేసుకుంటే, 3,727 మంది రాత పరీక్షకు హాజరయ్యారని, 2,401 మంది అర్హత సాధించారన్నారు. పీజీ లా కోర్సుకు 2,197 మంది దరఖాస్తు చేసుకోగా, దాంట్లో 1,860 మంది హాజరైతే 1,829 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్‌రావు, లాసెట్ కన్వీనర్ ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పీజీఈసెట్‌లో 89 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పీజీఈసెట్)లో 89.62 శాతం మంది అర్హత సాధించారు. మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్ష రాసేందుకు 25,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 22,461 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 20,131 మంది (89.62 శాతం) అర్హత సాధించారు. దరఖాస్తు చేసిన వారిలో బాలికలు 11,223 మంది, బాలురు 11,238 మంది ఉన్నారు. 17 రకాల కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్ రాత పరీక్షలు జరిగాయని, ఇందులో 16 కోర్సులు ఇంజనీరింగ్, ఒకటి ఎం.ఫార్మసీ కోర్సు ఉందని పాపిరెడ్డి అన్నారు. ఓయూ వీసీ, పీజీఈసెట్ చైర్మన్ రామచంద్రం మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో 168 ఇంజనీరింగ్ కాలేజీల్లో 8,374 సీట్లు ఉన్నాయని, వాటిలో 7,523 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఈ విద్యా సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మైనింగ్ కోర్సును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎంటెక్ మైనింగ్‌లో 18 సీట్లుంటాయన్నారు. తగ్గుతున్న విద్యార్థులు.. ఈ విద్యా సంవత్సరం పీజీ ఇంజనీరింగ్ సీట్లు తగ్గే అవకాశం ఉందని, కోర్సును శ్రద్ధగా చదవాలనుకునే విద్యార్థులే చేరుతున్నారని పాపిరెడ్డి వివరించారు. నిరంతర తనిఖీలు, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, పరీక్షలు రాయాలంటే హాజరు శాతం తప్పనిసరి చేయడం వంటి కారణాలతో పీజీఈసెట్‌కు దరఖాస్తు చేసే వారి సంఖ్య ఏటా తగ్గుతోందన్నారు. 2015 విద్యా సంంవత్సరంలో 48,992 మంది దరఖాస్తు చేసుకోగా, 2016 విద్యా సంవత్సరంలో 44,058 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఇక 2017 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 37,423 మంది దరఖాస్తు చేసుకున్నారని, 2018 విద్యా సంవత్సరంలో 25,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. భవిష్యత్తులో సివిల్ ఇంజనీరింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని పాపిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు, పీజీఈసెట్ కన్వీనర్ సమీనా ఫాతిమా, కో కన్వీనర్ రమేశ్‌బాబు, లాసెట్ కన్వీనర్ ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘గుర్తింపు’నిచ్చేది విద్యార్థులే..!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ కౌన్సి ల్ (న్యాక్) ఇచ్చే గుర్తింపులో విద్యార్థుల అభిప్రాయాలు కీలకం కానున్నాయని, వారి ప్రకారం అన్నీ బాగుంటేనే గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా మం డలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీని ప్రకారమే భవిష్యత్తులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం అవసరమైన మార్పులు చేస్తోందని చెప్పారు. అందుకనుగుణంగా రాష్ట్రం లోని విద్యా సంస్థలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ప్రవేశపెట్టిందని వివరించారు. రాష్ట్రంలోని వర్సిటీలు, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు వరల్డ్ ర్యాంకింగ్ పొందేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ ప్రతినిధులు, రాష్ట్ర వర్సిటీల వీసీలు, డీన్స్, సీనియర్ ప్రొఫెసర్లతో వర్క్‌షాప్ జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్‌సింగ్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ విద్య కమిషనర్ అశోక్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొ.వెంకటరమణ, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ లీడ్ నిక్కీ హార్సెమన్, సౌత్ ఏసియా రీజనల్ డైరెక్టర్ రితిన్ మల్హోత్ర, అమెరికా కాన్సులేట్ కాన్సులర్ సెక్షన్ చీఫ్ డొనాల్డ్ ములిగాన్ పాల్గొన్నారు. టీచింగ్, పరిశోధనలు, పరిశ్రమలు, నిధులు, ఆవిష్కరణలు, వరల్డ్ ఔట్లుక్ వంటి 5 కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇస్తున్నట్లు టైమ్స్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉస్మానియా వంటి వర్సిటీలు 800కుపైగా ర్యాంకింగ్‌లో ఉండటానికి కారణం అధ్యాపకుల కొరతతో పరిశోధనలు లేకపోవడమేనని అన్నారు. ఈ లోపాలను సవరించుకుంటే మంచి ర్యాంకు వస్తుందని సూచించారు. -
మే 7వ తేదీలోగా ఇంజనీరింగ్ కాలేజీల జాబితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈసారి మే నెలలోనే ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా జూన్‌లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసి జూలై ఒకటి నుంచే తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. మొత్తానికి మే నెలాఖరులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను మే 7వ తేదీలోగా అందజేయాలని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి సూచించారు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలలో తనిఖీలు, అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు యూనివర్సిటీలు చర్యలు చేపట్టాయి. ఇక ఎక్కువ కాలేజీలు కలిగిన జేఎన్టీయూ మే 5వ తేదీనాటికే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అనుబంధ గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) నేతృత్వంలో తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం ఆ తనిఖీలు పూర్తి కావచ్చాయి. వాటి ఆధారంగా కాలేజీలకు వసతులు, సదుపాయాలు, ఫ్యాకల్టీని అనుబంధ గుర్తింపును ఖరారు చేయనున్నారు. అయితే గతంలో కంటే ఈసారి కాలేజీల్లో లోపాల సంఖ్య తగ్గినట్లు జేఎన్టీయూ ఉన్నతాధికారులు గుర్తించారు. గతంలో ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ వంటి అంశాల్లో అనేక లోపాలు ఉండేవని, ఈసారి అలాంటి లోపాలు ఉన్న కాలేజీల సంఖ్య భారీగా తగ్గిందని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని కాలేజీల్లో మాత్రం చిన్నచిన్న లోపాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ప్రస్తుతం కాలేజీ యాజమాన్యాల్లోనూ మార్పువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 11 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకోగా, మరో 8 ఇంజనీరింగ్ కాలేజీలు 11 రకాల బీటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. 28 ఎంటెక్ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాంచీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. దీంతో వాటిల్లో సీట్లు భారీగా తగ్గనున్నాయి.