‘డిగ్రీ రెండో దశ’లో 70 వేల సీట్లు  | 70 thousand seats in Degree Second stage counseling | Sakshi
Sakshi News home page

‘డిగ్రీ రెండో దశ’లో 70 వేల సీట్లు 

Published Wed, Jun 20 2018 1:14 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

70 thousand seats in Degree Second stage counseling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌లో 70,925 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 1.21 లక్షల మంది విద్యార్థులకు సీట్లను కేటాయించగా, 80,678 మంది కాలేజీల్లో రిపోర్టు చేశారని పేర్కొన్నారు. మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో డిగ్రీ రెండో విడత సీట్ల కేటాయింపును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులు ఈ నెల 20 నుంచి 25 వరకు కొత్తగా రిజిస్టర్‌ చేసుకుని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు.

మొదటి, రెండో విడతలో మొత్తం 1,51,603 మందికి సీట్లను కేటాయించగా, ఇంగ్లిష్‌ మీడియంలో 1,25,885 మందికి, తెలుగు మీడియంలో 24,766 మందికి, అరబిక్‌లో ఒకరికి, ఉర్దూలో 937 మందికి, హిందీలో 14 మందికి సీట్లను కేటాయించినట్లు తెలిపారు. కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ఎంసెట్‌ తరహాలో వచ్చే ఏడాది ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ విధానం అమల్లోకి తెస్తామన్నారు. ఈసారి మొదటి దశలో మొదటి ఆప్షన్‌తో సీట్లు పొందిన వారికి మళ్లీ అవకాశం ఇచ్చేది లేదన్నారు. 44 డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, 188 కాలేజీల్లో 25 మందిలోపే విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. 386 కాలేజీల్లో 50 మందిలోపు, 584 కాలేజీల్లో 100 మందిలోపు విద్యార్థులు చేరారన్నారు.

కాలేజీల్లో చేరిన వారికి వచ్చే నెల 2 నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొదటి విడతలో 17,445 సీట్లు, రెండో విడతలో 19,046 సీట్లు కేటాయించామన్నారు. కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌లలో ప్రభుత్వ కాలేజీలకు విపరీతమైన డిమాండ్‌ ఉందన్నారు. డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ప్రవేశాల నుంచి ఎవరైనా ఎగ్జిట్‌ అయితే స్లైడింగ్‌కోసం చెల్లించిన ఫీజును తిరిగి వారికి ఇస్తామన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement