దూర విద్య.. అంతా మిథ్య! | Full of other State Varsity Study Centers are in the state | Sakshi
Sakshi News home page

దూర విద్య.. అంతా మిథ్య!

Published Sat, Jan 27 2018 4:49 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

Full of other State Varsity Study Centers are in the state - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: - ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా శ్రీనివాస్‌రెడ్డి డిగ్రీ చేశాడు. తెలంగాణ ఐసెట్‌ రాసి మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీఏలో చేరాడు. ర్యాటిఫికేషన్‌ కోసం అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యామండలికి వెళ్లగా పరిశీలించిన అధికారులు అతని సర్టిఫికెట్‌ చెల్లదని ప్రవేశాన్ని తిరస్కరించారు. 
- సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. తెలంగాణ లాసెట్‌ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు.  అతని ప్రవేశాన్నీ ఉన్నత విద్యామండలి తిరస్కరించింది.


ఇలా ఒకరు.. ఇద్దరు కాదు వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. విద్యలోనే కాదు ఉద్యోగాల్లోనూ ఇలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యామండలి తిరస్కరిస్తోంది. సుప్రీంకోర్టు, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్‌ జూరిస్‌డిక్షన్‌–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని రాష్ట్ర యూనివర్సిటీ లేదా డీమ్డ్‌ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి.. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్‌ విక్రమ్‌ సాహే లేఖ(ఎఫ్‌ఎన్‌ఓ డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. ఈ నిబంధనను తెలంగాణ ఉన్నత విద్యామండలి పక్కాగా అమలు చేస్తోంది. ఫలితంగా అనేక మంది విద్యార్థులు వివిధ కోర్సుల ప్రవేశాల్లో తిరస్కరణకు గురవుతున్నారు. దీంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రాష్ట్రంలోని స్టడీ సెంటర్ల ద్వారా 2013 తర్వాత చదివిన చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. 

50 ఇతర రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లు 
ఇతర రాష్ట్రాలకు చెందిన 50 వరకు రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య వంటి కోర్సులను దూర విద్య ద్వారా అందిస్తున్నాయి. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లోనే వేల కాలేజీల్లో ఆయా విద్యా సంస్థలు 150 కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. వాటిల్లో 2 లక్షల మంది విద్యార్థులు వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఏపీలోని ఓ స్టడీ సెంటర్‌ ద్వారా అక్కడి వర్సిటీలో చదివితే ఆ సర్టిఫికెట్‌ చెల్లుతుంది.. అదే వర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్య స్టడీ సెంటర్‌ ద్వారా చదివితే ఆ సర్టిఫికెట్‌ చెల్లుబాటు కాదు. దీనిపై ప్రచారం లేకపోవడంతో విద్యార్థులకు తెలియడం లేదు. ఇతర రాష్ట్ర వర్సిటీలు ఆదాయం కోసం ఈ విషయాన్ని దాచిపెట్టి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఉద్యోగాల్లోనూ తిరస్కరణ! 
ఇలాంటి సర్టిఫికెట్లను విద్యా ప్రవేశాల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆ సర్టిఫికెట్లను ఉద్యోగ నియామకాల విభాగాలు తిరస్కరిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటుండటంతో పలువురు అభ్యర్థులు ఉద్యోగాల్లోనూ తిరస్కరణకు గురి కావాల్సివస్తోంది. 

యూజీసీ నిబంధనల ప్రకారమే
యూజీసీ దూర విద్య, ఆఫ్‌ క్యాంపస్‌ల టెరిటోరియల్‌ జ్యూరిస్‌డిక్షన్‌ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర వర్సిటీ మరో రాష్ట్రంలో దూర విద్య కేంద్రాలను ఏర్పాటు చేసి కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. అందుకే అలా వచ్చే విద్యార్థుల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాం. ఇప్పటికైనా అలాంటి వాటిల్లో విద్యార్థులు చేరవద్దు. రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం లేని వారు తెలంగాణ రాష్ట్ర వర్సిటీల దూర విద్యా కేంద్రాల ద్వారా చదువుకోవాలి. 
– తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement