Study Centre
-
హైదరాబాద్ స్టడీ హాల్స్‌లో భద్రత కరువు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఢిల్లీ వెళ్లేవారు. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్.. ముఖ్యంగా అశోక్‌నగర్ పరిసర ప్రాంతాలు సివిల్స్ ప్రిపరేషన్‌కు అడ్డాగా మారింది. సివిల్ సర్వీసెస్‌తో పాటు గ్రూప్–1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ దినదిన గండంగా అభ్యర్థులు గడుపుతున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు యమ పాశాల్లా స్టడీ హాల్స్ చుట్టూ విద్యుత్ వైర్లు.. అగ్గిపెట్టెల్లాంటి గదులు.. ఆకతాయిల వేధింపులు.. పుస్తకాలతో పాటు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ నీటమునిగి విద్యార్థులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఇక్కడి స్టడీ హాళ్ల పరిస్థితులపై చర్చ జరుగుతోంది. అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో.. స్టడీ హాల్స్‌లో చదువుకుంటే ఏకాగ్రత ఉండదేమోనన్న బెంగతో లైబ్రరీ, స్టడీ సెంటర్లలో చాలా మంది చేరుతుంటారు. ఇదే అదునుగా వారి ఆశలను క్యాష్ చేసుకునేందుకు వీధివీధినా మూడు, నాలుగు స్టడీ హాల్స్ వెలిశాయి. అగ్గిపెట్టెల మాదిరిగా ఉన్న గదుల్లో ఇరుకుగా, గాలి వెలుతురు లేకుండా ఒక్కరిద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు, నలుగురిని కూర్చోబెడుతున్నారు. ఎండాకాలం వస్తే అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. ఏసీ స్టడీ హాల్స్ పేరిట అదనపు చార్జీలు వేస్తూ అభ్యర్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు. ఫైర్ సేఫ్టీ పాటించేదెవరు? చాలా స్టడీహాల్స్ లోపలికి ఇరుకైన మెట్ల ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి స్టడీ హాల్స్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ప్రమాదం జరిగితే తప్పించుకునే పరిస్థితులే కానరావట్లేదు. అలాంటి ప్రాంతాల్లో అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. విద్యుత్ వైర్లకు దగ్గరగా.. చాలా స్టడీ హాల్స్ లేదా లైబ్రరీలను నివాస సముదాయాల్లోనే ఏర్పాటు చేశారు. ఎక్కువగా రెండో అంతస్తులో వీటిని నడుపుతున్నారు. సాధారణంగా నివాస సముదాయాల్లో ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు నడపడం చట్ట విరుద్ధం. కొన్నింటికి ఎలాంటి బోర్డులు పెట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా గుట్టుగా నడిపించేస్తున్నారు. ఈ భవనాలకు దగ్గరి నుంచే ప్రమాదకరంగా హై వోల్టేజీ ఉన్న ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరికైనా ఆ వైర్లు తగిలితే ఎవరు బాధ్యత వహించాలన్నది పెద్ద ప్రశ్న. ఇక, కొన్ని ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను వైన్ షాపుల పక్కనే ఏర్పాటు చేశారు. అదీ మెయిన్ రోడ్డుపైనే ఇలా ఏర్పాటు చేస్తే పట్టించుకున్న వారే లేరు. వీధి లైట్లు లేక ఇబ్బందులు.. అభ్యర్థులు పొద్దుపోయే వరకు స్టడీ హాల్స్, లైబ్రరీల్లో చదువుకుని హాస్టల్ లేదా వారి గదులకు వెళ్తుంటారు. వెళ్లే దారిలో చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు లేక యువతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు రోడ్లపై అడ్డాలు వేసుకుని, వచ్చి పోయే అమ్మాయిలపై కామెంట్స్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. బైక్‌లపై వారి ముందు స్టంట్లు చేస్తున్నారు. అమ్మాయిల భద్రత గాలికి.. హాస్టళ్లలో అమ్మాయిల భద్రత గాలికొదిలేశారు. ఇటీవల ఓ అమ్మాయిల హాస్టల్లోకి దర్జాగా ఓ దుండగుడు ప్రవేశించి, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తమ చదువులకు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు, హాస్టల్‌కు చెడ్డ పేరు వస్తుందని యాజమన్యం మిన్నకుండి పోయింది. ఇక, కొత్తగా నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్ పై నుంచి పక్కనే ఉన్న భవనాల్లోకి మద్యం తాగి బాటిళ్లను విసిరేసే వారని మరికొందరు వాపోయారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చదివేకంటే ఇంటికి వెళ్లిపోవడమే ఉత్తమమని, చాలామంది అమ్మాయిలు సొంతూళ్లకు వెళ్లిపోయారు.జోరుగా గంజాయి అమ్మకాలు అశోక్ నగర్, గాంధీనగర్, హిమాయత్‌నగర్, చిక్కడపల్లిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే చదువుకునే వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం ఆకతాయిలకు అవకాశంగా మారింది. ఆంధ్ర కేఫ్ రోడ్డు, ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో చాలా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక, షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చేందుకు స్టడీహాళ్ల మధ్య ఎస్‌వోఎస్ బూత్ పోల్స్‌ను అమర్చాలని కోరుతున్నారు. దీంతో వెంటనే ఫిర్యాదు చేసి, సహాయం పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు.టౌన్‌ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలం.. నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. సెల్లార్‌ను పార్కింగ్‌కు బదులు వ్యాపార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి భవనాలు అశోక్‌నగర్‌లో కోకొల్లలు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడే హడావుడి చేయడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. -
కొలువుల కోసం ప్రత్యేక శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక సంస్థల చర్యలు వేగవంతమవడంతో అభ్యర్థులు సైతం అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒకదఫా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు మరోసారి స్వల్పకాలిక శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ వెనుకబడిన తరగతుల అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల బీసీ స్టడీ సర్కిల్ అధికారులతో ఉచిత కోచింగ్‌పై పలు రకాల సూచనలు చేశారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. జిల్లాలవారీగా స్టడీ సెంటర్లు బీసీ అభ్యర్థులకు స్వల్పకాలిక శిక్షణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. బీసీ సంక్షేమ వసతిగృహాలు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో తాత్కాలిక పద్ధతిలో తక్షణమే ఈ స్టడీ సెంటర్లను ప్రారంభించాలని మంత్రి గంగుల ఆదేశించారు. దీంతో అనువైన భవనాల లభ్యతపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. త్వరలో గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4తోపాటు గురుకుల కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే ఆ యా కేటగిరీల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీసీ అభ్యర్థులకు వారి జిల్లా కేంద్రాల్లోనే శిక్షణలు ఇచ్చేవిధంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో కూడా స్వల్పకాలిక శిక్షణ తరగతులను అతిత్వరలో నిర్వహించాలని బీసీ స్టడీ సర్కిల్ భావిస్తోంది. వారంరోజుల్లోగా కోచింగ్‌కు సంబంధించి ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది. -
‘మా అమ్మాయికి చదువు అక్కర్లేదని గొడవలకు దిగేవారు’
బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా మంచి పేరున్న హర్‌సంజమ్‌కౌర్ వృత్తి నుంచి కాస్త విరామం కోసం మౌంట్‌కైలాష్‌లో నిర్వహించిన మెడిటేషన్ క్లాస్‌లకు హాజరయ్యారు. అయితే అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ‘అంగన్’ అనే స్వచ్ఛందసంస్థతో పిల్లల చదువు నుంచి పేదల ఆకలి తీర్చడం వరకు ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కౌర్.... నిత్యజీవిత పరుగులో పరుగుకే సమయం సరిపోతుంది. కొందరు మాత్రం ఆ పరుగుకు బైబై చెప్పి నిదానంగా కూర్చొని ‘ఆత్మసమీక్ష’ చేసుకుంటారు. కొత్త వెలుగుతో కొత్త దారిలో ప్రయాణిస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తి హర్‌సంజమ్‌కౌర్. ‘కోల్‌కత్తాలో ఒక సంపన్న కుటుంబం లో పుట్టాను’.. ‘యూకేలో ఏంబీఏ చేశాను’ ‘ఇంటిరీయర్ డిజైనర్‌గా నాకు మంచిపేరుంది’... ఇలా చెప్పుకోవడంలో కౌర్‌కు ఎక్కడా తృప్తి కనిపించలేదు. ‘ఆకలితో నకనకలాడుతున్న నలుగురు అభాగ్యులను ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టాను’ అని చెప్పుకోవడంలో మాత్రం ఆమెకు గొప్ప తృప్తి లభించింది. రొటీన్ లైఫ్‌స్టైల్‌కు కాస్త విరామం ఇవ్వడానికి అన్నట్లుగా కౌర్ ‘అమ్ముకేర్’ అనే స్వచ్ఛందసంస్థ మౌంట్‌కైలాష్‌లో నిర్వహించిన మెడిటేషన్ ట్రిప్ కు వెళ్లారు. మన దేశంలోని అనేక ప్రాంతాలు, విదేశాల నుంచి అక్కడికి ఎంతోమంది వచ్చారు. ‘మీరు ఎంత సంపాదిస్తున్నారు?’ ‘ఎన్ని ఆస్తులు ఉన్నాయి?’... ఇలాంటి మాటలు అక్కడ మచ్చుకు కూడా వినిపించలేదు. క్షణభంగురమైన జీవితాన్ని వేదాంతకోణంలో దర్శించే మాటలు, పరులకు సేవ చేయడంలో లభించే ‘తృప్తి’ విలువను, ఆ శక్తి ముందుకు నడిపించే చైతన్యాన్ని విశ్లేషించే మాటలు వినిపించాయి. ‘మరి నా సంగతి ఏమిటీ?’ అని తనను తాను ప్రశ్నించుకున్నారు కౌర్. దానికి సమాధానమే ‘అంగన్’ అనే స్టడీసెంటర్. ‘అమ్ముకేర్’తో కలిసి పేదవిద్యార్థులకు ఈ స్టడీసెంటర్ ద్వారా వివిధరకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టారు కౌర్. కూలీపనులకు వెళ్లే శ్రామికులు పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళుతుంటారు. అక్కడ కూలిపని చేస్తున్న మాటే గానీ వారి మనసంతా పిల్లలపైనే ఉంటుంది. పిల్లలు ఏ ప్రమాదం కొని తెచ్చుకుంటారో అని వారి భయం. ఇది గ్రహించిన కౌర్ అలాంటి పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం, శుభ్రత, ఆరోగ్యాలను పట్టించుకోవడం ప్రారంభించారు. దీనివల్ల ఇటు పిల్లలకు, అటు తల్లిదండ్రులకు ఇద్దరికీ మేలు జరిగింది. ‘నా బిడ్డ స్కూల్లో భద్రంగా ఉన్నాడు’ అని వారిలో భరోసా వచ్చింది. ‘అంగన్’ స్టడీ సెంటర్ ద్వారా పిల్లలకు చిత్రకళ, సంగీతం లాంటివి నేర్పించారు. వారిలోని సృజనను వెలికి తీయడానికి రకరకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి భుజం తట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే కొందరు తల్లిదండ్రులు... ‘మా వాడికి చదువు ఎందుకమ్మా... ఇంకో రెండు సంవత్సరాలైతే పనిలోకెళతాడు’ ‘మా అమ్మాయికి చదువుకు అక్కర్లేదు. ఇంట్లో బోలెడు పని ఉంది’ అంటూ కౌర్‌తో గొడవకు దిగేవారు. అయితే ఆమె వారికి ఓపికతో సమాధానం చెప్పేవారు. కొందరు మనసు మార్చుకొని పిల్లలను స్కూలుకు పంపించేవారు. కొందరు ససేమిరా అనేవారు. అయితే ఈ రెండోకోవకు చెందిన వారు కూడా కొన్ని నెలల తరువాత చదువు విలువ గ్రహించి కౌర్ చెప్పిన మాటలు విన్నారు. రెండోసారి కరోనా విలయం మొదలైంది. బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో కూలీలు, శ్రామికులు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. వారి ఆకలి ని తీర్చడానికి ప్రతిరోజూ ‘ఫుడ్సేవ’ కార్యక్రమంతో ముందుకు వచ్చి ఎంతోమంది ఆకలి తీర్చారు. మాస్క్‌లు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ‘మంత్లీఫుడ్ కిట్’లు సరఫరా చేశారు. ‘డబ్బు విషయంలోనైనా ఇక చాలు అనే మాట వస్తుందేమోగానీ సేవ విషయంలో అది ఎప్పటికీ రాదు’ అంటున్న కౌర్ తన సేవాదృక్పథాన్ని మరింత విస్తరించడానికి భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. చదవండి: కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్.. -
పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రశాంత వాతావరణం ముఖ్యం. ఎలాంటి లొల్లి లేకుంటేనే శ్రద్ధగా చదువుకోవడం సాధ్యం. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నవారిలో అత్యధికులు ఇళ్లలో ప్రత్యేకగదులను స్టడీ రూమ్‌గా ఏర్పాటు చేసుకుంటారు. మరి ప్రత్యేకగది లేని వాళ్ల సంగతి? అలాంటి వారి కోసం స్టడీసెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఏప్రిల్ నెలాఖరుకు వీటిని అందుబాటులోకి తెచ్చేవిధంగా చర్యలు చేపట్టింది. ప్రధానంగా హరిజనవాడలకు అత్యంత సమీపంగా వీటిని ఉండేలా చూస్తున్నారు. ఇతర అభ్యర్థులను సైతం వీటిలోకి అనుమతించనున్నప్పటికీ ఎస్సీలకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. ఆ వనరులను వినియోగించుకుని... అందుబాటులో ఉన్న వనరులను స్టడీ సెంటర్ల కోసం వినియోగించుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో ఉన్న భవనాలను గుర్తిస్తోంది. ప్రస్తుతం చాలాచోట్ల కమ్యూనిటీ హాళ్లు, అంబేడ్కర్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అనువైనవాటిని స్టడీ సెంటర్లుగా మార్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. స్థానికంగా ఇబ్బంది కలగకుండా, కమ్యూనిటీ అవసరాలు తీరే విధంగా పక్కా ప్రణాళికతో ఈ భవనాలను వినియోగించుకోనుంది. కేవలం ఒక హాల్ వరకు మాత్రమే స్టడీ సెంటర్లకు వాడుకోవాలని భావిస్తోంది. మిగతా సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించనుంది. మినీలైబ్రరీ మాదిరిగా... స్టడీ సెంటర్లు మినీ లైబ్రరీలుగా కూడా ఉండనున్నాయి. విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ కోసం దిన, వార, మాస పత్రికలతోపాటు కీలకమైన పుస్తకాలను అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా డ్యూయల్ డెస్క్‌లు, టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ అంచనాల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి కలిగేవిధంగా ప్రతిపాదనలు ఉండాలని ఆయన అధికారులకు సూచించడంతో ఆ మేరకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. -
అసెంబ్లీలో అధ్యయన కేంద్రం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ రీసెర్చ్ సెంటర్ (డీఏఆర్‌సీ)ని ఏర్పాటు చేయనుంది. ఇందులో యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టనుంది. ఇందులో అప్రెంటిస్‌గా చేరిన విద్యార్థులు ఎమ్మెల్యేలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల యువతకు శాసనసభ కార్యకలాపాల నిర్వహణపై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వీరు శాసనసభ్యులకు ఆయా రోజుల్లో చర్చించే అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఎమ్మెల్యేలకు తాజా సమాచారం అందుతుంది. తత్ఫలితంగా వారికి కూడా ఆయా అంశాల విషయంలో నిష్ణాతులుగా మారుతారు. ఇలా ఇరువైపులా ప్రయోజకనకరమైన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం త్వరలో కార్యరూపంలోకి తీసుకురానుంది. అసెంబ్లీ సచివాలయం ఈ డీఏఆర్సీని ఏర్పాటు చేస్తుంది. 50 మందికి ఫెలోషిప్‌తోపాటు మరో 90 మందికి అసిస్టెంట్ ఫెలోషిప్ ఇవ్వనుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఏడాది కాలానికి ఇస్తారు. ఎవరైనా పూర్తిస్థాయిలో నేర్చుకోలేదని అనిపిస్తే మరో ఏడాదికాలం పొడిగిస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి ఏడాదిన్నర క్రితం ఈ అంశాన్ని సభ ముందుంచారు. తమకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తగినంత వ్యవధి దొరకకపోతుండడంతో సోమ్‌నాథ్ ఈ ఆలోచనను సీఎం ముందుంచారు. ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించే బాధ్యతను స్పీకర్ రాంనివాస్ గొయల్ అప్పట్లో జనరల్ పర్పస్ కమిటీ (జీపీసీ)కి అప్పగించారు. ఏడాదిలోగా తనకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. ఔత్సాహికులు ఈ నెల 25వ తేదీలోగా డీఏఆర్‌సీ.డీటీయూ.ఏసీ.ఇన్’కు పంపాల్సి ఉంటుంది. డీఏఆర్సీలో విలువైన, నాణ్యతా ప్రమాణాలతో కూడిన అధ్యయనం జరుగుతుందని, ఇది శాసనసభ్యులకు ఉపయుక్తంగా ఉంటుందని, వారికి అవసరమైన సమాచారం అందేందుకు దోహదం చేస్తుందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో శాసనసభ సచివాలయం పేర్కొంది. ఎంపిౖకైన యువకులు...శాసనసభ్యులు, అసెంబ్లీ సెక్రటరియేట్, ఆయా ప్రభుత్వ విభాగాలతో చక్కని సమన్వయంతో కలసిమెలసి పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. -
‘దూర విద్య’ దందా!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దూర విద్యా కేంద్రాలు విద్యార్థులతో చెలగాటమాడుతున్నాయి. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లు నిర్వహించడానికి వీల్లేదని తెలిసినా, వాటిలో చదివే విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు రాష్ట్రంలో చెల్లకున్నా.. తమ కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రాష్ట్ర యూనివర్సిటీల గుర్తింపుతో ఇక్కడ కొనసాగుతున్న కాలేజీలు కూడా ఈజీ మనీ కోసం అక్రమాల బాట పట్టాయి. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఇచ్చే భారీ కమీషన్ల కోసం తమ కాలేజీల్లో దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను మోసం చేస్తున్నాయి. ఇలాంటి స్టడీ సెంటర్లు ఒకటీ రెండూ కాదు వందల్లో ఉన్నాయి. ఒక్క నాగార్జున యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్లే రాష్ట్రంలో 100కు పైగా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 20కి పైగా ఉండగా, ద్రవిడ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 40 వరకు ఉన్నాయి. పాండిచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు, అన్నామలై యూనివర్సిటీ, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, వినాయక విద్యా మిషన్, మధురై కామరాజ్ తదితర యూనివర్సిటీలు కుప్పలుతెప్పలుగా తెలంగాణలో తమ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇంత జరుగుతున్నా ఉన్నత విద్యా మండలి కానీ, యూనివర్సిటీలు కానీ నోరు మెదపడం లేదు. తెలంగాణలోని స్టడీ సెంటర్లలో చదివే విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి రూ.కోట్లు దండుకుంటున్నా ఉన్నత విద్యా మండలికి చలనం లేకుండా పోయింది. రెగ్యులర్‌గా చదువుకునే స్తోమత లేక.. రాష్ట్రంలో రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లి చదువుకునే స్తోమత లేనివారే దూర విద్యా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలియక దారుణంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లను రాష్ట్రంలో నిర్వహించడానికి వీల్లేదన్న విషయం ఉన్నత విద్యా మండలికి తెలుసు. అయినా వాటిని నిర్వహిస్తున్న కాలేజీలకు ఎలాంటి నోటీసులు, ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. స్టడీ సెంటర్ల నుంచి యూనివర్సిటీల అధికారులు ముడుపులు పుచ్చుకొని ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ విద్యార్థి వేరే రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రంలో (తెలంగాణలోని) చదివిన సర్టిఫికెట్‌ను పెడితే దాన్ని తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి.. సంబంధిత నిబంధనలపై కనీస ప్రచారం చేయడం లేదు. ఉద్యోగాల్లో అలాంటి సర్టిఫికెట్లను అనుమతించవద్దని చెబుతోందే తప్ప.. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లలో చదవవద్దన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. దీంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సర్టిఫికెట్లను తెలంగాణలో చెల్లనివిగా పరిగణిస్తారన్న విషయం తెలియక విద్యార్థులు వాటిల్లో చేరుతూనే ఉన్నారు. బయటకు వచ్చినవి కొన్నే.. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి.. గతేడాది టీఎస్ ఐసెట్ రాసి మేనేజ్మెంట్ కోటాలో ఘట్కేసర్లోని ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. ఆ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల ర్యాటిఫికేషన్‌కు అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యా మండలికి వెళ్లాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ విద్యార్థి సర్టిఫికెట్ చెల్లదంటూ ప్రవేశాన్ని తిరస్కరించారు. అలాగే భువనగిరి ప్రాంతంలో ఓ కాలేజీలో గీతమ్ విద్యా సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో మరో విద్యార్థి డిగ్రీ చదివాడు. అతను మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏలో చేరగా.. సర్టిఫికెట్లను పరిశీలించిన ఉన్నత విద్యా మండలి అతని ప్రవేశాన్ని తిరస్కరించింది. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రంలో మరో విద్యార్థి డిగ్రీ పూర్తి చేసి.. లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్ని కూడా అధికారులు తిరస్కరించారు. ఇలా వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉద్యోగాల్లోనూ అలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి తిరస్కస్తోంది. అనుమతి లేకున్నా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి వీల్లేదు. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ (ఎఫ్.ఎన్ఓ.డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. దాంతోపాటు నిబంధనల కాపీని జత చేసి పంపించారు. అవే నిబంధనలను తాము అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెబుతోంది. కానీ తెలంగాణలో స్టడీ సెంటర్ల పెట్టవద్దని ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు ఓ లేఖ రాయాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. కనీసం తమ ఆధీనంలోని కాలేజీల్లోనైనా ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లు పెట్టకుండా కట్టడీ చేయడం లేదు. ఇవేవీ చేయకున్నా అలాంటి స్టడీ సెంటర్లలో చేరవద్దని విద్యార్థుల్లో అవగాహన కూడా కల్పించడం లేదు. మా సర్టిఫికెట్లు చెల్లుతాయి: నాగార్జున యూనివర్సిటీ తెలంగాణలోని తమ స్టడీ సెంటర్లలో చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని నాగార్జున యూనివర్సిటీ అధికారులు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు ఉమ్మడి విద్యా అవకాశాల విధానం అమల్లో ఉన్నందున తమ స్టడీ సెంటర్లు కూడా చెల్లుబాటు అవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా యూనివర్సిటీల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి కనీసం ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితోనైనా ఈ విషయంపై చర్చించడం లేదు. -
దూర విద్య.. అంతా మిథ్య!
సాక్షి, హైదరాబాద్: - ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా శ్రీనివాస్‌రెడ్డి డిగ్రీ చేశాడు. తెలంగాణ ఐసెట్ రాసి మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏలో చేరాడు. ర్యాటిఫికేషన్ కోసం అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యామండలికి వెళ్లగా పరిశీలించిన అధికారులు అతని సర్టిఫికెట్ చెల్లదని ప్రవేశాన్ని తిరస్కరించారు. - సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. తెలంగాణ లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్నీ ఉన్నత విద్యామండలి తిరస్కరించింది. ఇలా ఒకరు.. ఇద్దరు కాదు వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. విద్యలోనే కాదు ఉద్యోగాల్లోనూ ఇలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యామండలి తిరస్కరిస్తోంది. సుప్రీంకోర్టు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని రాష్ట్ర యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి.. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ(ఎఫ్ఎన్ఓ డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. ఈ నిబంధనను తెలంగాణ ఉన్నత విద్యామండలి పక్కాగా అమలు చేస్తోంది. ఫలితంగా అనేక మంది విద్యార్థులు వివిధ కోర్సుల ప్రవేశాల్లో తిరస్కరణకు గురవుతున్నారు. దీంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రాష్ట్రంలోని స్టడీ సెంటర్ల ద్వారా 2013 తర్వాత చదివిన చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. 50 ఇతర రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన 50 వరకు రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య వంటి కోర్సులను దూర విద్య ద్వారా అందిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే వేల కాలేజీల్లో ఆయా విద్యా సంస్థలు 150 కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. వాటిల్లో 2 లక్షల మంది విద్యార్థులు వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఏపీలోని ఓ స్టడీ సెంటర్ ద్వారా అక్కడి వర్సిటీలో చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుతుంది.. అదే వర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్య స్టడీ సెంటర్ ద్వారా చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు కాదు. దీనిపై ప్రచారం లేకపోవడంతో విద్యార్థులకు తెలియడం లేదు. ఇతర రాష్ట్ర వర్సిటీలు ఆదాయం కోసం ఈ విషయాన్ని దాచిపెట్టి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగాల్లోనూ తిరస్కరణ! ఇలాంటి సర్టిఫికెట్లను విద్యా ప్రవేశాల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆ సర్టిఫికెట్లను ఉద్యోగ నియామకాల విభాగాలు తిరస్కరిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటుండటంతో పలువురు అభ్యర్థులు ఉద్యోగాల్లోనూ తిరస్కరణకు గురి కావాల్సివస్తోంది. యూజీసీ నిబంధనల ప్రకారమే యూజీసీ దూర విద్య, ఆఫ్ క్యాంపస్‌ల టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర వర్సిటీ మరో రాష్ట్రంలో దూర విద్య కేంద్రాలను ఏర్పాటు చేసి కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. అందుకే అలా వచ్చే విద్యార్థుల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాం. ఇప్పటికైనా అలాంటి వాటిల్లో విద్యార్థులు చేరవద్దు. రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం లేని వారు తెలంగాణ రాష్ట్ర వర్సిటీల దూర విద్యా కేంద్రాల ద్వారా చదువుకోవాలి. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీసేన విజయానికి ముఖ్య కారకుడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనినే. జట్టుకు కెప్టెన్ కోహ్లి అయినా, ఈ విజయాలకు సారథి మాత్రం ధోనినే అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లుతున్నాయి. ధోని తొలుత బ్యాటింగ్‌లో కీలక వికెట్లు కోల్పోయిన జట్టును హార్ధిక్ పాండ్యాతో పాటు ఆదుకున్నాడు. ఆపై ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో టీమిండియా బౌలర్లకు ధోని చేసిన కీలక సూచనలే మ్యాచ్ గతిని మార్చివేశాయని తెలుస్తోంది. ఇందుకు స్టంప్ మైక్‌ల్ రికార్డయిన ధోని మాటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ ఆడియో సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'మిస్టర్ కూల్' ధోని కీలక సూచనలు పాటించిన ఇద్దరు బౌలర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు వైవిధ్యమైన బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఒక్కొక్కరిగా పెవిలియన్‌కు పంపారు. కానీ వికెట్ల వెనుక ఉన్న మహేంద్రుడు వారికి మార్గనిర్దేశం చేశాడు. తొలుత ప్రమాదకర ఆటగాడు డేవిడ్ వార్నర్, స్టొయినిస్‌ను కుల్దీప్ పెవిలియన్‌కు పంపించాడు. ఆపై భారీ సిక్సర్లతో చెలరేగిన మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్, మాథ్యూ వేడ్ లను మరో స్పిన్నర్ చహల్ పెవిలియన్ బాట పట్టించాడు. స్టంప్ మైక్‌లో ధోని మాటలు 'వో మార్నే వాలా దాల్నా.. అందర్ యా బాహర్ కోయీ భీ (షాట్ ఆడేలా బాల్ వేయి అయితే వికెట్ల వైపు లేదా బయటకి వచ్చినా ఒకే), గూమ్నే వాలా దాల్.. ఘూమ్నే వాలా దాల్.. (బాగా టర్న్ అయ్యేలా బౌలింగ్ చెయ్)' అంటూ యువ బౌలర్ కుల్దీప్‌నకు ధోనీ సూచించాడు. మాక్స్వెల్ ఆటకట్టించేందుకు స్టంప్స్ పైకి బాల్స్ వేయొద్దన్నాడు. తాను చెప్పిన బంతులు వేయని సందర్భంలో మహీ.. 'ఐసే ఐసే దాలో, తు భీ సున్తా నహీ హై క్యా (నువ్వు కూడా నా మాట వినిపించుకుంటలేవు)' అంటూ చహల్‌కు చెప్పడం రికార్డైంది. ఇలా ధోని చేసిన సూచనల్ని పాటింటిన స్పిన్నర్లు ఆసీస్ దూకుడుకు కళ్లెంవేశారు. తద్వారా ధోని ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. -
విద్యావేత్త యశ్పాల్ కన్నుమూత
► శాస్త్రరంగంలోనూ విశేష సేవ ► ప్రధాని మోదీ విచారం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ విద్యావేత్త, భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్పాల్ సింగ్ (90) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో యశ్పాల్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నోయిడాలోని ఓ వైద్యశాలలో తుదిశ్వాస విడిచారని ఆయన కొడుకు రాహుల్ పాల్ మంగళవారం తెలిపారు. అంత్యక్రియలను ఢిల్లీలోని లోధి రోడ్లో ఉన్న విద్యుత్ దహనవాటికలో నిర్వహించామని చెప్పారు. విశ్వకిరణాల (కాస్మిక్ రేస్)పై అధ్యయనంలో యశ్పాల్ కీలక పాత్ర వహించారు. భారతీయ విద్యావిధానంలో పలు సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా నిలిచారు. ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1926లో జన్మించిన యశ్పాల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అమెరికా వెళ్లి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. తిరిగి భారత్‌కు వచ్చిన ఆయన టీఐఎఫ్ఆర్లో తన ఉద్యోగాన్ని కొనసాగించారు. 1986–91 మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గాను యశ్పాల్ పనిచేశారు. ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అటు విద్యా విధానం రూపకల్పనలోనూ యశ్పాల్ విశేష కృషి చేశారు. జాతీయ విద్యా విధానంపై.. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ఏర్పాటు చేసిన కమిటీకి యశ్పాల్ నేతృత్వం వహించారు. 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై యశ్పాల్ సారథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఇది యశ్పాల్ కమిటీగా పేరుగాంచింది. సైన్సుకు ప్రాచుర్యం కల్పించినందుకుగాను ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆయనకు ‘కళింగ ప్రైజ్’ను ప్రదానం చేసింది. ఇవేకాక మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను ఆయన అందుకున్నారు. సేవలు గుర్తుండిపోతాయి: మోదీ ప్రొఫెసర్ యశ్పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘యశ్పాల్ మరణవార్త నన్ను బాధించింది. ఒక గొప్ప శాస్త్రవేత్తను, విద్యావేత్తను మనం కోల్పోయాం. భారతీయ విద్యా వ్యవస్థకు ఆయన అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయి’ అంటూ మోదీ ఓ ట్వీట్ చేశారు. యశ్పాల్ మృతి భారత్‌కు పెద్ద లోటు అని శాస్త్ర, సాంకేతిక, భూ శాస్త్ర శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా యశ్పాల్ మృతికి సంతాపం తెలిపారు. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ్ రాఘవన్ మాట్లాడుతూ ‘డా.హోమిబాబా, డా.విక్రమ్ సారాభాయ్ తదితరుల కాలానికి, నేటి తరానికి మధ్య వారధిలా ఉన్న వ్యక్తిని మనం కోల్పోయాం’ అని అన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా స్టడీ సెంటర్లు
- ‘బీఎస్సీ అగ్రికల్చర్’ కోర్సును నిర్వహిస్తున్న 3 వర్సిటీలు - చర్యలు చేపట్టాలని యూజీసీకి ఉన్నత విద్యామండలి లేఖ సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 3 వర్సిటీలు రాష్ట్రంలో పలు స్టడీ సెంటర్ల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి యూజీసీ కి లేఖ రాసింది. బీఎస్సీ అగ్రికల్చర్ వంటి వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఫిరోజాబాద్‌లోని జేఎస్ వర్సిటీ, రాజస్థాన్‌లోని సింఘానియా వర్సిటీలు రాష్ట్రంలోని 8 స్టడీ సెంటర్ల ద్వారా ఈ కోర్సును నిర్వహిస్తున్నాయని పేర్కొంది. యాప్రాల్‌లోని ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, తూముకుంటలోని ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, గ్రీన్‌ల్యాండ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్‌ఫీల్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, మాగ్జిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్ప్లాంట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసర్చ్‌లు ఆ కోర్సును నిర్వహిస్తున్నాయని వివరించింది. -
ఓపెన్ యూనివర్శిటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అర్హత పరీక్షకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వడ్రాణం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక శర్మా కాలేజీలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్‌ను పరిశీలించేందుకు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీ తెలంగాణా, ఏపీలోని అన్ని స్టడీ సెంటర్లలో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్ష కేవలం రాయడం, చదవగలగడం అనే అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదన్నారు. పరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నామన్నారు. దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే పంపుకోవాలని, ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 310లు, డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 300లు చెల్లిస్తే సరిపోతుందన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్‌కు తప్పనిసరిగా రావాల్సిన అవసరంలేదని, సైన్స్ అభ్యర్థులు మాత్రం స్టడీ సెంటర్లో వారంవారం జరిగే స్టడీ క్లాసులను వినియోగించుకోవచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు మూడు సంవత్సరాలకు కలిపి రూ. 5 వేలు కూడా మించదన్నారు. ఈ ఏడాది నుంచి సెమిస్టర్ సిస్టంను కూడా ప్రారంభిస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు మరింత సులభతరంగా ఉంటుందన్నారు. దాంతోపాటు స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ కోర్సులను కూడా విద్యార్థులకు అందించేందుకు ప్రాంతాల వారీగా పరిశీలన చేస్తున్నామన్నారు. తమ విద్యాసంస్థకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు కూడా ఉందన్నారు. అందువల్ల తమ దూర విద్యాకోర్సులు చదివిన వారు ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలకు సైతం హాజరుకావొచ్చన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ జిల్లాలో స్టడీ సెంటర్లను పెంచే అవకాశాన్ని, పీజీ కోర్సులు ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. సమావేశంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్.నరశింగరావు, సూపరింటెండెంట్ వి.వెంకటరమణ , సీనియర్ అసిస్టెంట్ శివరాం తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది?
నేటి పిల్లలే రేపటి పౌరులు అనే వ్యాఖ్య ఏ దేశానికైనా వర్తిస్తుంది. కానీ అత్యంత తెలివితేటలు గల పిల్లల చేతుల్లోనే రేపటి అమెరికా భవితవ్యం ఆధారపడి ఉందంటున్నారు స్టడీ ఆఫ్ మ్యాథమెటికల్లీ ప్రెషియస్ యూత్ (ఎస్ఎంపీవై). అమెరికాలోని మొత్తం విద్యార్థుల్లో ఒక్కశాతం కన్నా తక్కువగా ఉన్న అతి తెలివైన (ఐక్యూ ఎక్కువగా ఉన్న) పిల్లలపై ఈ సంస్థ 1971 నుంచి అధ్యయనం చేస్తూ వస్తోంది. అలా ఇప్పటి వరకు దాదాపు 5000 మంది తెలివైన విద్యార్థులపై అధ్యయనం చేసింది. వారే ఫెడరల్ జడ్జీలు, సెనేటర్లు, బిలియనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అవుతున్నారని అధ్యయనం తేల్చింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఆయా రంగాల్లో స్థిరపడ్డారో మాత్రం వివరించలేదు. విద్యార్థులపై దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు అధ్యయనం జరపడం బహూశ ప్రపంచంలో ఇదే మొదటిసారి. విద్యాప్రమాణాలకు సూచికగా అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానంలో గ్రేడ్ మారడం అనేది విద్యార్థుల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని అధ్యయనం తేల్చింది. గ్రేడ్ మారుతున్న విద్యార్థుల్లో 60 శాతం మంది శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్టడీస్‌లో డాక్టరేట్లు సాధిస్తున్నారని, గ్రేడ్ మారుతున్న, మారని విద్యార్థులను పోల్చి చూడగా ఈ విషయం వెల్లడైందని అధ్యయనకారులు పేర్కొన్నారు. దేశంలోని ఏ పాఠశాలలోనైనా తెలివైన విద్యార్థులను వదిలేసి తెలివి తక్కువ విద్యార్థులపైనే టీచర్లు ఎక్కువ దృష్టి పెడతారని, కానీ తెలివైన విద్యార్థులకు మరింత పదును పెడితే వారు జీవితంలో మరింత పైకి వస్తారని, వారిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అధ్యయనం సూచించింది. ఈ విషయంలో తెలివిగల పిల్లల చదువులపై తల్లిదండ్రులు కూడా మరింత శ్రద్ధ పెడితే ఫలితాలు మరింత బాగుంటాయని కూడా పేర్కొంది. -
టీచర్ల పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేష¯ŒS కోర్సుల అమలు మున్సిపల్ మంత్రి నారాయణ అమలాపురం టౌ¯ŒS : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదవించినప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. అమలాపురం కొంకాపల్లి జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫౌండేష¯ŒS కోర్సు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మంగళవారం రాత్రి మంత్రి నారాయణ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించన ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో 500 మంది పాల్గొనగా అందులో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో విద్యా ప్రమాణాల్లో మరీ వెనుకబడి ఉన్నారన్న దృష్టితోనే రాష్ట్రంలో ఎంపిక చేసిన 57 మున్సిపాలిటీల్లో ఫౌండేష¯ŒS కోర్సులు అమలు చేస్తున్నుట్టు తెలిపారు. మంత్రి నారాయణ పలువురు ఫౌండేష¯ŒS కోర్సు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖీ నిర్వహించారు. వారు ఏం చదువు తారు...భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని అడిగారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ ఇష్టాగోష్టిలో మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. చివరగా మంత్రి నారాయణ కొంకాపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. -
ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చేరేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రధానంగా 2011 - 2012 విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులు పెరుగుతున్నారు. 2011 - 12లో ఈ సంఖ్య 50 ఉండగా.. గతేడాది (2015- 16) 1210కి చేరింది. 2011 నుంచి గతేడాది వరకు నమోదైన విదేశీ విద్యార్థుల సంఖ్య 4038. వీరిలో 3,323 మంది విద్యార్థులు కాగా 715 మంది విద్యార్థినులు. ఈ విద్యా సంవత్సరంలో యూజీ కోర్సుల్లో దాదాపు 1500 మందికిపైగా విద్యార్థులకు ప్రొవిజినల్ అడ్మిషన్లు జారీ చేశారు. పీజీ, స్పెషల్ ఇంగ్లిష్ కోర్సుల్లోనూ వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. యూఎఫ్‌ఆర్‌ఓ లెక్కల ప్రకారం.. 2013-14 విద్యా సంవత్సరంలో అత్యధికంగా యూజీ, పీజీ కోర్సుల్లో కలిపి 2,645 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 1367 మంది విద్యార్థులు, 1278 విద్యార్థినులు ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో కొందరిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) స్పాన్సర్ చేస్తోంది. మిగిలినవారు సెల్ఫ్ ఫైనాన్స విధానంలో చేరారు. క్రేజీ కోర్సులు ఓయూలో గతేడాది యూజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స (బీసీఏ) కోర్సులో అత్యధికంగా 602 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. పీజీలో 334 మంది విద్యార్థులతో ఎమ్మెస్సీ టాప్‌లో నిలిచింది. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)లో 567, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ)లో 439, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ)లో 357, బీటెక్/బీఈలో 333, ఎంఏలో 242 మంది చేరారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)లో 132, పీహెచ్‌డీలో 196 మంది ప్రవేశాలు పొందారు. ఓయూలో ప్రత్యేకంగా విదేశీ విద్యార్థుల కోసం సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఫారిన్ స్టూడెంట్స్ అనే కోర్సు ఉంది. దీని కాలవ్యవధి పది నెలలు. ఈ దేశాల నుంచి ఎక్కువ ఓయూలో చేరిన విద్యార్థుల్లో అత్యధికంగా అఫ్గానిస్తాన్ (593), ఇరాక్ (572), యెమెన్ (474) సోమాలియా (467), సూడాన్ (350), నైజీరియా (169) దేశాల వారు ఉన్నారు. దాదాపు 85 దేశాల విద్యార్థులు ఓయూ పరిధిలోని కాలేజీల్లో చేరుతున్నారు. వీరితోపాటు యూఎస్, యూకే, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియన్ ఎన్ఆర్ఐ విద్యార్థులూ కూడా ప్రవేశం పొందుతున్నారు. మహారాష్ట్రలోని యూనివర్సిటీ ఆఫ్ పుణె తర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ప్రవేశం పొందుతున్న విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ నిలుస్తోంది. దేశమేదైనా ఉన్నత విద్యకోసం ఇక్కడికి వచ్చిన విద్యార్థులంతా కలిసిమెలసి ఉంటారు. ఇక్కడ కోర్సులనభ్యసించిన విదేశీ విద్యార్థులకు వారి దేశాల్లో గుర్తింపు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రొఫెసర్ జి.బి. రెడ్డి, జాయింట్ డెరైక్టర్, యూఎఫ్‌ఆర్‌ఓ, ఉస్మానియా యూనివర్సిటీ. -
‘జాతీయ స్థాయి’కి సాత్విక్
మద్దిరాల (చిలకలూరిపేట రూరల్): తుపాకులతో టెర్రరిస్టులను మాత్రమే చంపవచ్చు, విలువలతో కూడిన విద్యతో టెర్రరిజాన్ని రూపుమాపవచ్చు. నేటి విద్యావిధానంలో విలువలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా టెర్రరిస్టులుగా మారుతున్నారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం అహింసా విధానాన్ని పాటించారు. పెన్ను, పుస్తకం, ఉపాధ్యాయుడితో కలిసి టెర్రరిజాన్ని రూపుమాపవచ్చని ఇటీవల నోబుల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని కేంద్రీయ విద్యాలయమైన జవహర్ నవోదయకు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రదర్శించిన ఎగ్జిబిషన్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన క్లస్టర్ పోటీల్లో విజేతగా, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి ఐదు రాష్ట్రాల విద్యార్థులకు రీజనల్ స్థాయిలో సైతం విజేతగా నిలిచాడు. త్వరలో జాతీయస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యాడు.మండలంలోని మద్దిరాల గ్రామంలో నవోదయ పాఠశాలలో సీహెచ్ సాత్విక్ పదోతరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. ఈనెల 18, 19వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగిన క్లష్టర్ పోటీల్లో, 23,24 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో నిర్వహించిన రీజనల్ పోటీల్లో పాల్గొన్నాడు. రెండు పోటీలను సోషల్ సైన్స్ విభాగంలో అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి సూచనలు, సలహాలతో ఎగ్జిబిషన్‌ను ప్రదర్శించి ప్రతిభను కనబరచాడు. వ్యవసాయ కూలీ కుటుంబంలో మెరిసిన విద్యార్థి.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణుడై 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన అనుదీప్– శాంతి దంపతుల కుమారుడు సీహెచ్ సాత్విక్ ప్రవేశం పొందాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సాత్విక్‌ను ప్రిన్సిపాల్ ఎన్‌వీడీ విజయకుమారి జ్ఞాపిక, సర్టిఫికెట్లను అందించారు. డిప్యూటీ ప్రిన్సిపాల్ రాఘవయ్య, అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
ఈ యూనివర్సిటీలు, కాలేజీలు నకిలీవే
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, రాష్ట్రానికి చెందిన పలు కాలేజీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, అవి నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలేనని రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వాటిల్లో చదివి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కోర్సును నిర్వహించే 3 యూనివర్సిటీలు, 8 కాలేజీలకు, వాటి స్టడీసెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కాని, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ గుర్తింపునివ్వలేదని, యూజీసీ కూడా వాటికి గుర్తింపు ఇవ్వలేదని వెల్లడించారు. యూనివర్సిటీలు/ప్రభుత్వం/ యూజీసీ గుర్తింపు లేని కాలేజీల్లో చదివితే నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇతర వివరాలను యూజీసీ వెబ్సైట్లో (ugc.ac.in) పొందవచ్చని వివరించారు. ఇవీ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలు ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ⇒ సంఘానియా యూనివర్సిటీ, ఝుంఝును రాజస్తాన్ ⇒ జేఎస్ యూనివర్సిటీ, ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా యాప్రాల్, హైదరాబాద్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, తూముకుంట, సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ ఎదురుగా, శామీర్‌పేట్, రంగారెడ్డి ⇒ గ్రీన్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సుందర్‌నగర్ కాలనీ, మెయిన్‌రోడ్ సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్ ⇒ గ్రీన్‌ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ , సాయినగర్ రోడ్, రాజధాని హోటల్ లేన్ ఎదురుగా, హైదరాబాద్ ⇒ తెలంగాణ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్ట్రీట్ నెంబర్-2 బిగ్ బజార్ దగ్గర తార్నాక, హైదరాబాద్ ⇒ మాగ్జిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, నంజిని ఎన్క్లేవ్, ప్రశాంత్‌నగర్, ఉప్పల్ పోలీసుస్టేషన్ పక్కన, ఉప్పల్ ⇒ గ్రీన్ ప్లాంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, వివేకానందనగర్, కెనరా బ్యాంకు ఎదురుగా, కూకట్పల్లి, హైదరాబాద్ ⇒ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, హిల్ కాలనీ, రిలయన్స్ డిజిటల్ ఎదురుగా వనస్థలిపురం, హైదరాబాద్ -
చదువుతోపాటు సమాజాభివృద్ధికీ పాటుపడాలి
విద్యార్థులకు ‘నన్నయ’ వీసీ పిలుపు రంపచోడవరం : చదువుతోపాటు సమాజాభివృద్ధికి కూడా విద్యార్థులు పాటుపడాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక బీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నన్నయ వర్సిటీ, వికాస సంయుక్త ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏటా చదువు పూర్తి చేసుకునే 30 మంది విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. వర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి కేంద్రాలు 20 ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ పరిధిలో 450 డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. విద్యార్థులు పూర్తి చేసిన డిగ్రీకి అనుబంధంగా అదనపు నైపుణ్యాలను అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, తమలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలని వీసీ సూచించారు. వికాస ప్రాజెక్టు అధికారి వీఎన్ రావు, నన్నయ ఎడ్యుకేషన్ మెంబర్ బి.సువర్ణకుమార్ కూడా ప్రసంగించారు. వీసీని లెనోరా విద్యాసంస్థ ఆధ్వర్యాన ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో లెనోరా విద్యాసంస్థ అధినేత డాక్టర్ బి.రత్నం, వర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, వికాస ప్లేస్మెంట్ అధికారులు పి.శ్రీకాంత్, కౌముది, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్, లెనోరా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్‌మూర్తి, సర్పంచ్ వై.నిరంజనీదేవి, బీఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
14న బీఈడీ, డిగ్రీ ప్రవేశ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ, బీఈడీ (స్పెషల్), డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీలో ప్రవేశం కోసం ఈనెల 14న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు ఆ యూనివర్సిటీ సీఆర్ఆర్ కళాశాల స్టడీ సెంటర్ ప్రిన్సిపాల్ ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బీఈడీ, డిగ్రీ ప్రవేశపరీక్ష జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్) ప్రవేశపరీక్ష జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఎఓయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. -
అక్రమాలపై అధ్యయనం
యాంత్రీకరణ అక్రమాలపై రెండు బృందాల తనిఖీలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అధికారులు ఖమ్మం వ్యవసాయం : వ్యవసాయ యాంత్రీకరణ అమలు.. జరిగిన అక్రమాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రెండు బృందాలను నియమించింది. ఆధునిక పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్ఎస్ఎఫ్), రాష్ట్రీయ కృషి వికాస యోజన(ఆర్కేవీవై), నార్మల్ స్టేట్ ప్లాన్(ఎన్ఎస్పీ) వంటి పథకాల ద్వారా రూ.కోట్లు వెచ్చిస్తున్నాయి. ఈ నిధులను కొందరు అక్రమాలు కొల్లగొడుతున్నారు. 2014–15లో జిల్లాకు ఆయా పథకాల కింద విడుదలైన నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. రూ.20కోట్ల నిధుల్లో పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ.. జిల్లా వ్యవసాయ శాఖలో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించింది. అప్పటి జిల్లా వ్యవసాయ శాఖ బాస్(జేడీఏ) నిధులను సెల్ఫ్ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నట్లు నిర్ధారించారు. దాదాపు రూ.70లక్షలు డ్రా చేసుకున్నట్లు విచారణలో తేలింది. వీటిలో కొంత మొత్తాన్ని బాస్ తిరిగి రాష్ట్ర వ్యవసాయ శాఖకు జమ చేశారు. ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. ఇందులో ఆడిట్ జరగగా.. విచారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు బృందాల తనిఖీలు జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ.. క్షేత్రస్థాయిలో పథకం అమలును పరిశీలించాలని.. లబ్ధిదారుల ఆధారంగా యంత్ర పరికరాలు అందాయా? వాటిని ఆయా లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారా? అధికారులు మార్గదర్శకాలను పాటిస్తున్నారా? లబ్ధిదారుల గుర్తింపు సక్రమంగా ఉందా? లేదా? తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రెండు బృందాలను నియమించింది. ఇవి సోమవారం నుంచి తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. మెదక్ జిల్లా సదాశివపేట సీడ్పామ్ సహాయ వ్యవసాయ సంచాలకులు వి.విద్యాసాగర్, సిద్దిపేట ఏఓ ఆర్.ప్రభాకర్‌రావు ఒక బృందంగా, సంగారెడ్డి రైతు శిక్షణా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు జి.రమాదేవి, సంగారెడ్డి రైతు శిక్షణా కేంద్ర వ్యవసాయాధికారి ఎం.మీనా ఒక బృందంగా నియమితులయ్యారు. వీరు వ్యవసాయ డివిజన్లవారీగా తనిఖీలను ప్రారంభించారు. 2014 నుంచి పథకం అమలుపై పరిశీలన 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాల యాంత్రీకరణ పథకం అమలు తీరును తనిఖీ బృందాలు పరిశీలిస్తున్నాయి. రెండేళ్ల కాలంలో.. వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లకు సంబంధించిన పలు కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవటం, ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో పథకం అమలుపై సమగ్రంగా అధ్యయనం చేయాలని రెండు బృందాలను తనిఖీలకు నియమించారు. బృందాలు ఇప్పటివరకు బోనకల్లు, చింతకాని, ఖమ్మం అర్బన్(రఘునాథపాలెం), సత్తుపల్లి, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో తనిఖీలు చేపట్టాయి. రైతులను కలుస్తూ.. పరికరాల వివరాలను పరిశీలిస్తున్నాయి. శుక్రవారం వరకు జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తాయని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు మణిమాల తెలిపారు. ఇక్కడ జరిగిన అక్రమాలు, అమలు తీరుపై సమగ్ర నివేదికను రూపొందించి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. -
న్యాయం చేయండి
ఆర్మూర్: సమాధాన పత్రాలు చింపివేయడంతో తాము ఫెయిల్ అయ్యామని, తమకు న్యాయం చేయాలని పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న 15 మంది డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జూన్‌లో ఎంపీసీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన 15 మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసి యూనివర్సిటీకి పంపించిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జవాబు పత్రాలు చింపివేయబడ్డ 15 మంది విద్యార్థులు టెట్–1 క్వాలిఫై అయినవారే కావడం గమనార్హం. సమాధాన పత్రాలు చింపి వేయడంతో తాము ఫెయిల్ అయినట్లు తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా స్టడీ సెంటర్, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. బాధితులకు పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు అండగా నిలిచారు. గురువారం అంబేద్కర్ వర్సిటీ ఆర్మూర్ స్టడీ సెంటర్లో సెంటర్ కోఆర్డినేటర్ రాజ, క్లర్క్ శ్యాం, అటెండర్ రూపేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఆర్మూర్ సెంటర్లోనే సమాధాన పత్రాలు చినిగి వచ్చాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. సమాధాన పత్రాలను భద్రపరిచిన క్లర్క్ శ్యాం, హాల్ టికెట్టు నంబర్లు సేకరించిన అటెండర్లపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి కారణం చెప్పకుండానే అటెండర్ రూపేశ్ తమ హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు నోట్ చేసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులను రీవాల్యూయేషన్‌లో పాస్ చేయిస్తానంటూ క్లర్క్ శ్యాం చెప్పేవాడని ఆరోపించారు. ఈ సంఘటనపై కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా.. సమాధాన పత్రాలను చింపివేయడంతో విద్యా సంవత్సరం వృథా అవుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పీడీఎస్‌యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు స్వామి, రమాకాంత్, చందు, దినేశ్ తదితరులున్నారు. -
న్యాయం చేయండి
ఆర్మూర్ : సమాధాన పత్రాలు చింపివేయడంతో తాము ఫెయిల్ అయ్యామని, తమకు న్యాయం చేయాలని పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న 15 మంది డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జూన్‌లో ఎంపీసీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన 15 మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసి యూనివర్సిటీకి పంపించిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జవాబు పత్రాలు చింపివేయబడ్డ 15 మంది విద్యార్థులు టెట్–1 క్వాలిఫై అయినవారే కావడం గమనార్హం. సమాధాన పత్రాలు చింపి వేయడంతో తాము ఫెయిల్ అయినట్లు తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా స్టడీ సెంటర్, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. బాధితులకు పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు అండగా నిలిచారు. గురువారం అంబేద్కర్ వర్సిటీ ఆర్మూర్ స్టడీ సెంటర్లో సెంటర్ కోఆర్డినేటర్ రాజ, క్లర్క్ శ్యాం, అటెండర్ రూపేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఆర్మూర్ సెంటర్లోనే సమాధాన పత్రాలు చినిగి వచ్చాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. సమాధాన పత్రాలను భద్రపరిచిన క్లర్క్ శ్యాం, హాల్ టికెట్టు నంబర్లు సేకరించిన అటెండర్లపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి కారణం చెప్పకుండానే అటెండర్ రూపేశ్ తమ హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు నోట్ చేసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులను రీవాల్యూయేషన్‌లో పాస్ చేయిస్తానంటూ క్లర్క్ శ్యాం చెప్పేవాడని ఆరోపించారు. ఈ సంఘటనపై కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా.. సమాధాన పత్రాలను చింపివేయడంతో విద్యా సంవత్సరం వృథా అవుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పీడీఎస్‌యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు స్వామి, రమాకాంత్, చందు, దినేశ్ తదితరులున్నారు. -
విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ
హజిపల్లి(షాద్‌నగర్‌రూరల్): ఫరూఖ్‌నగర్ మండలం హజిపల్లి ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ షాద్‌నగర్ స్టార్స్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎంఈఓ శంకర్‌రాథోడ్ చేతుల మీదుగా అందజేశారు. ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతస్థాయిలో రాణించాలని అన్నారు. లయన్స్‌క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగారంశ్రీనివాస్, వార్డుసభ్యులు, ఉపాధ్యాయులు రంగయ్య, నాగరాజ్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ముందు చదవండి.. తర్వాత చెల్లించండి
ఖరగ్‌పూర్: ఐఐటీలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ నిధుల కోసం కొత్తదారి వెతుక్కుంది. విద్యార్థులు ఫీజు కోసం ఇబ్బందులు పడకుండా, సంస్థ ఆర్థిక భారంతో సతమతమవకుండా, ‘నేర్చుకోండి-సంపాదించండి-చెల్లించండి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగం వచ్చాక డబ్బులు విరాళంగాఇచ్చేందుకు విద్యార్థులు సుముఖంగా ఉంటే పథకంలో చేరొచ్చు. ఫీజు మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ‘ఉద్యోగమొచ్చాక ఏడాదికి కనీసం రూ.10 వేలు చెల్లించాలి. ఒక్కో మాజీ విద్యార్థి కనీసం రూ.30 వేలిచ్చినా ఏడాదికి రూ.30 కోట్లు అవుతుంది’ అని ఐఐటీ-కేజీపీ డెరైక్టర్ పార్థ ప్రతీమ్ చక్రవర్తి చెప్పారు. -
ఫీజులు నియంత్రించాలి
గద్వాల : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సం స్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుభా న్ అన్నారు. గురువారం అధిక ఫీజులను నిరసిస్తూ స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం వారిపట్ల ఉ దాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించా రు. ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అం జి, నాగరాజు, రాకేష్, రవి, గోపాల్, రాజు, రాము, ఆనం ద్, తాయన్న పాల్గొన్నారు. -
చెంచు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వనవాసి కల్యాణ పరిషత్‌లో మంగళవారం అనాథ చెంచు విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పరిషత్ అధ్యక్షుడు కోట దశరథం 65వ జన్మదినం సందర్భంగా అనాథ చెంచు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు తన కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. పరిషత్ ఆవరణలో 10 మొక్కలు నాటారు. కార్యక్రమంలో దశరథం, యాదమ్మ, దశరథం కుమారులు యాదగిరి, భాస్కర్, రాజేందర్, కిషోర్ ఉన్నారు.