అమెరికా భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది?
అమెరికా భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది?
Published Fri, Nov 18 2016 6:26 PM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
నేటి పిల్లలే రేపటి పౌరులు అనే వ్యాఖ్య ఏ దేశానికైనా వర్తిస్తుంది. కానీ అత్యంత తెలివితేటలు గల పిల్లల చేతుల్లోనే రేపటి అమెరికా భవితవ్యం ఆధారపడి ఉందంటున్నారు స్టడీ ఆఫ్ మ్యాథమెటికల్లీ ప్రెషియస్ యూత్ (ఎస్‌ఎంపీవై). అమెరికాలోని మొత్తం విద్యార్థుల్లో ఒక్కశాతం కన్నా తక్కువగా ఉన్న అతి తెలివైన (ఐక్యూ ఎక్కువగా ఉన్న) పిల్లలపై ఈ సంస్థ 1971 నుంచి అధ్యయనం చేస్తూ వస్తోంది. అలా ఇప్పటి వరకు దాదాపు 5000 మంది తెలివైన విద్యార్థులపై అధ్యయనం చేసింది.
వారే ఫెడరల్ జడ్జీలు, సెనేటర్లు, బిలియనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అవుతున్నారని అధ్యయనం తేల్చింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఆయా రంగాల్లో స్థిరపడ్డారో మాత్రం వివరించలేదు. విద్యార్థులపై దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు అధ్యయనం జరపడం బహూశ ప్రపంచంలో ఇదే మొదటిసారి. విద్యాప్రమాణాలకు సూచికగా అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానంలో గ్రేడ్ మారడం అనేది విద్యార్థుల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని అధ్యయనం తేల్చింది. గ్రేడ్ మారుతున్న విద్యార్థుల్లో 60 శాతం మంది శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్టడీస్‌లో డాక్టరేట్లు సాధిస్తున్నారని, గ్రేడ్ మారుతున్న, మారని విద్యార్థులను పోల్చి చూడగా ఈ విషయం వెల్లడైందని అధ్యయనకారులు పేర్కొన్నారు.
దేశంలోని ఏ పాఠశాలలోనైనా తెలివైన విద్యార్థులను వదిలేసి తెలివి తక్కువ విద్యార్థులపైనే టీచర్లు ఎక్కువ దృష్టి పెడతారని, కానీ తెలివైన విద్యార్థులకు మరింత పదును పెడితే వారు జీవితంలో మరింత పైకి వస్తారని, వారిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అధ్యయనం సూచించింది. ఈ విషయంలో తెలివిగల పిల్లల చదువులపై తల్లిదండ్రులు కూడా మరింత శ్రద్ధ పెడితే ఫలితాలు మరింత బాగుంటాయని కూడా పేర్కొంది.
Advertisement