పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్‌!  | Telangana Govt Plans Study Centre In Every Mandal | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్‌! 

Published Sun, Feb 7 2021 1:41 AM | Last Updated on Sun, Feb 7 2021 9:15 AM

Telangana Govt Plans Study Centre In Every Mandal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రశాంత వాతావరణం ముఖ్యం. ఎలాంటి లొల్లి లేకుంటేనే శ్రద్ధగా చదువుకోవడం సాధ్యం. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నవారిలో అత్యధికులు ఇళ్లలో ప్రత్యేకగదులను స్టడీ రూమ్‌గా ఏర్పాటు చేసుకుంటారు. మరి ప్రత్యేకగది లేని వాళ్ల సంగతి? అలాంటి వారి కోసం స్టడీసెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఏప్రిల్‌ నెలాఖరుకు వీటిని అందుబాటులోకి తెచ్చేవిధంగా చర్యలు చేపట్టింది. ప్రధానంగా హరిజనవాడలకు అత్యంత సమీపంగా వీటిని ఉండేలా చూస్తున్నారు. ఇతర అభ్యర్థులను సైతం వీటిలోకి అనుమతించనున్నప్పటికీ ఎస్సీలకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. 

ఆ వనరులను వినియోగించుకుని... 
అందుబాటులో ఉన్న వనరులను స్టడీ సెంటర్ల కోసం వినియోగించుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో ఉన్న భవనాలను గుర్తిస్తోంది. ప్రస్తుతం చాలాచోట్ల కమ్యూనిటీ హాళ్లు, అంబేడ్కర్‌ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అనువైనవాటిని స్టడీ సెంటర్లుగా మార్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. స్థానికంగా ఇబ్బంది కలగకుండా, కమ్యూనిటీ అవసరాలు తీరే విధంగా పక్కా ప్రణాళికతో ఈ భవనాలను వినియోగించుకోనుంది. కేవలం ఒక హాల్‌ వరకు మాత్రమే స్టడీ సెంటర్లకు వాడుకోవాలని భావిస్తోంది. మిగతా సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించనుంది. 

మినీలైబ్రరీ మాదిరిగా... 
స్టడీ సెంటర్లు మినీ లైబ్రరీలుగా కూడా ఉండనున్నాయి. విద్యార్థులకు కరెంట్‌ అఫైర్స్‌ కోసం దిన, వార, మాస పత్రికలతోపాటు కీలకమైన పుస్తకాలను అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా డ్యూయల్‌ డెస్క్‌లు, టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్‌లో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ అంచనాల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి కలిగేవిధంగా ప్రతిపాదనలు ఉండాలని ఆయన అధికారులకు సూచించడంతో ఆ మేరకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement