Competitive Examination
-
అభ్యర్థులను కుదిపేస్తున్న లీకేజీలు
-
పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రశాంత వాతావరణం ముఖ్యం. ఎలాంటి లొల్లి లేకుంటేనే శ్రద్ధగా చదువుకోవడం సాధ్యం. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నవారిలో అత్యధికులు ఇళ్లలో ప్రత్యేకగదులను స్టడీ రూమ్‌గా ఏర్పాటు చేసుకుంటారు. మరి ప్రత్యేకగది లేని వాళ్ల సంగతి? అలాంటి వారి కోసం స్టడీసెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఏప్రిల్ నెలాఖరుకు వీటిని అందుబాటులోకి తెచ్చేవిధంగా చర్యలు చేపట్టింది. ప్రధానంగా హరిజనవాడలకు అత్యంత సమీపంగా వీటిని ఉండేలా చూస్తున్నారు. ఇతర అభ్యర్థులను సైతం వీటిలోకి అనుమతించనున్నప్పటికీ ఎస్సీలకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. ఆ వనరులను వినియోగించుకుని... అందుబాటులో ఉన్న వనరులను స్టడీ సెంటర్ల కోసం వినియోగించుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో ఉన్న భవనాలను గుర్తిస్తోంది. ప్రస్తుతం చాలాచోట్ల కమ్యూనిటీ హాళ్లు, అంబేడ్కర్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అనువైనవాటిని స్టడీ సెంటర్లుగా మార్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. స్థానికంగా ఇబ్బంది కలగకుండా, కమ్యూనిటీ అవసరాలు తీరే విధంగా పక్కా ప్రణాళికతో ఈ భవనాలను వినియోగించుకోనుంది. కేవలం ఒక హాల్ వరకు మాత్రమే స్టడీ సెంటర్లకు వాడుకోవాలని భావిస్తోంది. మిగతా సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించనుంది. మినీలైబ్రరీ మాదిరిగా... స్టడీ సెంటర్లు మినీ లైబ్రరీలుగా కూడా ఉండనున్నాయి. విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ కోసం దిన, వార, మాస పత్రికలతోపాటు కీలకమైన పుస్తకాలను అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా డ్యూయల్ డెస్క్‌లు, టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ అంచనాల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి కలిగేవిధంగా ప్రతిపాదనలు ఉండాలని ఆయన అధికారులకు సూచించడంతో ఆ మేరకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. -
పోటీ పరీక్ష: దీక్ష విరమణకు నీళ్లిచ్చిందెవరు?
అహ్మదాబాద్: ఓ పోటీ పరీక్షలో అడిగిన ప్రశ్న ఆ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్లో రైతులకు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలో ఇటీవల దీక్షలో ఉన్న హార్ధిక్‌కు నీరు అందజేసి మద్దతు తెలిపింది ఎవరనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నకు నాలుగు ఐచ్ఛికాలు.. శరద్ యాదవ్, శతృజ్ఞ సిన్హా, లాలూ ప్రసాద్‌యాదవ్, విజయ్ రూపానీ కూడా ఇచ్చారు. అందులో సరైన సమాధానం మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్. ఈ సంగతి అటు ఉంచితే.. పరీక్షలో ఈ రకమైన ప్రశ్న రావడం గుజరాత్లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 25న నిరహార దీక్ష చేపట్టిన హార్ధిక్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మంచి నీళ్లు కూడా తీసుకోవడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. సెప్టెంబర్ 7వ తేదీన ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజు హాస్పిటల్లో హార్ధిక్‌ను పరామర్శించిన శరద్ యాదవ్ అతనికి నీరు అందజేశారు. కాగా హార్ధిక్ సెప్టెంబర్ 12వ తేదీన దీక్షను విరమించారు. పోటీ పరీక్షలో ఈ ప్రశ్న రావడంపై గాంధీనగర్ మేయర్‌ను ప్రశ్నించగా.. దీనిపై తనకు సమాచారం లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఎవరు ఈ పరీక్షల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. -
యువతుల దుస్తుల్ని బహిరంగంగా కత్తిరించారు
పట్నా: ఓ పోటీ పరీక్షకు నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించి హాజరైన యువతుల దుస్తుల్ని కత్తెరలు, బ్లేడులతో కత్తిరించిన ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థినుల దుస్తుల్ని చింపివేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో సంబంధిత పరీక్షా కేంద్రంతో పాటు పరీక్ష సూపరింటెండెంట్‌పై జీవితకాలం వేటుపడింది. బిహార్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ బోర్డు(బీసీఈసీఈబీ) శనివారం నర్సింగ్ కోర్సు ప్రవేశపరీక్షను నిర్వహించింది. స్లీవ్‌లెస్ దుస్తుల్ని ధరించాలని అభ్యర్థులకు సూచించింది. ముజఫర్‌పూర్ జిల్లాలో పలువురు యువతులు ఫుల్‌స్లీవ్ దుస్తులు ధరించి హాజరయ్యారు. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, ఇన్విజిలేటర్లు యువతుల స్లీవ్స్‌ను కత్తిరించారు. ఈ ఘటనపై బిహార్ విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. -
ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘టాపర్’ పేరులోనే కాదు.. నిజంగానూ విద్యార్థిని పై స్థాయిలో చూడాలనే తపనతోనే ప్రారంభమైనట్టుంది! ఒకటి కాదు రెండు కాదు ఒక్క పోటీ పరీక్షకు 5 లక్షల ప్రశ్నలతో సిలబస్‌ను తయారు చేసి అందిస్తుంది. దీంతో విద్యార్థి టాపర్‌గా నిలవడం పక్కా అంటున్నారు టాపర్.కామ్ కో–ఫౌండర్ హేమంత్ గోటే టీ. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఐఐటీ సీట్ కోసం తాను పడ్డ ఇబ్బందే టాపర్‌కు దారి చూపించిందంటున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... మాది పశ్చిమ గోదావరి జిల్లా. హైదరాబాద్‌లో స్కూల్, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక.. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత చౌపాటీ బజార్ అనే ఫోన్‌కామర్స్ స్టార్టప్‌లో ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా పనిచేశా. దీన్ని 2011లో ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సొంతంగా ఏదైనా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకొని.. చౌపాటీ బజార్లో సహోద్యోగీ జీశాన్ హయత్‌తో కలిసి 2013 ఏప్రిల్‌లో కోటి రూపాయల ఏంజిల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ముంబై కేంద్రంగా టాపర్‌ను ప్రారంభించాం. 50కి పైగా పరీక్షలు; ఒక్క దానికి 5 లక్షల ప్రశ్నలు.. 5–12 తరగతి వరకు బోర్డ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్, పోటీ పరీక్షల సిలబస్‌లు, మెటీరియల్స్ ఉంటాయి. జేఈఈ, యూపీఎస్ఈఈ, బిట్‌శాట్, ఎంసెట్, నీట్, ఎయిమ్స్ వంటి దేశంలోని అన్ని 50కి పైగా పోటీ పరీక్షల ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ వంటి అన్ని సబ్జెక్టులూ ఉంటాయి. మెటీరియల్స్‌తో పాటూ ఆన్లైన్లోనే ప్రాక్టీస్, మాక్ ఎగ్జామ్స్, లైవ్ చాట్‌లో సందేహాల నివృత్తితో పాటూ వాయిస్, వీడియో లెక్చర్స్, కంటెంట్ లభిస్తుంది. ఒక్క పరీక్షకు 5 లక్షలకు పైగా ప్రశ్నలను పొందవచ్చు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారం.. ప్రిపరేషన్ మెటీరియల్స్ ఏడాది, ఐదేళ్ల సబ్స్క్రిప్షన్స్ విధానంలో ఉంటాయి. ధరలు రూ.8 వేల నుంచి రూ.2.5 లక్షల వరకుంటాయి. ప్రస్తుతం టాపర్‌కు 30 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 1.50 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 లక్షల మంది విద్యార్థులుంటారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల యూజర్ల వాటా 60 శాతం పైనే ఉంటుంది. రూ.40 వేల సబ్స్క్రిప్షన్స్ యూజర్లే ఎక్కువగా ఉంటారు. గతేడాది రూ.50 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం. ఏడాదిలో యూజర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని.. నాలుగేళ్లలో 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. నెల రోజుల్లో హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్.. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్‌పూర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో 20 ఆఫీసులున్నాయి. నెల రోజుల్లో హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్నాం. జోద్‌పూర్‌కు చెందిన ఈసీప్రిప్‌ను, ముంబైకి చెందిన మంచ్.. రెండు ఎడ్యుకేషన్ స్టార్టప్స్‌ను కొనుగోలు చేశాం. నిధుల సమీకరణ తర్వాత మరొక స్టార్టప్‌ను దక్కించుకుంటాం. వచ్చే ఏడాది 5వ తరగతి లోపు పోటీ పరీక్షల సిలబస్‌లను ప్రవేశపెడతాం. ఆ తర్వాత విదేశాలకు చెందిన ఉపకారవేతనాలు, పోటీ పరీక్షల సిలబస్‌లకూ విస్తరిస్తాం. రూ.325 కోట్ల సమీకరణపై దృష్టి..: టాపర్లో మొత్తం 1,500 మంది ఉద్యోగులుంటే.. ఇందులో కంటెంట్ ప్రిపరేషన్ కోసం 500 మంది ఉన్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో కలిపి రూ.130 కోట్ల నిధులను సమీకరించాం. మరో రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మరో నలుగురు వెంచర్ క్యాపటలిస్ట్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. -
ఒకేసారి నాలుగు సర్కార్ కొలువులు
విశాఖ జిల్లా యువకుని ఘనత యలమంచిలి (యలమంచిలి): విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన కర్రి రఘునాథ్ శంకర్ (25) అనే యువకుడు. ఒకే సారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత సాధించాడు. సామాన్య రైతు కుంటుంబంలో జన్మించి ప్రభు త్వ పాఠశాలలో చదువుకుని కేవలం అందుబాటులో ఉన్న వనరులను మాత్రమే వినియోగించుకుని పోటీ పరీక్షల్లో నెగ్గాడు. ఏపీ జైళ్లశాఖ నిర్వహించిన జైల్ వార్డర్స్, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇన్కమ్ టాక్స్, సీబీఐ శాఖల్లో కొలువు కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, రైల్వే కమర్షియల్ అప్రంటీస్ పోస్టుకోసం నిర్వహించిన పరీక్షల్లో ఇతను అర్హత సాధించాడు. అయితే వీటిలో ఎస్ఐ పోస్టును ఎంచుకుంటున్నట్లు రఘునాథ్ తెలిపారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఈ యువకుడు ఒక మార్గదర్శిగా నిలిచాడు. తండ్రి కర్రి సత్యనారాయణ సాధారణ రైతు. తల్లి నాగమణి గృహిణి. తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరిస్తూనే మేనమామ నాయుడుని ఆదర్శంగా తీసుకుని తన విజయానికి సోపానాలు వేసుకున్నాడు. స్థానిక శాఖా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ అవపోసనపట్టి తన పరీక్షలకు అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించాడు. ప్రతి పుస్తకమూ విజయానికి ఓ మెట్టు మనకు అందుబాటులో ఉండే ప్రతి పుస్తకం మన విజయానికి ఎక్కడో ఒక చోట కారణం అవుతుం దనేది నా నమ్మకం. నేను ప్రత్యేకించి ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు. లైబ్రరీయే నా కోచింగ్ సెంటరు. నా తల్లిదండ్రులు, నాన్నమ్మ ప్రోత్సాహంతో మామయ్యను ఆదర్శంగా తీసుకుని ఈ విజయం సాధించాను. – కర్రి రఘునాథ్ శంకర్ -
రవాణాశాఖలో మీరే కీలకం
► 23 మంది ఏవీఎంఐలకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి ► త్వరలో విధుల్లో చేరనున్న ► మరో 20 మంది సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్ష ద్వారా ఎంపికైన 23మంది సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం నియామక పత్రాలను అందజేశారు. మరో 20 మంది త్వరలో విధుల్లో చేరనున్నారు. రవాణాశాఖలో ఖాళీగా ఉన్న 44 సహాయ మోటారు వాహన తనిఖీ అధికారుల ఖాళీల భర్తీకి గత సంవత్సరం సెప్టెంబర్‌లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 6053 మంది పోటీపడ్డారు. వారిలో 84 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. వీరిలోంచి 44 పోస్టులకు గాను 43 మందిని ఎంపిక చేశారు. మరో పోస్టు పెండింగ్‌లో ఉంది. ఎంపికైన 43 మందిలో 23 మంది సోమవారం ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందుకున్నారు. మిగతా వాళ్లు సైతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం విధుల్లో చేరనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రవాణాశాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లదే కీలకమైన బాధ్యత అని, విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతతో పాటు, ప్రభుత్వానికి ఆదాయాన్ని తేవడంలో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ మోటారు వాహన తనిఖీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాపారావు, జేటీసీలు వెంకటేశ్వర్లు, రఘునాథ్, పాండురంగారావు, తదితరులు పాల్గొన్నారు.