అహ్మదాబాద్: ఓ పోటీ పరీక్షలో అడిగిన ప్రశ్న ఆ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్‌లో రైతులకు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో క్లర్క్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలో ఇటీవల దీక్షలో ఉన్న హార్ధిక్‌కు నీరు అందజేసి మద్దతు తెలిపింది ఎవరనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నకు నాలుగు ఐచ్ఛికాలు.. శరద్ యాదవ్, శతృజ్ఞ సిన్హా, లాలూ ప్రసాద్‌యాదవ్, విజయ్ రూపానీ కూడా ఇచ్చారు. అందులో సరైన సమాధానం మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్. ఈ సంగతి అటు ఉంచితే.. పరీక్షలో ఈ రకమైన ప్రశ్న రావడం గుజరాత్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 25న నిరహార దీక్ష చేపట్టిన హార్ధిక్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మంచి నీళ్లు కూడా తీసుకోవడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. సెప్టెంబర్ 7వ తేదీన ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజు హాస్పిటల్‌లో హార్ధిక్‌ను పరామర్శించిన శరద్ యాదవ్ అతనికి నీరు అందజేశారు. కాగా హార్ధిక్ సెప్టెంబర్ 12వ తేదీన దీక్షను విరమించారు. పోటీ పరీక్షలో ఈ ప్రశ్న రావడంపై గాంధీనగర్ మేయర్‌ను ప్రశ్నించగా.. దీనిపై తనకు సమాచారం లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఎవరు ఈ పరీక్షల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment