ఒకేసారి నాలుగు సర్కార్ కొలువులు
విశాఖ జిల్లా యువకుని ఘనత
యలమంచిలి (యలమంచిలి): విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన కర్రి రఘునాథ్ శంకర్ (25) అనే యువకుడు. ఒకే సారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత సాధించాడు. సామాన్య రైతు కుంటుంబంలో జన్మించి ప్రభు త్వ పాఠశాలలో చదువుకుని కేవలం అందుబాటులో ఉన్న వనరులను మాత్రమే వినియోగించుకుని పోటీ పరీక్షల్లో నెగ్గాడు. ఏపీ జైళ్లశాఖ నిర్వహించిన జైల్ వార్డర్స్, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇన్‌కమ్ టాక్స్, సీబీఐ శాఖల్లో కొలువు కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, రైల్వే కమర్షియల్ అప్రంటీస్ పోస్టుకోసం నిర్వహించిన పరీక్షల్లో ఇతను అర్హత సాధించాడు.
అయితే వీటిలో ఎస్‌ఐ పోస్టును ఎంచుకుంటున్నట్లు రఘునాథ్ తెలిపారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఈ యువకుడు ఒక మార్గదర్శిగా నిలిచాడు. తండ్రి కర్రి సత్యనారాయణ సాధారణ రైతు. తల్లి నాగమణి గృహిణి. తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరిస్తూనే మేనమామ నాయుడుని ఆదర్శంగా తీసుకుని తన విజయానికి సోపానాలు వేసుకున్నాడు. స్థానిక శాఖా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ అవపోసనపట్టి తన పరీక్షలకు అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించాడు.
ప్రతి పుస్తకమూ విజయానికి ఓ మెట్టు
మనకు అందుబాటులో ఉండే ప్రతి పుస్తకం మన విజయానికి ఎక్కడో ఒక చోట కారణం అవుతుం దనేది నా నమ్మకం. నేను ప్రత్యేకించి ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు. లైబ్రరీయే నా కోచింగ్ సెంటరు. నా తల్లిదండ్రులు, నాన్నమ్మ ప్రోత్సాహంతో మామయ్యను ఆదర్శంగా తీసుకుని ఈ విజయం సాధించాను.
– కర్రి రఘునాథ్ శంకర్