ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు! | New startup dairy topper | Sakshi
Sakshi News home page

ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు!

Published Sat, Mar 31 2018 2:35 AM | Last Updated on Sat, Mar 31 2018 11:38 AM

New startup dairy topper - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘టాపర్‌’ పేరులోనే కాదు.. నిజంగానూ విద్యార్థిని పై స్థాయిలో చూడాలనే తపనతోనే ప్రారంభమైనట్టుంది! ఒకటి కాదు రెండు కాదు ఒక్క పోటీ పరీక్షకు 5 లక్షల ప్రశ్నలతో సిలబస్‌ను తయారు చేసి అందిస్తుంది. దీంతో విద్యార్థి టాపర్‌గా నిలవడం పక్కా అంటున్నారు టాపర్‌.కామ్‌ కో–ఫౌండర్‌ హేమంత్‌ గోటే టీ. ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక ఐఐటీ సీట్‌ కోసం తాను పడ్డ ఇబ్బందే టాపర్‌కు దారి చూపించిందంటున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

మాది పశ్చిమ గోదావరి జిల్లా. హైదరాబాద్‌లో స్కూల్, ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక.. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. ఆ తర్వాత చౌపాటీ బజార్‌ అనే ఫోన్‌కామర్స్‌ స్టార్టప్‌లో ప్రిన్సిపల్‌ ఇంజనీర్‌గా పనిచేశా. దీన్ని 2011లో ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సొంతంగా ఏదైనా స్టార్టప్‌ పెట్టాలని నిర్ణయించుకొని.. చౌపాటీ బజార్‌లో సహోద్యోగీ జీశాన్‌ హయత్‌తో కలిసి 2013 ఏప్రిల్‌లో కోటి రూపాయల ఏంజిల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ముంబై కేంద్రంగా టాపర్‌ను ప్రారంభించాం.

50కి పైగా పరీక్షలు; ఒక్క దానికి 5 లక్షల ప్రశ్నలు..
5–12 తరగతి వరకు బోర్డ్‌ ఎగ్జామ్స్, స్కాలర్‌షిప్స్, పోటీ పరీక్షల సిలబస్‌లు, మెటీరియల్స్‌ ఉంటాయి. జేఈఈ, యూపీఎస్‌ఈఈ, బిట్‌శాట్, ఎంసెట్, నీట్, ఎయిమ్స్‌ వంటి దేశంలోని అన్ని 50కి పైగా పోటీ పరీక్షల ప్రిపరేషన్స్‌ చేసుకోవచ్చు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్, బిజినెస్‌ స్టడీస్‌ వంటి అన్ని సబ్జెక్టులూ ఉంటాయి. మెటీరియల్స్‌తో పాటూ ఆన్‌లైన్‌లోనే ప్రాక్టీస్, మాక్‌ ఎగ్జామ్స్, లైవ్‌ చాట్‌లో సందేహాల నివృత్తితో పాటూ వాయిస్, వీడియో లెక్చర్స్, కంటెంట్‌ లభిస్తుంది. ఒక్క పరీక్షకు 5 లక్షలకు పైగా ప్రశ్నలను పొందవచ్చు.  

గతేడాది రూ.50 కోట్ల వ్యాపారం..
ప్రిపరేషన్‌ మెటీరియల్స్‌ ఏడాది, ఐదేళ్ల సబ్‌స్క్రిప్షన్స్‌ విధానంలో ఉంటాయి. ధరలు రూ.8 వేల నుంచి రూ.2.5 లక్షల వరకుంటాయి. ప్రస్తుతం టాపర్‌కు 30 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 1.50 లక్షల మంది పెయిడ్‌ యూజర్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 లక్షల మంది విద్యార్థులుంటారు.

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల యూజర్ల వాటా 60 శాతం పైనే ఉంటుంది. రూ.40 వేల సబ్‌స్క్రిప్షన్స్‌ యూజర్లే ఎక్కువగా ఉంటారు. గతేడాది రూ.50 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం. ఏడాదిలో యూజర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని.. నాలుగేళ్లలో 500 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం.

నెల రోజుల్లో హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌..  
బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్‌పూర్, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో 20 ఆఫీసులున్నాయి. నెల రోజుల్లో హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్నాం. జోద్‌పూర్‌కు చెందిన ఈసీప్రిప్‌ను, ముంబైకి చెందిన మంచ్‌.. రెండు ఎడ్యుకేషన్‌ స్టార్టప్స్‌ను కొనుగోలు చేశాం. నిధుల సమీకరణ తర్వాత మరొక స్టార్టప్‌ను దక్కించుకుంటాం. వచ్చే ఏడాది 5వ తరగతి లోపు పోటీ పరీక్షల సిలబస్‌లను ప్రవేశపెడతాం. ఆ తర్వాత విదేశాలకు చెందిన ఉపకారవేతనాలు, పోటీ పరీక్షల సిలబస్‌లకూ విస్తరిస్తాం.

రూ.325 కోట్ల సమీకరణపై దృష్టి..: టాపర్‌లో మొత్తం 1,500 మంది ఉద్యోగులుంటే.. ఇందులో కంటెంట్‌ ప్రిపరేషన్‌ కోసం 500 మంది ఉన్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో కలిపి రూ.130 కోట్ల నిధులను సమీకరించాం. మరో రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మరో నలుగురు వెంచర్‌ క్యాపటలిస్ట్‌లు ఆసక్తి చూపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement