startup dairy
-
కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీలకు పెద్ద సవాలే. వ్యాపార కార్యకలాపాల కంటే ఎక్కువగా ఉద్యోగుల రవాణా సేవల నిర్వహణ కష్టం. ఎంప్లాయిస్ ట్రాన్స్‌పోర్టేషన్ థర్డ్ పార్టీకి ఇద్దామంటే? వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. టెక్నాలజీ, నిర్వహణ కూడా అవసరమే. సొంత వాహనాలు, డ్రైవర్లు, ఏఐ ఆధారిత ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ మూడు విభాగాలను నిర్వహణ చేసే స్టార్టపే విజిల్ డ్రైవ్! మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ రాకేశ్ మున్ననూరు ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ‘‘మాది కరీంనగర్ జిల్లా. నోయిడాలో బీటెక్ పూర్తయ్యాక.. టాప్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరితే లాక్ అయిపోతానని వచ్చిన ఆఫర్‌ను వదిలేసి.. ఇంటికొచ్చేశా. బీటెక్ చేస్తూనే చాలా స్టార్టప్స్‌కు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నిర్వహణ, ఇన్వెస్ట్మెంట్స్ అప్రూవల్స్ తదితర విభాగాల్లో పనిచేశా. ఈ అనుభవంతో సొంతంగా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకొని 2016 ఏప్రిల్‌లో హైదరాబాద్ కేంద్రంగా విజిల్ డ్రైవ్.కామ్‌ను ప్రారంభించాం. డ్రైవర్లను అద్దెకిచ్చే సేవలతో ప్రారంభమైన విజిల్ డ్రైవ్.. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు క్యాబ్స్, టెక్నాలజీ సేవలందించే కంపెనీగా ఎదిగింది. 28 కంపెనీలు; 12 వేల మంది.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నాం. ఏడీపీ, ఇన్వెస్కో, ఐటీసీ హోటల్స్, రెయిన్బో ఆసుపత్రి, ఎల్ అండ్ టీ వంటి 28 కంపెనీలు, 12 వేల మంది ఉద్యోగులు కస్టమర్లుగా ఉన్నారు. ప్రస్తుతం 700 క్యాబ్స్ ఉన్నాయి. ఇందులో 20 శాతం సొంతానివి. విజిల్ ఫ్లీట్‌లో 4–7 సీట్ల వాహనాలు, విజిల్ షటిల్లో వింగర్స్, మినీ బస్‌లు, విజిల్ 360 డిగ్రీస్‌లో వాహనాలతో పాటూ టెక్నాలజీ సేవలు కూడా ఉంటాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ (ఏఐ), బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ ఉంటుంది. వచ్చే ఏడాది కాలంలో 1,500 క్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం రోజుకు క్యాబ్స్ 2,500 ట్రిప్పులు, లక్ష కి.మీ. వరకు తిరుగుతున్నాయి. రూ.15 కోట్ల ఆదాయం లక్ష్యం.. నెల ప్యాకేజ్, ట్రిప్ వారీగా ఆదాయం ఉంటుంది. ధరలు నెల ప్యాకేజీ రూ.30 వేల నుంచి రూ.50 వేలు, ట్రిప్‌కు అయితే రూ.350 నుంచి రూ.1,000కు చార్జీలుంటాయి. డ్రైవర్ కం ఓనర్ క్యాబ్ ఆదాయంలో విజిల్ డ్రైవ్‌కు 20 శాతం కమీషన్ ఉంటుంది. గతేడాది రూ.8 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. 2019–20లో రూ.15 కోట్ల రెవెన్యూను లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగింపు నాటికి పుణేలో సేవలను ప్రారంభించనున్నాం. 2020 నాటికి విశాఖపట్నం, ముంబై, ఢిల్లీలోకి ఎంట్రీ ఇస్తాం. రూ.70 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం విజిల్ డ్రైవ్‌లో 62 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 150కి చేర్చుతాం. ప్రస్తుతం ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఫోర్డ్స్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో ఎంవోయూ పూర్తవుతుంది. దీంతో ముంబై, కోల్‌కతా వంటి ఇతర నగరాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఏడాది కాలంలో క్లయింట్ల సంఖ్యను 50కి చేర్చుతాం. ‘‘ఇప్పటికే మా కంపెనీలో కొలీజియం గ్రూప్ రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలోనే రూ.70 కోట్ల నిధులు సమీకరించనున్నాం. అమెరికాకు చెందిన పలు ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్స్తో చర్చలు జరుగుతున్నాయి’’ అని రాకేశ్ వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
‘సోలార్’.. కేరాఫ్ ప్రాకృతిక్ పవర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ ఆవశ్యకత మనకు తెలిసిందే! కానీ, విద్యుత్ ఫలకాల ఏర్పాటు నుంచి కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ, ప్రభుత్వ రాయితీలు తీసుకోవటం వరకూ ప్రతిదీ పెద్ద పనే. పెద్ద స్థాయిలో సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసే కార్పొరేట్ సంస్థలకైతే మరీనూ. జస్ట్! వీటన్నింటికీ సింపుల్ సొల్యూషన్ అందిస్తోంది ప్రాకృతిక్ పవర్. ‘హర్ఘర్సోలార్.కామ్’ పేరిట సేవలందిస్తున్న ఈ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ కో–ఫౌండర్, విశాఖపట్నానికి చెందిన తెలుగమ్మాయి సాహిత్య సింధు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు చేరవేసే సోషల్ స్టార్టప్ ఇండియన్ ఐరిస్ మాదే. ఈ క్రమంలో చాలా లీడ్స్ సోలార్ పవర్ ఏర్పాటు, ప్రభుత్వ రాయితీల గురించి వచ్చేవి. అప్పుడే అనిపించింది.. మనమే ప్రత్యేకంగా సౌర విద్యుత్ సొల్యూషన్స్ సార్టప్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా అని? ఇంకేముంది! మహీందర్ సింగ్ రావు, నారాయణ్ సింగ్ రావుతో కలిసి నోయిడా కేంద్రంగా గతేడాది హర్ఘర్సోలార్.కామ్‌ను ప్రారంభించాం. వ్యక్తిగత, కార్పొరెట్ అవసరాలకు అనుగుణంగా సోలార్ పవర్ ఏర్పాటు, నిర్వహణ, రాయితీలు అన్నీ ఒకేచోట అందించడమే మా ప్రత్యేకత. 100కు పైగా క్లయింట్స్.. ప్రస్తుతం తెలంగాణ, ఒరిస్సా, రాజస్తాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 100కి పైగా వ్యక్తిగత, కార్పొరేట్ క్లయింట్లు ఉన్నారు. సుమారు 6,135.7 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నాం. వీటి విలువ రూ.16 కోట్లు. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పలు ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నాం. సెంట్రల్ ఆఫ్రికాలో 25 మెగావాట్ల రెండు ప్రాజెక్ట్‌లతో చర్చలు జరుగుతున్నాయి. సోలార్ పవర్ ఒప్పందాలు.. మా క్లయింట్ల జాబితాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని డ్రైల్యాండ్ అగ్రికల్చర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్‌పూర్‌లోని నిఫ్ట్, ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, భరత్‌పూర్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ర్యాప్‌సీడ్ మస్టర్డ్ రీసెర్చ్ వంటివి ఉన్నాయి. టాటా పవర్, రెన్వైస్, వరీ సోలార్, విక్రమ్ సోలార్ వంటి 10 మంది సోలార్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకున్నాం. ఇన్వెర్టర్ల కోసం పాలీక్యాబ్, డెల్టా, ఏబీబీ, ప్రోనిస్ కంపెనీలతో, ప్యానెల్స్ కోసం ఎన్కే సోలార్, మెహర్ సోలార్‌లతో ఒప్పందాలున్నాయి. రూ.60 లక్షల టర్నోవర్.. ప్రస్తుతం మా కంపెనీలో 15 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. మా క్లయింట్లకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల రాయితీలందించాం. గతేడాది రూ.60 లక్షల టర్నోవర్‌ను నమోదు చేశాం. వచ్చే ఏడాది కాలంలో 10 మెగావాట్ల ప్రాజెక్ట్‌లు, రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని లకి‡్ష్యంచాం’’ అని సింధు వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
మీ డ్రెస్‌కు.. మీరే అడ్రెస్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అందం అంటే మనకు నచ్చడం కాదు ఎదుటివాళ్లకు నచ్చేలా ఉండటం’’ అనే డైలాగ్‌ను సీరియస్‌గా తీసుకుంది అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్. ఎదుటివాళ్లకు నచ్చేలా మాత్రమే కాకుండా... మనం వేసుకున్న డ్రెస్ డిజైన్ ఎదుటి వాళ్లకు లేకుండా చేసేసింది. ‘ఒక మహిళ.. ఒక్క డిజైన్.. ఒక్కటే డ్రెస్’ కాన్సెప్ట్‌తో అహ్మదాబాద్‌లో ఏకంగా ‘ఈనాక్షి.కామ్’ను ప్రారంభించింది నమ్యా పటేల్. మహర్ష్ షాతో కలిసి ఈ ఏడాది మార్చిలో ఆరంభించిన తమ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు నమ్యా మాటల్లోనే... ‘‘గుజరాత్లో 80 ఏళ్ల నుంచి దీప్కాలా అనే బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలో ఉన్నారు మహర్ష్ షా ఫ్యామిలీ. ఈ అనుభవంతో ఇదే రంగంలో కొత్త కాన్సెప్ట్‌తో రావాలనుకున్నాం. అందుకే ఆయనతో కలిసి ఆన్లైన్ అపెరల్ బ్రాండ్ ఈనాక్షిని ప్రారంభించాం. 21 రోజులకో కొత్త కలెక్షన్..: ప్రస్తుతం ఈనాక్షిలో మహిళ దుస్తులు మాత్రమే లభ్యమవుతాయి. త్వరలోనే పిల్లల గార్మెంట్స్లోకి విస్తరిస్తాం. ఈనాక్షిలో టాప్‌లు, లాంగ్ గౌన్లు, డ్రెస్‌లు, కుర్తాలు, సూట్స్ వంటి అన్ని రకాల మహిళల దుస్తులూ ఉంటాయి. ప్రస్తుతం ముగ్గురు డిజైనర్లున్నారు. వీరే దుస్తులను డిజైన్ చేస్తారు. ప్రతి 21 రోజులకు ఒక కొత్త కలెక్షన్‌తో గార్మెంట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. ధరలు రూ.1,500 నుంచి రూ.6,000 వరకున్నాయి. ఆర్డర్ వచ్చిన 24 గంటల్లోగా డెలివరీ చేస్తాం. హైదరాబాద్ వాటా 10 శాతం.. అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఈనాక్షి ప్రారంభించిన రెండు నెలల్లోనే 3 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పటివరకు రూ.4 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. మా ఆదాయంలో హైదరాబాద్ వాటా 10 శాతం ఉంది. వచ్చే 6 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అహ్మదాబాద్‌లో తొలి ఆఫ్‌లైన్‌లో స్టోర్‌ను ప్రారంభిస్తాం’’. -
4జీ ల్యాప్‌టాప్ వస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 4జీ ఫోన్లే కాదు. ల్యాప్‌టాప్‌లూ వస్తున్నాయ్. కాకపోతే వీటిని తెస్తున్నది మాత్రం హైదరాబాదీ స్టార్టప్ ఆర్డీపీ. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్కూ పరిచయం చేస్తున్న తమ ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతం పూర్తయిందని.. 4జీతో పాటూ 24 గంటల బ్యాటరీ బ్యాకప్, ధర కూడా రూ.15 వేల లోపే ఉంటుందని చెప్పారు ఆర్డీపీ ఫౌండర్ అండ్ సీఈఓ విక్రమ్ రెడ్లపల్లి. ఈ ఏడాది ఏకంగా 10 మోడళ్లను విడుదల చేస్తామన్నారు. డిగ్రీ పూర్తయ్యాక అనంతపురంలో చిన్న కంప్యూటర్ సర్వీస్ సెంటర్లో పనిచేసిన విక్రమ్.. అక్కడే ఏకంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్‌ను తయారు చేసే కేంద్రమే పెట్టేశాడు. ఆర్డీపీ భవిష్యత్తు ప్రణాళికలను ఆయన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది అనంతపురంలోని కదిరి. ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేశా. అక్కడే కంప్యూటర్ సర్వీసెంగ్ సెంటర్‌తో పాటు తొలి సైబర్ కేఫ్ ప్రారంభించా. 2004లోనే స్థానిక కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వాలని ప్రయత్నించా. కానీ, బ్యాండ్‌విడ్త్, శాటిలైట్ సమస్యలతో అది సక్సెస్ కాలేదు. 2008లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు థిన్ క్లింట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా. నాలుగేళ్ల ఈ డిస్ట్రిబ్యూషన్లో వ్యాపారం, నెట్వర్కింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఏంటనేది నేర్చుకున్నా. అదే సమయంలో చైనాలో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో జరిగింది. విమానం ఎక్కాలనే కోరిక కూడా తీరుతుందని నేరుగా ఎక్స్‌పోకు వెళ్లా. స్థానికంగా ఒకటిరెండు టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సైబర్ సొల్యూషన్ బ్రాండ్ పేరిట వంద కంప్యూటర్లు తయారు చేయించుకొని ఇక్కడ విక్రయించడం మొదలుపెట్టా. అక్కడి నుంచి సొంతంగా బ్రాండ్ ఉండాలని నిర్ణయించుకొని 2012లో ఆర్డీపీ పేరిట సొంత కంపెనీ ప్రారంభించా. టెక్నాలజీ తెలిసిన ఎవరికైనా సరే థిన్‌క్లింట్ అంటే రిమోట్ డెస్క్‌టాప్ ప్రొటోకాల్ (ఆర్డీపీ) అనే. కానీ, సొంతగా కంపెనీ పెట్టాక కూడా ఆర్డీపీ అనే ఉంచడానికి కారణం.. అది మా ఇంటి పేరు కూడా కావటమే. థిన్‌క్లింట్ లోగో కూడా మార్చి.. ఆర్డీపీ అంటే రెడ్లపల్లిగా మార్చేశా. ఇప్పటివరకు ఆర్డీపీలో రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టా. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్.. ప్రస్తుతం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్, థిన్క్లింట్స్ మూడు విభాగాల్లో 16 మోడల్స్ ఉన్నాయి. ధరలు రూ.3,500 నుంచి రూ.45 వేల వరకూ ఉన్నాయి. ఎంటర్ప్రైజ్, రిటైల్, ఈ–కామర్స్ మూడు మాధ్యమాల్లో ఆర్డీపీ విక్రయాలుంటాయి. ఎంటర్ప్రైజ్లో కార్వీ, కేర్ ఆసుపత్రి, సేఫ్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రాబ్యాంక్, ఎయిర్ ఇండియా వంటి 3 వేలకు పైగా కంపెనీలు మా కస్టమర్లు. రిటైల్‌లో 26 ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్లున్నాయి. సొంత వెబ్‌సైట్‌తో పాటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే వంటి ఈ–కామర్స్ సంస్థల్లోనూ మా ఉత్పత్తులను కొనొచ్చు. తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం.. గత ఆర్ధిక సంవత్సరంలో 62 వేల ఉపకరణాలను విక్రయించాం. ఈ ఏడాది లక్షకు చేరాలని లకి‡్ష్యంచాం. ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా విక్రయాల్లో ల్యాప్‌టాప్ వాటా 40 శాతం. మా అమ్మకాల్లో డిస్ట్రిబ్యూషన్ల వాటా 30 శాతం, ఆన్లైన్ వాటా 15 శాతం వరకూ ఉంది. మన దేశంతో పాటూ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ విక్రయాలున్నాయి. మా వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం. ఎగుమతుల వాటా 5 శాతం. ఈ ఏడాది ముగిసేసరికి ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ల సంఖ్యను 100కు చేర్చాలని లకి‡్ష్యంచాం. అనంతపురంలో తయారీ కేంద్రం.. ఈ ఏడాది రూ.4 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఆయా ఉత్పత్తుల తయారీకి అవసరమైన విడిభాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. అనంతపురంలో 7 వేల చదరపు అడుగుల్లో తయారీ కేంద్రం ఉంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 65–70 వేలు. ప్రభుత్వం రాయితీలిస్తే విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నెలకు 50 వేల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఐఓటీ, ఏఐ ఆధారిత ఉపకరణాల అభివృద్ధిపై దృష్టిసారించాం. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు, విద్యా సంస్థలు, ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రూ.30 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం సంస్థలో 94 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది ఇంజనీర్లు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల ఆదాయాన్ని చేరాం. ఈ ఏడాది రూ.80 కోట్లు లకి‡్ష్యంచాం. 2020 నాటికి రూ.150 కోట్లు చేరుకోవాలనేది లక్ష్యం. 2019 నాటికి రూ.100 కోట్ల వాల్యుయేషన్‌తో 6 శాతం వాటాను విక్రయించేందుకు బ్రాండ్ క్యాపిటల్‌తో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాదిలో రూ.30 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. -
ప్రచారానికి సెలబ్రిటీలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సెలబ్రిటీలతో ప్రచారం అంటే కార్పొరేట్ సంస్థలకో లేక పెద్ద కంపెనీలకో పరిమితమైన విషయం. కానీ, దీన్నిప్పుడు చాలా సులభతరం చేసేసింది సెలబ్రిటీ హబ్! జస్ట్ మన బడ్జెట్‌ను ఎంటర్ చేస్తే చాలు అందుబాటులో ఉండే సెలబ్రిటీలు, ప్రముఖులను తెచ్చేస్తుంది. మరిన్ని వివరాలు సెలబ్రిటీ హబ్ చైర్మన్ జే చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఈ రోజుల్లో బ్రాండింగ్, ప్రచారం లేకపోతే వస్తువులు, ఉత్పత్తులను ప్రజలు ఆదరించట్లేదు. మరి, సెలబ్రిటీలు, ప్రముఖులతో ప్రచారం చేయించాలంటే వాళ్లు ఎక్కడుంటారో తెలియదు? ఎలా కలవాలో తెలియదు? ఒకవేళ కలిసినా మనకు టైమిస్తారో లేదో తెలియదు? ఇలా రకరకాల సమస్యలుంటాయి. వీటన్నింటికీ పరిష్కరించడమే సెలబ్రిటీ హబ్ ప్రత్యేకత. ప్రారంభోత్సవాలకు, బ్రాండింగ్ ప్రమోషన్ చేయించడం మా పని. 40 వేల మంది సెలబ్రిటీల నమోదు.. 2014లో విజయవాడ కేంద్రంగా సెలబ్రిటీ హబ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం 40 వేల మంది సెలబ్రిటీలతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో మోడల్స్లతో పాటూ టీవీ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలున్నారు. ఉత్తరాది టీవీ, చిత్ర పరిశ్రమలోని ఆర్టిస్టులు, సెలబ్రిటీల కోసం ముంబైకి చెందిన సిమ్కామ్ మోడల్ మేనేజ్మెంట్, జాకీ ఫెర్నాండెజ్, పినాకిల్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రారంభ ధర రూ.50 వేలు.. ప్రస్తుతం నెలకు 25 కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, మలేషియా, శ్రీలంక, దుబాయ్, అమెరికా దేశాల్లో సేవలందించాం. త్వరలోనే మలేషియా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాన్ని, ఏలూరు ఓ రియల్టీ సంస్థతో బ్రాండింగ్ కార్యక్రమానికి ఒప్పందం కుదిరింది. టీవీ ఆర్టిస్ట్‌ల ప్రారంభ ధర రూ.50 వేల నుంచి ఉన్నాయి. సినీ సెలబ్రిటీలైతే రూ.లక్ష నుంచి రూ.2 కోట్ల వరకుంది. క్రీడా ప్రముఖులైతే రూ.15 లక్షల నుంచి మొదలవుతుంది. వసతులు, ప్రయాణ ఖర్చులు, భద్రత, ఇతరత్రా అవసరాలన్నీ కూడా సెలబ్రిటీ హబ్బే కల్పిస్తుంది. రూ.30 కోట్ల వ్యాపార లక్ష్యం ప్రస్తుతం మా కంపెనీలో 16 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. గతేడాది రూ.15 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.30 కోట్లు లకి‡్ష్యంచాం. -
ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘టాపర్’ పేరులోనే కాదు.. నిజంగానూ విద్యార్థిని పై స్థాయిలో చూడాలనే తపనతోనే ప్రారంభమైనట్టుంది! ఒకటి కాదు రెండు కాదు ఒక్క పోటీ పరీక్షకు 5 లక్షల ప్రశ్నలతో సిలబస్‌ను తయారు చేసి అందిస్తుంది. దీంతో విద్యార్థి టాపర్‌గా నిలవడం పక్కా అంటున్నారు టాపర్.కామ్ కో–ఫౌండర్ హేమంత్ గోటే టీ. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఐఐటీ సీట్ కోసం తాను పడ్డ ఇబ్బందే టాపర్‌కు దారి చూపించిందంటున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... మాది పశ్చిమ గోదావరి జిల్లా. హైదరాబాద్‌లో స్కూల్, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక.. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత చౌపాటీ బజార్ అనే ఫోన్‌కామర్స్ స్టార్టప్‌లో ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా పనిచేశా. దీన్ని 2011లో ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సొంతంగా ఏదైనా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకొని.. చౌపాటీ బజార్లో సహోద్యోగీ జీశాన్ హయత్‌తో కలిసి 2013 ఏప్రిల్‌లో కోటి రూపాయల ఏంజిల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ముంబై కేంద్రంగా టాపర్‌ను ప్రారంభించాం. 50కి పైగా పరీక్షలు; ఒక్క దానికి 5 లక్షల ప్రశ్నలు.. 5–12 తరగతి వరకు బోర్డ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్, పోటీ పరీక్షల సిలబస్‌లు, మెటీరియల్స్ ఉంటాయి. జేఈఈ, యూపీఎస్ఈఈ, బిట్‌శాట్, ఎంసెట్, నీట్, ఎయిమ్స్ వంటి దేశంలోని అన్ని 50కి పైగా పోటీ పరీక్షల ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ వంటి అన్ని సబ్జెక్టులూ ఉంటాయి. మెటీరియల్స్‌తో పాటూ ఆన్లైన్లోనే ప్రాక్టీస్, మాక్ ఎగ్జామ్స్, లైవ్ చాట్‌లో సందేహాల నివృత్తితో పాటూ వాయిస్, వీడియో లెక్చర్స్, కంటెంట్ లభిస్తుంది. ఒక్క పరీక్షకు 5 లక్షలకు పైగా ప్రశ్నలను పొందవచ్చు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారం.. ప్రిపరేషన్ మెటీరియల్స్ ఏడాది, ఐదేళ్ల సబ్స్క్రిప్షన్స్ విధానంలో ఉంటాయి. ధరలు రూ.8 వేల నుంచి రూ.2.5 లక్షల వరకుంటాయి. ప్రస్తుతం టాపర్‌కు 30 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 1.50 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 లక్షల మంది విద్యార్థులుంటారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల యూజర్ల వాటా 60 శాతం పైనే ఉంటుంది. రూ.40 వేల సబ్స్క్రిప్షన్స్ యూజర్లే ఎక్కువగా ఉంటారు. గతేడాది రూ.50 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం. ఏడాదిలో యూజర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని.. నాలుగేళ్లలో 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. నెల రోజుల్లో హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్.. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్‌పూర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో 20 ఆఫీసులున్నాయి. నెల రోజుల్లో హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్నాం. జోద్‌పూర్‌కు చెందిన ఈసీప్రిప్‌ను, ముంబైకి చెందిన మంచ్.. రెండు ఎడ్యుకేషన్ స్టార్టప్స్‌ను కొనుగోలు చేశాం. నిధుల సమీకరణ తర్వాత మరొక స్టార్టప్‌ను దక్కించుకుంటాం. వచ్చే ఏడాది 5వ తరగతి లోపు పోటీ పరీక్షల సిలబస్‌లను ప్రవేశపెడతాం. ఆ తర్వాత విదేశాలకు చెందిన ఉపకారవేతనాలు, పోటీ పరీక్షల సిలబస్‌లకూ విస్తరిస్తాం. రూ.325 కోట్ల సమీకరణపై దృష్టి..: టాపర్లో మొత్తం 1,500 మంది ఉద్యోగులుంటే.. ఇందులో కంటెంట్ ప్రిపరేషన్ కోసం 500 మంది ఉన్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో కలిపి రూ.130 కోట్ల నిధులను సమీకరించాం. మరో రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మరో నలుగురు వెంచర్ క్యాపటలిస్ట్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. -
అట్టపెట్టెలో అందం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆడవాళ్లతో షాపింగ్ మీద బోలెడన్ని జోకులున్నాయి. ఎందుకంటే ఓ పట్టాన వదలరని! అందులోనూ కాస్మెటిక్స్ షాపింగ్‌కైతే మరీనూ! తోడు వెళ్లినవాళ్లకు నచ్చితే కొంటారు.. లేకపోతే బ్రాండ్ మేనేజర్ చెబితే ఓకే చేస్తారు. మహిళగా స్వయంగా ఇవన్నీ చూసే కాబోలు... హైదరాబాదీ అమ్మాయి లావణ్య సుంకరి దీన్నే ఓ వ్యాపార వేదికగా మలచుకుంది. నెలకు సరిపడే ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులను బాక్స్‌లో పెట్టి విక్రయించడం మొదలెట్టింది. నెలకు 500 ఆర్డర్లతో మొదలైన గ్లామ్‌ఈగో ప్రస్థానం.. ఏడాదిలో 50 వేల ఆర్డర్లకు విస్తరించింది. వివరాలు లావణ్య మాటల్లోనే.. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంబీఏలో మార్కెటింగ్ చేశాక.. జెట్ ఎయిర్వేస్లో హోస్టెస్‌గా చేరా. అక్కడి నుంచి దుబాయ్, ఐర్లాండ్‌లకు చెందిన రెండు నిర్మాణ సంస్థల్లో పనిచేశా. తర్వాత సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకొని.. కో–ఫౌండర్ ప్రభాకర్ దారక్పల్లితో కలిసి రూ.60 లక్షల పెట్టుబడితో గతేడాది మార్చిలో టీ–హబ్ కేంద్రంగా గ్లామ్ఈగోను ప్రారంభించాం. బాక్స్‌లో నెలకు సరిపడే ఉత్పత్తులు..: గ్లామ్‌ఈగో బాక్స్‌ల ఎంపిక పూర్తి శాస్త్రీయంగా జరుగుతుంది. నమోదు చేసుకున్న కస్టమర్‌ను ముందుగా చర్మం రంగు, జుట్టు తీరు, శరీర ఆకృతి వంటి వాటిపై 8 ప్రశ్నలడుగుతాం. వాటి సమాధానాలను బట్టి ఎలాంటి మేకప్ కిట్స్ నప్పుతాయో ఎంపిక చేసి వాటినే పంపిస్తాం. గ్లామ్‌ఈగో వద్ద నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది సబ్స్క్రిప్షన్ బాక్స్లుంటాయి. వీటి ధరలు వరుసగా నెలకు రూ.399, రూ.329, రూ.299, రూ.289. ఒక్కో బాక్స్‌లో మేకప్ కిట్స్, స్కిన్, ఫేస్, బాడీ కేర్ ఉత్పత్తులు 4–5 వరకూ ఉంటాయి. అన్నీ ఆయుర్వేదిక్ బ్రాండెడ్ ఉత్పత్తులే. ఉదాహరణకు అమెరికాకు చెందిన మన్నాకాదర్, రష్యాకు చెందిన స్వేర్ సీక్రెట్, ఎంకెఫైన్ బ్రాండ్లున్నాయి. ప్రతి నెలా బ్రాండ్లు మారుతాయి కూడా. గత ఏడాది కాలంలో 40 బ్రాండ్ల ఉత్పత్తులను వినియోగించాం. రూ.19 కోట్ల నిధుల సమీకరణ.. హైదరాబాద్‌లోని చిరెక్ పబ్లిక్ స్కూల్ దగ్గర 8 వేల చ.అ.ల్లో గిడ్డంగి ఉంది. త్వరలోనే షాద్‌నగర్‌లో మరో వేర్‌హౌజ్‌ను ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది పురుషుల సౌందర్య ఉత్పత్తులను కూడా విక్రయిస్తాం. జూన్ నాటికి గ్లామ్ఈగోలో ఆయా బ్రాండ్ల ఉత్పత్తులను విడిగా కొనొచ్చుకూడా. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ–కామర్స్ ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరింత మందిని నియమిస్తున్నాం. ఈ ఏడాది చివరికి రూ.19 కోట్లు సమీకరిస్తాం. వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో చర్చిస్తున్నాం. హైదరాబాద్ వాటా 18–20 శాతం.. ప్రస్తుతం నెలకు 50 వేల ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి 18–20 శాతం వాటా ఉంటుంది. మా కస్టమర్లలో ఎక్కువ 18–34 ఏళ్ల మధ్య వయస్సు వారు.. అందులోనూ కార్పొరేట్ మహిళా ఉద్యోగులే. మాకొచ్చే సబ్స్క్రిప్షన్లలో 6 నెలల వాటా 50 శాతం వరకుంటుంది. బ్లూడార్ట్, డీటీడీసీ, ఫస్ట్ ఫ్లయిట్, డెల్హివెరి వంటి అన్ని ప్రధాన కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. 38 వేల పిన్‌కోడ్స్‌లో డెలివరీ అందిస్తున్నాం. ఏడాదిలో రూ.6 కోట్ల వ్యాపారాన్ని చేరాం. వచ్చే ఏడాది ఆర్డర్ల సంఖ్య లక్షకు, వ్యాపారం రూ.18 కోట్లకు చేర్చాలని లకి‡్ష్యంచాం. -
కేన్సర్ ఔషధాలకూ రాయితీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫోన్లు, దుస్తులే కాదు ఔషధాలూ డిస్కౌంట్లతో ఆన్లైన్లో కొనడం మనకు తెలిసిందే. కానీ, కేన్సర్, గుండె జబ్బులు వంటి ఖరీదైన మందులు సైతం రాయితీలో దొరకటమంటే కష్టం. అందుకే దీన్నే వ్యాపారంగా మార్చి ‘కోమెడ్జ్.కామ్’ను ఆరంభించారు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీహరి అరిగె. వ్యక్తిగత అవసరాలతో పాటు స్థానిక రిటైల్ మందుల షాపులకూ ఔషధాలను అందించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు వ్యవస్థాపకుడు శ్రీహరి మాటల్లోనే... ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఐటీలో ఉద్యోగ రీత్యా లండన్కెళ్లా. కుటుంబ వ్యాపారం మెడికల్ స్టోర్ కావటంతో దీనికి టెక్నాలజీని జోడించా. రూ.కోటి పెట్టుబడులతో గతేడాది ఆగస్టులో కోమెడ్జ్.కామ్‌ను ప్రారంభించా. ప్రస్తుతం కోమెడ్జ్.కామ్‌లో 80 వేలకు పైగా ఔషధాలున్నాయి. సాధారణ మందులతో పాటూ మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్ చికిత్స వంటి ఖరీదైన మందులు, పోషకాహార ఉత్పత్తులు, మాతాశిశు సంరక్షణ ఔషధాలు, ఆయుర్వేద మందులు కూడా లభిస్తాయి. ప్రస్తుతం నెలకు 3,000–5,000 ఆర్డర్లు వస్తున్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకుంటుంది. నెలకు రూ.లక్ష వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. వెయ్యి పైన ఆర్డర్‌కు ఉచిత డెలివరీ, 22 శాతం డిస్కౌంట్ ఉంటుంది. వెయ్యి లోపయితే రూ.50 డెలివరీ చార్జీ, 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ప్రస్తుతం మాకు 800 మంది కస్టమర్లున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. కేన్సర్, గుండె జబ్బుల మందుల ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కారణం డిస్కౌంట్లే. హైదరాబాద్‌లో మందుల డెలివరీ కోసం సొంతంగా 15 మంది సిబ్బందిని నియమించుకున్నాం. ఇతర నగరాల్లో డెలివరీ కోసం తపాలా శాఖతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే ల్యాబ్ పరీక్షలను అందించాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగిసేసరికి 5 వేల మంది కస్టమర్లు, నెలకు రూ.కోటి వ్యాపారం చేయాలని లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగింపులోగా రూ.10 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. -
ఆఫీసుకొచ్చారా.. సెల్ఫీ ఇవ్వండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘సెల్ఫీ’.. సెల్‌ఫోన్ వినియోగదారులకు పరిచయం చేయాల్సిన పనిలేదేమో! ప్రమాదాలు కోరితెచ్చుకున్న వాళ్లనూ చూశాం. కానీ, అదే సెల్ఫీతో వ్యాపారం చేసేవాళ్లూ పెరుగుతున్నారు. రెగ్యులర్.లి... ఆ కోవలోదే. సెల్ఫీతో హెచ్ఆర్ సేవలందిస్తోంది. వివరాలు వ్యవస్థాపకుడు అవిజిత్ సర్కార్ మాటల్లోనే... ‘‘గతంలో ఉద్యోగులు, విద్యార్థులు, మార్కెటింగ్ వారు ఎవరైనా సరే.. హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకం చేసేవారు. తర్వాత బయోమెట్రిక్స్.. ఇకిప్పుడు ఐరిస్, ఫేసియల్ స్కానర్లు వచ్చేశాయి. వీటిలో దేనికైనా నిర్వహణ వ్యయం కాసింత ఎక్కువ. కానీ, సెల్ఫీ ఫొటోనే అటెండెన్స్ రిజిస్టర్‌లా మార్చేస్తే ఈ వ్యయం ఉండదుగా అనే ఆలోచన వచ్చింది. ఇంకేముంది మాతృసంస్థ అయిన అవీఫా ఇన్ఫోటెక్ బృందంతో కలిసి రెగ్యులర్.లి పేరిట క్లౌడ్ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేశాం. రూ.4 లక్షలతో గతేడాది ఆగస్టులో కోల్‌కతా కేంద్రంగా ప్రారంభించాం. ఎలా పనిచేస్తుందంటే? ఇది క్లౌడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రెగ్యులర్ యాప్‌లో ఒప్పంద కంపెనీకి ప్రత్యేక ఖాతా తెరిచి అందులో వారి ఉద్యోగులను నమోదు చేయాలి. ఉద్యోగి ఆఫీసు పరిసరాల్లోకి చేరగానే ఆటోమేటిక్‌గా యాప్‌కు అనుసంధానమై పోతాడు. అందులో ఉన్న చెకిన్ బటన్‌ను నొక్కగానే సెల్ఫీతో కూడిన హాజరు నమోదవుతుంది. ఇది నేరుగా యాజమాన్యానికి చేరిపోతుంది. అంతే!! స్మార్ట్‌ఫోన్ లేని ఉద్యోగులు ఆఫీసులోని లాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా చెకిన్ కావచ్చు. ఇందులో క్యూఆర్ లేదా బార్ కోడ్ ఉంటుంది. దాన్ని ఫొటో ఐడీతో స్కాన్ చేయగానే సెల్ఫీతో కూడా చెకిన్ అవుతుంది. జీపీఎస్, వైఫై ఎస్ఎస్ఐడీ ఆధారంగా ఔట్‌డోర్ ఉద్యోగుల ఫీల్డ్ ట్రాకింగ్ కూడా చేస్తుంది. యాజమాన్యానికి ఉద్యోగి లొకేషన్ మ్యాప్స్ ద్వారా కనిపిస్తుంటుంది. జీతభత్యాలు; ప్రదర్శన సేవలు కూడా.. హాజరు నమోదొక్కటే కాదు. సమయ పాలన, పనితీరు నివేదికలు, సెలవుల నిర్వహణ సేవలూ ఈ యాప్‌తోనే నిర్వహించుకునే వీలుంది. ఒప్పందం కంపెనీల హెచ్ఆర్ విభాగం పనిభారాన్ని తగ్గించేందుకు వచ్చే ఏడాది తొలి త్రై మాసికం నాటికి జీతభత్యాల నిర్వహణ సేవలను కూడా అందిస్తాం. జీపీఎస్, వైఫైలకు లాకింగ్స్ ఉంటాయి. కాబట్టి భద్రత విషయంలోనూ అనుమానాలవసరం లేదు. 60 కంపెనీలు; 10 వేల ఉద్యోగులు.. ప్రస్తుతం ఇండియాతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో సేవలందిస్తున్నాం. లెన్స్‌కార్ట్, వెస్ట్‌విండ్, సరళ్ డయాగ్నస్టిక్స్, నానో ఐడీ, గ్రాబ్ ట్యాక్సీ వంటి 60కి పైగా సంస్థలు మా కస్టమర్లుగా ఉన్నాయి. వీటిలో 10 వేలకు పైగా ఉద్యోగుల అటెండెన్స్‌ను మేం నిర్వహిస్తున్నాం. చార్జీలు నెలకు ఒక యూజర్‌కు 1 డాలర్. రూ.6 కోట్ల నిధుల సమీకరణ..: జూలై నాటికి బ్రేక్‌ఈవెన్‌కొస్తాం. ఈ ఏడాది ముగిసే నాటికి 200 మంది కస్టమర్లను చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో ఐదుగురు ఉద్యోగులున్నారు. తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. పలువురు వీసీ ఇన్వెస్టర్లు రూ.6 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. కానీ విస్తరణ తర్వాతే సమీకరిస్తాం’’‘ అని అవిజిత్ వివరించారు. -
ఫెస్టివ్యా.. హస్తకళ ఆభరణాల వేదిక!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో దొరకనిదంటూ లేని ఈ రోజుల్లో ఎంతో విలువైన భారతీయ హస్తకళలు మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయాయి. ఈ అవకాశాన్ని వ్యాపార సూత్రంగా మలుచుకుంది ఫెస్టివ్యా. మన దేశ హస్తకళలకు విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను గుర్తించి ఫెస్టివ్యా.ఇన్ను ప్రారంభించింది. ఆన్లైన్ వేదికగా స్థానిక హ్యాండ్‌మేడ్ జువెలరీని విక్రయించడమే దీని పని. మన దేశంతో పాటూ అమెరికా, యూకే, సింగపూర్, మలేషియా వంటి ఆరేడు దేశాల్లో విక్రయాలు సాగిస్తోంది. మరిన్ని వివరాలు ఫెస్టివ్యా సీఈఓ సురేష్ రాధాకృష్ణన్ నాయర్, మాటల్లోనే.. 37 మంది డిజైనర్స్; 3,700 ఉత్పత్తులు.. ‘‘2016 మేలో రూ.20 లక్షల పెట్టుబడితో మాథ్యూ అబ్రహం రాయ్, రాహుల్ ఆర్, నిక్కీ జోసెఫ్‌తో కలిసి దీన్ని ప్రారంభించాం. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన 37 మంది డిజైనర్ వర్తకులతో ఒప్పందం ఉంది. ఇందులో ఆనోకి, ఆరాధ్య, దిశా, అవతరణ, ఎత్నిక్ మ్యాజిక్స్, మీరా, కళాధర్ వంటి డిజైనర్స్‌కు చెందిన 3,700 రకాల ఆభరణాలున్నాయి. నగలు, గాజులు, చెవిదిద్దులు, ముక్కుపుడకలు, పట్టీలు వంటి ఉన్నాయి. ధరలు రూ.250 నుంచి రూ.6 వేల వరకున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,500.. ప్రస్తుతం 3 వేల మంది రిజిస్టర్ కస్టమర్లున్నారు. ఇందులో మిస్ ఇండియా యూనివర్స్ 2017 శ్రేయా కృష్ణన్‌తో పాటూ పలువురు వ్యాపార ప్రముఖులున్నారు. ఫెస్టివ్యా వెబ్‌సైట్‌తో పాటూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఆర్డర్ రాగానే వర్తకుడికి ఉత్పత్తుల ప్యాకింగ్ కోసం బాక్స్‌లు, లేబుల్స్ ఇస్తాం. ఉత్పత్తి తయారీ పూర్తవ్వగానే వాటిని ప్యాకింగ్ చేయగానే స్థానిక లాజిస్టిక్ సంస్థ వాటిని సేకరించి కస్టమర్‌కు పంపిస్తుంది. ఫెడెక్స్, డీటీపీసీ, గతి వంటి ఆరేడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం నెలకు 250కి పైగా ఆర్డర్లొస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. వారం రోజుల్లో వైజాగ్, హైదరాబాద్ డిజైన్స్.. వారం రోజుల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌కు హస్తకళ ఆభరణాలను జోడించనున్నాం. వైజాగ్ నుంచి టెర్రకోట, హైదరాబాద్ నుంచి పట్టుదారంతో చేసే గాజులు, నగలు తయారు చేసే 10 మంది వర్తకులను ఎంపిక చేశాం. తొలిదశలో నలుగురితో ప్రారంభిస్తాం. డిజైనర్స్ పేరు మీదే ఉత్పత్తులను విక్రయించడం మా ప్రత్యేకత. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. వర్తకుడి నుంచి అమ్మకం విలువలో 30 శాతం కమీషన్‌గా తీసుకుంటాం. ఈ ఏడాది ముగిసే నాటికి 200 మంది వర్తకులు, కోటి రూపాయల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం 9 మంది ఉద్యోగులున్నారు. ఏప్రిల్ నాటికి రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం. అమెరికా నుంచి పలువురు ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. కానీ, దేశీయంగానే నిధులు సమీకరించాలని నిర్ణయించాం. ఒకరిద్దరు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం’’ అని సురేశ్ వివరించారు. -
పిల్లలకు ఏం కావాలన్నా... అద్దెకే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, బైకులు అద్దెకు తీసుకోవడం మనకు తెలుసు. ఈ మధ్య ఇంట్లోకి కావాల్సిన బెడ్లు, వాషింగ్ మిషన్, టీవీ, ఎలక్ట్రానిక్స్ వంటివీ అద్దెకిస్తున్నారు. కానీ, పిల్లల ఉత్పత్తులు, వృద్ధుల ఉపకరణాలు ఎవరైనా అద్దెకిస్తున్నారా? ఇదిగో... ‘రెంటికిల్’ పని ఇదే. పిల్లల మంచాలు, పరుపులు, ఆట వస్తువులు, బ్యాగులు.. వృద్ధులకవసరమైన చేతికర్రలు, వీల్ చెయిర్ల వంటివి అద్దెకిచ్చేందుకు రెడీ అవుతోందీ సంస్థ. మరిన్ని వివరాలు రెంటికిల్ కో–ఫౌండర్ వినీత్ చావ్లా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ముంబై వర్సిటీలో ఎంబీఏ చేశాక ఒరిఫ్లేమ్ కాస్మొటిక్స్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరా. తర్వాత గోద్రెజ్, వర్ల్‌పూల్, ఫ్యూచర్ గ్రూప్స్‌ల్లో వివిధ హోదాల్లో పనిచేశా. తరవాత హాంకాంగ్‌కు చెందిన వినాలైట్ గ్రూప్‌కు ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించా. అన్నిచోట్లా నాకు ఎదురైన అనుభవమే రెంటికిల్ స్టార్టప్‌కు పునాది వేసింది. ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో, దేశాల్లో ఉండేటపుడు ప్రతిచోటా ఇంట్లోకి వస్తువులు కొనడం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి శ్రమతో పాటూ డబ్బూ వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగానే అమిత్ సోదితో కలిసి రూ.30 లక్షల పెట్టుబడితో 2015 నవంబర్‌లో గుర్గావ్ కేంద్రంగా రెంటికిల్.కామ్‌ను ప్రారంభించాం. 150 రకాల కేటగిరీల్లో ఉత్పత్తులు.. ప్రస్తుతం లైఫ్ స్టయిల్, హోమ్ అప్లియెన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి 150 విభాగాలకు చెందిన ఉత్పత్తులున్నాయి. పడక మంచాలు, పరుపులు, వార్డ్రోబ్, డ్రెస్సింగ్, డైనింగ్ టేబుల్, లైట్లు, సోఫా, టీవీ, ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రో ఓవెన్, వాషింగ్ మిషన్ ఇలా ఇంటికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువూ అద్దెకు తీసుకోవచ్చు. వీటిలో ఫర్నీచర్‌ను మేమే సొంతగా ఢిల్లీలోని మా కేంద్రంలో తయారు చేస్తున్నాం. గృహోపకరణాల్ని కొని నిల్వచేస్తున్నాం. మిగిలిన ఉత్పత్తుల కోసం సంబంధిత తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మార్చి నాటికి పిల్లలు, వృద్ధులకు అవసరమైన ఉత్పత్తులతో పాటు, జిమ్ ఉపకరణాలను కూడా అద్దెకిస్తాం. రూ.26 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, గుర్గావ్, నోయిడాలో సేవలందిస్తున్నాం. అక్కడ గిడ్డంగులూ ఉన్నాయి. వచ్చే నెలలో బెంగళూరులో... ఈ ఏడాది ముగిసేలోగా ముంబై, పుణె నగరాల్లో సేవలు ఆరంభిస్తాం. ఇప్పటివరకు 10 వేల మంది మా సేవలను వినియోగించుకున్నారు. ‘ఓయో’ రూమ్స్‌లో వాడే వస్తువులన్నీ మా దగ్గర అద్దెకు తీసుకున్నవే. ప్రస్తుతం నెలకు 1,500 ఆర్డర్లు, రూ.5 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. 60 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల క్రితం ఈక్విటీ రూపంలో రూ.26 కోట్ల నిధులను సమీకరించాం. సింగపూర్‌కు చెందిన వీసీ సంస్థ థింక్యూవేట్, సీఎక్స్ పార్టనర్‌కు చెందిన అజయ్ రెలాన్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది చివర్లో మరో విడత నిధులను సమీకరిస్తాం’’ అని చావ్లా వివరించారు. హైదరాబాద్ వాటా 30 శాతం.. రెంటికిల్ వెబ్సైట్లోకి లాగినయ్యాక.. కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పాన్, ఆధార్ నంబర్లతో పాటూ బ్యాంక్ స్టేట్మెంట్ వంటి వివరాలివ్వాలి. కేవైసీ పూర్తయ్యాక.. 5–7 రోజుల వ్యవధిలో ఉత్పత్తులు ఉచితంగా ఇంటికి డెలివరీ అవుతాయి. రిటర్న్స్ కూడా అంతే! అద్దె నెలకు సంబంధిత వస్తువు ధరలో 2–3 శాతం వరకుంటుంది. మా మొత్తం వ్యాపారం, ఆర్డర్లలో హైదరాబాద్ వాటా 30 శాతం వరకూ ఉంది. -
అంబులెన్స్ అడ్డా ‘స్టాన్‌ప్లస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుయ్.. కుయ్.. కుయ్‌మంటూ వచ్చే అంబులెన్స్ క్షణం ఆలస్యమైతే? ప్రాణం ఖరీదవుతుంది! నిజం, ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోని పోయిర్సన్ విషయంలో జరిగిందిదే. చేతిలో డబ్బుతో.. బృందంతో.. పక్కా ప్రణాళికతో ఇండియాకు వచ్చాడు సోలార్ ప్లాంట్ పెడదామని! కానీ, ‘తానొకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలచినట్లు’ సోలార్ ప్లాంట్ కాస్త స్టాన్‌ప్లస్ అత్యవసర వైద్య సేవల కంపెనీగా మారింది. అసలేం జరిగిందో ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు కంపెనీ కో–ఫౌండర్లు ఆంటోని పోయిర్సన్, జోసీ లియోన్, ప్రదీప్ సింగ్. అది వారి మాటల్లోనే చూద్దాం... ‘‘రాజస్థాన్‌లో సోలార్ ప్లాంట్ పెట్టాలని 2013లో ఫ్రాన్స్ నుంచి ఇండియాకొచ్చా. ఆ సమయంలో నా బృందంలోని ఓ సహచరుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే మేం అంబులెన్స్‌కు ఫోన్ చేశాం. కానీ, లాభం లేకపోయింది! అంబులెన్స్ ఆలస్యంగా వచ్చింది. పైగా ఆసుపత్రికి వెళ్లటానికి 3 గంటలు పట్టింది. ఆ అంబులెన్స్‌లో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలూ లేవు. అందులోని సిబ్బంది శిక్షణ ఉన్నవారు కూడా కాదు. ఇవన్నీ నా మనసులో బలమైన ముద్రవేశాయి. రెండేళ్ల తర్వాత ఫ్రాన్స్‌లోని ఇన్సీడ్లో (బిజినెస్ స్కూల్ ఫర్ వరల్డ్) ఎంబీఏలో చేరా. అక్కడ చండీగఢ్‌కు చెందిన ప్రదీప్ సింగ్‌తో పరిచయమైంది. తను ఫార్మాసూటికల్ రంగం నుంచి వచ్చాడు. ఓ రోజు మా ఇద్దరి మధ్య దేశంలోని అత్యవసర వైద్య సేవల గురించి చర్చ జరిగింది. అప్పుడే... దేశంలో అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకుని.. ఇన్సీడ్లోని మరో స్నేహితుడు కోస్టారికాకు చెందిన జోసి లియోన్‌తో కలిసి స్టాన్ప్లస్కు ప్రాణం పోశాం. స్టార్టప్ ఎక్కడ పెట్టాలని బెంగళూరు, ముంబై, పుణె, హైదరాబాద్ నగరాలను పరిశీలించాం. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, వాతావరణం, మార్కెట్ అవకాశాల దృష్ట్యా హైదరాబాద్ కేంద్రం గా రూ.50 లక్షల పెట్టుబడితో 2016 సెప్టెంబర్‌లో ప్రారంభించాం. అంబులెన్స్‌తో పాటు కాల్ సెం టర్, డ్రైవర్లు, పారా మెడికల్ స్టాఫ్ ఇతరత్రా నిర్వహణ సేవలన్నీ అందించడమే స్టాన్‌ప్లస్ ప్రత్యేకత. 300 వాహన; 8 ఎయిర్ అంబులెన్స్‌లు.. అత్యవసర వైద్య సేవలతో పాటూ, వాహనాన్ని జీపీఆర్ఎస్తో అనుసంధానించటం వల్ల వాహన వేగం, ట్రాఫిక్ రద్దీ, ఆసుపత్రికి చేరే సమయం ప్రతి ఒక్కటీ ట్రాక్ అవుతుంటుంది. పేషెంట్ మెడికల్ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆసుపత్రికి చేరేలోపు సంబంధిత ఆసుపత్రికి చేరవేస్తాం. దీంతో పేషెం ట్‌కు మరింత వేగంగా చికిత్స అందించే వీలుంటుం ది. ప్రస్తుతం స్టాన్ప్లస్లో 300 అంబులెన్స్‌లున్నాయి. ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం 8 సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో స్టాన్ మూవ్ పేరిట మెడికల్ యుటిలిటీ వెహికిల్ (ఎంయూవీ) సేవలు ప్రారంభిస్తాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. వాహనంలోని సీట్లను పూర్తిగా మారుస్తాం. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పేషెంట్‌కు సౌకర్యవంతంగా వీల్ చెయిర్‌తో సహా అంబులెన్స్‌లో ఎక్కొచ్చు. 360 డిగ్రీల కోణంలో సీటు తిరుగుతుంది. వచ్చే 3 నెలల్లో బైక్ అంబులెన్స్‌లనూ ప్రారంభిస్తాం. నెలకు 2 వేల బుకింగ్స్.. ప్రస్తుతం తెలంగాణ మొత్తం, ఏపీలో ఏలూరులో మాత్రమే స్టాన్‌ప్లస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి సన్‌షైన్, శ్రీకర, ఓమ్నీ, నైటింగేల్స్, మల్లారెడ్డి నారాయణ, హిమగిరి, కాల్హెల్త్, సిటిజెన్స్ స్పెషాలిటీ, హోలిస్టిక్ వంటి 15 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. నెల రోజుల్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు పట్టణాలకు విస్తరిస్తాం. ఆయా ప్రాంతాల్లో 20 ఆసుపత్రులతో ఒప్పందమైంది. ప్రతి కిలోమీటర్‌కు రూ.15–30 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం నెలకు 2,000 ఆర్డర్లొస్తున్నాయి. నెలనెలా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 10 వేల మంది మా సేవలు వినియోగించుకున్నారు. 6 నెలల్లో రూ.65 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం 68 మంది ఉద్యోగులున్నారు. జూన్ నాటికి రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. రెండు నెలలక్రితం కలారీ క్యాపిటల్ నుంచి రూ.8 కోట్ల నిధులను సమీకరించాం. మరో 6 నెలల్లో రూ.65 కోట్ల నిధులు సమీకరిస్తాం. దేశంలోని అతిపెద్ద వీసీ ఫండ్‌తో చర్చలు జరుగుతున్నాయి. మరో 6 నెలల్లో డీల్ క్లోజ్ అవుతుంది’’ అని ప్రదీప్‌సింగ్‌తో కలిసి జోయిర్సన్ వివరించారు. -
వైద్య దిక్సూచి ‘కేర్ మోటో’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘పండగొస్తుంది. షాపింగ్కెళతాం. అక్కడి డ్రెస్సుల్లో ఒకటి ఎంపిక చేసి.. మనకు నప్పుతుందో లేదో ట్రయల్ వేసుకొని మరీ చూస్తాం. నచ్చితే ఒకే! లేకపోతే ఇంకోటి చూస్తాం! కుదరకపోతే వేరే షాపుకెళతాం’’ ఇందులో మనకయ్యే ఖర్చేమీ ఉండదు! మరి దీన్నే వైద్య సేవలకు అన్వయిస్తే...‘‘సుస్తీ చేస్తే దగ్గర్లోని ఆసుపత్రికెళతాం. మందులు వాడతాం. తగ్గలేదంటే మరో ఆసుపత్రికెళతాం. మళ్లీ మందులు వాడతాం. ఈ లోపు స్నేహితులో, బంధువులో మరో వైద్యుడిని సూచిస్తే అక్కడికీ వెళతాం’’ కానీ వెళ్లిన ప్రతి ఆసుపత్రిలో డాక్టర్ కన్సల్టేషన్, పరీక్షలు, మందులు ఖర్చులు తడిసిమోపడవుతాయి! పై రెండు ఉదాహరణలతో తెలిసిందొక్కటే.. విండో షాపింగ్‌లా ట్రీట్మెంట్ షాపింగ్ ఉచితంగా దొరకదని! దీన్నే వ్యాపారంగా మార్చుకున్నారు నిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సర్జన్‌గా ఉన్న డాక్టర్ నిరంజన్ రావూరి. 2016 ఏప్రిల్‌లో హైదరాబాద్ కేంద్రంగా కేర్మోటో.కామ్‌ను ఆరంభించారు. సంస్థ సేవలు, ఇతర వివరాలను ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. సాధారణంగా పేషెంట్లు 3 రకాలు. ఆరోగ్య బీమాతో చికిత్స చేయించుకునేవాళ్లు, బీమా లేకుండా డబ్బుతో చికిత్స చేయించుకునే వాళ్లు, ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వాళ్లు. నిజానికి 60 శాతం పేషెంట్లు బీమాతో చేయించుకునేవారే. వీళ్ల సమస్యేంటంటే.. ఏ జబ్బుకు ఏ ఆసుపత్రి, ఏ వైద్యుడు సరైన చికిత్స చేస్తాడో తెలియదు. డబ్బులు వృథా చేస్తుంటారు. రోజూ పేషెంట్లు వచ్చి నాకు చెప్పే బాధలే కేర్మోటో.కామ్‌కు పునాది వేశాయి. ట్రీట్మెంట్ షాపింగ్ ఖర్చును నివారించి ఏ రోగానికి ఏ ఆసుపత్రిలో సరైన చికిత్స అందుతుందో.. అది కూడా అందుబాటు ధరల్లో ఎక్కడ ఉంటుందో చెప్పడమే కేర్మోటో.కామ్ పని. 6 నెలల్లో మార్కెట్లోకి ఐఓటీ పరికరం.. ప్రస్తుతం మా వద్ద 30 మంది ఉద్యోగులున్నారు. వైద్య పరిభాషతో పాటూ ఏ జబ్బుకు ఎలాంటి చికిత్స ఉంటుందనే అంశాలపై శిక్షణ ఇచ్చిన తర్వాతే ఉద్యోగులను నియమించుకుంటాం. ఐఓటీ ఆధారిత మెడికల్ డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 40 శాతం అభివృద్ధి పూర్తయింది. మరో 6 నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఇదేంటంటే.. డివైజ్‌ను కొన్న కస్టమర్ బీపీ, షుగర్, హృదయ స్పందన వంటి వివరాలు ఎప్పటికప్పుడు క్లౌడ్ ఆధారంగా కేర్మోటోకు చేరుతాయి. ఎలాంటి తేడాను గుర్తించినా.. వెంటనే కస్టమర్‌కు సమాచారం పంపిస్తాం. వెంటనే కస్టమర్ దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించే వీలుంటుంది. 3 నెలల్లో రూ.6 కోట్ల సమీకరణ.. 2 నెలల్లో డయోగ్నస్టిక్, ఆరోగ్య బీమా, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ సేవలు ప్రారంభిస్తాం. తొలిదశలో 10 సెంటర్లతో ఒప్పందం చేసుకుంటాం. ఇప్పటివరకు కేర్మోటోలో వ్యక్తిగతంగా రూ.కోటి పెట్టుబడి పెట్టా. విస్తరణ కోసం రూ.6 కోట్లు సమీకరిస్తున్నాం. ఒకరిద్దరు వీసీ ఇన్వెస్టర్లతో చర్చించాం.3 నెల ల్లో డీల్ క్లోజవుతుంది. కర్ణాటక, తమిళనాడులో 40 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని విస్తరిస్తున్నాం. 100 ఆసుపత్రులు.. 300 మంది వైద్యులు.. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటూ విజయవాడ, వైజాగ్, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కాకినాడల్లోని సుమారు 100 ఆసుపత్రులు, 300 మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నాం. వైద్య ఖర్చులను సమకూర్చేందుకు మిలాప్, ఇంపాక్ట్ గురు వంటి క్రౌడ్‌ఫండింగ్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఈ మధ్యే శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తికి కాలేయ మార్పిడికి మిలాప్ ద్వారా నిధులు సమీకరించాం. కాలేయ దాత దొరకగానే చికిత్స మొదలవుతుంది. కేర్మోటోకు 2.64 లక్షల యూజర్లున్నారు. 4,767 కన్సల్టేషన్స్ పూర్తి చేశాం. మా ద్వారా 1,049 సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం రోజుకు 120 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో మెకాళ్ల మార్పిడి, కంటి శుక్షాల చికిత్స, కాలేయ మార్పిడి వంటి వ్యాధులకు సంబంధించిన ఫోన్లే ఎక్కువగా ఉంటున్నాయి. 70 శాతం కేసులను నిమ్స్, ఎంఎన్‌జే, పుట్టపర్తి ఆసుపత్రులకే సూచిస్తుంటాం. -
పరిశోధన మీది.. పెట్టుబడి మాది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హవాయ్‌కు చెందిన ఓ రీసెర్చ్ స్కాలర్ ‘అగ్నిపర్వతాల నుంచి విద్యుత్ తయారీ’ అంశాన్ని శోధిస్తున్నాడు. జర్మనీకి చెందిన మరో స్కాలర్ ‘మైక్రోసెన్సార్లతో భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని ఎలా చేయాలి’ అనేది పరిశోధిస్తున్నాడు. ఢిల్లీకి చెందిన ఇంకో రీసెర్చర్ ‘డ్రోన్లు, సెన్సార్ల ఆధారంగా గాలి, కాలుష్యం స్థాయి ఎలా ఉంటుందోనని’ చూస్తున్నాడు. ..ఇలా ఒకటి, రెండూ కాదు!. సైన్స్, సామాజిక అంశాలపై 30కి పైగా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. వీటన్నింటికీ వేదిక మన తెలుగు కుర్రాడి స్టార్టప్ ‘రీసెర్చ్ ఫండర్స్’!! నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అకీరా పీఎస్ ప్రారంభించిన రీసెర్చ్ ఫండర్స్ గురించి మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... ‘‘రీసెర్చ్ స్కాలర్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్యలు.. నిధులు, మార్గదర్శనం, పరిశోధన పరికరాలు. ఇక ల్యాబ్, ఆర్అండ్డీ కోసమైతే కోట్లలోనే ఖర్చవుతుంది. కానీ, ప్రభుత్వమిచ్చే నిధులు 40 శాతమే. మిగిలిన మొత్తాన్ని స్కాలర్లు సమకూర్చుకోలేక మధ్యలోనే పరిశోధనలు నిలిపేస్తున్న సంఘటనలు బోలెడు. ‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ’ అంశంపై ఎంఎస్ చేస్తున్న సమయంలో నాకూ ఇవన్నీ ఎదురయ్యాయి. దీనికి పరిష్కారం చూపే క్రమంలోనే ‘రీసెర్చ్ ఫండర్స్.ఓఆర్జీ’ సంస్థను ప్రారంభించా. రూ.18 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్‌లో మొదలైంది. రీసెర్చ్ స్కాలర్లు, ఇన్వెస్టర్లను కలపడమే మా పని. అంటే రీసెర్చ్ అకడమిక్‌కు మాది ఒక సామాజిక వేదికన్న మాట. స్కాలర్లకు రూ.1.4 కోట్ల నిధులు.. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనమిక్స్, డాటా సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్ వంటి 25కి పైగా సబ్జెక్ట్‌ల్లోని పరిశోధనలను మా వేదికపై నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 30కి పైగా పరిశోధన ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. మన దేశంతో పాటు జర్మనీ, యూకే, సింగపూర్ దేశాల నుంచి కూడా పరిశోధనలున్నాయి. రీసెర్చ్ ఫండర్స్‌లో 7 వేల మంది ఇన్వెస్టర్లు (బ్రాకర్స్) నమోదయ్యారు. ఇప్పటివరకు రీసెర్చ్ స్కాలర్స్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.4 కోట్ల నిధులను సమీకరించారు. నమోదు ఉచితమే, కానీ.. రీసెర్చ్ ఫండర్స్‌లో పరిశోధనల నమోదు ఉచితమే. కాకపోతే, నిధులు పొందాక దాన్లో 5 శాతం, ల్యాబ్‌కైతే 10 శాతం రీసెర్చ్ ఫండర్స్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి, ఇన్వెస్టర్లకేం ప్రయోజనమంటే.. రీసెర్చ్ స్కాలర్లు తమ పరిశోధన పూర్తయ్యాక దాని ఫలితాలను వారికి ఫండింగ్ ఇచ్చిన వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో రూ.12 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశాం. హైదరాబాద్‌లో ఏఐ ఆర్అండ్డీ ల్యాబ్.. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. దేశంలో ఆర్ అండ్ డీ పరిశ్రమ విలువ 48 బిలియన్ డాలర్లు. పలు ఆర్అండ్డీ వర్సిటీలు, ప్రైవేట్ సంస్థల సహకారంతో హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అకడమిక్ రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం కేంద్ర పరిశోధన విభాగం(సీబీడీ) తోనూ చర్చలు జరిపాం. కలారీ క్యాపిటల్ ‘కే స్టార్ట్’ కార్యక్రమంలో రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. తొలి విడత చర్చలూ ముగిశాయి’’ అని అకీరా వివరించారు. అకీరా పీఎస్‌కు జర్మనీ ఫెలోషిప్.. అకీరా పీఎస్ అసలు పేరు పరిశణబోయిన శ్రవణ్ కుమార్. హైదరాబాద్‌లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఉద్యోగం రాకపోవటంతో జేఎన్టీయూలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపై ఎంఎస్‌లో చేరాడు. ఆర్ధిక ఇబ్బందులతో మధ్యలోనే వదిలేసి.. అదే జేఎన్టీయూలో పరీక్షల విభాగంలో ఉద్యోగంలో చేరాడు. ‘‘అప్పుడే అనిపించింది చిన్న నగరాలు, పట్టణాల్లో యువతకు నిరుద్యోగ సమస్యలేంటో? ఉద్యోగావకాశాలు సరిగా తెలియవు? తెలిసినా ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఎలా ఎదుర్కోవాలో తెలియదని. దీనికి పరిష్కారం చూపించే క్రమంలోనే ఇంటర్నెట్ అవసరం లేకుండా స్థానిక ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే ‘నోటిఫై యూ’ అనే ఓ సామాజిక సెర్చ్ ఇంజిన్‌ను అభివృద్ధి చేశా. ఉద్యోగార్థులు విద్యార్హత, చిరునామా, ఫోన్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను నోటిఫై యూ డేటాబేస్‌లో నమోదు చేస్తే.. మీ అర్హతకు తగ్గ ఉద్యోగం స్థానికంగా ఎక్కడ ఉందో వెతికి సంబంధిత కస్టమర్ ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుంది. 2013లో ప్రారంభించి.. 2014 డిసెంబర్ వరకూ నోటిఫై యూను నడిపించాం. సుమారు 20 లక్షల మంది నమోదయ్యారు. నోటిఫై యూ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. దీన్ని గమనించిన జర్మనీలోని ఇంక్యుబేటర్ 2016లో సోషల్ ఆస్ట్రోనాట్ రీసెర్చ్‌లో ఫెలోషిప్ ఇచ్చింది’’ అని అకిరా తెలియజేశారు. -
రండి.. నడకను దానం చేద్దాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్త దానం, నేత్ర దానం.. ఆఖరికి అవయవ దానం గురించి కూడా తెలుసు. కానీ, చెప్పుల దానం, బూట్ల దానం గురించి ఎప్పుడైనా విన్నారా? జోక్ అని నవ్వి వదిలేయకండి.. ఎందుకంటే.. ఇది నిజం! మనం వాడి పడేసే బూట్లు, చెప్పులు, సోల్, లేస్ల వంటివి సేకరించి తిరిగి వాడుకునేందుకు వీలుగా మరమ్మతు చేసి విరాళంగా అందిస్తోంది గ్రీన్‌సోల్ సంస్థ! సామాజిక బాధ్యతగా ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపార రూపం దాల్చుకుంది. రతన్ టాటా, బరాక్ ఒబామాల ప్రశంసలూ అందుకుంది. దీనిపై సంస్థ సీఈఓ శ్రేయాన్స్... ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... నేను, నా స్నేహితుడు రమేశ్ ధామి ఇద్దరం మారథాన్ రన్నర్లమే. ప్రాక్టీస్‌లో, పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే వాళ్లం. కాకపోతే నెలకు 2–3 జతల బూట్లు పాడైపోయేవి. ఖరీదైన బూట్లను ఊరికే బయట పారేసే బదులు రీ ఫర్నిష్ చేసి తిరిగి వాడుకుంటే బాగుంటుంది కదా అనిపించేది. ఈ ఆలోచనే గ్రీన్సోల్కు బీజం వేసింది. 2014లో రూ.10 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా గ్రీన్‌సోల్ సంస్థను ప్రారంభించాం. జనం వాడి పడేసే బూట్లను సేకరించి మరమ్మతు చేసి విరాళంగా అందించడం, ఇంకాస్త ఫ్యాషన్‌గా తయారు చేసి విక్రయించటం మా పని. కార్పొరేట్స్, వ్యక్తిగత విరాళాలు.. వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు ఎవరైనా సరే... పాత బూట్లు, చెప్పులు, సోల్, లేసులను విరాళంగా అందించవచ్చు. షూ మరమ్మతు కోసం అయ్యే ఖర్చు కూడా దాతే ఇవ్వాలి. ఒక్కో జతకు రూ.199 అందించాల్సి ఉంటుంది. బూట్ల సేకరణ కోసం దేశంలో 4 వేల కేంద్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15 పాయింట్లున్నాయి. గతేడాది లక్ష జతల బూట్లను, రూ.20 కోట్లను విరాళంగా సమీకరించాం. టాటా, రోల్స్ రాయిస్, ల్యాండ్ రోవర్, ఎల్ అండ్ టీ, వివంత, నాప్టోల్, జస్ట్ డయల్, యాక్సిస్ బ్యాంక్, సిగ్నా టీటీకే, మేక్ మై ట్రిప్ వంటి వందలాది కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నాం. గ్రీన్‌సోల్ చెప్పులు విరాళం, విక్రయం కూడా.. సేకరించిన బూట్లను ముంబైలోని రీఫర్బిష్ కేంద్రంలో మరమ్మతు చేస్తాం. ఒక్క జత తయారు చేసేందుకు అరగంట సమయం పడుతుంది. మరమ్మతు చేసిన చెప్పులను నెలకొకసారి ఒక్కో ప్రాంతంలో చెప్పులులేని ప్రజలకు, గ్రామాల్లోని పాఠశాలలకు అందజేస్తుంటాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62 వేల జతల చెప్పులను దానం చేశాం. ఏప్రిల్‌లో ఏపీ, తెలంగాణల్లో 4 వేల జతల బూట్లను విద్యార్థులకు అందజేశాం. వీటిని అడిడాస్ కంపెనీ స్పాన్సర్ చేసింది. వచ్చే వారం ఒరిస్సాలో 4,500 జతల చెప్పులను విరాళంగా అందించనున్నాం. ఆన్లైన్లో కొనుగోలు కూడా.. గ్రీన్‌సోల్ కంపెనీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చుల కోసం కొన్ని రకాల ఫ్యాషన్ చెప్పులను కూడా తయారు చేస్తాం. వీటి విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును నిర్వహణ ఖర్చులుగా వినియోగిస్తుంటాం. ప్రస్తుతానికైతే ఆన్లైన్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపడుతున్నాం. డిజైన్‌ను బట్టి వీటి ధర రూ.600–1,200గా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వ్యాపారాన్ని చేశాం. ఈ ఏడాది రూ.20 లక్షల టర్నోవర్‌ను లకి‡్ష్యంచాం. జనవరి నుంచి విపణిలోకి గ్రీన్‌సోల్ చెప్పులు.. జనవరి నుంచి రిటైల్, హోల్‌సేల్‌లోనూ గ్రీన్‌సోల్ పాదరక్షలను విక్రయించాలని నిర్ణయించాం. ఇందుకోసం స్థానిక రిటైల్ స్టోర్లతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ముంబైలో గిడ్డంగి ఉంది. ఫిబ్రవరిలో టాటా సహకారంతో జంషెడ్పూర్, ఢిల్లీల్లో 1,400 చ.అ.లో రెండు గిడ్డంగులను ప్రారంభించనున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు పీఈ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాం. -
పుస్తకాలకు లోన్ కావాలా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహ రుణాలో లేక వాహన రుణాల గురించో మనకు తెలిసిందే. కానీ, విద్యార్థులకు రుణాలు అందులోనూ ల్యాప్‌టాప్, మొబైల్, వాచ్‌లు, పుస్తకాలు వంటివి కొనేందుకూ రుణాలిస్తారండోయ్. దీన్నే వ్యాపార ప్రత్యేకతగా మార్చుకుంది ఫెయిర్‌సెంట్. విద్యా రుణాల కోసం క్రేజీబీ, క్విక్లో సంస్థలతో, మోటార్, రిటైల్, ఎస్ఎంఈ లోన్ల కోసం బాక్సీతో ఒప్పందం చేసుకుంది ఫెయిర్‌సెంట్. త్వరలోనే బ్యాంకులు, ఎన్బీఎఫ్లతో ఒప్పందం చేసుకొని.. ఇతరత్రా రుణ విభాగాల్లోకి విస్తరించనున్నట్లు ఫెయిర్‌సెంట్ కో–ఫౌండర్ వినయ్ మాథ్యూ ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఫెయిర్‌సెంట్ స్టార్టప్ ప్రారంభానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. ఎలాగంటే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రుణాలు 5% కూడా లబ్ధిదారులకు చేరట్లేదు. దీంతో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. మా సర్వేలో తేలిన ఈ అంశాలనే వ్యాపారావకాశంగా మార్చుకున్నాం. దేశంలోని రుణదాతల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి.. తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని నిర్ణయించుకొని 2014లో రూ.50 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా రజత్ గాంధీ, నితిన్ గుప్తాలతో కలసి ఫెయిర్‌సెంట్.కామ్‌ను ప్రారంభించాం. 25 వేల రుణ దాతలు.. 2.50 లక్షల గ్రహీతలు.. ప్రస్తుతం ఫెయిర్సెంట్లో 25 వేల మంది రుణదాతలు, 2.5 లక్షల మంది రుణ గ్రహీతలు నమోదయ్యారు. వీరి వివరాలను సామాజిక మాధ్యమాలు, ఆల్గరిథం, ఇతరత్రా మార్గాల ద్వారా ధ్రువీకరించుకున్నాకే నమోదు చేసుకుంటాం. రుణం అవసరమున్న కస్టమర్ ఫెయిర్సెంట్లో లాగిన్ అయ్యాక.. అవసరమైన మొత్తాన్ని నమోదు చేయాలి. వెంటనే సంబంధిత రిక్వెస్ట్ రుణదాతలకు వెళుతుంది. ఆసక్తి ఉన్న దాతలు వడ్డీ రేట్లతో సహా గ్రహీతకు అందజేస్తారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరగానే.. రుణదాత గ్రహీతకు ముందుగా 20% సొమ్మును అందిస్తారు. మిగిలిన మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక నేరుగా గ్రహీత బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈఎంఐ ద్వారా రుణ మొత్తం తగ్గుతుంటుంది. ఒకవేళ ఈఎంఐ కట్టడంలో విఫలమైతే రుణంపై ఏడాదికి 24 శాతం జరిమానా ఉంటుంది. నెలకు 200 దరఖాస్తులు; రూ.3 కోట్ల రుణం.. పర్సనల్ లోన్లకు రూ.7 లక్షలు, చిన్న, మధ్య తరహా సంస్థలకైతే (ఎస్ఎంఈ) రూ.10 లక్షల వరకు రుణాలిస్తాం. ఇప్పటివరకు 2.5 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.30 కోట్ల రుణాలను అందించాం. నెలకు 200 దరఖాస్తుదారులకు.. సుమారు రూ.3 కోట్ల లోన్లను అందిస్తున్నాం. వడ్డీ రేటు ఏడాదికి 12 నుంచి 35 శాతందాకా ఉంటుంది. రుణ దాత నుంచి 1 శాతం, గ్రహీత నుంచి 2 శాతం కమీషన్ తీసుకుంటాం. ఏపీ, తెలంగాణ వాటా 8 శాతం.. ప్రతి నెలా వ్యాపారంలో 600% వృద్ధి నమోదవుతోంది. మా మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 8% వరకూ ఉంది. ఇప్పటివరకు ఈ రెండు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల రుణాలందించాం. ఇక్కడి నుంచి 2,500 మంది రుణ దాతలు, 30 వేల మంది రుణ గ్రహీతలు నమోదయ్యారు. వచ్చే త్రైమాసికం నుంచి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రుణాలిప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. 6 నెలల్లో రూ.25 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం కంపెనీలో 40 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నిధులను సమీకరించాం. సింగపూర్‌కు చెందిన ఎంఅండ్ఎన్ పార్టనర్స్, అరినా క్యాపిటల్ పార్టనర్స్, 3 వన్ 4 క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, బ్రాండ్ క్యాపిటల్స్, బీసీసీఎల్లు ఈ పెట్టుబడులు పెట్టాయి. మరో 6 నెలల్లో రూ.25 కోట్లు సమీకరిస్తాం. ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. ఈ రౌండ్లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ పాల్గొంటారు’’ అని వినయ్ వివరించారు. -
ఫిట్‌నెస్‌కు ఫిట్‌మీల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డరివ్వటం మెట్రో నగరాల్లో కామన్. కానీ, ఆర్డరిచ్చిన ఆహారాన్ని ఎలా తయారు చేస్తున్నారు? ఎంత శుభ్రత పాటిస్తున్నారు? అసలు ఎలాంటి ఉత్పత్తులను వినియోగిస్తున్నారనేది మనకు తెలియదు. రుచిగా, వేడిగా ఉంటే చాలు. తినేస్తాం! కానీ, న్యూట్రిషన్ ఫుడ్‌ను అందించడం, అందులోనూ ఆర్డరిచ్చిన ఫుడ్‌లో ఏవి ఎంత పాళ్లలో ఉన్నాయో చెప్పటం ఇవన్నీ చేస్తే!! కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్‌తో పాటూ నమ్మకమూ ఏర్పడుతుంది. ఇదే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫిట్‌మీల్స్ ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ జీశాన్ అహ్మద్ మాటల్లోనే.. అపూర్వ రావ్, అమన్ రాయగురు, భవ్యాంత్ కొల్లి, నేను నలుగురం కలసి దీన్ని ఏర్పాటు చేశాం. చదువు, ఉద్యోగం రీత్యా మేం ఇతర నగరాల్లో, విదేశాల్లో ఉన్నాం. అప్పుడు మాకు ఎదురైన ప్రధాన సమస్య ఆహారం. టైమ్ లేకపోవటం, వంట సరిగా రాకపోవటం.. కారణమేదైనా బయటి ఫుడ్ దిక్కయ్యేది. దీంతో అనారోగ్య సమస్యలు. వీటికి చెక్ చెప్పేందుకే ఆరోగ్యకరమైన, సేంద్రియ ఆహారం కోసం వెతికాం. అదే ఫిట్మీల్స్కు ప్రాణం పోసింది. పుట్టిపెరిగింది హైదరాబాద్ కావటంతో రూ.35 లక్షల పెట్టుబడితో 2015లో ఫిట్‌మీల్స్ ఇండియా.కో.ఇన్ను ఆరంభించాం. 8 కిచెన్స్; 4 ఔట్లెట్లు..: ప్రస్తుతం హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. సోమాజిగూడ, బంజారాహిల్స్, కృష్ణా నగర్, శ్రీనగర్ కాలనీ, జూబ్లిహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలల్లో 8 కిచెన్స్ ఉన్నాయి. ఇందులో 4 మెయిన్ కిచెన్స్. ఒక్కోటి 2.500 చ.అ.ల్లో ఉంటుంది. 4 ఔట్లెట్లు కూడా ఉన్నాయి. ఆహారం తయారీ, ప్యాకేజింగ్, డెలివరీ అన్నీ మేమే చేస్తాం. ఐదుగురు షెఫ్‌లున్నారు. శాకాహారం, మాంసాహారం కలిపి... ఇండియన్, కాంటినెంటల్, ఇంటర్నేషనల్ వెరైటీలు 2,500 వరకూ ఉన్నాయి. కూరగాయలు, మాంస ఉత్పత్తులు, ఇతరత్రా దినుసుల కోసం స్థానిక వెండర్లు, రైతులతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి. వైజాగ్, భీమవరం, రాజమండ్రి.. ప్రస్తుతం మాకు 10 వేల మంది రిజిస్టర్ కస్టమర్లున్నారు. ఇందులో వెయ్యి మంది వరకు సబ్స్క్రిప్షన్ యూజర్లు. వారం రోజుల సబ్‌స్క్రిప్షన్‌కు రూ.3,373 చార్జీ. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ కస్టమైజ్డ్ రీతిలో ఆర్డరివ్వొచ్చు. త్వరలోనే విశాఖ, భీమవరం, రాజమండ్రిలల్లో ఫ్రాంచైజీ విధానంలో ఔట్లెట్లను ప్రారంభిస్తున్నాం. ఒక్కో స్టోర్ 1,500 చదరపు అడుగుల్లో ఉంటుంది. ఒకో ఔట్‌లెట్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతుంది. ఫ్రాంచైజర్లకు ఫిట్‌మీల్స్ నుంచి రెసిపీ, సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలందిస్తాం. 3 నెలల్లో బెంగళూరులో సేవలను ప్రారంభిస్తాం. ఇంద్రానగర్‌లో ప్రధాన కిచెన్ నెలకొల్పుతున్నాం. ఏడాదిలో ముంబై, గుర్గావ్లకూ విస్తరించాలనేది లక్ష్యం. రూ.12 కోట్ల వ్యాపార లక్ష్యం.. ప్రస్తుతం రోజుకు 1,500 ఆర్డర్లొస్తున్నాయి. ఐటీ, కార్పొరేట్లు, ఎగువ మధ్యతరగతి కస్టమర్లు అధికం. ఎక్కువగా నాన్‌వెజ్ ఆర్డర్లు, అందులోనూ లంచ్ ఆర్డర్లే ఉంటాయి. ప్రస్తుతం 64 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.2.25 కోట్ల టర్నోవర్ సాధిం చాం. వ్యాపారంలో ఆన్లైన్ వాటా 70%, ఔట్లెట్ల వాటా 30%. ఈ ఏడాది రూ.6 కోట్ల వ్యాపారాన్ని ల క్ష్యించాం. బెంగళూరు విస్తరణతో రూ.12 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటాం’’ అని జీశాన్ వివరించారు. -
‘ఆఫ్ బిజినెస్’తో చిన్న సంస్థలు ఆన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ)లకు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, విస్తరించాలన్నా ప్రధానంగా ఎదురయ్యే సమస్య నిధులే!! పోనీ, నిధులు సమకూరాయనుకుంటే ఆయా పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను కొనుగోలు చేయటం మరో సమస్య. ఈ రెండింటికీ ఒకే వేదికగా పరిష్కారం చూపిస్తోంది ‘ఆఫ్ బిజినెస్.కామ్’! అవునండి.. ఎస్ఎంఈలకు కేవలం నిధులను అందించడమే కాకుండా.. అవే నిధులతో అవసరమైన ముడిసరుకుల కొనుగోలు చేసే వీలు కల్పించడమే దీని ప్రత్యేకత. నిధుల కోసం పెట్టుబడిదారులతో.. ముడి పదార్థాల కోసం తయారీ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకుంది. మరిన్ని వివరాలు ఆఫ్ బిజినెస్.కామ్ సీఈవో ఆశిష్ మోహపత్రా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆఫ్‌బిజినెస్.కామ్ ప్రారంభానికి కారణం నాతో పాటు ఉన్న కో–ఫౌండర్లు పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో పని చేయడమే. బడా కంపెనీలకు రుణాలు, పెట్టుబడులు పొందడం పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ, ఎస్ఎంఈల పరిస్థితికొస్తే? ఇదే ఆలోచన ఆఫ్ బిజినెస్.కామ్‌కు పునాది వేసింది. నిధుల పంపిణీతోనే సరిపెట్టకుండా ఎస్ఎంఈలకు ముడి పదార్ధాల కొనుగోలులోనూ సేవలందించాలని నిర్ణయించుకొని రూ.32 కోట్ల పెట్టుబడులతో 2015 ఆగస్టులో గుర్గావ్ కేంద్రంగా ఆఫ్‌బిజినెస్.కామ్‌ను ప్రారంభించాం. నాతో పాటూ రుచి కర్లా, భువన్ గుప్తా, చంద్రాన్షు, నితిన్ జైన్, వసంత్ శ్రీధర్, బిస్వజిత్, ధావల్ రాడియా కో–ఫౌండర్లుగా ఉన్నారు. ఆఫ్ బిజినెస్.కామ్ షరతేంటంటే.. ఎస్ఎంఈలు నిధులతో పాటూ ముడి పదార్థాలను కూడా విక్రయ సంస్థల వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 1,200 ఎస్ఎంఈలు; రూ.800 కోట్ల నిధులు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 1,200 ఎస్ఎంఈలు మా కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 110 ఎస్ఎంఈలు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ప్రారంభించిన 16 నెలల్లో రూ.800 కోట్లను అందించాం. ఎస్ఎంఈని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ అందిస్తాం. నెలకు రూ.50 కోట్ల నిధుల వితరణ చేస్తుంటాం. వడ్డీ రేటు సెక్యూర్డ్ అయితే ఏడాదికి 12 శాతం, అన్సెక్యూర్డ్ 18 శాతంగా ఉంది. త్వరలోనే రసాయనాలు, గార్మెట్ కొనుగోలు కూడా.. ప్రస్తుతం మా సంస్థ నుంచి ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్, పేపర్ ప్యాకేజ్, సిమెంట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి మెటీరియల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆయా ఉత్పత్తుల కొనుగోలు కోసం సెయిల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, జిందాల్, వైజాగ్, రాఠి వంటి 500లకు పైగా తయారీ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో ధరలు 8 శాతం వరకు తక్కువగా ఉంటాయి. నెల రోజుల్లో పారిశ్రామిక రసాయనాలు, గార్మెట్ ముడిసరకులనూ చేర్చనున్నాం. రూ.150 కోట్ల నిధుల సమీకరణ.. ఎస్ఎంఈ కస్టమర్ నుంచి వడ్డీ, డిస్ట్రిబ్యూటర్ నుంచి కమీషన్ 2 శాతం తీసుకుంటాం. ఇదే మా వ్యాపార విధానం. గతేడాది రూ.220 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఇందులో 18 శాతం వాటా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలది ఉంటుంది. ఈ ఏడాది రూ.900 కోట్ల వ్యాపారాన్ని జనవరి నుంచి మహారాష్ట్రలోని ఎస్‌ఎంఈలకూ మా సేవలను అందించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 180 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.120 కోట్ల నిధులను సమీకరించాం. మ్యాట్రిక్స్ పార్టనర్స్, జోడియస్ టెక్నాలజీస్‌తో పలు టెక్నాలజీ కంపెనీల సీఈఓలు ఈ పెట్టుబడులు పెట్టారు. ‘‘వచ్చే 6 నెలల్లో రూ.150 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఈ రౌండ్లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ పాల్గొంటారని’’ ఆశిష్ వివరించారు. -
సృజనాత్మక ఎలక్ట్రానిక్స్ అడ్డా ‘ఎర్హా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచంలో అతి చిన్న మొబైల్.. తైవాన్‌కు చెందిన ‘టాక్సీ’. దీని పొడవు జస్ట్ క్రెడిట్ కార్డు సైజు అంతే!. మరి అతి తేలికైన సెల్‌ఫోన్? రష్యాకు చెందిన ‘ఇలారి నానోఫోన్ సీ’. దీని బరువు 30 గ్రాములు మాత్రమే ఇక దుబాయ్‌కు చెందిన ‘మిసూట్ డ్యూయల్ సిమ్ కేస్’తో ఒకే మొబైల్‌ను ఏకకాలంలో ఆండ్రాయిడ్, ఐఫోన్ వెర్షన్లలో వాడొచ్చు. నిజానికివన్నీ జనరల్ నాలెడ్జి ప్రశ్నలు కాదు. ‘ఎర్హా.కామ్’లో దొరికే వస్తువులు!!. అవును.. ప్రపంచంలో అత్యంత సృజనాత్మకమైన గాడ్జెట్స్ దొరికే వేదిక ఇదే మరి! ఆన్లైన్ వేదికపై అంతర్జాతీయ బ్రాండ్లను, అది కూడా ఇన్నోవేటివ్ ఎలక్ట్రానిక్స్‌ను మాత్రమే విక్రయించడం ఎర్హా ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ సీఈఓ మణికాంత్ జైన్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘పంజాబ్‌లో ప్రాథమిక విద్య పూర్తయ్యాక.. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశా. తాతముత్తాతల నుంచే గార్మెంట్ వ్యాపారం మాది. చదువుకున్న వాడిని కావటంతో గార్మెంట్స్ క్రయవిక్రయాల కోసం విదేశాలకు వెళ్లేవాణ్ణి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే ఇష్టం కనక ఎక్కడికెళ్లినా ఏదో ఒక గాడ్జెట్ కొనేవాణ్ణి. దాన్ని చూసి స్నేహితులు, కుటుంబీకులు బాగుందని తీసుకునేవాళ్లు. లేకపోతే మళ్లీ ఏ దేశమైనా వెళ్లినప్పుడు అలాంటి గాడ్జెట్ తీసుకురమ్మని డబ్బులు ఇచ్చేవాళ్లు. ఓ సందర్భంలో... విదేశాల్లోని ఇన్నోవేషన్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ వంటివి ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తే ఎలా ఉంటుందనిపించింది’’! అలా 2014లో ఎర్హా.కామ్‌కు బీజం పడింది. 1,500 కేటగిరీల్లో 20 వేల ఉత్పత్తులు..: ప్రస్తుతం ఎర్హా.కామ్‌లో అమెరికా, రష్యా, జర్మనీ, హాంకాంగ్, కొరియా, తైవాన్, చైనా, దుబాయ్ దేశాల్లోని ఇన్నోవేటివ్ గాడ్జెట్స్, యాక్ససరీలుంటాయి. ఆయా ఉత్పత్తుల కోసం ఆయా దేశాల్లోని తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మొబైల్స్, యాక్ససరీలు, చార్జర్లు, కేబుల్స్ ఇలా సుమారు 1,500 కేటగిరీల్లో 20 వేలకు పైగా ఉత్పత్తులున్నాయి. ఏడాది కాలంలో మరో వెయ్యి ప్రోడక్ట్లను జత చేయనున్నాం. ఉత్పత్తుల నిల్వ కోసం ఢిల్లీలో 3,500 చ.అ.ల్లో గిడ్డంగి ఉంది. ఉత్పత్తుల ధరలు రూ.150 నుంచి రూ.15,900 వరకున్నాయి. హైదరాబాద్ నుంచి 15 శాతం అమ్మకాలు.. ప్రస్తుతం మాకు 50 వేల మంది కస్టమర్లున్నారు. ఫేస్బుక్లో 2.50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నెలకు 5 వేల ఆర్డర్లొస్తున్నాయి. హైదరాబాద్ నుంచి సుమారు 15 శాతం వ్యాపారం వస్తోంది. స్థానిక కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించడం కోసం వచ్చే ఏడాదిలో హైదరాబాద్‌లో సర్వీసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఆర్డరిచ్చిన 7 పని దినాల్లో డెలివరీ చేస్తాం. ఇందుకోసం పలు కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రూ.30 కోట్ల నిధుల సమీకరణ.. ఎర్హాలో కొన్న ఉత్పత్తులకు ఆయా కంపెనీల గ్యారంటీ, వారంటీతో పాటు మేం 6 నెలల గ్యారంటీని అందిస్తాం. 8 ఏళ్ల వ్యాపారంలో రీప్లేస్‌మెంట్‌కు వచ్చిన ఉత్పత్తులు 2 శాతం కంటే తక్కువే. ఇప్పటివరకు మా ఒప్పందం కంపెనీలకు రూ.20 కోట్ల గ్రాస్ మర్చండేజ్ వాల్యూ (జీఎంవీ) చేసిచ్చాం. ఇందులో మా ఆదాయం 30 శాతం వరకుంటుంది. రెండేళ్లలో జీఎంవీని రూ.100 కోట్లకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఈ ఏడాది డిసెంబర్‌లోగా రూ.30 కోట్ల నిధుల సమీకరణ పూర్తి చేస్తాం’’ అని మణికాంత్ వివరించారు. -
2 నిమిషాల్లో బైక్ సర్వీసింగ్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేటి యువత తిండి, నిద్ర లేకపోయినా ఉండగలరేమో గానీ, చేతిలో మొబైల్, తిరగడానికి బైక్ లేనిదే ఉండలేరు. లాంగ్ రైడ్ అనో, ఫ్రెండ్స్‌తో షికారనో, వీకెండ్స్ రైడ్ అనో బైక్‌ను రయ్మనిపించేందుకు బోలెడన్ని సందర్భాలు. కానీ, అదే బైక్ సర్వీసింగ్ అంటే!! టైమ్ వేస్ట్ అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. పైగా పర్సుకు భారం కూడానూ! కానీ, రెండంటే రెండు నిమిషాల్లో బైక్ సర్వీసింగ్, అది కూడా జస్ట్ రూ.40కే అంటోంది ఎక్స్‌ప్రెస్ బైక్ వర్క్స్(ఈబీడబ్ల్యూ)! వాషింగే కాదు.. మైనర్ రిపేర్లు, ఆన్ రోడ్ అసిస్టెన్స్ సేవలనూ అందిస్తామంటోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫండ్ మేనేజర్, టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్క్ మొబియస్ నుంచి నిధులను పొందిన ఈబీడబ్ల్యూ ప్రణాళికలను సంస్థ కో–ఫౌండర్ నీరజ్ టక్సండే ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. చిన్నతనం నుంచే బైకులంటే ఇష్టం వల్ల కావొచ్చు.. వేర్వేరు ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినా బైక్ రైడింగే నన్ను భూషణ్ కర్న్, జీగర్ వోరాలతో కలిపింది. లాంగ్ రైడింగ్ వెళ్లినప్పుడల్లా మాకెదురయ్యే ప్రధాన సమస్య సర్వీసింగ్. దీనికి పరిష్కారం వెతికే పనిలోనే ఎక్స్‌ప్రెస్ బైక్ వర్క్స్ కంపెనీకి బీజం పడింది. రూ.9 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా 2013 జూన్‌లో ఎక్స్‌ప్రెస్ బైక్ వర్క్స్‌ను ప్రారంభించాం. 2 నిమిషాల్లో, రూ.40కి, అది కూడా జస్ట్ 10 లీటర్ల నీటితో బైక్ సర్వీసింగ్ మా ప్రత్యేకత. ప్రతి పెట్రోల్ బంకులో ఈబీడబ్ల్యూ లక్ష్యం.. మన దేశంతో పాటూ ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, రువాండ, కొలంబియా దేశాల్లోనూ ఈబీడబ్ల్యూ కేంద్రాలున్నాయి. దేశంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణే, నాసిక్, బెంగళూరు, ధన్‌బాద్, కోయంబత్తూర్, హుబ్లీ నగరాల్లో 32 ఈబీడబ్ల్యూ స్టోర్లున్నాయి. త్వరలోనే కొచ్చిన్, వెస్ట్ ముంబై, భువనేశ్వర్, నాగ్‌పూర్, సూరత్, విజయవాడ, మైసూర్‌లలో ఫ్రాంచైజీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం. ఏడాది ముగింపు నాటికి 100 ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యించాం. పెట్రోల్ బంకుల్లో ఈబీడబ్ల్యూ కేంద్రాల ఏర్పాటు కోసం ఇండియన్ ఆయిల్(ఐఓసీ), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)తో ఒప్పందం చేసుకున్నాం. ముంబైలోని పలు బంకుల్లో స్టోర్లను ఏర్పాటు చేశాం. దేశంలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌కు ఉన్న 52 వేల పెట్రోల్ బంకుల్లోనూ ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. వాషింగ్‌కు 10 లీటర్ల నీళ్లు..: సాధారణంగా బైక్ వాషింగ్‌కు 50–60 లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. ఈబీడబ్ల్యూలో కేవలం 10 లీటర్లే. అందులోనూ 90% నీటిని పునఃవినియోగానికి వీలుగా శుద్ధి చేస్తాం. ఇదే మా ప్రత్యేకత. ఇప్పటివరకు 2.50 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను సర్వీసింగ్ చేశాం. ప్రస్తుతం రోజుకు ఒక్కో స్టోర్ నుంచి 1,500–1,800 బైకులను సర్వీసింగ్ చేస్తున్నాం. రూ.12 లక్షలకు ఫ్రాంచైజీ..: ముంబైలో 2,500 చ.అ.ల్లో ఈబీడబ్ల్యూ తయారీ ప్లాంట్ ఉంది. నెలకు 13 ఆటోమెటిక్ బైక్ వాషింగ్ మిషన్లను తయారు చేస్తుంటాం. ధర రూ.8.5 లక్షలు. ఈబీడబ్ల్యూ మిషన్లను హీరో మోటో కార్ప్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చర్ (ఓఈఎం) పరీక్షలు నిర్వహించి అనుమతినిచ్చాకే మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఫ్రాంచైజీ రూపంలో ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు రూ.12 లక్షల పెట్టుబడి అవసరం. మిషన్, నిర్వహన, శిక్షణ, మార్కెటింగ్ వంటి వాటికి ఏడాదికి 5% రాయల్టీని తీసుకుంటాం. 6 నెలల్లో 4–5 మిలియన్ డాలర్లు.. ప్రస్తుతం మా సంస్థలో 45 మంది ఉద్యోగులున్నారు. నెలకు 150% వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. 6 నెలల్లో 4–5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని నిర్ణయించాం. ‘‘2015లో ప్రముఖ అంతర్జాతీయ ఫండ్ మేనేజర్, టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్క్ మొబియస్, మదర్సన్ సుమీ గ్రూప్ వామన్ సెహగల్, హీరో ఫిన్‌కార్ప్ అభిమన్యు ముంజల్, కార్నేషన్ ఆటో ఇండియా కనల్ కట్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులను సమీకరించాం. ప్రస్తుతం వీళ్లు లాభాలను స్వీకరించి కంపెనీ నుంచి తప్పుకున్నారు’’ అని నీరజ్ వివరించారు. -
అరచేతిలో ఆసుపత్రి, డాక్టర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆసుపత్రిలో అడ్మిట్ అంటే చాలు! చాలా మందికి భయం. ఎందుకంటే ఆసుపత్రి ఎలాంటిదో? వైద్యుడెలాంటి వాడో? అసలేం చికిత్స చేస్తున్నాడో? ఎంత చార్జీ వసూలు చేస్తారో?.. ఇలా ఒకటేమిటి.. అడ్మిషన్ నుంచి డిశ్చార్జయ్యే వరకూ సవాలక్ష సందేహాలు. వీటిన్నంటి నడుమ అసలు మీకొచ్చిన జబ్బేంటి? ఎలాంటి చికిత్స అవసరం? ఏ ఆసుపత్రి అయితే బెటర్? ఏ వైద్యుడైతే కరెక్ట్? ఆసుపత్రి, మందుల ధరలు, గత కస్టమర్ల అనుభవాలూ ప్రతీ అంశాన్ని ఆసుపత్రిలో అడ్మిట్ కాకముందే అందిస్తే? పేషెంటకు భయం పోతుంది!! త్వరగా కోలుకునే అవకాశమూ ఉంటుంది. ఇదిగో ఇలాంటి సేవలనే అందిస్తోంది క్రెడిహెల్త్. సంస్థ సేవల గురించి ఫౌండర్ రవి వీర్మణి మాటల్లోనే.. జంషెడ్‌పూర్‌లోని ఎక్స్ఎల్ఆర్ఐ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఎస్కార్ట్ గ్రూప్‌లో ఉద్యోగంలో చేరా. ఆ తర్వాత సొంతంగా నోబెల్ హౌజ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ స్టార్టప్‌ను ప్రారంభించా. తర్వాత దీన్ని హెవిట్ అసోసియేట్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి హెవిట్లో సౌత్ ఏషియా ఎండీగా బాధ్యతలు చేపట్టా. 2005లో సింగపూర్‌లోని అవెంటూస్ కన్సల్టింగ్ సీఈఓగా చేరా. 2010 వరకూ పనిచేశా. తరవాత తిరిగొచ్చి ఢిల్లీ కేంద్రంగా సేవలందిస్తున్న మ్యాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ సీఓఓగా బాధ్యతలు స్వీకరించా. వైద్య రంగంలో రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో గమనించిదొక్కటే..!! స్వదేశంలో, విదేశాల్లో ఎక్కడ చూసినా వైద్య రంగంలో పారదర్శకత లోపమే ప్రధానంగా కనిపించేది. అంటే ఆసుపత్రి నుంచి మొదలుపెడితే వైద్యుడు, మందులు, చార్జీలు ప్రతి దాంట్లోనూ పేషెంట్‌కు అనుమానమే. దీన్ని తొలగించి రోగికి భరోసా కలిగించాలని నిర్ణయించుకొని గుర్గావ్ కేంద్రంగా 2014 జనవరిలో క్రెడిహెల్త్ను ప్రారంభించా. ఇప్పటివరకు రూ.20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టా. జబ్బు లక్షణాలు చెబితే చాలు ఏ ఆసుపత్రి బెటరో లేక ఏ వైద్యుడు సరైన చికిత్స చేస్తాడో వివరిస్తాం. ఆసుపత్రి నుంచి మొదలుపెడితే డాక్టర్, జబ్బు, చికిత్స విధానం, ధర, దానికి పట్టే సమయం, చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఒకటేమిటి ఆసుపత్రిలో అడ్మిట్ నుంచి డిశ్చార్జి వరకూ సమస్త సమాచారం ముందే అందిస్తాం. 630 ఆసుపత్రులు, 30 వేల మంది వైద్యులు.. ప్రస్తుతం దేశంలోని 630 ఆసుపత్రులు, 30 వేల మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి 50 వరకు ఆసుపత్రులుంటాయి. అపోలో, కేర్, యశోదా, రెయిన్బో వంటివి కొన్ని. సేవలను బట్టి ఆసుపత్రి నుంచి సబ్స్క్రిప్షన్ చార్జీ నెలకు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకుంటుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ల్లో అంబులెన్స్ సేవలూ లభిస్తాయి. ఆయా నగరాల్లో 800 మంది అంబులెన్స్ డ్రైవర్లు, స్థానిక ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. 10% విదేశీ పేషెంట్లే..: ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, పుణే, జైపూర్, చండీగఢ్ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఆయా నగరాల్లో 4 లక్షల మంది కస్టమర్లున్నారు. మొత్తం కస్టమర్లలో విదేశీ పేషెంట్ల వాటా 10%. హైదరాబాద్ నుంచి 30% కస్టమర్లుంటారు. ప్రతి రోజూ 1,200 మంది పేషెంట్లు మా సేవలను వినియోగించుంటుంటున్నారు. ఇందులో 120 మంది వరకు విదేశీ పేషెంట్లుంటారు. నేపాల్, బంగ్లాదేశ్, ఇరాక్, ఆఫ్రికా నుంచి ఎక్కువగా పేషెంట్లు వస్తుంటారు. 2 నెలల్లో 97 కోట్ల సమీకరణ.. గతేడాది మా ఒప్పందం ఆసుపత్రులకు రూ.90 కోట్ల గ్రాస్ మర్చండేస్ వ్యాల్యూ (జీఎంవీ) చేసిచ్చాం. ఈ ఏడాది రూ.200 కోట్లు దాటుతుందని అంచనా. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల్లో రూ.97 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురితో చర్చలు జరుగుతున్నాయి. ఈ నిధుల సహాయంతో కొచ్చిన్, అమృత్సర్, గౌహతి, లక్నో నగరాలకు విస్తరించాలని నిర్ణయించాం. ఒక్కో నగరంలో సుమారు 50 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంటాం. ఏడాదిలో సింగపూర్, దుబాయ్ దేశాల్లోనూ సేవలను ప్రారంభిస్తాం. స్థానిక ఆసుపత్రులతో చర్చలు జరుపుతున్నాం. -
క్లిక్ చేస్తే లంచ్ బాక్స్!
కొందరు బరువు తగ్గాలి. మరికొందరు కాస్త పుష్టిగా మారాలి. వీటికోసం జిమ్, యోగా సెంటర్లలో గడిపేవారు ఎక్కువమందే. అయితే వ్యాయామంతో పాటు సరైన ఆహారం ఉంటేనే ఇదంతా సాధ్యమని నిపుణులు చెబుతూనే ఉంటారు. మరి ఏం తింటే బెటర్? చక్కని ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ తమ ‘డైట్ ఆన్ క్లిక్’తో సమాధానం చెబుతున్నారు ఈ యువకులు. బరువు తగ్గటానికైనా, పెరగటానికైనా రహస్యం సరైన సమయానికి సరైన పౌష్టికాహారం తీసుకోవటమేనంటున్నారు వీళ్లు. దీనికోసం తమ ‘డైట్ ఆన్ క్లిక్.కామ్‌లో’ ఆర్డరిస్తే చాలు. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్ రెండూ ఒకేసారి అందించడమే వీరి ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకులు, ఆనంద్, స్వరూప్‌ల మాటల్లోనే... ♦ పౌష్టికాహారానికి ‘డైట్ ఆన్ క్లిక్’ ♦ ఒకే సమయంలో లంచ్, స్నాక్స్ కూడా.. ♦ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సేవలు ♦ నిధుల సమీకరణ తరవాత విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో .ఈ రోజుల్లో ప్రతిదానికీ ఆన్లైనే వేదికైంది. అయితే ఆన్లైన్లో ఫుడ్ అందిస్తున్న సంస్థల మెనూ చూస్తే... బిర్యానీలు.. కేలరీలు ఎక్కువుండే నాన్‌వెజ్ ఐటమ్స్, స్నాక్స్ విషయానికొస్తే పిజ్జాలు.. సమోసాలు.. ఇవే కనిపిస్తుంటాయి. అమ్మేవారి సంగతి పక్కన పెడితే.. తినేవారి ఆరోగ్యం మాటేంటి? ఆకలితో కొందరు.. వేరే అవకాశం లేక ఇంకొందరు మొత్తం మీద అందరూ అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు. మేం ఐటీ ఉద్యోగులం కావటంతో మాకూ ఈ బాధలు తప్పలేదు. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని... అదీ సమయానికి అందించే సంస్థలేవైనా ఉన్నాయా! అని వెతికితే ఒక్కటీ కనిపించలేదు. అప్పుడే అనిపించింది... వేరే ఎవరో చేయడమెందుకు మనమే రంగంలోకి దిగితే బాగుంటుంది కదా... అని. ఇంకేముంది! ఇంటర్మీడియెట్ నుంచి స్నేహితులమైన మేం... శరత్ అనే మరో స్నేహితుడితో కలసి రూ.9 లక్షల పెట్టుబడి పెట్టి కూకట్‌పల్లిలోని ఫోర్త్ ఫేజ్‌లో డైట్ ఆన్ క్లిక్ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాం. లంచ్, స్నాక్స్ రెండూ ఒకేసారి... డబ్బా బుక్ చేసుకోవాలనుకుంటే ఉదయం 11 గంటల లోపు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12-2 గంటల మధ్య సరఫరా చేస్తాం. ఇందులోనే సాయంత్రానికి కావాల్సిన స్నాక్స్ కూడా ఉంటాయి. ప్రతీ రోజూ మెనూ మారుతుంటుంది. ప్రస్తుతం రోజుకు 160కి పైగా ఆర్డర్లొస్తున్నాయి. నేరుగా కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఒక్క రోజుకైతే డబ్బా ధర రూ.90. వారం, నెల వారీ ప్యాకేజీలకైతే ఇంకా తక్కువే పడుతుంది. వారం ప్యాకేజీ డబ్బా ధర రూ.85, నెల ప్యాకేజీలో డబ్బా ధర రూ.79. సర్వీస్ చార్జీలుండవు. శని, ఆదివారాలు సెలవు. ఇంకో ప్రత్యేకతేమిటంటే మా రెగ్యులర్ కస్టమర్లకు మేం న్యూట్రికేర్ వంటి ప్రముఖ సంస్థల చేత ఆహారం విషయంలో కౌన్సిలింగ్ కూడా ఉచితంగానే ఇప్పిస్తున్నాం. నిధుల సమీకరణపై దృష్టి.. ప్రస్తుతం కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఆ తరవాత హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేస్తాం. గత నెలలో రూ.2.70 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. ప్రస్తుతం 8 మంది డెలివరీ బాయ్స్, వివిధ రెస్టారెంట్లలో 18 ఏళ్ల అనుభవమున్న ఓ చెఫ్‌తో పాటు ముగ్గురు సహాయకులను నియమించుకున్నాం. డైట్ ఆన్ క్లిక్ మెనూ ఇదే.. సోమవారం: బీట్ రూట్ రోటీ, పాలకూర పప్పు, చిక్కుడు కాయ కర్రీ, పుదీనా రైస్, బ్రౌన్/వైట్ రైస్, పెరుగు. స్నాక్స్: మొలకెత్తిన పెసలు, పళ్లు. మంగళవారం: క్యారెట్ రోటీ, మెంతికూర పప్పు, రాజ్మ కర్రీ, పెరుగు, సోయా రైస్, బ్రౌన్/వైట్ రైస్. స్నాక్స్: రావి బిస్కెట్లు, ఫైబర్ రిచ్ స్వీట్ పొటాటో. బుధవారం: మేతి రోటీ, టమాటా పప్పు, టోఫూ ఆలు మిక్స్డ్ కర్రీ, పెరుగు, బీట్ రూట్ రైస్, బ్రౌన్/వైట్ రైస్. స్నాక్స్: ఉలవల లడ్డూ, స్వీట్ కార్న్. గురువారం: మల్టీ గ్రెయిన్ రోటీ, దోసకాయ పప్పు, క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, పెరుగు, కొబ్బరన్నం, బ్రౌన్/వైట్ రైస్. స్నాక్స్: మిక్స్డ్ నట్స్, పీనట్ సలాడ్. శుక్రవారం: సొరకాయ రోటీ, ఉలవచారు, వంకాయ కర్రీ విత్ ఉలవల పౌడర్, పెరుగు, రాగి జావ, బ్రౌన్/వైట్ రైస్ స్నాక్స్: మిక్స్డ్ ఫ్రూట్స్, నల్ల శనగల సలాడ్. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...