హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహ రుణాలో లేక వాహన రుణాల గురించో మనకు తెలిసిందే. కానీ, విద్యార్థులకు రుణాలు అందులోనూ ల్యాప్‌టాప్, మొబైల్, వాచ్‌లు, పుస్తకాలు వంటివి కొనేందుకూ రుణాలిస్తారండోయ్. దీన్నే వ్యాపార ప్రత్యేకతగా మార్చుకుంది ఫెయిర్‌సెంట్. విద్యా రుణాల కోసం క్రేజీబీ, క్విక్లో సంస్థలతో, మోటార్, రిటైల్, ఎస్‌ఎంఈ లోన్ల కోసం బాక్సీతో ఒప్పందం చేసుకుంది ఫెయిర్‌సెంట్. త్వరలోనే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌లతో ఒప్పందం చేసుకొని.. ఇతరత్రా రుణ విభాగాల్లోకి విస్తరించనున్నట్లు ఫెయిర్‌సెంట్ కో–ఫౌండర్ వినయ్ మాథ్యూ ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘ఫెయిర్‌సెంట్ స్టార్టప్ ప్రారంభానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. ఎలాగంటే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రుణాలు 5% కూడా లబ్ధిదారులకు చేరట్లేదు. దీంతో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. మా సర్వేలో తేలిన ఈ అంశాలనే వ్యాపారావకాశంగా మార్చుకున్నాం. దేశంలోని రుణదాతల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి.. తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని నిర్ణయించుకొని 2014లో రూ.50 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా రజత్ గాంధీ, నితిన్ గుప్తాలతో కలసి ఫెయిర్‌సెంట్.కామ్‌ను ప్రారంభించాం.
25 వేల రుణ దాతలు.. 2.50 లక్షల గ్రహీతలు..
ప్రస్తుతం ఫెయిర్‌సెంట్‌లో 25 వేల మంది రుణదాతలు, 2.5 లక్షల మంది రుణ గ్రహీతలు నమోదయ్యారు. వీరి వివరాలను సామాజిక మాధ్యమాలు, ఆల్గరిథం, ఇతరత్రా మార్గాల ద్వారా ధ్రువీకరించుకున్నాకే నమోదు చేసుకుంటాం. రుణం అవసరమున్న కస్టమర్ ఫెయిర్‌సెంట్‌లో లాగిన్ అయ్యాక.. అవసరమైన మొత్తాన్ని నమోదు చేయాలి.
వెంటనే సంబంధిత రిక్వెస్ట్ రుణదాతలకు వెళుతుంది. ఆసక్తి ఉన్న దాతలు వడ్డీ రేట్లతో సహా గ్రహీతకు అందజేస్తారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరగానే.. రుణదాత గ్రహీతకు ముందుగా 20% సొమ్మును అందిస్తారు. మిగిలిన మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక నేరుగా గ్రహీత బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈఎంఐ ద్వారా రుణ మొత్తం తగ్గుతుంటుంది. ఒకవేళ ఈఎంఐ కట్టడంలో విఫలమైతే రుణంపై ఏడాదికి 24 శాతం జరిమానా ఉంటుంది.
నెలకు 200 దరఖాస్తులు; రూ.3 కోట్ల రుణం..
పర్సనల్ లోన్లకు రూ.7 లక్షలు, చిన్న, మధ్య తరహా సంస్థలకైతే (ఎస్‌ఎంఈ) రూ.10 లక్షల వరకు రుణాలిస్తాం. ఇప్పటివరకు 2.5 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.30 కోట్ల రుణాలను అందించాం. నెలకు 200 దరఖాస్తుదారులకు.. సుమారు రూ.3 కోట్ల లోన్లను అందిస్తున్నాం. వడ్డీ రేటు ఏడాదికి 12 నుంచి 35 శాతందాకా ఉంటుంది. రుణ దాత నుంచి 1 శాతం, గ్రహీత నుంచి 2 శాతం కమీషన్ తీసుకుంటాం.
ఏపీ, తెలంగాణ వాటా 8 శాతం..
ప్రతి నెలా వ్యాపారంలో 600% వృద్ధి నమోదవుతోంది. మా మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 8% వరకూ ఉంది. ఇప్పటివరకు ఈ రెండు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల రుణాలందించాం. ఇక్కడి నుంచి 2,500 మంది రుణ దాతలు, 30 వేల మంది రుణ గ్రహీతలు నమోదయ్యారు. వచ్చే త్రైమాసికం నుంచి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రుణాలిప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం.
6 నెలల్లో రూ.25 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం కంపెనీలో 40 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నిధులను సమీకరించాం. సింగపూర్‌కు చెందిన ఎంఅండ్‌ఎన్ పార్టనర్స్, అరినా క్యాపిటల్ పార్టనర్స్, 3 వన్ 4 క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, బ్రాండ్ క్యాపిటల్స్, బీసీసీఎల్‌లు ఈ పెట్టుబడులు పెట్టాయి. మరో 6 నెలల్లో రూ.25 కోట్లు సమీకరిస్తాం. ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. ఈ రౌండ్‌లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ పాల్గొంటారు’’ అని వినయ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment