
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) తన కార్యకలాపాల కోసం రూ.40,000 కోట్ల స్వల్పకాలిక రుణాలు పొందడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి గణనీయంగా రూ.1.26 లక్షల కోట్లు అందుకున్నప్పటికీ ఈ రుణాలు తీసుకునేందుకు సిద్ధపడడం గమనార్హం. ఇప్పటివరకు అందుకున్న కేటాయింపులు 2025 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అంచనా వేసిన రూ.1.34 లక్షల కోట్ల ఆహార సబ్సిడీలో 95 శాతంగా ఉన్నాయి.
ఆర్థిక సవాళ్లు, కార్యాచరణ అవసరాలు
దేశ ఆహార భద్రత, పంపిణీ నిర్వహణకు బాధ్యత వహించే ఎఫ్‌సీఐ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుత సబ్సిడీ కేటాయింపులకు, కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులకు మధ్య అంతరాన్ని పూడ్చడానికి స్వల్పకాలిక రుణాలు దోహదపడతాయి. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ సజావుగా సాగేందుకు ఈ రుణాలు కీలకం కానున్నాయి.
వడ్డీ రేట్లు, రుణ నిబంధనలు
నిర్దేశిత బ్యాంకులు అందించే ఈ స్వల్పకాలిక రుణాల వార్షిక వడ్డీ రేట్లు 6.79% నుంచి 7.39% మధ్య ఉంటాయి. ఈ రుణాలు సాధారణంగా 90 రోజుల కాలపరిమితికి లభిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన మిగిలిపోయిన సబ్సిడీలు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపుల్లో కొంత భాగం విడుదలయ్యే వరకు ఎఫ్‌సీఐ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన లిక్విడిటీని ఈ రుణాల వల్ల సమకూర్చుకుంటుంది.
ఇదీ చదవండి: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపు
సబ్సిడీ కేటాయింపు, ఆర్థిక నిర్వహణ
ఆహార సబ్సిడీ ఖర్చుల్లో అధిక భాగాన్ని ఎఫ్‌సీఐకి విడుదల చేయడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరించింది. అయితే, ఇప్పటికే 95 శాతం నిధుల కేటాయింపు పూర్తయింది. మిగిలిన 5 శాతం సబ్సిడీ సాధారణంగా అవసరమైన ఖాతాల ఆడిట్ తరువాత పంపిణీ చేస్తారు. దీనికితోడు 2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఖర్చుకాని రూ.5,900 కోట్ల సబ్సిడీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫార్వర్డ్ చేశారు. అయినప్పటికీ ఎఫ్‌సీఐ 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.10,000 కోట్ల లోటును అంచనా వేసింది. ఇందులో ఖాతాల సిటిల్‌మెంట్ తర్వాత లభించే రూ.6,000 కోట్లు ఉన్నాయి. కార్పొరేషన్ వద్ద ప్రస్తుతం 3.6 కోట్ల టన్నుల బియ్యం, 1.48 కోట్ల టన్నుల గోధుమలతో సహా 5.08 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. దేశ ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, బఫర్ స్టాక్స్ నిర్వహించడానికి ఈ నిల్వలు చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment