ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇబ్బందులు
ఐకేపీ ధాన్యం కొనబోమని అల్టిమేటం
అధికారి దిగిరావడంతో వెనక్కి తగ్గిన వైనం
రెండేళ్లుగా ఇదే తరహా తంతు
తాడేపల్లిగూడెం : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకున్నప్పటి నుంచి జిల్లాలో అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల అలసత్వం.. మిల్లర్ల అలకలు.. ఉన్నతాధికారుల జోక్యం.. తాత్కాలికంగా సమస్యకు వాణిజ్య ప్రకటనల విరామం మాదిరి గ్యాప్. మళ్లీ నిబంధనల ఉల్లంఘనలు, అలకలు, అల్టిమేటమ్‌లు మామూలే.. రెండేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఐకేపీ ధాన్యం తరలింపు వ్యవహారంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో ఆ కేంద్రాల నిర్వాహకులు రబ్బర్ స్టాంపుగా మారారు. గతంలో మాదిరి రైతు ధాన్యం ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లడం, తేమ శాతం చూసి, అవసరమైతే అక్కడే ధాన్యం ఒకటిరెండు రోజులు నిల్వ చేసి మిల్లర్లకు పంపించడం వంటివి జరిగే వి.
ప్రస్తుతం మార్చిన విధానంలో ల్యాండ్‌టు మిల్ ప్రాతిపదికన ధాన్యం రైతుల నుంచి ఐకేపీ కేంద్ర నిర్వాహకుల కాగితాల అనుమతి పత్రాల ద్వారా మిల్లులకు వెళుతోంది. అక్కడి నుంచి సీఎంఆర్ ( కస్టమ్ మిల్లింగ్ రైస్) రూపంలో బియ్యం ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి. జిల్లాలో సుమారు 400 మిల్లులు ఉన్నాయి. వీటిలో 330 మిల్లులు పనిచేస్తున్నాయి. ఐకేపీ ద్వారా మిల్లులకు సీఎంఆర్ నిమిత్తం ధాన్యం పంపేందుకు ఆయా మిల్లుల మర ఆడింపు స్థాయి. గతంలో వారిచ్చిన సీఎంఆర్‌ను ఆధారంగా చేసుకున్నారు. ఈసారి కూడా ఆయా మిల్లులకు లక్ష్యాలను నిర్ణయించారు. దీనికనుగుణంగా ఆయా మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను ప్రభుత్వానికి చూపించాలి. ఇటీవలి కాలం వరకు ఈ వ్యవహారం సాఫీగానే సాగింది.
ఒక ప్రజాప్రతినిధి స్నేహితునిగా చెబుతున్న ఓ వ్యక్తికి ఏలూరు సమీపంలో ఒక మిల్లు ఉంది. ఆ మిల్లుకు అసోసియేషన్ తరఫున కేటాయించిన సీఎంఆర్ లక్ష్యానికంటే అధికంగా ఐకేపీ నుంచి ధాన్యం తోలే విధంగా ఏర్పాటు జరిగింది. అదనంగా తోలుకొనే ధాన్యానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ చూపించలేదు. సదరు మిల్లర్ అదనంగా తోలుకున్న ధాన్యం వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారడంతో ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దింపుకోబోమని మిల్లర్ల ప్రముఖులు అధికారులకు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారి ఒకరు ఏలూరు సమీపంలోని మిల్లుకు కేటాయించిన మేరకే ధాన్యం దింపుకొనేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మిల్లర్లు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. సకాలంలో స్పందించి కేంద్ర ఆహార శాఖా మంత్రిని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఎఫ్‌సీఐ లెవీ సేకరణ ప్రక్రియ నుంచి తప్పుకొంది. అప్పటి నుంచి ఇలాంటి అలకలు, సముదాయింపులు షరా మామూలుగా సాగుతున్నాయి.
కస్టమ్ మిల్లింగ్‌లో మెలికలు.. అలకలు
Published Thu, Jan 7 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM
Advertisement
Advertisement