Food Corporation of India
-
ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి..
సాక్షి, హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్‌సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో జనవరి 31వ తేదీలోపు బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి.. ఈనెలాఖరు నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరగకూడ దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మిల్లర్లంతా రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీ చేయడంపైనే ఆధారపడి ఉంటుందని, జాప్యం జరిగితే కార్పొరేష న్కు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందన్నారు. గత పదేళ్లలో రూ.58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వల్ల పౌరసరఫరాలపై భారం పడింద ని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడుతోందన్నారు. బియ్యం సరఫరాలో జాప్యంతో రాష్ట్ర కేటాయింపులపై ప్రభావం సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో జాప్యం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు వస్తాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల కార్పొరేషన్ భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్‌చేసి రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో బియ్యం బస్తాకు 45 కిలోల కంటే తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. కొందరి నిర్లక్ష్యం వల్ల రేషన్‌షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాలనీ, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాంః సీఎస్ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎఫ్‌సీఐకి పంపిణీ చేయాల్సిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డాటా ఎంట్రీని ఆధార్, రేషన్ కార్డుల్లోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే కిలో బియ్యం?
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ. 25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలుజాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర ఆహార పదార్థాల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర రూ. 43గా ఉంది. ఇది కిందటి ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం.. ‘భారత్ రైస్’ను తీసుకురానున్నట్లు వినికిడి. రాయితీ ధరతో అందించనున్న బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ అవుట్లెట్, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్’ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని రాయితీ ధరలకు విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో గోధుమ పిండిని రూ. 27.50, కిలో శనగ పప్పును . 60 చొప్పున వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉత్పత్తులు 2,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లలో పంపిణీ చేస్తున్నారు. వీటిలాగే ‘భారత్ రైస్’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. -
2వేల టన్నుల గోధుమలకు 11న ఈ–వేలం
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో గోధుమల ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్–డొమెస్టిక్ ద్వారా కేంద్రం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలు) ఈ నెల 11వ తేదీన ఈ–వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు శనివారం ఎఫ్‌సీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గోధుమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే వారు, గోధుమ పిండి మిల్లర్లకు మాత్రమే గోధుమలను విక్రయిస్తున్నట్లు తెలిపింది. కనీసం 10 మెట్రిక్ టన్నుల నుంచి గరిష్టంగా 100 మెట్రిక్ టన్నులకు బిడ్ వేయడానికి అర్హులని, ఈ–వేలంలో పాల్గొనదలచిన బిడ్డర్ తప్పనిసరిగా ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్, జి.ఎస్.టి. / ట్రేడ్ ట్యాక్స్ రిజి్రస్టేషన్, పాన్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో 2వేల మెట్రిక్ టన్నుల విక్రయానికి.. క్వింటా రూ.2150 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఈ–వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. -
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ ప్రారంభిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరువారాలుగా నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్రంలో సీఎంఆర్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని రైస్‌మిల్లులను మిల్లింగ్‌కు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ నిలిచిపోయిన తరువాత తలెత్తిన పరిస్థితులు, వరదల వల్ల ధాన్యం నాని మొలకెత్తిన తీరు, మిల్లర్ల అసంతృప్తి తదితర అంశాలపై మంత్రి గంగుల శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు, ఎఫ్‌సీఐ సీఎంఆర్‌ను నిలిపివేసిన నేపథ్యంలో 3,200 మిల్లుల్లో సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయన్నారు. ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. సీఎంఆర్‌ను పునరుద్ధరించడంతో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బియ్యాన్ని తరలించడానికి రైల్వే ర్యాక్‌లను పెంచాలని ఆయన ఎఫ్‌సీఐ జీఎంను కోరారు. కాగా మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో ఏం చేయాలనే అంశాన్ని చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాశరథి అవార్డును అందుకుంటున్న సంకోజు వేణును మంత్రి అభినందించారు. -
Telangana: బియ్యం సేకరణకు కేంద్రం ఓకే..
►రాష్ట్రంలో రైస్ మిల్లులు ఎట్టకేలకు తిరిగి తెరుచుకోబోతున్నాయి. 43 రోజులుగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి సెంట్రల్ పూల్‌కు బియ్యం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో మిల్లులు తెరుచుకోనున్నాయి. నిలిచిపోయిన బియ్యం సేకరణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. ►కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే ఇంతకాలం ధాన్యం మిల్లింగ్, బియ్యం సేకరణలో ప్రతిష్టంభన నెలకొందని ఆరోపించారు. ఎఫ్‌సీఐ నేతృత్వంలో బియ్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నామని, ధాన్యం సేకరణలో అవకతవకలపై తెలంగాణకు ఆడిట్ బృందాలను పంపిస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో అవకతవకల ఆరోపణలు, మిల్లుల్లో ఎఫ్‌సీఐ ప్రత్యక్ష తనిఖీలు తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మార్చి, మే నెలల్లో కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎఫ్‌సీఐ రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. మార్చి నెలలో జరిపిన తనిఖీల్లో 40 మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం (ఒక్కో బస్తాలో 40 కిలోలు) మాయమైనట్లు గుర్తించింది. మే నెలలో జరిపిన పరిశీలనలో 63 మిల్లుల్లో 1,13,872 ధాన్యం బస్తాల లెక్క తేలలేదు. 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం బస్తాలను నిల్వ చేశారని పేర్కొంది. ఇదే విషయాన్ని ఎఫ్‌సీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ, ఆయా మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క మిల్లుపైనా చర్యలు తీసుకోలేదని ఎఫ్‌సీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పేదలు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి తీసుకొంది. కానీ ప్రజలకు పంపిణీ చేయలేదు. అయితే ఇందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ధాన్యం నిల్వల మాయం, బియ్యం పంపిణీ కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. గత జూన్ 7వ తేదీ నుంచి రాష్ట్రంలో సెంట్రల్ పూల్‌కు బియ్యం సేకరణను నిలిపివేసింది. కస్టమ్ మిల్లింగ్ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కూడా..మిల్లర్లపై తీసుకున్న చర్యలు, బియ్యం పంపిణీ కాకపోవడంపై ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పిస్తేనే సెంట్రల్ పూల్‌కు బియ్యం తీసుకునే అంశం పరిశీలిస్తామని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తేల్చిచెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల ప్రయత్నాలు, మిల్లర్ల ఒత్తిడి వంటి తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నాని మొలకెత్తిన ధాన్యం.. ఈ యాసంగిలో సుమారు 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ధాన్యం మిల్లులకు తరలించినా నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. గత వానాకాలం, అంతకుముందు యాసంగికి సంబంధించిన సుమారు 44 లక్షల టన్నుల ధాన్యం సీఎంఆర్ కోసం మిల్లుల్లోనే ఉండటంతో.. చాలాచోట్ల ధాన్యం బస్తాలు ఆరుబయట, మిల్లుల ఆవరణల్లోనే ఉండిపోయాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు టార్పాలిన్ల కింద ఉంచిన ధాన్యం చాలావరకు తడిచిపోయింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ , ఖమ్మం మొదలైన ఉమ్మడి జిల్లాల్లో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచి మొలకెత్తింది. ఈ నేపథ్యంలో మిల్లర్లు ఆందోళనలకు కూడా సిద్ధమయ్యారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించినా ఏవీ సత్ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో తడిచిన 10 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించాలని, తరువాత ఇతర ధాన్యాన్ని కూడా అమ్మేయాలని నిర్ణయించినా.. ముఖ్యమంత్రి నుంచి తుది ఆమోదం లభించలేదు. ఎట్టకేలకు బుధవారం సెంట్రల్ పూల్‌కు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడంతో దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. అయితే తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని ఏం చేస్తారనే దానిపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాష్ట్రంలో నిలిచి పోయిన బియ్యం సేకరణను గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది. ఈ మేరకు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్.అశోక్‌కుమార్ బుధవారం రాత్రి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని ఇప్పటికే ప్రారంభించడంతో పాటు, అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలకు దిగిన నేపథ్యంలో బియ్యం సేకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివరణ ఇస్తేనే సేకరణ – కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ తీరు వల్లనే ఆ రాష్ట్రంలో సెంట్రల్ పూల్ కింద బియ్యం సేకరణను నిలిపివేసినట్లు కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో మిల్లుల్లో ధాన్యం బస్తాలు మాయం కావడాన్ని గుర్తించడంతో పాటు, అనేక మిల్లుల్లో ధాన్యం లెక్కించడానికి వీల్లేకుండా ఉండటాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. మరోవైపు పీఎంజీకేఏవై కింద తీసుకున్న కోటా బియ్యాన్ని కూడా పంపిణీ చేయలేదని వివరించింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ పూల్ కింద బియ్యం సేకరణను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇప్పటికైనా సంబంధిత అంశాలపై వివరణతో సమగ్ర నివేదికను అందజేస్తే సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. -
రూ.46 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యానికి, మిల్లింగ్ అయిన ధాన్యానికి, నిల్వ ఉన్న వడ్లకు లెక్క సరిపోలేదు. రూ.46 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయం అయినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రెండు విడతల తనిఖీల్లో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ధాన్యం మాయమైన మిల్లులు,తమ బృందాలకు సహకరించని మిల్లర్లపై చర్యలకు ఎఫ్‌సీఐ సిఫార సు చేసింది. ఆయా మిల్లులు నుంచి కస్టమ్ మిల్లింగ్‌రైస్ (సీఎంఆర్) కానీ, డీసీపీ బియ్యం కానీ తీసుకోవద్దనిప్రభుత్వాన్ని కోరింది. చుక్కలు చూపించిన మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో సరిగా ఉన్నాయా? ఎంత పరిమాణంలో మిల్లింగ్ చేశారు? ఇచ్చిన సీఎంఆర్‌కు, నిల్వ ఉన్న ధాన్యానికి లెక్క సరిపోతోందా? అనే విషయాలపై ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు గత మార్చి, మే నెలల్లో రైస్ మిల్లులకు వెళ్లిన ఎఫ్‌సీఐ అధికారులకు మిల్లర్లు ధాన్యానికి బదులు ‘చుక్కలు’చూపించిన సంగతి తెలిసిందే. మొదటి విడత తనిఖీల సమయంలో చాలాచోట్ల అడ్డదిడ్డంగా ఉన్న బస్తాలను లెక్కించడానికి వీలు కాలేదు. తర్వాత ‘తనిఖీలకు వస్తున్నాం... ధాన్యం సంచులను లెక్కించేందుకు వీలుగా అందుబాటులో ఉంచండి’అని సమాచారం ఇచ్చినా... 593 మిల్లుల యజమానులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. ‘అన్ కౌంటబుల్’(లెక్కించడానికి వీల్లేని స్థితిలో) ధాన్యం నిల్వలను రాశులు పోసిన మిల్లర్లు అక్రమాలు బయట పడకుండా చేశారు. అయితే మొత్తం మీద రూ.46 కోట్ల విలువైన ధాన్యం మాయం అయినట్లు ఎఫ్‌సీఐ వర్గాలు వెల్లడించాయి. తొలివిడతలో రూ.35 కోట్లు.. మలివిడతలో రూ.11 కోట్లు రాష్ట్రంలోని 3,278 మిల్లుల్లో 2020–21 యాసంగి, గత (2021–22) వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ లెక్కలు తేల్చేందుకు రైస్‌మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేయా లని ఎఫ్‌సీఐ గడచిన మార్చి లో నిర్ణయించింది. అప్పట్లో 958 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. 40 మిల్లుల్లో రూ.35.58 కోట్ల విలువైన 18,156 టన్నుల ధాన్యం గాయబ్ అయినట్లు గుర్తించారు. మిగతా 2,320 మిల్లుల్లో గత నెలలో ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు నిర్ణయించి, పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. 62 బృందాలను ఏర్పాటు చేసి 124 మందితో తనిఖీలు జరిపించారు. అయితే ఈ తనిఖీలకు అనేకచోట్ల మిల్లర్లు సహకరించలేదు. కాగా 63 మిల్లుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు ధ్రువీకరించారు. రూ.11 కోట్ల విలువైన 5,515 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్క తేలకుండా పోయింది. నిరుటి యాసంగికి సంబంధించిన ధాన్యం బస్తాలు లెక్కించడానికి వీల్లేకుండా 101 మంది మిల్లర్లు సహాయ నిరాకరణ చేయగా, గత వానాకాలం ధాన్యానికి సంబంధించి మరో 492 మిల్లులు సహకరించలేదు. మిల్లర్లు సహకరించడంతో పాటు ధాన్యం లెక్కించేందుకు వీలుగా ఉండి ఉంటే మరిన్ని అక్రమాలు వెలుగు చూసి ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మిల్లర్లపై చర్యలు తీసుకోండి ధాన్యం మాయం చేసిన మిల్లులతోపాటు, ఎఫ్‌సీఐకి సహకరించని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఎన్.అశోక్ కుమార్ మంగళవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష తనిఖీల్లో సరైన విధానంలో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా మిల్లర్లను ఆదేశిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని లేఖలో ఎఫ్‌సీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మిల్లుల నుంచి సీఎంఆర్ కింద సెంట్రల్ పూల్‌కు ఇచ్చే బియ్యం కానీ, డీసీపీ కింద రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే బియ్యం గానీ తీసుకోవద్దని çసూచించింది. ఒకవేళ డీసీపీ పద్ధతిలో వాడుకున్నా, తాము సెంట్రల్ పూల్ లెక్కల్లోకి తీసుకోమని çసూచించింది. -
రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు ఆపాలి: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేస్తున్న దాడులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గుంగుల కమలాకర్ స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎఫ్‌సీఐ తనిఖీల వెనుక కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు. రైతుల సజావుగా ధాన్యం అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగంగానే ఎఫ్‌సీఐ దాడులంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభం కాగానే దాడులు చేస్తున్నారు. రైస్ మిల్లులలో ఉద్దేశ్య పూర్వకంగానే ఎఫ్‌సీఐ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొనుగోళ్లు సంజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తోంది. రైతులు పండించిన పంట రైస్ మిల్లుల వరకూ చేరకూడదని డబ్బులు అందకుండా చేయాలని కేంద్రం ఉద్దేశ్య పూర్వకంగానే తనిఖీలు చేయిస్తోంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. వడ్లు మాయం కావు.. కొనుగోళ్లు పూర్తి అయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నాం. చదవండి: (అక్రమాలపై ఎఫ్‌సీ‘ఐ’) కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రైస్ మిల్లులలో ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉంది.. మేము వ్యతిరేకించడం లేదు అయితే ఇప్పుడిప్పుడే కోతలు పూర్తయ్యి ధాన్యం వస్తోంది. కాబట్టి ఇది సమయం, సందర్భం కాదు. దీనివల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుంది.. రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేస్తే సహకరిస్తామని' తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. చదవండి: (4.54 లక్షల బస్తాలు మాయం) -
పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్‌సీఐ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) శ్రీకారం చుట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఎఫ్‌సీఐ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని ప్రతి రైస్‌మిల్లును ప్రత్యక్షంగా తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్(పీవీ) చేయాలని, ప్రతి బస్తా లెక్క తేల్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తనిఖీ కార్యక్రమం మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక మిల్లుల్లో తనిఖీలు కొనసాగాయి. ఆయా జిల్లాల పౌరసరఫరా అధికారులతో కలిసి ఎఫ్‌సీఐ అధికారులు బృందాలుగా ఏర్పడి మిల్లుల్లో నిల్వలను, రికార్డులను పరిశీలించారు. పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం, బియ్యం బస్తాలను లెక్కించారు. తనిఖీల్లో తేలిన అంశాలతో ఓ నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. అక్రమాలపై అనుమానంతోనే.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసే విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానిస్తున్న ఎఫ్‌సీఐ ఇక నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాతే బియ్యం సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ వల్ల కాలయాపన జరిగి, నిర్ణీత సమయంలో సీఎంఆర్ ఇవ్వలేమన్న పౌరసరఫరాల శాఖ వాదనను తోసిపుచ్చిన ఎఫ్‌సీఐ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని ఏడు ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయాల పరిధిలోని 33 జిల్లాల్లో ఉన్న అన్ని రైస్ మిల్లుల్లో ఈ తనిఖీలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా వేర్‌హౌసింగ్ గోడౌన్ డిపోల మేనేజర్లు, ఇతర అధికారులతో 62 బృందాలను ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి అధికారులు ఉన్నారు. వీరు ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి తమకు కేటాయించిన డివిజన్లలోని జిల్లాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ జరపనున్నారు. రెండు సీజన్ల ధాన్యం తనిఖీ గత ఏడాది (2020–21) యాసంగి సీజన్‌తో పాటు మొన్నటి వానాకాలం (2021–22) సీజన్లకు సంబంధించిన ధాన్యంపై తనిఖీలు సాగుతున్నాయి. గత యాసంగి సీజన్‌కు సంబంధించి 475 మిల్లులు, వానాకాలం సీజన్ ధాన్యంకు సంబంధించి 1,825 మిల్లులను తనిఖీ చేయనున్నారు. తనిఖీలకు అనుగుణంగా ధాన్యం బస్తాలను అందుబాటులో ఉంచాలని ఎఫ్‌సీఐ ఇప్పటికే మిల్లుల యాజమాన్యాలను ఆదేశించింది. కాగా గత మార్చి నెలలో 958 మిల్లుల్లో తనిఖీ నిర్వహించగా, 40 మిల్లుల్లో నిల్వల్లో తేడా ఉన్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు గుర్తించారు. 4.54 లక్షల బ్యాగుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. తనిఖీల తర్వాతే వానాకాలం బియ్యం సేకరణ గత యాసంగికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గడువు ముగియడంతో సీఎంఆర్ గడువును నెలరోజలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇంకా నిర్ణయం రాలేదు. కాగా ఇప్పుడు యాసంగి ధాన్యానికి సంబంధించి తనిఖీలు జరపనున్న 475 మిల్లుల్లో సీఎంఆర్ ఎంతమేర పూర్తయిందో తెలియదు. ఒకవేళ సీఎంఆర్ పూర్తయితే.. యాసంగి సీజన్లో ఆయా మిల్లులకు వచ్చిన ధాన్యం, ఇచ్చిన బియ్యం లెక్కలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి బేరీజు వేసుకొని అక్రమాలు జరిగాయో లేదో తేల్చనున్నారు. వానాకాలం సీఎంఆర్ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయి, అక్రమాలు లేవని తేలేంత వరకు బియ్యాన్ని సేకరించకూడదని ఎఫ్‌సీఐ నిర్ణయించుకుంది. ఇక నుంచి బియ్యం సేకరించేటప్పుడు బియ్యం ఎప్పటివో (ఎంత పాతవో) తేల్చే పరీక్షలు నిర్వహించాలని కూడా అధికారులకు ఎఫ్‌సీఐ ఆదేశాలు ఇచ్చింది. కాగా రైస్ మిల్లుల్లో జరిగే తనిఖీలకు అధికార యంత్రాంగం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు సూచించింది. జిల్లాల్లో తనిఖీలు సాగాయిలా... – ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో 3, ఖమ్మంలో 2, కొణిజర్ల 1, ఖమ్మం రూరల్‌లో 1, వైరాలో 3 మిల్లుల్లో తనిఖీలు జరిగాయి. జిల్లాలో మొత్తం 56 మిల్లులు ఉండగా 10 మిల్లుల నిర్వాహకులు ధాన్యం కేటాయింపునకు అనుగుణంగా సీఎంఆర్ బియ్యం ఇచ్చే సమయంలో ఆలస్యం చేస్తున్నట్టుగా తేలిందని సమాచారం. – మంచిర్యాల జిల్లాలో నస్పూర్, కిష్టంపేట, చెన్నూరు, కత్తెర శాల, ఆస్నాద్ శివారు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లుల సామర్థ్యం, ట్రక్ షీట్లు తదితర వివరాలు పరిశీలించారు. గత మార్చి నెలలో జరిపిన తనిఖీల్లో జిల్లాలో ఎక్కడా ధాన్యం, బియ్యం సరఫరాలో తేడాలు గుర్తించలేదు. తాజా తనిఖీల్లో మాత్రం కొన్ని మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలకు సంబంధించి స్వల్ప తేడా గుర్తించినట్లు సమాచారం. – జోగుళాంబ గద్వాల జిల్లా లోని అయిజ పట్టణంలోని రైస్ మిల్లులను ఎఫ్‌సీఐ మేనేజర్లు కృష్ణమోహన్ , వెంకట సాయిరాం సివిల్ సప్లయిస్ అధికారి నరసింహారావు తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. – మహబూబాబాద్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో నిల్వలను ఎఫ్‌సీఐ అధికారులు భీమ్లా నాయక్, శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. నర్సింహులపేట మండలం పెద్దనాగారం శ్రీ శ్రీ పారాబాయిల్డ్ మిల్లు, మరిపెడ మండలంలోని ఎల్లంపేట లక్ష్మీ పారాబాయిల్డ్ మిల్లులో ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలు, ఎఫ్‌సీఐకి పంపాల్సిన సీఎంఆర్ వివరాలు పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. – జగిత్యాల జిల్లాలో నాలుగు బృందాలుగా ఎఫ్‌సీఐ అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నిడమనూరు, నకిరేకల్, చిట్యాలతో పాటు సూర్యాపేట జిల్లా కోదాడలోని పలు మిల్లులో తనిఖీలు కొనసాగాయి. -
వరికి ఎసరెందుకు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 25కుపైగా రాష్ట్రాల్లో వరి పండిస్తున్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వరే ప్రధాన పంట. వరి ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నేరుగా కొనుగోలు చేయకుండా.. కస్టమ్ మిల్లింగ్ విధానంలో తీసుకుంటుంది. అంటే.. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కొని రైతులకు డబ్బులు చెల్లిస్తాయి. తర్వాత ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు పంపి మిల్లింగ్ చేయిస్తాయి. ఇందుకోసం మిల్లులకు డబ్బులు చెల్లిస్తాయి. మిల్లింగ్ ద్వారా ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపుతాయి. ఎఫ్‌సీఐ ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని ‘డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ పూల్’ విధానం ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రేషన్ డిపోలకు సరఫరా చేస్తుంది. ఎఫ్‌సీఐ ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువగా బియ్యాన్ని సేకరిస్తుంది. ♦దేశవ్యాప్తంగా 2020–21లో 12.23 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా.. ఎఫ్‌సీఐ 25 రాష్ట్రాల నుంచి 5.99 కోట్ల టన్నులు సేకరించింది. ఇందులో ముందుజాగ్రత్త కోసం చేసే నిల్వ (బఫర్ స్టాక్) 1.35 కోట్ల టన్నులుపోగా.. మిగతా బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతుంది. క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యం వస్తేనే.. ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు కనీసం 68 కిలోల బియ్యం రావాలి. కానీ రాష్ట్రంలో యాసంగి ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూకల శాతం పెరుగుతోంది. బియ్యం తగ్గుతున్నాయి. దీనికి ఎఫ్‌సీఐ అంగీకరించదు. అదే ధాన్యాన్ని పారాబాయిల్డ్ మిల్లుల్లో ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మార్చితే ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు 68కిలోలకుపైగా వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాయిల్డ్ రైస్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, వీలైనంత వరకు ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే ఎఫ్‌సీఐ ఇకముందు బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పడంతో సమస్య మొదలైంది. ♦ గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభు త్వం.. రైతులకు రూ.17 వేల కోట్లకుపైగా చెల్లించింది. ఆ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుటివరకు లక్ష్యంలో 50 శాతమే ఎఫ్‌సీఐకి పంపారు. ఎఫ్‌సీఐ గోడౌన్లకు బియ్యం చేరితేనే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి. వరిసాగు భారీగా పెరగడంతో.. తెలంగాణలో గతంలో కంటే వరిసాగు భారీగా పెరిగింది. గతంలో సాధారణంగా 26 లక్షల ఎకరాల్లో వరి పండించేవారు. కొన్నాళ్లుగా సాగునీటి సమస్య తీరడం, వాతావర ణం అనుకూలిస్తుండటం, విద్యుత్ సరఫరా బాగుండటం తో.. ప్రస్తుతం సాగు 60 లక్షల ఎకరాలకు చేరింది. కొన్నేళ్లలో నే ఇంత భారీగా సాగు, ధాన్యం దిగుబడి పెరగడంతో.. దాని కి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం పెరిగింది. మరోవైపు.. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా సమస్యకు దారి తీసింది. ♦ తెలంగాణలో గత యాసంగిలో పెరిగిన పంట విస్తీర్ణంతో ఏకంగా 92.33 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిరాగా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించింది. కానీ కేంద్రం 24.60 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని, మిగతా పచ్చి బియ్యంగా ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో రెండు సీజన్లలో పండిన పంటలో ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం కలిపి 90 లక్షల టన్నులు సేకరించాలని కోరింది. దీనికి కూడా అంగీకరించని కేంద్రం.. వానకాలం పంటను పూర్తిగా తీసుకుని, యాసంగిలో 44.75 లక్షల టన్నులే సేకరించేందుకు ఒప్పుకొంది. 2021–22 వానాకాలం (ప్రస్తుత సీజన్) పంటలోనూ 40 లక్షల టన్నుల పచ్చి బియ్యం (రా రైస్) మాత్రమే సేకరిస్తామని చెప్పింది. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం కొనబోమని స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి కేరళ, తమిళనాడు, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియాలకు సుమారు 30 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం ఎగుమతి అవుతాయని అంచనా. వరిలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడితే.. యాసంగిలో రాష్ట్ర రైతులు.. ధాన్యం దిగుబడి అధికంగా ఉండి, చీడపీడలు అంటని రకాలనే సాగుచేస్తారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న వాతావరణ పరిస్థితులు, సీడ్ కంపెనీల లాబీయింగ్ వంటికారణాలతో.. కొన్నేళ్లుగా ఒకే తరహా వంగడాలను సాగుచేస్తున్నారు. యాసంగి సమయంలోనూ మిల్లింగ్‌లో నూకలుగా మారని వంగడాలు ఉన్నా.. ఆ దిశగా రైతులు, సీడ్ కంపెనీలు ఆలోచించడం లేదని రైస్‌మిల్లర్ల సంఘం నేత తూడి దేవేందర్‌రెడ్డి చెప్తున్నారు. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ వంటి వంగడాలు యాసంగిలో కూడా మంచి దిగుబడి వస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల కన్నా వరిలోనే ప్రత్యామ్నాయ వంగడాలను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ పంటలివే.. ♦ మొక్కజొన్న, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, శనగలు, పెసర్లు, ఉలువలు తదితరాలు ♦ వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, కుసుమలు, ఆముదం, ఇతర నూనె పంటలు ♦ ఇతర ఆహార పంటలు, పొగాకు సాగు వానాకాలం పంట కొనుగోళ్లూ తక్కువే.. రాష్ట్రంలో వానాకాలం పంటను చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో పంట కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి 2,34,517 మంది రైతుల నుంచి 14.84 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. రూ.2,415 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా.. రూ.489.6 కోట్లను మాత్రమే జిల్లాలకు విడుదల చేశారు. అయితే ఆలస్యమైనా వానకాలం కొనుగోళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి యాసంగిపైనే పడింది. ఇతర రాష్ట్రాల్లో ‘బాయిల్డ్’ గొడవెందుకు లేదు? దేశవ్యాప్తంగా చూస్తే.. కేరళలో మాత్రమే అత్యధికంగా 80 శాతం ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, హరియాణా, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ యాసంగిలో పండిన ధాన్యాన్ని కొంతమేర ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. కానీ మరీ తెలంగాణ స్థాయిలో ఉండదు. ఆ రాష్ట్రాలలో ఉన్న భూసార పరిస్థితులకు తోడు.. వాటికి ఆనుకొని ఉన్న సముద్రం కారణంగా ఎండాకాలంలోనూ గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో ధాన్యం ఎక్కువగా నూకలు అవదు. కొంతమేర ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అయినా అది ఆ రాష్ట్రాల అవసరాలకు సరిపోనుంది. దీనివల్లే కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పినా.. ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురుకాలేదు. కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూపులు! ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. యాసంగిలో వరి వేయవద్దని హెచ్చరిస్తూనే, ఏ బియ్యం ఎంత మేర కొంటారో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సాగు విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆదివారం మంత్రులు, అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. రెండు రోజులు అక్కడే ఉంటామని, ఉప్పుడు బియ్యం కొనుగోళ్లకు కేంద్రం ఒప్పుకోకపోతే రైతులు యాసంగిలో ఏ పంట వేయాలో సూచిస్తామని తెలిపారు. దీంతో రైతులు ముఖ్యమంత్రి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. పచ్చిబియ్యంగా మార్చలేకనే.. వానలు సరిగాపడి, నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు రైతులను పంటల కోసం ప్రోత్సాహించాల్సింది పోయి.. వరి పండించకూడదని కేం ద్రం చెప్పడం సరికాదు. రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని పచ్చిబియ్యంగా మారిస్తే.. నూకల శాతం పెరిగి ఎఫ్‌సీఐకి విక్రయించలేని పరిస్థితి. అందుకే కొన్నేళ్లుగా బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇస్తున్నాం. యాసంగిలో కూడా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనేందుకు ముందుకు రావాలి. అంతకు మించి ప్రత్నామ్నాయం లేదు. - సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు, అఖిల భారత రైతు సంఘం చట్టం ప్రకారం కేంద్రం కొనాల్సిందే.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందే. ఆ చట్టం కింద ప్రతీ ఒక్కరికి ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం వరి తగ్గించాలనుకుంటే.. ఫలానా పంట వేస్తే మద్దతు ధరకు కొంటామని ముందే చెప్పాలి. ప్రతీ గింజ కొంటా మని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎందుకు చెప్పింది? ఏ ఆధారం చేసుకొని కేసీఆర్ ఈ ప్రకటన చేశారు? పచ్చిబియ్యం విషయంలో నూకలు వస్తాయంటున్నారు. ఇది ప్రాసెసింగ్ సమస్య. సేకరణ సమస్య కాదు. ఈ విషయంపై మిల్లర్లతో కూర్చొని చర్చించుకోవాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ప్రత్యామ్నాయ పంటలను మద్దతు ధరలకు కొనాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యామ్నాయ పంటలను మద్దతుధరకు కొనేలా హామీ ఇవ్వాలి. కేరళ తరహాలో బోనస్ ఇవ్వాలి. మద్దతు ధరలు లేని ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేయాలని చెప్తోంది. ఇందులో ఆవాలు, ఆముదం పంటలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో లేవు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించాలి. ఈ యాసంగిలో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుండే సరఫరా చేయాలి. – టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతుసంఘం -
మిశ్రమ సూచిక పద్ధతిలో ముడిబియ్యం పరీక్ష
సాక్షి, హైదరాబాద్: కస్టంమిల్డ్ రైస్(సీఎంఆర్) సేకరణలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ దీపక్ శర్మ తెలిపారు. సెంట్రల్ పూల్ సీఎంఆర్‌లో పాత బియ్యం ఆమోదించేందుకు ముందుగా మిశ్రమ సూచిక పద్ధతిలో తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని దీని ప్రకారం సెంట్రల్ పూల్ కింద సీఎంఆర్ సేకరణ కోసం మిల్డ్ ముడి బియ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. ఆకుపచ్చ/అవకాడో ఆకుపచ్చలో ఉన్న నమూనాలను మాత్రమే ఆమోదిస్తామని, పసుపు/పసుపు నారింజ/నారింజ తదితర రంగులో ఉన్న నిల్వలను తిరస్కరిస్తామని తెలిపారు. వాటాదారులకు ఈ పద్ధతి గురించి అవగాహన కల్పిస్తామని, తెలంగాణ ప్రభుత్వం భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్లతో ఈ విధానంపై అవగాహన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
Telangana: చి‘వరి’కి ఏమవుతుందో?
వానాకాలం సీజన్లో వచ్చే ధాన్యంలో కనీసం 80 లక్షల టన్నుల మేర తీసుకోవాలని ఎఫ్‌సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కానీ తొలుత 48 లక్షల టన్నులే సేకరిస్తామని ఎఫ్‌సీఐ చెప్పింది. తర్వాత 60 లక్షల టన్నులు తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో మిగతా ధాన్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం వరిపంట కోతకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ధాన్యం కొనుగోళ్లపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ధాన్యం సేకరణ విషయంగా కేంద్రం నుంచి మద్దతు కొరవడటం, అదే సమయంలో రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రానుండటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీసం 90 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. కేంద్రం 60 లక్షల టన్నులకు మించి సేకరించలేమని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఏమిటి, కొన్నా ఎక్కడ నిల్వ చేయాలి, ఇందుకు ఏమేం చర్యలు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంత కొనలేం..! రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలంలో నీటి లభ్యత పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. సుమారు 1.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని.. ఇందులో స్థానిక అవసరాలు, మిల్లర్ల అవసరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి జరిగే క్రయవిక్రయాలు పోనూ కనీసం 90 లక్షల టన్నులకుపైగా సేకరించాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది వానాకాలం లో 48.85 లక్షల టన్నులే సేకరించగా.. యాసంగిలో రికార్డు స్థాయిలో 92 లక్షల టన్నుల సేకరణ జరిగింది. అయితే ప్రస్తుత వానాకాలంలో ధాన్యం సేకరణకు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అనేక కొర్రీలు పెడుతోంది. ధాన్యం తక్కువగా కొంటామని, అందులోనూ ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమని చెప్తోంది. మిల్లుల్లోనే ధాన్యం.. గోదాముల కొరత గత యాసంగికి సంబంధించిన ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే విషయంలోనే ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతూ వచ్చింది. 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని పేర్కొంది. అయితే రాష్ట్రం ఒత్తిడితో మరో 20 లక్షల టన్నులు తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఇందులో మొత్తంగా 44.75 లక్షల టన్నులకుగాను ఎఫ్‌సీఐ ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 18 లక్షల టన్నులే తీసుకుంది. మరో 26 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. ఈ ధాన్యా న్ని కూడా ప్రతి నెలా 3–4 లక్షల టన్నులకు మించి తరలించలేకపోతోంది. ప్రస్తుత నిల్వలు ఖాళీ అయ్యేందుకు సమయం పట్టే అవకాశముంది. గోదాములు ఇప్పటికే నిండిపోయాయి. మరోవైపు వానాకాలం దిగుబడులు పోటెత్తనున్నాయి. దీంతో ఆ ధాన్యం నిల్వ సమస్యగా మారుతోంది. కార్యాచరణ ప్రణాళిక ఏదీ? రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికీ కార్యాచరణ ఖరారు కాలేదు. దసరాకు ముందే ప్రణాళిక సిద్ధం చేసి, ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా ఇంతవరకు ప్రక్రియ మొదలుకాలేదు. గత ఏడాది వానాకాలంలో 48.85 లక్షల టన్నుల మేర చేసిన సేకరణ కోసం 600కుపైగా కొనుగోలు కేంద్రాలు అవసరమయ్యాయి. ఈ ఏడాది భారీగా కొనుగోళ్లు చేయాల్సి ఉండటంతో.. రెట్టింపు కొనుగోలు కేంద్రాలు అవసరమని అంచనా. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద ఈ–అకౌంటింగ్ నిర్వహించడంతోపాటు, నిర్వాహకులు కంప్యూటర్, ప్రింటర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. దీనితోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం షెల్ట ర్లు, తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన ప్లాడీ క్లీనర్లు, విన్నోవింగ్ మెషీన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లను సమకూర్చుకోవాలి. ఈ ఏర్పాట్లకు సంబంధించి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. -
పచ్చి బియ్యం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్ సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అడిగిన విధంగా రా రైస్ (పచ్చి బియ్యం) ఇవ్వలేమని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. యాసంగిలో వరిసాగు కాలంలో అధిక ఉష్ణో గ్రత వల్ల రా రైస్ దిగుబడికి అనుకూలంగా ఉండదని, 25 శాతం కంటే అధికంగా నూకలు వస్తాయని, దీన్ని ఎఫ్‌సీఐ తిరస్కరిస్తోందన్నా రు. అందువల్ల ఎఫ్‌సీఐ అడిగినట్లుగా 40 శాతం బాయిల్డ్ రైస్, 60 శాతం రా రైస్ ఇవ్వ లేమని, 80–90 శాతం వరకు బాయిల్డ్ రైస్, మిగిలినవి రా రైస్ ఇవ్వగలమని తెలిపారు. ఈ విషయంలో ఎఫ్‌సీఐ తన నిర్ణ యాన్ని పునఃసమీక్షించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్, ఎఫ్ సీఐ నుంచి రావాల్సిన బకా యిలపై సోమవారం పౌర సరఫరాల భవ న్లో అధికారులతో శ్రీనివాస్‌రెడ్డి సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 63 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 24.75 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ పేర్కొనడం రైతాం గానికి గొడ్డలిపెట్టుగా మారుతోందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక ఇప్పుడు తీసుకోబోమనడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ఈ సమస్యను సీఎం కేసీ ఆర్, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలా కర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా సీఎంఆర్ గడువును పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. -
ఇకపై అంతా పచ్చిబియ్యమే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణపై భారత ఆహార సంస్థ కొత్త కొర్రీలు పెడుతోంది. దేశవ్యాప్తంగా పచ్చిబియ్యం (రా రైస్)కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఇకపై దాన్ని మాత్రమే సేకరిస్తామని అంటోంది. వానాకాలం, యాసంగి సీజన్లలోనూ ఇకపై పచ్చిబియ్యం మాత్రమే తమకు అందించాలని లేని పక్షంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తోంది. ఈ వానాకాలానికి సంబంధించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ముందుకు వచ్చి న ఎఫ్‌సీఐ పూర్తి పచ్చిబియ్యాన్ని మాత్రమే తీసుకోనుంది. పచ్చి బియ్యమే.. పరమాన్నం రాష్ట్రం నుంచి అధికంగా ఉప్పుడు బియ్యాన్ని సేకరించి పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే ఎఫ్‌సీఐ... గతేడాది యాసంగి నుంచి తన విధానాన్ని మార్చుకుంటూ వస్తోంది. బాయిల్డ్ రైస్ వినియోగం అధికంగా ఉండే తమిళనాడు, కేరళ నుంచి డిమాండ్ తగ్గడం, వినియోగం లేక ఎఫ్‌సీఐ వద్ద నిల్వలు పెరుగుతుండటంతో డిమాండ్ అధికంగా ఉన్న రా రైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ షరతులు పెట్టింది. గత యాసంగిలో 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఇందులో 80.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. ఈ ధాన్యాన్ని మర పట్టించడం ద్వారా 55లక్షల మె ట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి ఉంటుందని అంచనా వేసిం ది. మర పట్టించి ఇచ్చిన బియ్యంలో ఏటా 95 శాతం వరకు ఉప్పుడు బియ్యాన్నే ఎఫ్‌సీఐ సేకరిస్తూ రాగా గత సీజన్లో రా రైస్ మాత్రమే ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ దాన్ని పట్టించుకోని ఎఫ్‌సీఐ 60 శాతం మేర రా రైస్ ఇవ్వాలని కోరింది. 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నులే బాయిల్డ్ కింద ఇవ్వాలని మిగతా 30.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రా రైస్‌గా ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌లో 15 లక్షల టన్నుల సేకరణ పూర్తి చేసింది. మిగతా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ సేకరణ తర్వాత మిగతా బియ్యాన్ని సేకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌సీఐ సేకరించని పక్షంలో రాష్ట్రానికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ అవసరం ఉంటుందని అంచనా వేస్తుండగా ఇందులో గత సీజన్లను అనుసరించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంటోంది. దీనికి సంబంధించి పూర్తిగా పచ్చి బియ్యాన్ని ఇవ్వాలని కోరింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లోనూ దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో పచ్చి బియ్యం ఎలా ఇవ్వగలమన్నది ప్రశ్నగా మారింది. ఎఫ్‌సీఐ కొర్రీల దృష్ట్యానే సన్న రకాల సాగు పెంచాలని ప్రభుత్వం కోరినా గిట్టుబాటు ధరలు రాని దృష్ట్యా ఈ సీజన్లో దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. -
బియ్యంతో నిండిపోయిన గోదాములు
నల్లగొండ జిల్లాలో గోదాముల్లో 4,81,838 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అందులో ఎఫ్‌సీఐ గోదాములు బియ్యంతో ఇప్పటికే నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 8.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా మిల్లుల్లో పెట్టింది. గోదాములు ఖాళీ లేక బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. రోజుకు ఒక వ్యాగన్ ద్వారా 3800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అవసరమైన చోటికి పంపాల్సి ఉండగా, 4 రోజులకు ఒక వ్యాగన్ ద్వారానే బియ్యం సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్‌లోనూ ఎఫ్‌సీఐతోపాటు చిన్నాచితక గోదాముల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అక్కడ 12 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి మిల్లులకు అప్పగించింది. అక్కడున్న గోదాములు 90 శాతం బియ్యంతో నిండి ఉన్నాయి. అక్కడినుంచి రోజుకు రెండు వ్యాగన్లలో బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు లేదా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తేనే సేకరించిన ధాన్యాన్ని మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక వ్యాగన్ ద్వారా మాత్రమే బియ్యాన్ని ఎక్స్‌పోర్టు చేస్తుండటంతో మిల్లింగ్ కుంటుపడుతోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలు నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా తగ్గడంతో గోదాముల్లో ఖాళీలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మిల్లుల నుంచి బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. దీనికితోడు తాజాగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోబోమని పేర్కొనడంతో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మార్చి ఎఫ్‌సీఐ ఇచ్చే ప్రక్రియ స్తంభించిపోయింది. దీంతో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం వర్షాలకు తడిచి నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. కేంద్రం వద్దన్నా ముందుకొచ్చిన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని ఆ చట్టంలో పేర్కొంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లాల్లో గోదాముల సామర్థ్యం తక్కువగా ఉన్నా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ మార్కెట్‌యార్డులు, ఫంక్షన్ హాళ్లను తీసుకొని మిల్లర్లకు ఇచ్చి అక్కడ ధాన్యం నిల్వ చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఎఫ్‌సీఐ గోదాముల్లోని బియ్యం అంతర్రాష్ట్ర సరఫరా మందగించింది. ఒక్కో జిల్లా నుంచి రోజుకు నాలుగైదు వ్యాగన్ల ద్వారా బియ్యం పంపించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యాగన్ ద్వారా బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళుతోంది. నల్లగొండ మండలంలోని ఓ రైస్‌మిల్ ఆవరణలో నిల్వ ఉంచిన ధాన్యం ప్రైవేటు గోదాములు ఉన్నా వాడుకోలేని పరిస్థితి.. ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోయిన నేపథ్యంలో ప్రైవేటు గోదాములు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు గోదాములను టెండర్ ద్వారానే తీసుకోవాలని కేంద్రం నిబంధన విధించింది. ఆన్లైన్ టెండర్ జారీ చేసి, 15 రోజులు సమయం ఇవ్వాలని, తర్వాతే గోదాములను తీసుకోవాలని పేర్కొంది. ఇందుకు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే వద్దంటున్న కేంద్రం 2019–20 రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని సీఎంఆర్‌గా మార్చి ఎఫ్‌సీఐ ఇస్తూ వచ్చారు. చివరలో దాదాపు 1.01 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి చేరలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇక ఈ సీజన్లో బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని రాష్ట్రం... కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. బియ్యం తీసుకోబోమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గడిచిన సీజన్లలో మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేదని, అందుకే ఈ సారి ఇప్పటికే గడువు దాటినందున బియ్యం తీసుకోబోమని పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం సేకరించిన ధాన్యం పరిస్థితి ఏంటన్నది గందరగోళంగా మారింది. -
ఈ ఏడాది 40.47 లక్షల టన్నుల బియ్యం సేకరణ
సాక్షి, అమరావతి/ఆటోనగర్ (విజయవాడ తూర్పు): ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఇప్పటివరకు 40.47 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. 2019–20లో ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 55.36 లక్షల టన్నుల బియ్యం సేకరించినట్లు ఎఫ్‌సీఐ ఏపీ రీజియన్ జనరల్ మేనేజర్ అమరేష్ కుమార్ తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కింద 9.2 కోట్ల మంది పిల్లలకు పోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–బి వంటి పోషకాలు కలిగిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 2021–22కి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం కింద 13.97 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. కోవిడ్ దెబ్బతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి కేంద్రం.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.2,480 కోట్లతో 6.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అందించినట్లు తెలిపారు. -
ఇటు ఆకలి, అటు ఆహార ధాన్యాల వృధా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో గత జనవరి ఒకటవ తేదీ నాటికి పాడైన ఆహార ధాన్యాలు 7.2 లక్షల టన్నులు ఉండగా, మే ఒకటవ తేదీ నాటికి, అంటే నాలుగు నెలల కాలంలో అవి 71.8 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంటే దాదాపు 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. లాక్డౌన్ సందర్భంగా ‘పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ఏప్రిల్, మే నెలల్లో పేద ప్రజలకు పంపిణీ చేసిన ఆహార ధాన్యాలకన్నా ఇవి ఎక్కువ. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు, ఆహార కొరత ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కోసం భారత ఆహార సంస్థ ఈ ఆహార ధాన్యాలను ఏటా సేకరిస్తోంది. అయితే ఆహార ధాన్యాలను నిల్వచేసే గిడ్డంగుల సామర్థ్యం కన్నా ఎక్కువ ధాన్యాలను సేకరించడం, ఉన్న గిడ్డంగులు ఎప్పటికప్పుడు మరమ్మతులు నోచుకోక పోవడం వల్ల దేశంలో ఏటా ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. 2018, అక్టోబర్ నెల నుంచి దేశంలో ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువైంది. 2020, మే ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్థ గరిష్టంగా 668 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించాల్సి ఉండగా, 878 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించింది. ఆహార ధాన్యాల కొనుగోలుకే కాకుండా వాటి రవాణాకు, నిల్వకు భారత ఆహార సంస్థకు ఎంతో ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నిల్వల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వాలు ఆహార ధాన్యాల కొనుగోలుతో పాటు, వాటి రవాణా, నిల్వకు అయ్యే ఖర్చును కూడా భరించేవి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ధాన్యం ధరనే చెల్లించి సరకును తీసుకుంటోంది. అదనపు నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాల్సిందిగా భారత ఆహార సంస్థను కేంద్రం ఆదేశించింది. చాలా సందర్భాల్లో బహిరంగ మార్కెట్ రేటుకన్నా ఎక్కువ మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి సేకరించడం వల్ల, తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తంలో డబ్బు రాకపోవడం ఒకటైతే, మార్కెట్లో అదనపు నిల్వలను తక్కువ ధరకు అమ్మాల్సి రావడం, అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ధాన్యాలు పాడవడం వల్ల భారత ఆహార సంస్థ భారీగా నష్టపోతోంది. దాన్ని పూడ్చుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. 2019, డిసెంబర్ 31వ తేదీ వరకు ఆ సంస్థకు 2.36 లక్షల కోట్ల అప్పు పేరకు పోయింది. భారత ఆహార సంస్థ నిల్వల్లో ఎక్కువగా బియ్యం, గోధుమలే ఉంటాయన్న విషయం తెల్సిందే. అదనంగా సేకరించిన దాదాపు 200 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఏం చేయాలో భారత ఆహార సంస్థకు అర్థం కావడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే ఆ సంస్థ బహిరంగ మార్కెట్లో విక్రయించగలిగింది. కరోన లాక్డౌన్ సందర్భంగా రైళ్లు, బస్సుల్లోనే కాకుండా కాలి నడకన స్వగ్రామాలకు బయల్దేరిన లక్షలాది మంది వలస కార్మికులు ఆకలి కోసం అల్లాడుతుంటే, ఏటా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటించి చనిపోతుంటే మరోపక్క టన్నుల కొద్ది ఆహార ధాన్యాలు వృధా అవడం గమనిస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. -
రాష్ట్రం... ధాన్య భాండాగారం
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్ ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. దేశం మొత్తం మీద ఈ సీజన్లో 83.01 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఒక్క తెలంగాణ సొంతంగా 52.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డులు సృష్టించిందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణ æ91.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా సగానికి పైగా సేకరణపూర్తి చేసిందని వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ సైతం రికా ర్డు స్థాయిలో 23.04లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీఎండీ వి.వి.ప్రసాద్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పంజాబ్, ఎంపీలనుంచి గోధుమల సేకరణ.. ఇక గత ఏడాది దేశ వ్యాప్తంగా 3.41 కోట్ల మెట్రిక్ టన్నుల గోధుమల సేకరణ చేయగా, ఈ ఏడాది ఇప్పటికే గత ఏడాదికి మించి 3.42కోట్ల మెట్రిక్ టన్నుల గోధుమ సేకరణ పూర్తయిందని వెల్లడించారు. పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధికంగా గోధుమల సేకరణ జరిగిందని తెలిపారు. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా, కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, రవాణా, నిల్వల విషయంలో రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నామని వివరించారు. దేశంలోని పౌరులకు ఆహార ధాన్యాల కొరత లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ యోజన పథకం కింద తెలంగాణకు ఏప్రిల్, మే, జూన్ నెలల అవసరాలకు కలిపి మొత్తంగా 2.87 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం సరఫరా చేసినట్లు వెల్లడించారు. కేంద్రం అందించిన బియ్యం రాష్ట్రంలోని 1.91కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు. దీంతో పాటే తెలంగాణలోని వలస కార్మికులకు ఆహార కొరత లేకుండా వారికి నెలకు 5 కిలోల బియ్యం పంపిణీకోసం అదనంగా మరో 19,162 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా అందించినట్లు వెల్లడించారు. ఇక లాక్డౌన్ మొదలైన నాటినుంచి ఇంతవరకు తెలంగాణనుంచి 495 రైళ్ల ద్వారా 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు తరలించినట్లు తెలిపారు. -
లోగుట్టు గిడ్డంగులకెరుక!
సాక్షి, హైదరాబాద్: బియ్యం నిల్వల పేరిట భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్మించిన గిడ్డంగులను ఏళ్ల తరబడిగా ఖాళీగా పెట్టి ఆమ్యామ్యాల కోసం ప్రైవేటు గిడ్డంగుల్లో నాలుగింతలు అధిక అద్దెతో బియ్యం నిల్వ చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఎఫ్‌సీఐ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూహెచ్సీ) అధికారుల నిర్వాకంతో ఏటా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. గిడ్డంగులకు అప్రోచ్ రోడ్డు ఉన్నా లేదని, లేదా మరేదో కుంటి సాకులు చూపి అధికారులు గత ఏడేళ్లుగా ప్రైవేటు గిడ్డంగులకు కోట్లాది రూపాయలను అప్పనంగా దోచిపెట్టారని ఆధారాలతోపాటు బయటపడింది. కొంతమంది ఎఫ్‌సీఐ అధికారులు తమ బినామీలతోనే ప్రైవేటు గిడ్డంగులను కట్టించి వారికే బియ్యం నిల్వ పనులు అప్పగిస్తున్నారని పీపీపీ విధానంలో గిడ్డంగులు నిర్మించి నష్టపోయిన పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. పథకం నేపథ్యం ఇదీ.. పీపీపీ విధానంలో గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రోత్సహించి సరుకుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎఫ్‌సీఐ 2008లో ప్రైవేటు ఎంటర్ప్రెన్యూర్ గ్యారెంటీ (పెగ్) పథకం ప్రవేశపెట్టింది. గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి పెట్టదు. పెగ్ పథకం కింద నిర్మించే గిడ్డంగుల్లో పదేళ్ల పాటు గ్యారెంటీగా బియ్యం నిల్వ చేసి అద్దె చెల్లిస్తామని, దీంతో పెట్టుబడి వ్యయం తిరిగి రాబట్టుకోవచ్చని ఎఫ్‌సీఐ ధీమా కల్పించింది. దీంతో పలువురు పెట్టుబడిదారులు భారీగా గిడ్డంగులు నిర్మిం చారు. ఏడాదిలోగా శీతల గిడ్డంగులను నిర్మించాలని, రెండో ఏడాది ముగిసేలోగా సమీపంలోని రైల్వే స్టేషన్ నుంచి గిడ్డంగుల వరకు బియ్యం రవాణా కోసం రైల్వే లైను(రైల్వై సైడింగ్) నిర్మించాలనే షరతులను ఎఫ్‌సీఐ పెట్టింది. రైల్వే లైను నిర్మించేందుకు రైల్వే బోర్డు నుంచి రైల్వే ట్రాన్స్‌పోర్టు క్లియరెన్స్ (ఆర్టీసీ) పొందడంలో ఎఫ్‌సీఐ తీవ్ర జాప్యం చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పరిమాణంలో సరుకు రవాణా చేస్తారు? ఎంత రవాణా వ్యాపారం జరుగుతుంది? ఎంత ట్రాఫిక్ ఉంటుంది? తదితర సమాచారాన్ని రైల్వే బోర్డుకు పంపడంలో ఎఫ్‌సీఐ అధికారులు కావాలనే జాప్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి జీఎం లేఖే సాక్ష్యం.. ప్రైవేటు గిడ్డంగులకు బదులు పెగ్ గిడ్డంగులను వినియోగిస్తే ఏటా రూ.కోట్లు మిగులుతాయని పేర్కొంటూ 2017 మే 1న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ స్వయంగా ఎఫ్‌సీఐకి లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని పెగ్ గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తే ఏటా రూ.4.30 కోట్లు, మేళ్లచెరువులోని గిడ్డంగిలో నిల్వ చేస్తే ఏటా రూ.2.23 కోట్లు ఆదా అవుతాయని అందులో పేర్కొన్నారు. ఇదే లెక్కన టేకులసోమారం గిడ్డంగిలో నిల్వ చేసినా ఏటా రూ.2.23 కోట్లు ఆదా కానున్నాయి. వాస్తనానికి ప్రైవేటు గిడ్డంగులకు బదులు పూర్తి స్థాయిలో ఈ మూడు గిడ్డంగులను ఎఫ్‌సీఐ వాడుకుంటే ఏటా ప్రభుత్వానికి రూ.70 కోట్ల వరకు ఆదా అవుతాయని, ఏడేళ్లలో దాదాపు రూ.500 కోట్లు దుర్వినియోగం కాకుండా మిగిలేవని పెగ్ గిడ్డంగుల యజమానులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తూ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. మామూళ్ల దురాశతోనే. ఎఫ్‌సీఐ గిడ్డంగులు కాకుండా ప్రైవేటు గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తే మామూళ్లు వస్తాయన్న దురాశతో కొందరు అధికారులు ఈ జాప్యం చేసినట్లు పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. రైల్వే బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చే సరికి రెండేళ్ల జాప్యం జరిగింది. అప్పటికే రైల్వే సైడింగ్ నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. పాత నిబంధనల ప్రకారం ఒకటిన్నర కిలోమీటర్ల రైల్వేలైన్‌ను రైల్వే సొంత ఖర్చుతో నిర్మించనుండగా, కొత్త నిబంధనల్లో ఈ నిడివి అర కి.మీ.కు తగ్గింది. దీంతో మిగిలిన కిలోమీటర్ లైను నిర్మాణ వ్యయ భారం పెట్టుబడిదారులపై పడింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో టెండర్లలో ఎఫ్‌సీఐ హామీ ఇచ్చిన అద్దె ధరతో రైల్వే లైన్లు నిర్మిస్తే తమకు గిట్టుబాటు కాదని, ప్రతి బస్తాపై అదనంగా నెలకు రూ.2 అద్దె చెల్లిస్తే రైల్వే లైను పనులు చేపడుతామని పెట్టుబడిదారులు లేఖ రాశారు. రోడ్డు మార్గంతో పోలిస్తే రైల్వేమార్గంలో బియ్యం తరలిస్తే బస్తాపై రవాణా, హమాలీ చార్జీలు కలిపి రూ.20 వరకు అదా అవుతుందని, రూ.2 అదనంగా చెల్లించినా నష్టం లేదని, అయినా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు అంగీకరించలేదని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు. అప్పుడు వద్దని..ఇప్పుడు కావాలని... పత్తి నిల్వకు సీసీఐ ఇటీవల మేళ్లచెరువు, టేకులసోమారం పెగ్ గిడ్డంగులను అద్దెకు తీసుకుంది. ఈ గిడ్డంగులను వాడుకోవడానికి ఏడేళ్లుగా నిరాకరిస్తూ వచ్చిన ఎఫ్‌సీఐ అధికారులు ఈ విషయం తెలుసుకుని.. వాటిని ఖాళీ చేసి తమకు అప్పగిస్తే వాడుకుంటామని ఈ నెల 5న లేఖ రాయడం విశేషం. ఈ గిడ్డంగులను వాడుకోవడానికి సీసీఐకి లేని అభ్యంతరం ఎఫ్సీఐకు ఎందుకు ఉందనే విమర్శలొస్తాయనే జాగ్రత్త పడినట్టు అర్థమవుతోంది. యాదాద్రి జిల్లా టేకుల సోమారంలో రూ.24 కోట్లతో 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చిరాక్ వేర్‌హౌజ్ బిల్డర్స్ సంస్థ 10 గిడ్డంగులను నిర్మించింది. ఈ గిడ్డంగికి అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేదని, భవిష్యత్తులో రోడ్డు ఉన్న స్థలం నుంచి నీటిపారుదల కాల్వ వెళ్లనుందని ఏడేళ్లుగా సాకులు చెబుతూ ఇక్కడ పెట్టాల్సిన బియ్యాన్ని దగ్గరలోని ఓ ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేస్తోంది. ఇవి ఎఫ్‌సీఐ అధికారుల బినామీలవన్న విమర్శలున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో రూ.24 కోట్ల వ్యయంతో 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దేవిశ్రీ బిల్డర్స్ సంస్థ 2013లో 10 గిడ్డంగులను నిర్మించింది. సరైన అప్రోచ్ రోడ్డు లేదనే సాకుతో ఎఫ్‌సీఐ ఈ గిడ్డంగులను సైతం ఖాళీగా పెట్టింది. రైల్వే శాఖకు చెందిన భూమిలో అప్రోచ్ రోడ్డు ఉందని, ఈ గోదాములను ఉపయోగించలేమని తేలుస్తూ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు గత నవంబర్ 11న లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లా జానకంపేటలో 60 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో ‘లక్ష్మీ కోల్డ్ స్టోరేజీ అండ్ వేర్ హౌసెస్’ 12 గిడ్డంగులను నిర్మించింది. 2013లో నిర్మాణం పూర్తి చేసినా, 2017 వరకు ఈ గిడ్డంగులను ఎఫ్‌సీఐ ఖాళీగా పెట్టింది. ఈ గిడ్డంగిలో బియ్యం నిల్వ చేస్తే నెలకు అద్దె బస్తాపై 90పైసలు మాత్రమే కానుంది. 2017 నుంచి ఈ గిడ్డంగులను పాక్షికంగా మాత్రమే వినియోగించుకుంటోంది. బస్తాకు రూ.4.38 పైసలు చెల్లిస్తూ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు గిడ్డంగుల్లో ఎఫ్‌సీఐ బియ్యం నిల్వ చేస్తోంది. జానకంపేట గిడ్డంగిలో బియ్యం నిల్వ చేస్తే ఏటా రూ.4.32 కోట్లు ఆదా అవుతాయని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ 2017లో ఎఫ్‌సీఐకి లేఖ రాశారు. ప్రైవేటు దోపిడీ రైల్వే లైన్ల నిర్మాణం సాధ్యం కాకపోయినా, రోడ్డు మార్గంలో బియ్యం తరలించి 60% అద్దెతో పెగ్ స్కీం కింద నిర్మించే గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ హామీ ఇచ్చింది. ‘పెగ్’ గిడ్డంగిలో ఎన్ని బస్తాలు నిల్వ చేస్తే ఆ మేరకే అద్దె చెల్లిస్తే సరిపోనుంది. టెండరు ద్వారా నిర్మించిన గిడ్డంగుల్లో 60% అద్దెతో ఒక బస్తా బియ్యం నిల్వ చేస్తే నెలకు రూ.1 వ్యయం మాత్రమే కానుంది. రోడ్డు సరిగ్గా లేదని, హమాలీలు లేరని, క్రాప్ లేదని సాకులు చూపి ఏడేళ్లుగా ఎఫ్‌సీఐ అధికారులు చాలా పెగ్ గిడ్డంగులను ఖాళీగా ఉంచారు. వీటికి బదులుగా ప్రైవేటు గిడ్డంగుల్లో ప్రతి నెలా బస్తాకు రూ.4.68 చొప్పున బియ్యం నిల్వ చేస్తూ కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారు. -
నచ్చితే ఒక రేటు.. లేకపోతే మరో రేటు
సాక్షి, అమరావతి: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అనే రీతిలో ప్రభుత్వం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపును ఇష్టారాజ్యంగా చేస్తోంది. తమకు కావాల్సినవారికి సేవా సంస్థల పేరుతో కారుచౌకగా భూములు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయల రేటు కడుతోంది. బడా కార్పొరేట్ సంస్థలకు సైతం వందల ఎకరాలను అతి తక్కువ ధరకే ఇస్తోంది. ఇప్పటివరకూ చేసిన భూకేటాయింపులన్నీ ఇదే తరహాలో ఉండటం గమనార్హం. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎకరం రూ.25 లక్షలకే భూమిని ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీకి ఎకరం రూ.4 కోట్లు చొప్పున నిర్ణయించింది. కార్పొరేట్ సంస్థలకు తక్కువ రేటుకు భూములు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1,500 ఎకరాలు కేటాయింపు ఇప్పటివరకూ 115కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1,500 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఒక్కోదానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేసింది. 1,500 ఎకరాల్లో 600 ఎకరాలను ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున అతి తక్కువ ధరకే కట్టబెట్టేసింది. మరో 250 ఎకరాలను బీఆర్ఎస్ మెడ్‌సిటీ, ఇండో – యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్కి ఇదే రేటుకు ఇచ్చింది. కార్పొరేట్ కంపెనీ ఎల్ అండ్ టీకి కూడా ఎకరం కేవలం రూ.1.5 లక్షల చొప్పున, ఏటా ఐదు శాతం పెంచేలా 30 ఏళ్ల లీజుకి ఆ సంస్థకు ఐదెకరాల భూమిని అప్పగించింది. తక్కువ ధరకు భూమిని ఇవ్వడమే కాకుండా ఆయా సంస్థలకు అవసరమైన రోడ్లు, నీరు వంటి సౌకర్యాలను కూడా సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) సొంత ఖర్చులతో సమకూర్చిపెట్టింది. రాష్ట్రంలో 38 క్రీడా సంఘాలు అమరావతిలో స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి మాత్రం ఎకరం రూ.10 లక్షల చొప్పున 12 ఎకరాలు కేటాయించారు. సేవా సంస్థల పేరుతో.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి ఎకరం రూ.25 లక్షల చొప్పున, బ్రహ్మకుమారీస్, గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కు ఎకరం కేవలం రూ.10 లక్షల చొప్పున భూములు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలకు అదిరిపోయే ధర అదే సమయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), ఎల్ఐసీ, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్, నాబార్డ్, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, సిండికేట్ బ్యాంక్, ఐవోసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్లు చొప్పున వసూలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ నేవీ, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్సŠ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలకు సైతం ఎకరం కోటి రూపాయలు వసూలు చేసి మరీ భూములు కేటాయించారు. కార్పొరేట్ సంస్థలు, తమ అనుయాయులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కారుచౌకగా వందల ఎకరాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఆర్బీఐకు 11 ఎకరాలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు విధించారు. దీంతో కేంద్ర సంస్థలు రాజధానిలో తమ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. భూములు కేటాయింపులో స్వప్రయోజనాలు చూసుకుని తక్కువ ధరకు వందల ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఎస్ఆర్ఎం, విట్, బీఆర్ఎస్ మెడ్‌సిటీ వంటి సంస్థలకు శాశ్వతంగా భూములు బదలాయించగా ఆర్బీఐ, సీపీడబ్లు్యడీ, ఏపీహెచ్ఆర్డీ వంటి ప్రభుత్వ సంస్థలకు మాత్రం లీజుకిచ్చింది. ప్రైవేటు సంస్థలకు నేరుగా ఇలా భూములివ్వకూడదని, వేలం ద్వారా కేటాయింపు జరపాలని ఆర్థిక శాఖ, సీఆర్డీఏ సూచించినా ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయడం లేదు. కార్పొరేట్ కంపెనీలపై అమిత ప్రేమ కనబరుస్తూ రైతుల నుంచి సేకరించిన భూములను వాటికి తక్కువ రేటుకు కట్టబెడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్ జట్టు
హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అఖిల భారత ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. ఈనెల 4 నుంచి సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సౌత్‌జోన్‌లోని వివిధ రీజియన్ల నుంచి 29 మంది ప్రాబబుల్స్‌కు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. హైదరాబాద్ రీజినల్ స్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ (ఆర్‌ఎస్‌పీసీ) అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ ఎ.రాజగోపాల్, ఆర్‌ఎస్‌పీసీ సెక్రటరీ, పీఆర్ డీజీఎం విక్టర్ అమల్‌రాజ్ ఈ ట్రయల్స్‌ను పర్యవేక్షించారు. ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీలో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు డీఎస్ శ్రీధర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీ చండీగఢ్‌లో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగుతుంది. సౌత్‌జోన్ ఎఫ్‌సీఐ జట్టు: డి.ఎస్. శ్రీధర్ (కెప్టెన్), సుమిత్ అహ్లావత్, వై. అముల్ పాల్, కె.శ్రీకాంత్, ఎ.సెంథిల్ కుమారన్, జి.శ్రీకాంత్, ప్రవీణ్ సోనీ, ఎస్.గంగాధరన్, నవీన్ నైన్, జి.బాలకుమార్, ప్రమోద్ కుమార్, ఎస్.యోగేశ్, ఎం.ఎ.రషీద్, జె.ఆర్.శ్రీనివాస్, వెంకటేశ్ సాగర్, హెచ్.చంద్ర శేఖర్. -
కిలో రూ.120కు కందిపప్పు విక్రయం
నేటి నుంచి 25 కేంద్రాల్లో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన కందిపప్పు ధరలను దృష్టిలో పెట్టుకొని సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కిలో రూ.120కే అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఎంపిక చేసిన రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి విక్రయాలను శనివారం నుంచి ఆరంభించనుంది. రాష్ట్రంలో కందిపప్పు ధరల నియంత్రణకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 25వేల మెట్రిక్ టన్నుల కందిని సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసి పెట్టింది. ఇందులోంచి రాష్ట్రం ఇప్పటికే 10వేల టన్నులు తీసుకుంది. అందులో 2వేల టన్నులకు టెండర్లు పిలిచి పప్పుగా మార్చింది. దాన్నే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల ద్వారా రూ.120 సబ్సిడీ ధరకు విక్రయించనుంది. -
ఎఫ్‌సీఐ కార్యాలయంలో సీబీఐ విచారణ
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో శుక్రవారం సీబీఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎఫ్‌సీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సోమయ్య ఇటీవలి కాలంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో సీబీఐ అధికారులు ఎఫ్‌సీఐలో విచారణ చేపట్టారు. సీబీఐ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. -
కస్టమ్ మిల్లింగ్‌లో మెలికలు.. అలకలు
ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇబ్బందులు ఐకేపీ ధాన్యం కొనబోమని అల్టిమేటం అధికారి దిగిరావడంతో వెనక్కి తగ్గిన వైనం రెండేళ్లుగా ఇదే తరహా తంతు తాడేపల్లిగూడెం : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకున్నప్పటి నుంచి జిల్లాలో అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల అలసత్వం.. మిల్లర్ల అలకలు.. ఉన్నతాధికారుల జోక్యం.. తాత్కాలికంగా సమస్యకు వాణిజ్య ప్రకటనల విరామం మాదిరి గ్యాప్. మళ్లీ నిబంధనల ఉల్లంఘనలు, అలకలు, అల్టిమేటమ్‌లు మామూలే.. రెండేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఐకేపీ ధాన్యం తరలింపు వ్యవహారంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో ఆ కేంద్రాల నిర్వాహకులు రబ్బర్ స్టాంపుగా మారారు. గతంలో మాదిరి రైతు ధాన్యం ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లడం, తేమ శాతం చూసి, అవసరమైతే అక్కడే ధాన్యం ఒకటిరెండు రోజులు నిల్వ చేసి మిల్లర్లకు పంపించడం వంటివి జరిగే వి. ప్రస్తుతం మార్చిన విధానంలో ల్యాండ్టు మిల్ ప్రాతిపదికన ధాన్యం రైతుల నుంచి ఐకేపీ కేంద్ర నిర్వాహకుల కాగితాల అనుమతి పత్రాల ద్వారా మిల్లులకు వెళుతోంది. అక్కడి నుంచి సీఎంఆర్ ( కస్టమ్ మిల్లింగ్ రైస్) రూపంలో బియ్యం ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి. జిల్లాలో సుమారు 400 మిల్లులు ఉన్నాయి. వీటిలో 330 మిల్లులు పనిచేస్తున్నాయి. ఐకేపీ ద్వారా మిల్లులకు సీఎంఆర్ నిమిత్తం ధాన్యం పంపేందుకు ఆయా మిల్లుల మర ఆడింపు స్థాయి. గతంలో వారిచ్చిన సీఎంఆర్‌ను ఆధారంగా చేసుకున్నారు. ఈసారి కూడా ఆయా మిల్లులకు లక్ష్యాలను నిర్ణయించారు. దీనికనుగుణంగా ఆయా మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను ప్రభుత్వానికి చూపించాలి. ఇటీవలి కాలం వరకు ఈ వ్యవహారం సాఫీగానే సాగింది. ఒక ప్రజాప్రతినిధి స్నేహితునిగా చెబుతున్న ఓ వ్యక్తికి ఏలూరు సమీపంలో ఒక మిల్లు ఉంది. ఆ మిల్లుకు అసోసియేషన్ తరఫున కేటాయించిన సీఎంఆర్ లక్ష్యానికంటే అధికంగా ఐకేపీ నుంచి ధాన్యం తోలే విధంగా ఏర్పాటు జరిగింది. అదనంగా తోలుకొనే ధాన్యానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ చూపించలేదు. సదరు మిల్లర్ అదనంగా తోలుకున్న ధాన్యం వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారడంతో ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దింపుకోబోమని మిల్లర్ల ప్రముఖులు అధికారులకు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారి ఒకరు ఏలూరు సమీపంలోని మిల్లుకు కేటాయించిన మేరకే ధాన్యం దింపుకొనేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మిల్లర్లు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. సకాలంలో స్పందించి కేంద్ర ఆహార శాఖా మంత్రిని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఎఫ్‌సీఐ లెవీ సేకరణ ప్రక్రియ నుంచి తప్పుకొంది. అప్పటి నుంచి ఇలాంటి అలకలు, సముదాయింపులు షరా మామూలుగా సాగుతున్నాయి. -
లక్షన్నర మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల సేకరణ
♦ ఎఫ్‌సీఐ ద్వారా తెలంగాణలో 25 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలు ♦ ధరల స్థిరీకరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ♦ ‘సాక్షి’తో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కంది పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు వీలుగా భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ద్వారా కందుల సేకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. దేశం మొత్తంగా ధరల నియంత్రణకు వీలుగా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణలో 25 వేల మెట్రిక్ టన్నుల కంది సేకరణ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధర కు కందులు సేకరిస్తామని, దీనికి మార్క్‌ఫెడ్, నాఫెడ్ సేవలను వినియోగిస్తామన్నారు. ధరల నియంత్రణ అవసరమైనప్పుడు పప్పుగా మార్చిన కందిని బహిరంగ మార్కెట్లోకి ఎఫ్సీఐవిడుదల చేస్తుందని వివరించారు. రాష్ట్రా ల అవసరాలు తీరాక మిగులుంటే, ఆయా రాష్ట్రాల అంగీకారం మేరకు ఇతర రాష్ట్రాల అవసరాలకు మార్కెట్లోకి విడుదల చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన పాశ్వాన్ పార్క్ హయత్ హోటల్లో ఎఫ్‌సీఐ అధికారులతో భేటీ అయ్యారు. వారితో వివిధ అంశాలపై సమీక్షించిన అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నిల్వలపై ఆంక్షలు: ఈ ఏడాది వర్షపాత లేమి వల్ల దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో పప్పు దినుసుల సాగు తగ్గి, దిగుబడి పడిపోయిందని.. అందువల్లే ధరలు పెరిగాయని పాశ్వాన్ తెలిపారు. కంది నిల్వలపై విధించిన నియంత్రణను ఏడాది పాటు పొడిగించామని, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు ఈ నియంత్రణ పెట్టామన్నారు. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు కేంద్రం సత్వరమే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. ఉల్లి దిగుమతులపై గతంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేశామని, దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించిన కేంద్రం, ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకునేలా ప్రస్తుత నిబంధనలను సవరించామన్నారు. తెలంగాణలో 21 లక్షల బోగస్ కార్డుల తొలగింపు దేశంలో తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిందని పాశ్వాన్ తెలిపారు. తెలంగాణలో 1.91 కోట్ల మంది ఈ పథకం కింద ఉన్నారన్నారు. తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో 100 శాతం కార్డుల కంప్యూటరైజేషన్ పూర్తయిందన్నారు. తెలంగాణలో కార్డులను ఆధార్‌తో సీడింగ్ చేసి 21 లక్షల బోగస్ కార్డులను తొలగించారని, దీంతో నిజమైన అర్హులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల పంపిణీ అక్రమాలు, దారి మళ్లింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెచ్చిన పంపిణీ వ్యవస్థ నిర్వహణ (సప్లై చైన్ మేనేజ్మెంట్)ను తెలంగాణలో అమలు చేస్తే మరిన్ని అక్రమాలను అడ్డుకోవచ్చని, ఇప్పటికే ఈ విధానం 8 రాష్ట్రాల్లో అమలై మెరుగైన ఫలితాలు ఇస్తోందని చెప్పారు. ఆహార ధాన్యాలకు నగదు బదిలీ.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీపై అందజేస్తున్న సరుకుల పంపిణీలో అక్రమాలు, లీకేజీల నివారణకు నేరుగా నగదు బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ప్రస్తుతం చండీగఢ్, పుదుచ్చేరిల్లో దీనిని అమలు చేస్తోందని, మరిన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. లబ్ధిదారుల వివరాల డిజిటలైజేషన్, ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే దీన్ని నిర్వహించడం సులభమవుతుందని, దీని ద్వారా రాయితీ సొమ్ము నేరుగా లబ్ధిదారుడికే చేరి ఎక్కడైనా సరుకులు కొనే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కిరోసిన్ విషయంలో నగదు బదిలీ చేయాలన్న అంశాన్ని పెట్రోలియం శాఖ పరిశీలిస్తోందని, మున్ముందు దీనిపై నిర్ణయం రావచ్చన్నారు.