ఇక వరిసాగు.. కొరివితో చెలగాటమే! | FCI stopped by the levy and collection | Sakshi
Sakshi News home page

ఇక వరిసాగు.. కొరివితో చెలగాటమే!

Published Fri, Mar 6 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

FCI stopped by the levy and collection

ఎఫ్‌సీఐ ద్వారా లెవీ సేకరణ నిలిపివేయనున్న కేంద్రం
ధాన్యం ‘తలరాత’ బహిరంగ మార్కెట్‌కే వదిలివేత
కనీస మద్దతుధర దక్కదని అన్నదాతల ఆందోళన
 

అమలాపురం : రైతుల నెత్తున కేంద్రం మరో పిడుగు వేయనుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా ధాన్యం లెవీ సేకరణ నిలిపివేయాలని, ధాన్యాన్ని కేవలం బహిరంగ మార్కెట్‌కే విడిచిపెట్టాలని  దాదాపు నిర్ణయం తీసుకుంది. దీనితో పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర పొందలేక రైతులు నష్టపోయే దుస్థితి తలెత్తనుంది. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా లెవీగా సేకరించేది. గత ఖరీఫ్‌కు ముందు ఇది 75 శాతం వరకు ఉండేది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు దీనిని కస్టమ్ మిల్లింగ్ చేసిన తరువాత బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని 75 శాతం లెవీగా సేకరించడం ఏమిటని భావించిన కేంద్ర ప్రభుత్వం.. గత ఖరీఫ్ ముందు దీనిని మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నట్టు 25 శాతానికి కుదించింది. ఈ నిర్ణయం రైతులకు చేదు ఫలితాలు చవి చూపించింది.

ధాన్యం కొనేవారు లేక కనీస మద్దతుధర బస్తా (75 కేజీలు)కి రూ.1,035 పొందలేకపోయూరు. రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని బియ్యం గా మార్చిన తరువాత ఎఫ్‌సీఐ సేకరిస్తుందనే భరోసా లేకపోవడంతో మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాలేదు. అలాగే    ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కనీస మద్దతు ధర చెల్లించకుండా బస్తా రూ.800కు కొనడం ద్వారా మిల్లర్లు లాభాలు ఆర్జిస్తే, రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా పెద్దగా కొనుగోలు జరగలేదు. కళ్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడం వల్ల ఈ ఏడాది సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో 10.50 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం గమనార్హం. అంటే మిల్లర్లు పెద్దగాా కొనుగోలు చేయకున్నా పండిన ధాన్యంలో మూడో వంతుమాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టు. దీని వల్లే రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదు. తాజాగా ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తున్న 25 శాతం లెవీని కూడా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఎఫ్‌సీఐ గొడౌన్లలో బఫర్‌స్టాక్ కోసం ప్రభుత్వం లెవీ సేకరించేది. అవసరాలకు మించి ధాన్యం నిల్వలు ఉండడంతో కేంద్రం సేకరణ నిలిపివేసిందని సమాచారం.

పండినా తప్పని దండగ..

కేంద్రం నిర్ణయం రైతులకు అశనిపాతంగా మారనుంది. ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు ఉంటుందనే భరోసా లేకుండా పోతే మిల్లర్లు ధాన్యాన్ని ఆచితూచి కొంటారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినా దీనిని మళ్లీ మిల్లర్లకు ఇచ్చి పౌరసరఫరా శాఖ ద్వారా సేకరించాల్సి వస్తోంది. మిల్లరు కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి మొత్తం ఓపెన్ మార్కెట్‌కు తరలిస్తే డిమాండ్ తగ్గి బియ్యం ధరలు పడిపోతాయి. అదే జరిగితే మిల్లర్లకు నష్టం వస్తుంది. అలా కాక అవసరం మేరకే బియ్యాన్ని పంపినా, కృత్రిమ కొరత సృష్టించినా ధర మరింత పెరిగి మిల్లర్లు మంచి లాభాలు పొందుతారు. ఇవన్నీ చూస్తే మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ. అంటే ధాన్యాన్ని వాస్తవికమైన అవసరమైన మేరకైనా కొంటారనేది ప్రశ్నార్థకం. పోనీ ప్రభుత్వ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుందా అంటే గత ఖరీఫ్‌లో కొన్నది మూడో వంతే. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వచ్చే రబీలో జిల్లాలో ధాన్యం దిగుబడి13 లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా. పరిస్థితి చూస్తే దిగుబడి పెరిగి.. కొనుగోలు తగ్గేలా ఉంది. అదే జరిగితే రైతులు లాభసాటి, గిట్టుబాటు ధర అటుంచి కనీస మద్దతు ధర కూడా పొందే అవకాశం లేకుండా పోతుంది.

అంటే బాగా పండినా రైతులు నష్టాలు చూడాల్సి వస్తోందన్నమాట. ‘ప్రభుత్వం లెవీ సేకరణ ఎత్తివేస్తే ఎత్తివేసింది. కనీసం ఇతర దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించినా ధాన్యానికి డిమాండ్ వస్తుంది’ అని రైతులు కోరుతున్నా ప్రభుత్వం తలకెక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మునుముందు వరి సాగు కొరివితో తలగోక్కోవడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement