The collection of the levy
-
ఇక వరిసాగు.. కొరివితో చెలగాటమే!
ఎఫ్‌సీఐ ద్వారా లెవీ సేకరణ నిలిపివేయనున్న కేంద్రం ధాన్యం ‘తలరాత’ బహిరంగ మార్కెట్‌కే వదిలివేత కనీస మద్దతుధర దక్కదని అన్నదాతల ఆందోళన అమలాపురం : రైతుల నెత్తున కేంద్రం మరో పిడుగు వేయనుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా ధాన్యం లెవీ సేకరణ నిలిపివేయాలని, ధాన్యాన్ని కేవలం బహిరంగ మార్కెట్‌కే విడిచిపెట్టాలని దాదాపు నిర్ణయం తీసుకుంది. దీనితో పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర పొందలేక రైతులు నష్టపోయే దుస్థితి తలెత్తనుంది. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా లెవీగా సేకరించేది. గత ఖరీఫ్‌కు ముందు ఇది 75 శాతం వరకు ఉండేది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు దీనిని కస్టమ్ మిల్లింగ్ చేసిన తరువాత బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని 75 శాతం లెవీగా సేకరించడం ఏమిటని భావించిన కేంద్ర ప్రభుత్వం.. గత ఖరీఫ్ ముందు దీనిని మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నట్టు 25 శాతానికి కుదించింది. ఈ నిర్ణయం రైతులకు చేదు ఫలితాలు చవి చూపించింది. ధాన్యం కొనేవారు లేక కనీస మద్దతుధర బస్తా (75 కేజీలు)కి రూ.1,035 పొందలేకపోయూరు. రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని బియ్యం గా మార్చిన తరువాత ఎఫ్‌సీఐ సేకరిస్తుందనే భరోసా లేకపోవడంతో మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాలేదు. అలాగే ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కనీస మద్దతు ధర చెల్లించకుండా బస్తా రూ.800కు కొనడం ద్వారా మిల్లర్లు లాభాలు ఆర్జిస్తే, రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా పెద్దగా కొనుగోలు జరగలేదు. కళ్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడం వల్ల ఈ ఏడాది సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో 10.50 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం గమనార్హం. అంటే మిల్లర్లు పెద్దగాా కొనుగోలు చేయకున్నా పండిన ధాన్యంలో మూడో వంతుమాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టు. దీని వల్లే రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదు. తాజాగా ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తున్న 25 శాతం లెవీని కూడా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఎఫ్‌సీఐ గొడౌన్లలో బఫర్‌స్టాక్ కోసం ప్రభుత్వం లెవీ సేకరించేది. అవసరాలకు మించి ధాన్యం నిల్వలు ఉండడంతో కేంద్రం సేకరణ నిలిపివేసిందని సమాచారం. పండినా తప్పని దండగ.. కేంద్రం నిర్ణయం రైతులకు అశనిపాతంగా మారనుంది. ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు ఉంటుందనే భరోసా లేకుండా పోతే మిల్లర్లు ధాన్యాన్ని ఆచితూచి కొంటారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినా దీనిని మళ్లీ మిల్లర్లకు ఇచ్చి పౌరసరఫరా శాఖ ద్వారా సేకరించాల్సి వస్తోంది. మిల్లరు కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి మొత్తం ఓపెన్ మార్కెట్‌కు తరలిస్తే డిమాండ్ తగ్గి బియ్యం ధరలు పడిపోతాయి. అదే జరిగితే మిల్లర్లకు నష్టం వస్తుంది. అలా కాక అవసరం మేరకే బియ్యాన్ని పంపినా, కృత్రిమ కొరత సృష్టించినా ధర మరింత పెరిగి మిల్లర్లు మంచి లాభాలు పొందుతారు. ఇవన్నీ చూస్తే మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ. అంటే ధాన్యాన్ని వాస్తవికమైన అవసరమైన మేరకైనా కొంటారనేది ప్రశ్నార్థకం. పోనీ ప్రభుత్వ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుందా అంటే గత ఖరీఫ్‌లో కొన్నది మూడో వంతే. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వచ్చే రబీలో జిల్లాలో ధాన్యం దిగుబడి13 లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా. పరిస్థితి చూస్తే దిగుబడి పెరిగి.. కొనుగోలు తగ్గేలా ఉంది. అదే జరిగితే రైతులు లాభసాటి, గిట్టుబాటు ధర అటుంచి కనీస మద్దతు ధర కూడా పొందే అవకాశం లేకుండా పోతుంది. అంటే బాగా పండినా రైతులు నష్టాలు చూడాల్సి వస్తోందన్నమాట. ‘ప్రభుత్వం లెవీ సేకరణ ఎత్తివేస్తే ఎత్తివేసింది. కనీసం ఇతర దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించినా ధాన్యానికి డిమాండ్ వస్తుంది’ అని రైతులు కోరుతున్నా ప్రభుత్వం తలకెక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మునుముందు వరి సాగు కొరివితో తలగోక్కోవడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సంక్షోభంలో రైస్ మిల్లులు
మెదక్: లెవీ సేకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైస్ మిల్లులు సంక్షోభంలో పడ్డాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్న బియ్యం లెవీని 75 శాతం నుంచి 25శాతానికి తగ్గించడంతో బిన్ని మిల్లులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేం ద్రం కస్టం మిల్లింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టడంతో మిల్లర్లు విలవిలలాడుతున్నారు. దరిమిలా జిల్లాలో ఉన్న 76 బాయిల్డ్ రైస్ మిల్లులు, 200 రా రైస్‌మిల్లులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద సబ్సిడీ బియ్యాన్ని సరఫరా చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం 75శాతం లెవీని అనుమతించేది. రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన వరిధాన్యంలో 75శాతం బియ్యాన్ని లెవీ కింద ఎఫ్‌సీఐకి సరఫరా చేసే అవకాశం ఉండేది. మిగతా 25శాతం స్వేచ్ఛా మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. మిల్లర్లు కొనుగోలు చేసిన 100 క్వింటాళ్ల ధాన్యం నుంచి 67క్వింటాళ్ల ధాన్యాన్ని లెక్క గడతారు. ఇందులో లెవీ నిబంధనల ప్రకారం 75శాతం అంటే 50 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వానికి, 17క్వింటాళ్లు అంటే 25శాతం మిల్లర్లకు వెళ్తుండేది. కాని ప్రస్తుతం లేవిని 25శాతానికి తగ్గించడంతో 17క్వింటాళ్లు ప్రభుత్వానికి, 50 క్వింటాళ్లు మిల్లర్లకు వెళ్తుంది. ఎఫ్‌సీఐ కింద క్వింటాల్ బియ్యానికి సుమారు రూ.2100 చెల్లిస్తుండేవారు. దీంతో ఇది మిల్లర్లకు గిట్టుబాటుగా ఉండేది. 25శాతం లెవీతో మిల్లర్ల లబోదిబో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించి 17శాతం తేమను అనుమతించి ఎఫ్‌సీఐకి 75శాతం ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ బియ్యాన్ని సరఫరా చేసే వారు. మిగతా 25శాతం బియ్యాన్ని స్వేచ్ఛా మార్కెట్లో అమ్ముకునేవారు. కాని ప్రస్తుతం స్వేచ్ఛా మార్కెట్లో బియ్యం అమ్ముకోవాలంటే సాటెక్స్ మెషిన్లలో మరపట్టిన బియ్యం అవసరం ఉంటుంది. సాటెక్స్ మెషిన్ కొనుగోలు చేయాలంటే ఇందుకు సుమారు రూ.1.25కోట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో మొత్తం 76బాయిల్డ్ రైస్ మిల్లులు, 200 రా రైస్‌మిల్లులు ఉన్నాయి. గత ఏడాది 50వేల టన్నుల కస్టం మిల్లింగ్ రైస్, 1లక్ష15వేల టన్నుల రా బియ్యం, 1లక్ష10వేల టన్నుల బాయిల్డ్ రైస్ బియ్యం, 30వేల టన్నుల స్వేచ్ఛా విఫణి వియ్యం వెరసి సుమారు 3లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. గిట్టుబాటు కాని ధరలు కస్టం మిల్లింగ్ కింద 1 క్వింటాల్ ధాన్యాన్ని మర ఆడిస్తే ప్రభుత్వం కేవలం రూ.15ల చార్జి చెల్లిస్తుంది. ఇది 22 ఏళ్ల క్రితం నిర్ణయించిన ధర. అప్పట్లో రూ.1.20 పైసలకు యూనిట్ ఉన్న విద్యుత్ ధర నేడు రూ.9.10లకు చేరింది. అలాగే రవాణా ఖర్చులు, మెషినరీ రిపేర్లు, హమాలీల కూలీలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం చార్జీలు మాత్రం పెంచలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చూస్తే క్వింటాల్ ధాన్యానికి రూ.40లు చెల్లిస్తున్నట్లు మిల్లర్లు చెప్పారు. కస్టం మిల్లింగ్ కింద కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.200లు రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఐకేపీలు, సొసైటీల ద్వారా ధాన్యం సేకరణ చేసేందుకు నిర్ణయించింది. అయితే హమాలీ, కమిషన్లు రూ.200ల మేర మిగిలించుకొని మిగతా డబ్బులు తమకు తమకు ఇస్తే కస్టం మిల్లింగ్ చేయడానికి తాము సిద్ధమేనని రైస్ మిల్లర్లు చెబుతున్నారు.