సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యానికి, మిల్లింగ్ అయిన ధాన్యానికి, నిల్వ ఉన్న వడ్లకు లెక్క సరిపోలేదు. రూ.46 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయం అయినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రెండు విడతల తనిఖీల్లో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ధాన్యం మాయమైన మిల్లులు,తమ బృందాలకు సహకరించని మిల్లర్లపై చర్యలకు ఎఫ్‌సీఐ సిఫార సు చేసింది. ఆయా మిల్లులు నుంచి కస్టమ్ మిల్లింగ్‌రైస్ (సీఎంఆర్) కానీ, డీసీపీ బియ్యం కానీ తీసుకోవద్దనిప్రభుత్వాన్ని కోరింది.
చుక్కలు చూపించిన మిల్లర్లు
కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో సరిగా ఉన్నాయా? ఎంత పరిమాణంలో మిల్లింగ్ చేశారు? ఇచ్చిన సీఎంఆర్‌కు, నిల్వ ఉన్న ధాన్యానికి లెక్క సరిపోతోందా? అనే విషయాలపై ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు గత మార్చి, మే నెలల్లో రైస్ మిల్లులకు వెళ్లిన ఎఫ్‌సీఐ అధికారులకు మిల్లర్లు ధాన్యానికి బదులు ‘చుక్కలు’చూపించిన సంగతి తెలిసిందే.
మొదటి విడత తనిఖీల సమయంలో చాలాచోట్ల అడ్డదిడ్డంగా ఉన్న బస్తాలను లెక్కించడానికి వీలు కాలేదు. తర్వాత ‘తనిఖీలకు వస్తున్నాం... ధాన్యం సంచులను లెక్కించేందుకు వీలుగా అందుబాటులో ఉంచండి’అని సమాచారం ఇచ్చినా... 593 మిల్లుల యజమానులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. ‘అన్ కౌంటబుల్’(లెక్కించడానికి వీల్లేని స్థితిలో) ధాన్యం నిల్వలను రాశులు పోసిన మిల్లర్లు అక్రమాలు బయట పడకుండా చేశారు. అయితే మొత్తం మీద రూ.46 కోట్ల విలువైన ధాన్యం మాయం అయినట్లు ఎఫ్‌సీఐ వర్గాలు వెల్లడించాయి.
తొలివిడతలో రూ.35 కోట్లు.. మలివిడతలో రూ.11 కోట్లు
రాష్ట్రంలోని 3,278 మిల్లుల్లో 2020–21 యాసంగి, గత (2021–22) వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ లెక్కలు తేల్చేందుకు రైస్‌మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేయా లని ఎఫ్‌సీఐ గడచిన మార్చి లో నిర్ణయించింది. అప్పట్లో 958 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. 40 మిల్లుల్లో రూ.35.58 కోట్ల విలువైన 18,156 టన్నుల ధాన్యం గాయబ్ అయినట్లు గుర్తించారు.
మిగతా 2,320 మిల్లుల్లో గత నెలలో ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు నిర్ణయించి, పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. 62 బృందాలను ఏర్పాటు చేసి 124 మందితో తనిఖీలు జరిపించారు. అయితే ఈ తనిఖీలకు అనేకచోట్ల మిల్లర్లు సహకరించలేదు. కాగా 63 మిల్లుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు ధ్రువీకరించారు.
రూ.11 కోట్ల విలువైన 5,515 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్క తేలకుండా పోయింది. నిరుటి యాసంగికి సంబంధించిన ధాన్యం బస్తాలు లెక్కించడానికి వీల్లేకుండా 101 మంది మిల్లర్లు సహాయ నిరాకరణ చేయగా, గత వానాకాలం ధాన్యానికి సంబంధించి మరో 492 మిల్లులు సహకరించలేదు. మిల్లర్లు సహకరించడంతో పాటు ధాన్యం లెక్కించేందుకు వీలుగా ఉండి ఉంటే మరిన్ని అక్రమాలు వెలుగు చూసి ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ మిల్లర్లపై చర్యలు తీసుకోండి
ధాన్యం మాయం చేసిన మిల్లులతోపాటు, ఎఫ్‌సీఐకి సహకరించని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఎన్.అశోక్ కుమార్ మంగళవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష తనిఖీల్లో సరైన విధానంలో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా మిల్లర్లను ఆదేశిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని లేఖలో ఎఫ్‌సీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది.
మిల్లుల నుంచి సీఎంఆర్ కింద సెంట్రల్ పూల్‌కు ఇచ్చే బియ్యం కానీ, డీసీపీ కింద రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే బియ్యం గానీ తీసుకోవద్దని çసూచించింది. ఒకవేళ డీసీపీ పద్ధతిలో వాడుకున్నా, తాము సెంట్రల్ పూల్ లెక్కల్లోకి తీసుకోమని çసూచించింది.
Comments
Please login to add a commentAdd a comment