సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరువారాలుగా నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్రంలో సీఎంఆర్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని రైస్‌మిల్లులను మిల్లింగ్‌కు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ నిలిచిపోయిన తరువాత తలెత్తిన పరిస్థితులు, వరదల వల్ల ధాన్యం నాని మొలకెత్తిన తీరు, మిల్లర్ల అసంతృప్తి తదితర అంశాలపై మంత్రి గంగుల శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు, ఎఫ్‌సీఐ సీఎంఆర్‌ను నిలిపివేసిన నేపథ్యంలో 3,200 మిల్లుల్లో సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయన్నారు.
ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. సీఎంఆర్‌ను పునరుద్ధరించడంతో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బియ్యాన్ని తరలించడానికి రైల్వే ర్యాక్‌లను పెంచాలని ఆయన ఎఫ్‌సీఐ జీఎంను కోరారు. కాగా మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో ఏం చేయాలనే అంశాన్ని చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాశరథి అవార్డును అందుకుంటున్న సంకోజు వేణును మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment