Rice milling
-
ఇడ్లీ.. దోశ.. రీసైక్లింగ్! రేషన్ బియ్యం దందా.. ఖర్చు రూ.33.. అమ్మకం 8 కే!
బియ్యం సరిగా ఉడకట్లేదు.. ఈ చిత్రంలో ముద్దగా మారిన అన్నాన్ని చూపిస్తున్న మహిళ పేరు సమ్మెట లక్ష్మి. ఆమెది అదిలాబాద్ జిల్లా తాంసి గ్రామం. గత నెలలో రేషన్ షాపు ద్వారా తీసుకున్న దొడ్డు బియ్యం సరిగ్గా ఉడకట్లేదని ఆమె తెలిపింది. ఇలాంటి అన్నాన్ని ఎలా తినాలి? అని ప్రశ్నిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ లక్ష్యం నెరవేరడం లేదు. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత బియ్యం’ తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపించక పోవడమే ఇందుకు కారణం. తమకు ప్రతినెలా కోటా కింద వస్తున్న బియ్యంలో ఐదారు కిలోలు ఇంట్లో ఇడ్లీ, దోశల పిండి కోసం ఉపయోగిస్తూ మిగతావి రేషన్ డీలర్లకో, చిరువ్యాపారులకో లబ్ధిదారులు అమ్మేస్తున్నారు. డీలర్లు, వ్యాపారులు తాము కొంత లాభం చూసుకుని సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద తిరిగి ప్రభుత్వానికే అంటగడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కిలో బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.32.94 ఖర్చు చేస్తోంటే, లబ్ధిదారులు ఆ బియ్యాన్ని అత్యంత చౌకగా రూ.8కి విక్రయిస్తుండటం విస్మయం కలిగిస్తుండగా.. రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటూ వండితే అన్నం ముద్దగా మారుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రైస్ బదులు క్యాష్ ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఉచిత బియ్యానికి నగదు (డ్రా అండ్ క్యాష్) తంతు యథేచ్ఛగా సాగుతోంది. ఈ–పాస్ (బయోమెట్రిక్) ద్వారా కోటా బియ్యం పొందేందుకు లబ్ధిదారుల బయోమెట్రిక్/ఐరిస్ తప్పనిసరి కావడంతో ఈ–పాస్ ద్వారా ఆమోదం లభించగానే లబ్ధిదారుల అంగీకారంతో కొందరు డీలర్లు బియ్యం బదులు నగదు ముట్టజెబుతున్నారు. కరోనా కన్నా ముందు ఈ తరహా దందా 10 శాతం వరకు ఉండగా ఇప్పుడది 40 శాతానికిపైగా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల సమీపంలో చిరు వ్యాపారులు నిరీక్షిస్తూ లబ్ధిదారులు కోటా బియ్యం తెచ్చుకోగానే వారి నుంచి చౌకగా కొనేస్తున్నారు. కొన్నిచోట్ల చిరు వ్యాపారులు ఇళ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కార్డు రద్దు కాకుండా ఉండేందుకే.. వాస్తవానికి పీడీఎస్ బియ్యం అవసరం లేకు న్నా చాలామంది లబ్ధిదారులు కేవలం రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండేందుకే నెలసరి కోటా ను డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ–పాస్ ద్వారా వరుసగా 3 నెలలు సరుకులు డ్రా చేయకుంటే కార్డు రద్దవుతోంది. రేషన్ కా ర్డు బహుళ ప్రయోజనకారి కావడంతో ప్రజలు దానిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఆర్థిక భారం నెలకు రూ.506 కోట్లు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ వల్ల ప్రస్తుతం ప్రతినెలా ప్రభుత్వంపై రూ.506.05 కోట్లపైనే ఆర్థికభారం పడుతోంది. ప్రభుత్వం పీడీఎస్ కింద కిలో బియ్యం పంపిణీకి రూ.32.94 ఖర్చుచేస్తోంది. వాస్తవంగా కిలో బియ్యానికి రూ.31 చొప్పున ధర వర్తింపజేస్తున్నప్పటికీ రవాణా, నిర్వహణ కలిపి కిలోపై అదనంగా రూ.1.94 ఖర్చవుతోంది. అన్నం ముద్దగా అవుతోందని.. ఖమ్మంకు చెందిన ఆటోడ్రైవర్ వెంకటస్వామి కుటుంబానికి ఆహార భద్రత (రేషన్) కార్డు ఉంది. అతనితో పాటు భార్య, నలుగురు పిల్లలు కార్డులో సభ్యులుగా ఉన్నారు. కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు ప్రస్తుతం ఐదు కిలోల చొప్పున 30 కిలోల బియ్యం అందుతున్నాయి. అయితే అవి వండితే అన్నం ముద్దగా అవుతోందని దోశలు, ఇడ్లీల కోసం ఓ ఐదు కిలోల బియ్యం ఉంచుకుని మిగతావి కిలోకు రూ.8 చొప్పున డీలర్‌కే ఇచ్చేస్తున్నారు. డబ్బులిస్తే బాగుంటుంది.. ఉచిత బియ్యం తినేందుకు పనికిరాకుండా ఉన్నాయి. నాసిరకం బియ్యం ఇచ్చే బదులు సరిపడా డబ్బులిస్తే బాగుంటుంది. మంచి బియ్యం కొనుక్కొని తింటాం. -కావేరి, హస్తినాపురం, రంగారెడ్డి జిల్లా ఇడ్లీలు, దోశలకే వాడతాం రేషన్ బియ్యాన్ని ఇడ్లీలు, దోశలు, పిండి వంటలకే వాడతాం. మిగిలిన బియ్యం నిల్వ ఉంచితే పురుగులు పడతాయి. అందువల్లే ఇంటి వద్దకు వచ్చే చిరు వ్యాపారులకు అమ్మేస్తున్నాం. -శైలజ, మిర్యాలగూడ రేషన్ బియ్యం తినలేక.. పీడీఎస్ బియ్యం చాలావరకు ముక్కిపోయి, పురుగులు పట్టి ఉంటుండడం, వండితే అన్నం ముద్దగా కావడం, ఒకవేళ తింటే జీర్ణం కాకపోవడం వంటి కారణాలతోనే లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కొందరు కేవలం ఇడ్లీలు, దోశలు, పిండివంటలకు మాత్రం కొంత బియ్యాన్ని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు పశువులకు కుడితి కింద ఉపయోగిస్తున్నారు. మిగతా బియ్యాన్ని అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఇలా లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరిస్తున్న డీలర్లు, చిరు వ్యాపారులు వాటిని బియ్యం ముఠాలకు లేదా మిల్లరకు చేరవేస్తున్నారు. లబ్ధిదారుల వద్ద కిలో రూ.8 చొప్పున కొంటున్నవారు..ముఠాలకు రూ.10–రూ.12 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా ముఠాలు పెద్దమొత్తంలో బియ్యం సేకరించాక వాటిని వాహనాల్లో రైస్‌మిల్లులకు తరలించి కిలోకు రూ.14–16 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండగా మిల్లర్లు వాటిని కస్టమ్ మిల్లింగ్ పేరుతో తిరిగి సర్కారుకే అంటగడుతున్నారు. తద్వారా మిల్లర్లు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు దండుకుంటున్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ ప్రారంభిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరువారాలుగా నిలిచిపోయిన ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్రంలో సీఎంఆర్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని రైస్‌మిల్లులను మిల్లింగ్‌కు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ నిలిచిపోయిన తరువాత తలెత్తిన పరిస్థితులు, వరదల వల్ల ధాన్యం నాని మొలకెత్తిన తీరు, మిల్లర్ల అసంతృప్తి తదితర అంశాలపై మంత్రి గంగుల శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు, ఎఫ్‌సీఐ సీఎంఆర్‌ను నిలిపివేసిన నేపథ్యంలో 3,200 మిల్లుల్లో సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయన్నారు. ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. సీఎంఆర్‌ను పునరుద్ధరించడంతో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బియ్యాన్ని తరలించడానికి రైల్వే ర్యాక్‌లను పెంచాలని ఆయన ఎఫ్‌సీఐ జీఎంను కోరారు. కాగా మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో ఏం చేయాలనే అంశాన్ని చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాశరథి అవార్డును అందుకుంటున్న సంకోజు వేణును మంత్రి అభినందించారు. -
మిల్లింగ్.. తిరకాసు!
కోరుట్ల: ధాన్యం మిల్లింగ్‌లో అధికారులు..ప్రజాప్రతినిధులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలిపోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఏటా స్థానిక మిల్లర్లు అభ్యంతరాలు తెలుపుతున్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఎప్పటిలాగే ఈ ఖరీఫ్ సీజన్లో మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంగా మారింది. ఇదీ..తిరకాసు ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సివిల్ సప్లయ్ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 35 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 60 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఒక్క సీజన్లో జిల్లాలోని అన్ని రైస్‌మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పరిగణనలోకి తీసుకుంటే మూడు లక్షల మెట్రిక్ టన్నులపైగానే ఉంటుంది. అయినప్పటికీ జిల్లాలోని రైస్‌మిల్లులకు ఉత్పత్తి అయిన ధాన్యంలో కేవలం 1,35,100 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లింగ్‌కు కేటాయించారు. మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. స్థానికంగా రైస్ మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికి పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వెనక ఏదో తిరకాసు ఉందని స్థానిక రైస్‌మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.17కోట్ల భారం మిల్లర్ల విషయాన్ని పక్కన బెడితే ఒక్కో క్వింటాలుకు రూ.15 చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది. 1,15,250 మెట్రిక్ టన్నుల ధా న్యం జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి పరిసరాల కు తరలించడానికి ఎంత తక్కువ అనుకున్నా రూ. 17 కోట్లకు మించిన రవాణా భారం పడుతుంది. జిల్లాలోని దాదాపు 100 రైస్మిల్లుల్ల పనిచేసే సు మారు 5వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లింగ్ చేసేం దుకు అనుమతి వచ్చేలా ఒత్తిడి తెస్తే ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో అధికారులు..ప్రజాప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మిల్లింగ్ సామర్థ్యం తక్కువ జిల్లాలోని రైస్ మిల్లుల్లో మన దగ్గర ఉత్పత్తి అయిన ధాన్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం లే దు. ఈ కారణంగా పొరుగు జిల్లాల్లోని రైస్ మిల్లులకు పంపాల్సి వస్తోంది. ఇందులో ఏలాంటి సందేహాలకూ తావు లేదు. మిల్లింగ్ సామర్థ్యం పెరిగితే స్థానికంగా మిల్లర్లకు ధాన్యం కేటాయించడానికి ఇబ్బంది లేదు. – చందన్‌కుమార్, ఏఎస్వో, సివిల్ సప్లయిస్ -
మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట
తొలిసారిగా నిర్దేశిత గడువులో సీఎంఆర్ వసూలు సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా పౌర సరఫరాల శాఖ తొలిసారిగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను నిర్దేశిత గడువులోగా రాబట్టింది. నెల రోజుల వ్యవధిలో నిర్దేశిత గడువులో 98 శాతం.. అంటే రూ.421 కోట్ల విలువ చేసే 1.58 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టారు. పౌర సరఫరాల సంస్థ నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని అప్పగించడంలో మిల్లర్లు ఏటా తీవ్ర జాప్యం చేస్తున్నారు. సీఎంఆర్‌ను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పౌర సరఫరాల చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది మిల్లర్లు సీఎంఆర్‌ను ఎగవేస్తూ.. కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లులు, సీఎంఆర్ ఎగవేతదారులు, కేసులున్న వారికి కూడా సీఎంఆర్ ఇవ్వడం వంటి తప్పిదాలు పునరావృతమవుతూ వచ్చాయి. 2014-15లో మిల్లర్ల నుంచి 16.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా.. 15.07 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించారు. రూ. 350 కోట్ల విలువ చేసే 1.38 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌర సరఫరాల శాఖకు బాకీ పడ్డారు. పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం.. 2010-11 నుంచి 2014-15 వరకు 115 మంది మిల్లర్లు రూ.133.39 కోట్లు విలువ చేసే 57,781 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగవేశారు. ఈ ఏడాది 98 శాతం వసూలు 2015-16కు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి పౌర సరఫరాల శాఖ సేకరించి.. సీఎంఆర్‌లో భాగంగా 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించింది. క్వింటాలు ధాన్యానికి 68 కిలోల బాయిల్డ్ రైస్ లేదా 67 కిలోల ముడి బియ్యాన్ని తిరిగి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2015-16లో మిల్లర్ల నుంచి 15.88 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 30 నాటికి 15.66 లక్షల మెట్రిక్ టన్నులు అప్పగించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సీఎంఆర్ బకాయిలను రాబట్టేందుకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తరచూ మిల్లర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఎస్వోలు, పౌర సరఫరాల శాఖ డీఎంలతో సమీక్షలు నిర్వహించారు. అధికారులు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి మిల్లర్లపై ఒత్తిడి తేవడంతో 98 శాతం మేర సీఎంఆర్ రాబట్టారు. కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో వంద శాతం సీఎంఆర్‌ను వసూలు చేయడం ద్వారా పౌర సరఫరాల శాఖ రికార్డు సృష్టించింది. ఇకపై సీఎంఆర్ ఇచ్చే మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఎగవేతదారులు, కేసులు నమోదైన వారికి సీఎంఆర్ ఇవ్వకూడదని నిర్ణయించారు.