బియ్యం సరిగా ఉడకట్లేదు.. ఈ చిత్రంలో ముద్దగా మారిన అన్నాన్ని చూపిస్తున్న మహిళ పేరు సమ్మెట లక్ష్మి. ఆమెది అదిలాబాద్ జిల్లా తాంసి గ్రామం. గత నెలలో రేషన్ షాపు ద్వారా తీసుకున్న దొడ్డు బియ్యం సరిగ్గా ఉడకట్లేదని ఆమె తెలిపింది. ఇలాంటి అన్నాన్ని ఎలా తినాలి? అని ప్రశ్నిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ లక్ష్యం నెరవేరడం లేదు. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత బియ్యం’ తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపించక పోవడమే ఇందుకు కారణం. తమకు ప్రతినెలా కోటా కింద వస్తున్న బియ్యంలో ఐదారు కిలోలు ఇంట్లో ఇడ్లీ, దోశల పిండి కోసం ఉపయోగిస్తూ మిగతావి రేషన్ డీలర్లకో, చిరువ్యాపారులకో లబ్ధిదారులు అమ్మేస్తున్నారు. డీలర్లు, వ్యాపారులు తాము కొంత లాభం చూసుకుని సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు విక్రయిస్తున్నారు.
మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద తిరిగి ప్రభుత్వానికే అంటగడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కిలో బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.32.94 ఖర్చు చేస్తోంటే, లబ్ధిదారులు ఆ బియ్యాన్ని అత్యంత చౌకగా రూ.8కి విక్రయిస్తుండటం విస్మయం కలిగిస్తుండగా.. రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటూ వండితే అన్నం ముద్దగా మారుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
రైస్ బదులు క్యాష్
ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఉచిత బియ్యానికి నగదు (డ్రా అండ్ క్యాష్) తంతు యథేచ్ఛగా సాగుతోంది. ఈ–పాస్ (బయోమెట్రిక్) ద్వారా కోటా బియ్యం పొందేందుకు లబ్ధిదారుల బయోమెట్రిక్/ఐరిస్ తప్పనిసరి కావడంతో ఈ–పాస్ ద్వారా ఆమోదం లభించగానే లబ్ధిదారుల అంగీకారంతో కొందరు డీలర్లు బియ్యం బదులు నగదు ముట్టజెబుతున్నారు.
కరోనా కన్నా ముందు ఈ తరహా దందా 10 శాతం వరకు ఉండగా ఇప్పుడది 40 శాతానికిపైగా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల సమీపంలో చిరు వ్యాపారులు నిరీక్షిస్తూ లబ్ధిదారులు కోటా బియ్యం తెచ్చుకోగానే వారి నుంచి చౌకగా కొనేస్తున్నారు. కొన్నిచోట్ల చిరు వ్యాపారులు ఇళ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
కార్డు రద్దు కాకుండా ఉండేందుకే..
వాస్తవానికి పీడీఎస్ బియ్యం అవసరం లేకు న్నా చాలామంది లబ్ధిదారులు కేవలం రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండేందుకే నెలసరి కోటా ను డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ–పాస్ ద్వారా వరుసగా 3 నెలలు సరుకులు డ్రా చేయకుంటే కార్డు రద్దవుతోంది. రేషన్ కా ర్డు బహుళ ప్రయోజనకారి కావడంతో ప్రజలు దానిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు.
ఆర్థిక భారం నెలకు రూ.506 కోట్లు
రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ వల్ల ప్రస్తుతం ప్రతినెలా ప్రభుత్వంపై రూ.506.05 కోట్లపైనే ఆర్థికభారం పడుతోంది. ప్రభుత్వం పీడీఎస్ కింద కిలో బియ్యం పంపిణీకి రూ.32.94 ఖర్చుచేస్తోంది. వాస్తవంగా కిలో బియ్యానికి రూ.31 చొప్పున ధర వర్తింపజేస్తున్నప్పటికీ రవాణా, నిర్వహణ కలిపి కిలోపై అదనంగా రూ.1.94 ఖర్చవుతోంది.
అన్నం ముద్దగా అవుతోందని..
ఖమ్మంకు చెందిన ఆటోడ్రైవర్ వెంకటస్వామి కుటుంబానికి ఆహార భద్రత (రేషన్) కార్డు ఉంది. అతనితో పాటు భార్య, నలుగురు పిల్లలు కార్డులో సభ్యులుగా ఉన్నారు. కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు ప్రస్తుతం ఐదు కిలోల చొప్పున 30 కిలోల బియ్యం అందుతున్నాయి. అయితే అవి వండితే అన్నం ముద్దగా అవుతోందని దోశలు, ఇడ్లీల కోసం ఓ ఐదు కిలోల బియ్యం ఉంచుకుని మిగతావి కిలోకు రూ.8 చొప్పున డీలర్‌కే ఇచ్చేస్తున్నారు.
డబ్బులిస్తే బాగుంటుంది..
ఉచిత బియ్యం తినేందుకు పనికిరాకుండా ఉన్నాయి. నాసిరకం బియ్యం ఇచ్చే బదులు సరిపడా డబ్బులిస్తే బాగుంటుంది. మంచి బియ్యం కొనుక్కొని తింటాం.
-కావేరి, హస్తినాపురం, రంగారెడ్డి జిల్లా
ఇడ్లీలు, దోశలకే వాడతాం
రేషన్ బియ్యాన్ని ఇడ్లీలు, దోశలు, పిండి వంటలకే వాడతాం. మిగిలిన బియ్యం నిల్వ ఉంచితే పురుగులు పడతాయి. అందువల్లే ఇంటి వద్దకు వచ్చే చిరు వ్యాపారులకు అమ్మేస్తున్నాం.
-శైలజ, మిర్యాలగూడ
రేషన్ బియ్యం తినలేక..
పీడీఎస్ బియ్యం చాలావరకు ముక్కిపోయి, పురుగులు పట్టి ఉంటుండడం, వండితే అన్నం ముద్దగా కావడం, ఒకవేళ తింటే జీర్ణం కాకపోవడం వంటి కారణాలతోనే లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కొందరు కేవలం ఇడ్లీలు, దోశలు, పిండివంటలకు మాత్రం కొంత బియ్యాన్ని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు పశువులకు కుడితి కింద ఉపయోగిస్తున్నారు.
మిగతా బియ్యాన్ని అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఇలా లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరిస్తున్న డీలర్లు, చిరు వ్యాపారులు వాటిని బియ్యం ముఠాలకు లేదా మిల్లరకు చేరవేస్తున్నారు. లబ్ధిదారుల వద్ద కిలో రూ.8 చొప్పున కొంటున్నవారు..ముఠాలకు రూ.10–రూ.12 చొప్పున విక్రయిస్తున్నారు.
ఆయా ముఠాలు పెద్దమొత్తంలో బియ్యం సేకరించాక వాటిని వాహనాల్లో రైస్‌మిల్లులకు తరలించి కిలోకు రూ.14–16 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండగా మిల్లర్లు వాటిని కస్టమ్ మిల్లింగ్ పేరుతో తిరిగి సర్కారుకే అంటగడుతున్నారు. తద్వారా మిల్లర్లు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు దండుకుంటున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment