Free rice distribution
-
ఉచిత రేషన్ మరో ఐదేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్ అందిస్తున్న ఆహార ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లు అందజేయాలని కూడా నిర్ణయించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీని లక్ష్యమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకాన్ని రెండేళ్ల పాటు కొనసాగిస్తాం. మహిళా సంఘాలకు డ్రోన్ల కొనుగోలు వ్యయంలో 80 శాతం దాకా ఆర్థిక సాయం అందిస్తాం. ఇందుకు ఏటా రూ.1,261 కోట్లు కేటాయిస్తున్నాం. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కలి్పస్తాం. ఈ డ్రోన్లను వ్యవసాయ సేవల నిమిత్తం రైతులకు మహిళా సంఘాలు అద్దెకిస్తాయి. తద్వారా ఒక్కో సంఘం ఏటా కనీసం రూ.లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు’’ అని వివరించారు. మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేస్తామని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఇక పీఎంజీకేఏవైను మరో ఐదేళ్లు కొనసాగించేందుకు రూ.11.8 లక్షల కోట్లు అవసరమని మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో 2020లో కేంద్రం ఈ పథకాన్ని మొదలు పెట్టడం తెలిసిందే. 2026 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ శాతం తదితరాలపై సలహాలు, సూచనలకు ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘం తాలూకు విధి విధానాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కమిషన్ 2025 అక్టోబర్ అంతానికల్లా నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జనజాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.45 కోట్లు గిరిజన జనాభా ఉంది. అందులో 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్‌లోని 75 గిరిజన సమూహాలను ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మూడేళ్లు కొనసాగించేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది. -
ఎన్నికలు ముగిసే వరకూ ఆహార భద్రత !
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ తర్వాత సైతం కొనసాగించే అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ కారణాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా 81 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం ప్రతి నెల ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. నిజానికి ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించడం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత బియ్యం పథకాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని అధికార బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది. గతంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలు అండగా నిలిచిన నేపథ్యంలో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించి ఈసారీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. దీంతోపాటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రెండేళ్లుగా ఏడాది గరిష్టంగా ఒక్కో రీఫిల్‌కు రూ.200 సబ్సిడీ చొప్పున 12 సిలిండర్లను రాయితీ ధరకు అందిస్తోంది. వంటగ్యాస్ ధరలు ఎక్కువ స్థాయిలోనే కొనసాగితే ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
ఇడ్లీ.. దోశ.. రీసైక్లింగ్! రేషన్ బియ్యం దందా.. ఖర్చు రూ.33.. అమ్మకం 8 కే!
బియ్యం సరిగా ఉడకట్లేదు.. ఈ చిత్రంలో ముద్దగా మారిన అన్నాన్ని చూపిస్తున్న మహిళ పేరు సమ్మెట లక్ష్మి. ఆమెది అదిలాబాద్ జిల్లా తాంసి గ్రామం. గత నెలలో రేషన్ షాపు ద్వారా తీసుకున్న దొడ్డు బియ్యం సరిగ్గా ఉడకట్లేదని ఆమె తెలిపింది. ఇలాంటి అన్నాన్ని ఎలా తినాలి? అని ప్రశ్నిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ లక్ష్యం నెరవేరడం లేదు. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత బియ్యం’ తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపించక పోవడమే ఇందుకు కారణం. తమకు ప్రతినెలా కోటా కింద వస్తున్న బియ్యంలో ఐదారు కిలోలు ఇంట్లో ఇడ్లీ, దోశల పిండి కోసం ఉపయోగిస్తూ మిగతావి రేషన్ డీలర్లకో, చిరువ్యాపారులకో లబ్ధిదారులు అమ్మేస్తున్నారు. డీలర్లు, వ్యాపారులు తాము కొంత లాభం చూసుకుని సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద తిరిగి ప్రభుత్వానికే అంటగడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కిలో బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.32.94 ఖర్చు చేస్తోంటే, లబ్ధిదారులు ఆ బియ్యాన్ని అత్యంత చౌకగా రూ.8కి విక్రయిస్తుండటం విస్మయం కలిగిస్తుండగా.. రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటూ వండితే అన్నం ముద్దగా మారుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రైస్ బదులు క్యాష్ ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఉచిత బియ్యానికి నగదు (డ్రా అండ్ క్యాష్) తంతు యథేచ్ఛగా సాగుతోంది. ఈ–పాస్ (బయోమెట్రిక్) ద్వారా కోటా బియ్యం పొందేందుకు లబ్ధిదారుల బయోమెట్రిక్/ఐరిస్ తప్పనిసరి కావడంతో ఈ–పాస్ ద్వారా ఆమోదం లభించగానే లబ్ధిదారుల అంగీకారంతో కొందరు డీలర్లు బియ్యం బదులు నగదు ముట్టజెబుతున్నారు. కరోనా కన్నా ముందు ఈ తరహా దందా 10 శాతం వరకు ఉండగా ఇప్పుడది 40 శాతానికిపైగా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల సమీపంలో చిరు వ్యాపారులు నిరీక్షిస్తూ లబ్ధిదారులు కోటా బియ్యం తెచ్చుకోగానే వారి నుంచి చౌకగా కొనేస్తున్నారు. కొన్నిచోట్ల చిరు వ్యాపారులు ఇళ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కార్డు రద్దు కాకుండా ఉండేందుకే.. వాస్తవానికి పీడీఎస్ బియ్యం అవసరం లేకు న్నా చాలామంది లబ్ధిదారులు కేవలం రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండేందుకే నెలసరి కోటా ను డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ–పాస్ ద్వారా వరుసగా 3 నెలలు సరుకులు డ్రా చేయకుంటే కార్డు రద్దవుతోంది. రేషన్ కా ర్డు బహుళ ప్రయోజనకారి కావడంతో ప్రజలు దానిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఆర్థిక భారం నెలకు రూ.506 కోట్లు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ వల్ల ప్రస్తుతం ప్రతినెలా ప్రభుత్వంపై రూ.506.05 కోట్లపైనే ఆర్థికభారం పడుతోంది. ప్రభుత్వం పీడీఎస్ కింద కిలో బియ్యం పంపిణీకి రూ.32.94 ఖర్చుచేస్తోంది. వాస్తవంగా కిలో బియ్యానికి రూ.31 చొప్పున ధర వర్తింపజేస్తున్నప్పటికీ రవాణా, నిర్వహణ కలిపి కిలోపై అదనంగా రూ.1.94 ఖర్చవుతోంది. అన్నం ముద్దగా అవుతోందని.. ఖమ్మంకు చెందిన ఆటోడ్రైవర్ వెంకటస్వామి కుటుంబానికి ఆహార భద్రత (రేషన్) కార్డు ఉంది. అతనితో పాటు భార్య, నలుగురు పిల్లలు కార్డులో సభ్యులుగా ఉన్నారు. కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు ప్రస్తుతం ఐదు కిలోల చొప్పున 30 కిలోల బియ్యం అందుతున్నాయి. అయితే అవి వండితే అన్నం ముద్దగా అవుతోందని దోశలు, ఇడ్లీల కోసం ఓ ఐదు కిలోల బియ్యం ఉంచుకుని మిగతావి కిలోకు రూ.8 చొప్పున డీలర్‌కే ఇచ్చేస్తున్నారు. డబ్బులిస్తే బాగుంటుంది.. ఉచిత బియ్యం తినేందుకు పనికిరాకుండా ఉన్నాయి. నాసిరకం బియ్యం ఇచ్చే బదులు సరిపడా డబ్బులిస్తే బాగుంటుంది. మంచి బియ్యం కొనుక్కొని తింటాం. -కావేరి, హస్తినాపురం, రంగారెడ్డి జిల్లా ఇడ్లీలు, దోశలకే వాడతాం రేషన్ బియ్యాన్ని ఇడ్లీలు, దోశలు, పిండి వంటలకే వాడతాం. మిగిలిన బియ్యం నిల్వ ఉంచితే పురుగులు పడతాయి. అందువల్లే ఇంటి వద్దకు వచ్చే చిరు వ్యాపారులకు అమ్మేస్తున్నాం. -శైలజ, మిర్యాలగూడ రేషన్ బియ్యం తినలేక.. పీడీఎస్ బియ్యం చాలావరకు ముక్కిపోయి, పురుగులు పట్టి ఉంటుండడం, వండితే అన్నం ముద్దగా కావడం, ఒకవేళ తింటే జీర్ణం కాకపోవడం వంటి కారణాలతోనే లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కొందరు కేవలం ఇడ్లీలు, దోశలు, పిండివంటలకు మాత్రం కొంత బియ్యాన్ని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు పశువులకు కుడితి కింద ఉపయోగిస్తున్నారు. మిగతా బియ్యాన్ని అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఇలా లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరిస్తున్న డీలర్లు, చిరు వ్యాపారులు వాటిని బియ్యం ముఠాలకు లేదా మిల్లరకు చేరవేస్తున్నారు. లబ్ధిదారుల వద్ద కిలో రూ.8 చొప్పున కొంటున్నవారు..ముఠాలకు రూ.10–రూ.12 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా ముఠాలు పెద్దమొత్తంలో బియ్యం సేకరించాక వాటిని వాహనాల్లో రైస్‌మిల్లులకు తరలించి కిలోకు రూ.14–16 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండగా మిల్లర్లు వాటిని కస్టమ్ మిల్లింగ్ పేరుతో తిరిగి సర్కారుకే అంటగడుతున్నారు. తద్వారా మిల్లర్లు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు దండుకుంటున్నట్టు తెలుస్తోంది. -
TS: తగ్గిన తలసరి కోటా
సాక్షి, హైదరాబాద్: బియ్యంలో కోతపడింది. కొన్నినెలలుగా పంపిణీ చేస్తున్న తలసరి 10 కిలోల ఉచిత బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది. ఈ నెల నుంచి ఆహార భద్రతా కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ ఆహార భద్రతా కార్డుల(ఎన్ఎఫ్ఎస్సీ)తోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులందరికీ ఇదే వర్తించనుంది. కేంద్రమిచ్చేదానికి అదనంగా.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రేషన్‌కార్డులపై రూపాయికి కిలో బియ్యం చొప్పున.. కుటుంబంలోని నలుగురికి ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున పంపిణీ చేసేవారు. కేసీఆర్ సర్కారు 2015 జనవరి 1 నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకం మొదలైంది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేంద్రం 54.44 లక్షల కార్డుల పరిధిలోని 1.91 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కిలోకు రూ.3 రేటుతో బియ్యం ఇస్తుంది. ఇందులో 2 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతోపాటు అదనంగా మరో కిలో కలిపి.. ఆరు కిలోల చొప్పున ‘రూపాయి’బియ్యం ఇస్తూ వచ్చింది. కరోనా పరిస్థితులతో ఉచితంగా.. కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితుల నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం తెచ్చి.. పేదలందరికీ ఉచితంగా 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వస్తోంది. తాజాగా 2023 డిసెంబర్ వరకు కూడా ఐదు కిలోల ఉచిత బియ్యం పథకాన్ని పొడిగిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదనంగా ఇస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి స్వస్తి పలికింది. ఆహార భద్రతా కార్డులన్నింటిపై ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే కరోనాకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తలా ఆరు కిలోల బియ్యం ఇవ్వగా.. ఇప్పుడు అందులోనూ ఒక కిలో కోత పడటం గమనార్హం. ఇన్నాళ్లూ తీవ్ర భారం మోస్తూ.. రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య 90,13,512. ఇందులో 54.44 లక్షలకార్డులు జాతీయ ఆహార భద్రతాచట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేటాయించినవికాగా, 30 లక్షలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవి. ఇవికాకుండా 5.62 లక్షల అంత్యోదయ అన్నయోజన, 5 వేలకుపైగా అన్నపూర్ణ కార్డులు ఉన్నా యి. మొత్తంగా 2.68 కోట్ల మందికి రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. అయితే కరోనా సమయం నుంచి రాష్ట్రంలో అదనంగా ఉచిత బియ్యం ఇవ్వడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడింది. దీనికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3వేల కోట్లు ఖర్చయ్యాయి. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రతినెలా ప్రభుత్వం రూ.300 కోట్ల చొప్పున సబ్సిడీ భరించింది. ఇప్పుడీ భారం చాలా వరకు తగ్గనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. -
రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, అమరావతి: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించొద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మంగళగిరిలో చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ఉచిత బియ్యం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. సమీపంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎండీయూ వాహన సేవలు, బియ్యం నాణ్యతపై అభిప్రాయాణలను సేకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని వాహనాల్లో ఇంటి వద్దకే అందించడం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో రేషన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. చాలా మంది పేదలు ప్రభుత్వం ఇస్తున్న రూపాయికే కిలో బియ్యంతో కడుపు నింపుకుంటున్నట్టు చెప్పారన్నారు. -
Telangana: ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో శుక్రవారం నుంచి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల కార్డులు, 2.83 కోట్ల లబ్ధిదారులున్నారని వివరించారు. వీరిలో కేంద్రం కేవలం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తోందని స్పష్టం చేశారు. మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాçష్ట్ర ప్రభుత్వమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరో విడత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు రేషన్ పంపిణీని పొడిగించిందని తెలిపారు. ఇందుకోసం కేవలం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని పేర్కొన్నారు. వీటికి నెలకు రూ.75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అదనంగా రూ.227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. పీఎంజీకేఏవై మొదలైనప్పటి నుంచి అదనంగా 25 నెలలకు కేవలం బియ్యం కోసం రూ.1,308 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. వలస కూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1,500 చొప్పున రెండునెలలు అందజేసిన మొత్తం రూ.2,454 కోట్లని వివరించారు. -
PMGKY: బాధ్యతగా ఆహార భద్రత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) 3,06,878 మంది కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యాన్ని అందించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేషన్ షాపులలో ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తారు. ఎన్ఎఫ్ఎస్ఏ లబి్ధదారులకు వలంటీర్ల ద్వారా పంపిణీకి సంబంధించిన కూపన్లు రెండు రోజుల ముందే వారి ఇంటి వద్దనే అందజేసే విధంగా ఏర్పాటు చేశారు. కూపన్లు తీసుకొన్న లబి్ధదారులు వారు కూపన్లలో చూపిన దుకాణానికి వెళ్లి ఉచిత బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యథావిధిగా రాష్ట్రం బియ్యం.. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న సార్టెక్స్ బియ్యాన్ని యథావిధిగా ఉమ్మడి జిల్లాలోని కార్డుదారులకు 710 ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ ఆగస్టు 1వ తేదీ నుంచి ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగనుంది. కార్డుదారుని ఇంటి వద్దకే వెళ్లి ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. గ్యాస్ సిలెండర్ల విక్రయాలకు.. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ షాపుల్లో 5కేజీల గ్యాస్ సిలెండర్లను అందుబాటులోకి ఉంచే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జాయింట్ కల్టెకర్ నుపూర్ అజయ్ కుమార్ గ్యాస్ కంపెనీలు, రేషన్‌షాపు డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కలి్పంచారు. ఈ మేరకు వారితో ఎంఓయూ చేసుకున్నారు. ఒక్కో రేషన్ షాపులో 20 సిలెండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. 5 కేజీల గ్యాస్ సిలెండర్ రిజి్రస్టేషన్ చార్జీ రూ. 1,803గా నిర్ణయించారు. ఇందులో రూ.640విలువైన గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అయి పోయిన వెంటనే, రేషన్‌షాపు వద్దకు వెళ్లి ఖాళీ సిలెండర్, ఇచ్చి నిండు సిలెండర్ తీసుకోవచ్చు. బియ్యం పంపిణీకి ఏర్పాట్లు.. జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన కార్డులకు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతినెలా చేస్తున్న బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే వెళ్లి అందిస్తాం. త్వరలో రేషన్ షాపుల్లో 5కేజీల సిలెండర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. – శ్రీవాస్ నుపూర్, జేసీ, ఎన్టీఆర్ జిల్లా -
జనవరిలో ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: డిసెంబర్లో పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని జనవరిలో అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. పీఎంజీకేఏవై కింద కేంద్రం ఉచిత బియ్యం పంపిణీని డిసెంబర్ (2021) నుంచి మార్చి( 2022) వరకు పొడిగించిందని చెప్పారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రతా పథకంలోని కార్డుదారులు ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పొందనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం 89 లక్షల మందికి (జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు)మాత్రమే సరిపడే 1,34,110.515 టన్నుల బియ్యాన్ని మాత్రమే కేటాయించిందన్నారు. అయితే ఏపీలో మొత్తం 144 లక్షల మంది లబ్ధిదారులకు 2,11,592.890 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సరిపడ నిల్వలు లేకపోవడంతో పంపిణీని వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. పీఎంజీకేఏవై కింద రాష్ట్రంలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 5,36,442.040 టన్నుల బియ్యాన్ని ఉచితంగా..3,27,120 టన్నుల బియ్యాన్ని బయట మార్కెట్ ద్వారా రాష్ట్రానికి విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 1న కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఇంత వరకు కేంద్రం నుంచి స్పందనలేదన్నారు. -
ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేత!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా దేశంలో నిరుపేదలకు ఉచితంగా అందించిన బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీ నవంబర్ తర్వాత నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద పేదలకు ఉచితంగా బియ్యం/గోధుమల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. గడువు పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆహార ధాన్యాల పంపిణీని కొనసాగించే అంశమై ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవలే ప్రకటించారు. కోవిడ్–19 మహహ్మరి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పథకాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. -
జూన్, జూలైల్లో ఉచిత బియ్యం!
సాక్షి, హైదరాబాద్: జూన్, జూలైల్లో ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వనుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉపాధిలేక ఇంటి పట్టునే ఉంటున్న పేదలకు ఆహార కొరత లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రకటించిన ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. కేంద్రం అందిస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి అదనంగా రాష్ట్ర కోటా కింద మరో 5 కిలోలు కలిపి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్రంపై నెలకు రూ.200 కోట్ల మేర భారం దేశవ్యాప్తంగా కేంద్ర ఆహార చట్టం పరిధిలోకి వచ్చే 80 కోట్ల మంది లబ్ధిదారులకు గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని కేంద్రం ఇదివరకే తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర చట్టం పరిధిలోకి వచ్చేవారు 1.91 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వీరికి అవసరమయ్యే 93 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. రాష్ట్ర చట్టం పరిధిలోకి వచ్చే 90 లక్షల మంది లబ్ధిదారులతో కలుపుకొని మొత్తం 2.80 కోట్ల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. అదనంగా ఇచ్చే బియ్యం కోటాతో ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.400 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్‌కు అవసరమయ్యే బియ్యం కోటాను 25వ తేదీ నాటికి రేషన్ షాపులకు ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, తమను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించడంతోపాటు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, అందరికీ ఇన్సూరెన్స్ చేయించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జూన్‌లో బియ్యం పంపిణీ నిలిపివేస్తామని చెబుతున్నారు. వీరి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయం మేరకు బియ్యం పంపిణీ ఆధారపడి ఉంది. -
కోటి 30 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం
గుడివాడ టౌన్: రాష్ట్రంలో కోటీ 47 లక్షల పైచిలుకు కుటుంబాల్లో ఇప్పటివరకు కోటీ 35 లక్షల మందికి ఉచిత బియ్యం పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. శనివారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన బియ్యం అందిస్తున్నామన్నారు. ప్రజలు ఇంటికే పరిమితమై కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. -
నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ
గుడివాడ టౌన్: కరోనా నేపథ్యంలో పేదవారిని ఆదుకోవాలనే దృక్పథంతో శనివారం నుంచి ప్రతి ఒక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోలు సార్టెక్స్ స్వర్ణరకం మధ్యస్త సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. మే, జూన్ నెలల్లో ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లు వెచ్చించిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్లు బియ్యం కార్డులున్నాయన్నారు. వారందరికీ ఉచిత బియ్యం అందిస్తామన్నారు. -
మార్చి వరకు ఉచిత బియ్యం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా నుంచి పేదలు ఇంకా పూర్తిగా కోలుకోని దృష్ట్యా పేదలకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో కేంద్రం ప్రకటన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గడువు నవంబర్‌తో ముగియనుంది. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు క్షీణించడం, వరదలతో పంటనష్టం సంభవిం చడం, నిర్మాణ రంగం ఇంకా కోలుకోక వలస కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తుండటంతో ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వేళ ఆదుకునేందుకు... కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పో యిన పేద, మద్య తరగతి రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి 3 నెలలపాటు ఉచితంగా ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యంతోపాటు కార్డున్న ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా వారిలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.91 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి అదనంగా మరో 7 కిలోలు కలిపి మొత్తంగా 12 కిలోలు అందించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా పేదలకు సరైన ఉపాధి లభించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీని మార్చి వరకు పొడిగించాలని ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. -
వలస కూలీలకు ఉచిత రేషన్
న్యూఢిల్లీ: వలస కూలీలకు ఉచిత రేషన్‌ను వెంటనే అందజేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది వలస కూలీలకు రెండు నెలలకు అవసరమైన ఆహారధాన్యాలు, పప్పులను గోదాముల నుంచి తీసుకుని 15 రోజుల్లోగా పంపిణీ చేయాలని కేంద్రం ఆహార శాఖ మంత్రి పాశ్వాన్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రేషన్ కార్డులు లేని వలస కూలీలు కూడా అర్హులేనన్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలో చొప్పున గోధుమలు లేదా బియ్యం, 1 కిలో శనగలు మే, జూన్ రేషన్‌గా అందివ్వాలన్నారు. ప్రస్తుత అంచనా 8 కోట్లకు మించి వలస కూలీలున్నట్లయితే అదనంగా కూడా రేషన్‌ను కేంద్రం కేటాయిస్తుందనీ, వాస్తవ లబ్ధిదారులను రాష్ట్రాలు గుర్తించాలని, ఆ వివరాలను కేంద్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ, గుజరాత్‌లకు గోధుమలతోపాటు బియ్యాన్ని, రాజస్తాన్, పంజాబ్, ఛండీగఢ్‌లకు గోధుమలు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బియ్యం కేటాయింపులు జరిగాయి. -
మిగులు నుంచే ‘ఉచిత’ సర్దుబాటు!
ఉచిత బియ్యం పథకం అమలుకు టీ సర్కారు కసరత్తు బోగస్ ఏరివేతతో బియ్యం, కిరోసిన్ సబ్సిడీలో రూ.400 కోట్ల మిగులు ఉచిత బియ్యం పంపిణీకి అదనంగా అయ్యేది రూ.200 కోట్లే మిగులు నిధుల నుంచి ఈ వ్యయం భరించాలని యోచన హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉచిత బియ్యం పంపిణీకి.. ప్రస్తుతం అవుతున్న వ్యయం కంటే అదనంగా మరో రూ.200 కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బోగస్ కార్డుల ఏరివేతతో మిగులుతాయని భావిస్తున్న రూ.400 కోట్ల నుంచి ఈ సొమ్మును సర్దుబాటు చేయవచ్చని సర్కారు భావిస్తోంది. ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే దిశగా ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభించిన కేబినెట్ సబ్‌కమిటీ.. ఇదే అంశంపై మరోమారు అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాక ఓ నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎఫ్‌సీఐ కోటా కింద 10.94 లక్షల మెట్రిక్ టన్నులు (ఏపీఎల్-6.56, బీపీఎల్-4.38 లక్షల మెట్రిక్ టన్నులు) కేటాయిస్తుండగా, మరో 7 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్రం సమకూరుస్తోంది. ఈ బియ్యం పంపిణీ కింద రాష్ట్రం ఏటా సుమారుగా రూ.1,400 కోట్ల మేర సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 11 లక్షల బోగస్ కార్డులను ఏరివేయడం ద్వారా సుమారు 51 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను తొలగించింది. ఈ ఏరివేసిన కార్డులకు ఇప్పటికే బియ్యం, కిరోసిన్ సరఫరాలను పూర్తిచేయడంతో అవన్నీ మిగులులో ఉన్నట్టే. సెప్టెంబర్ లెక్కల ప్రకారం నెలకి సుమారు 16 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 2,460 కిలోలీటర్ల కిరోసిన్ మిగులు చేకూరింది. అంటే ఏడాదిలో ఇంకా పూర్తిస్థాయిలో ఏరివేత పూర్తయితే రాష్ట్రానికి మొత్తం సబ్సిడీ భారం రూ.400 కోట్ల మేర తగ్గుతుందని పౌర సరఫరాల శాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం స్థానంలో ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఏటా మరో రూ.200 కోట్ల కంటే ఎక్కువ భారం పడదని, దీన్నిసైతం మిగులులోంచి సర్దుబాటు చేయొచ్చన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందని చెబుతున్నారు. ఇక బియ్యం కోటాను సైతం కుటుంబానికి 20 కేజీల నుంచి 30-35 కేజీల వరకు పెంచే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న సర్కారు.. బియ్యం లభ్యత, కేంద్ర సహకారం, ఆర్థిక భారాల లెక్కలు తేలాకే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది.కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ దీనిపై అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకున్నాక ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పామాయిల్ పునరుద్ధరణ దిశగా... గత ఐదు నెలలుగా రేషన్‌కార్డుదారులకు నిలిచిపోయిన పామాయిల్ సరఫరాను తిరిగి పునరుద్ధరించే అంశంపై కూడా సర్కారు సమాలోచనలు చేస్తోంది. పామాయిల్‌పై కేంద్ర సబ్సిడీ ఎత్తివేసిన అనంతరం దీన్ని పునరుద్ధరించే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనర్హుల ఏరివేత పూర్తికావడం, పామాయిల్‌కు లబ్ధిదారుల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉన్న దృష్ట్యా దీనిపై ఓ నిర్ణయానికి రావాలని ప్రజాప్రతినిధుల నుంచి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులకు వినతులు వెళ్లాయి. పామాయిల్ సబ్సిడీ భారం నెలకు రూ.19 కోట్లు, ఏటా రూ.230 కోట్ల వరకు ఉంటుందని గతంలోనే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అయితే బోగస్ ఏరివేత పెద్ద ఎత్తున జరిగినందున ఈ భారం రూ.180 కోట్లకే పరిమితం కావచ్చని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ భారాన్ని కూడా మిగులు సబ్సిడీ నుంచి సర్దుబాటు చేయాలని సబ్ కమిటీ యోచిస్తోంది.