సాక్షి, హైదరాబాద్: బియ్యంలో కోతపడింది. కొన్నినెలలుగా పంపిణీ చేస్తున్న తలసరి 10 కిలోల ఉచిత బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది. ఈ నెల నుంచి ఆహార భద్రతా కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ ఆహార భద్రతా కార్డుల(ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ)తోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులందరికీ ఇదే వర్తించనుంది.
కేంద్రమిచ్చేదానికి అదనంగా..
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రేషన్‌కార్డులపై రూపాయికి కిలో బియ్యం చొప్పున.. కుటుంబంలోని నలుగురికి ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున పంపిణీ చేసేవారు. కేసీఆర్ సర్కారు 2015 జనవరి 1 నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకం మొదలైంది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద కేంద్రం 54.44 లక్షల కార్డుల పరిధిలోని 1.91 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కిలోకు రూ.3 రేటుతో బియ్యం ఇస్తుంది. ఇందులో 2 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతోపాటు అదనంగా మరో కిలో కలిపి.. ఆరు కిలోల చొప్పున ‘రూపాయి’బియ్యం ఇస్తూ వచ్చింది.
కరోనా పరిస్థితులతో ఉచితంగా..
కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితుల నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం తెచ్చి.. పేదలందరికీ ఉచితంగా 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వస్తోంది. తాజాగా 2023 డిసెంబర్ వరకు కూడా ఐదు కిలోల ఉచిత బియ్యం పథకాన్ని పొడిగిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదనంగా ఇస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి స్వస్తి పలికింది. ఆహార భద్రతా కార్డులన్నింటిపై ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే కరోనాకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తలా ఆరు కిలోల బియ్యం ఇవ్వగా.. ఇప్పుడు అందులోనూ ఒక కిలో కోత పడటం గమనార్హం.
ఇన్నాళ్లూ తీవ్ర భారం మోస్తూ..
రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య 90,13,512. ఇందులో 54.44 లక్షలకార్డులు జాతీయ ఆహార భద్రతాచట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద కేటాయించినవికాగా, 30 లక్షలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవి. ఇవికాకుండా 5.62 లక్షల అంత్యోదయ అన్నయోజన, 5 వేలకుపైగా అన్నపూర్ణ కార్డులు ఉన్నా యి. మొత్తంగా 2.68 కోట్ల మందికి రేషన్ బియ్యం సరఫరా అవుతోంది.
అయితే కరోనా సమయం నుంచి రాష్ట్రంలో అదనంగా ఉచిత బియ్యం ఇవ్వడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడింది. దీనికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3వేల కోట్లు ఖర్చయ్యాయి. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రతినెలా ప్రభుత్వం రూ.300 కోట్ల చొప్పున సబ్సిడీ భరించింది. ఇప్పుడీ భారం చాలా వరకు తగ్గనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment