National Food Security scheme
-
TS: తగ్గిన తలసరి కోటా
సాక్షి, హైదరాబాద్: బియ్యంలో కోతపడింది. కొన్నినెలలుగా పంపిణీ చేస్తున్న తలసరి 10 కిలోల ఉచిత బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది. ఈ నెల నుంచి ఆహార భద్రతా కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ ఆహార భద్రతా కార్డుల(ఎన్ఎఫ్ఎస్సీ)తోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులందరికీ ఇదే వర్తించనుంది. కేంద్రమిచ్చేదానికి అదనంగా.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రేషన్‌కార్డులపై రూపాయికి కిలో బియ్యం చొప్పున.. కుటుంబంలోని నలుగురికి ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున పంపిణీ చేసేవారు. కేసీఆర్ సర్కారు 2015 జనవరి 1 నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకం మొదలైంది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేంద్రం 54.44 లక్షల కార్డుల పరిధిలోని 1.91 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కిలోకు రూ.3 రేటుతో బియ్యం ఇస్తుంది. ఇందులో 2 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతోపాటు అదనంగా మరో కిలో కలిపి.. ఆరు కిలోల చొప్పున ‘రూపాయి’బియ్యం ఇస్తూ వచ్చింది. కరోనా పరిస్థితులతో ఉచితంగా.. కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితుల నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం తెచ్చి.. పేదలందరికీ ఉచితంగా 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వస్తోంది. తాజాగా 2023 డిసెంబర్ వరకు కూడా ఐదు కిలోల ఉచిత బియ్యం పథకాన్ని పొడిగిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదనంగా ఇస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి స్వస్తి పలికింది. ఆహార భద్రతా కార్డులన్నింటిపై ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే కరోనాకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తలా ఆరు కిలోల బియ్యం ఇవ్వగా.. ఇప్పుడు అందులోనూ ఒక కిలో కోత పడటం గమనార్హం. ఇన్నాళ్లూ తీవ్ర భారం మోస్తూ.. రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య 90,13,512. ఇందులో 54.44 లక్షలకార్డులు జాతీయ ఆహార భద్రతాచట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేటాయించినవికాగా, 30 లక్షలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవి. ఇవికాకుండా 5.62 లక్షల అంత్యోదయ అన్నయోజన, 5 వేలకుపైగా అన్నపూర్ణ కార్డులు ఉన్నా యి. మొత్తంగా 2.68 కోట్ల మందికి రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. అయితే కరోనా సమయం నుంచి రాష్ట్రంలో అదనంగా ఉచిత బియ్యం ఇవ్వడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడింది. దీనికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3వేల కోట్లు ఖర్చయ్యాయి. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రతినెలా ప్రభుత్వం రూ.300 కోట్ల చొప్పున సబ్సిడీ భరించింది. ఇప్పుడీ భారం చాలా వరకు తగ్గనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. -
జనవరిలో ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: డిసెంబర్లో పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని జనవరిలో అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. పీఎంజీకేఏవై కింద కేంద్రం ఉచిత బియ్యం పంపిణీని డిసెంబర్ (2021) నుంచి మార్చి( 2022) వరకు పొడిగించిందని చెప్పారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రతా పథకంలోని కార్డుదారులు ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పొందనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం 89 లక్షల మందికి (జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు)మాత్రమే సరిపడే 1,34,110.515 టన్నుల బియ్యాన్ని మాత్రమే కేటాయించిందన్నారు. అయితే ఏపీలో మొత్తం 144 లక్షల మంది లబ్ధిదారులకు 2,11,592.890 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సరిపడ నిల్వలు లేకపోవడంతో పంపిణీని వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. పీఎంజీకేఏవై కింద రాష్ట్రంలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 5,36,442.040 టన్నుల బియ్యాన్ని ఉచితంగా..3,27,120 టన్నుల బియ్యాన్ని బయట మార్కెట్ ద్వారా రాష్ట్రానికి విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 1న కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఇంత వరకు కేంద్రం నుంచి స్పందనలేదన్నారు. -
జాతీయ ఆహార భద్రత పథకానికి రూ.1720కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత పథకానికి ఈ ఏడాది రూ.1720 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017-18లో జాతీయ ఆహారభద్రత పథకం నిధుల్లో 20శాతం ఈ పథకాన్ని అమలుచేస్తున్న రాష్ట్రాల్లో అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రీడ్ విత్తనాల పంపిణీకోసం కేటాయించినట్లు కూడా మంత్రి వెల్లడించారు. అలాగే, 2016-17లో రైతుల ఉత్పాదనలకు గిట్టుబాటు ధర లభించకపోవడానికి కారణాలు, పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధరలు లభించక రైతులకు వాటిల్లుతున్న నష్టాల నేపథ్యంలో మార్కెటింగ్ వ్యవస్థలను పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతుందో వివరించాలంటూ అడిగిన ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మరోపక్క, దక్షిణ మధ్య రైల్వేకి క్లెరికేజ్ చార్జీల కింద వచ్చిన ఆదాయంపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ సహాయమంత్రి రాజన్ గోహైన్ సమాధానం తెలిపారు. 2016-17లో రిజర్వడ్ టిక్కెట్ల కేన్సిలేషన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ.103.27కోట్ల ఆదాయం లభించినట్లు వివరించారు. 2015-17లో రిజర్వడ్ టిక్కెట్ల ద్వారా రైల్వేలకు ఏటా లభించే ఆదాయం దాదాపు 25 శాతం పెరిగినట్లు ఆయన వివరించారు. ఇక టిక్కెట్ కేన్సిలేషన్ ద్వారా 2016-17లో దేశ వ్యాప్తంగా రైల్వేకు రూ.1400కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. -
రైతుల విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు..!
దోమ, న్యూస్‌లైన్: ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి అందజేసిన శనగ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని ఊట్పల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంటఉత్పత్తులను సాధించేందుకు వీలుగా ప్రభుత్వం రైతులకు వేరుశగన, శనగ, మొక్కజొన్న తదితర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆయా పంటలను సాగు చేయడంలో సలహాలు, సూచనలు అందించడం, రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ సదుపాయం కలిగించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద రబీ సీజన్లో శనగ పంట సాగుకు అధికారులు మండల పరిధిలోని ఊట్పల్లి, బొంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 75 మంది చొప్పున రైతులను ఎంపిక చేశారు. వారికి పంపిణీ చేసేందుకు ఒక్కో గ్రామానికి 75 బస్తాల చొప్పున మొత్తం 150 బస్తాలను రెండు నెలల క్రితం చేరవేశారు. అయితే కొంతకాలం పాటు వాటిని అలాగే ఉంచి తర్వాత అమ్ముకుంటే ఎవరికీ తెలియదని భావించారు ఆదర్శరైతులు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన శనగ విత్తనాలను గురువారం రాత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎప్పుడూ లేనిది ఊళ్లోకి కార్లు, ఆటోలు హడావుడిగా రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి విషయం ఆరా తీశారు. ఓ గదిలో 32 శనగబస్తాలు దాచి ఉంచారని తెలిసింది. మొత్తం 75 బస్తాలకుగాను 32 మాత్రమే ఉండడంతో స్థానిక ఆదర్శరైతును నిలదీశారు. అతను తనకేం తెలి యదని బుకాయించాడు. గ్రామ సర్పంచ్ పద్మమ్మ తదితరులు గదికి తాళం వేసి విషయాన్ని జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పరిగి డివిజన్ వ్యవసాయాధికారి నాగేష్ కుమార్, మండల వ్యవసాయాధికారి రేణుకా చక్రవర్తిని శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం పంపిణీ చే యాల్సిన విత్తనాలను రబీ సీజన్ ముగుస్తున్నా ఎందుకు పంపిణీ చేయలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఏడీఏతో పాటు మండల వ్యవసాయాధికారి పొం తనలేని సమాధానాలు చెప్పడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఆదర్శరైతులు కుమ్మక్కై విత్తనాలను అమ్ముకుం టున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బొంపల్లి గ్రామంలోనూ విత్తనాలు పంపిణీ చేయకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.