
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో శుక్రవారం నుంచి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల కార్డులు, 2.83 కోట్ల లబ్ధిదారులున్నారని వివరించారు. వీరిలో కేంద్రం కేవలం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తోందని స్పష్టం చేశారు.
మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాçష్ట్ర ప్రభుత్వమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరో విడత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు రేషన్ పంపిణీని పొడిగించిందని తెలిపారు. ఇందుకోసం కేవలం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని పేర్కొన్నారు.
వీటికి నెలకు రూ.75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అదనంగా రూ.227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. పీఎంజీకేఏవై మొదలైనప్పటి నుంచి అదనంగా 25 నెలలకు కేవలం బియ్యం కోసం రూ.1,308 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. వలస కూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1,500 చొప్పున రెండునెలలు అందజేసిన మొత్తం రూ.2,454 కోట్లని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment