ఆందోళనొద్దు.. ఆదుకుంటాం | Telangana Govt To Purchase Rain Soaked Paddy Upon Drying It: Gangula Kamalakar | Sakshi
Sakshi News home page

ఆందోళనొద్దు.. ఆదుకుంటాం

Published Wed, May 18 2022 2:03 AM | Last Updated on Wed, May 18 2022 8:18 AM

Telangana Govt To Purchase Rain Soaked Paddy Upon Drying It: Gangula Kamalakar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని, ఆధైర్యపడాల్సిన అవసరం లేద న్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు.

అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితు లతోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సోమవారం పౌర సరఫరాల భవన్‌లో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపు, తడిసిన ధాన్యం, గన్నీ బ్యాగులు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు.

ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి..
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు మంత్రి గంగుల విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. వచ్చే 2–3 రోజుల్లోనూ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, రైతాంగానికి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్‌లోడింగ్‌ చేసుకొని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కొను గోలు కేంద్రాల్లో అవసరమైన మేరకు టార్పా లిన్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 

20.25 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తరుగు తదితర అంశాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందడం లేదని మంత్రి గంగుల తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం ఏమాత్రం సహకరించ కున్నా.. కొత్తగా ఒక గన్నీ బ్యాగును ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటివరకు 9.97 కోట్ల గన్నీ బ్యాగులను సమకూర్చు కుందని చెప్పారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటున్నా మని, కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. రోజుకు దాదాపు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటివరకు 6,369 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు గంగుల తెలిపారు. 3.18 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,961 కోట్ల విలువైన 20.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇందులో 19.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించామన్నారు.

తరుగు తీస్తే చర్యలు తప్పవు...
తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల హెచ్చరించారు. అవసరమైతే వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాడానికి కూడా వెనకడాబోమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాక అక్కడ తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

ముఖ్యంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచిం చారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్, మెదక్‌ కలెక్టర్‌ హరీశ్, మెదక్, సిద్దిపేట అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement