సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగి ధాన్యం సీఎంఆర్ విషయంలో కేంద్రం నిర్ణయించే లక్ష్యానికి అనుగుణంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎంత మేర ముడి బియ్యంగా, ఉప్పుడు బియ్యంగా తీసుకుంటారనే స్పష్టత వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని స్పష్టంచేశారు. కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి రాష్ట్రం తరపున పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రాత్రి సీఎంతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో సేకరించే ధాన్యం లక్ష్యం, సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యం గురించి వివరించారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా కూడా బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఇవ్వడంలో ఉన్న ప్రతికూలతలపై చర్చించినట్లు సమాచారం. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేస్తే తప్ప రైతాంగానికి మేలు జరగదనే విషయంపై మరోసారి చర్చించినట్లు తెలిసింది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి బకాయి ఉన్న విషయాలను కూడా సీఎంకు వివరించారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment